top of page
Original.png

ఆహా ఏమి రుచి



Aha Emi Ruchi -  Telugu Comedy Story |Mohana Krishna Tata

ఆహా ఏమి రుచితెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 27/03/2026


“డైటింగ్ చేస్తూ ఉండగా... పెళ్లి భోజనాలు ఎదురైతే ఏం జరుగుతుందో తెలుసా?”

నవ్వులు పూయించే ఆహా ఏమి రుచి కథలో తాత మోహనకృష్ణ గారు వివరించారు.

చిన్నప్పటినుంచి నేను నా హెవీ పర్సనాలిటీ మీద యుద్ధం చేసిన వాడినే. చిన్నగా ఉన్నప్పుడు లావుగా ఉంటే, బొద్దుగా ఉన్నాడు అంటూ బుగ్గ గిల్లేవారు. అప్పుడు అందమే, కానీ స్కూల్ లో చేరాక అంతా వెక్కిరించారు. పొట్టిగా ఉంటే ఇంకాను.


ఫ్రెండ్స్ కామెంట్స్ భరించలేక, తెగ వాకింగ్ చేశాను. కాళ్ళు నొప్పులతో రెస్ట్ తీసుకోవడం... మెల్లగా బద్ధకంతో వాకింగ్ కి గుడ్ బై చెప్పేశాను!


అలా సంవత్సరాలు గడిచిపోయాయి. మొత్తానికి, చదువు అయిపోయి, ఉద్యోగం దాటి, పెళ్ళి టైం వచ్చింది. ఎంత సంపాదించినా, అందరూ చూసేది ఈడు జోడు కదా. నాతో పాటే నా పర్సనాలిటీ కూడా పెరుగుతూ వచ్చింది.


పెళ్ళిచూపులలో...


"మీ అబ్బాయి కొంచెం లావు అనుకుంటాను," అంది పెళ్ళికూతురు తల్లి.


"కాదండీ! కొంచెం బొద్దుగా ఉంటాడు అంతే!" అని తల్లి ప్రేమతో కవర్ చేసింది అమ్మ.


వంద కిలోలు బొద్దు అనుకుంటే మంచిదే మరి. కానీ లోకం ఒప్పుకోదుగా! అమ్మాయిలు సన్నగా ఉంటే, నా పక్కన పీలగా ఉండేవారు. అదే లావుగా ఉంటే, రాక్షసి లాగా భయంకరంగా ఉండేవారు.


మొత్తానికి ఒక మోస్తరుగా ఉన్న అమ్మాయితో నా పెళ్ళి జరిగింది. కొంతకాలం అంతా హ్యాపీ. మా ఇద్దరినీ ఒకేసారి చూసే జనాలకు మాత్రమే తేడా. ఒక కన్ను పెద్దదిగా చేసి చూడాల్సిన పర్సనాలిటీ కదా మనది మరి!


ఎప్పుడూ ఆకలికి కడుపులో ఎలుకలు తిరగడం తప్పితే, కళ్ళు తిరగడం ఎరుగని నాకు, ఒక రోజు ఎందుకో కళ్ళు తిరిగాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే గాని మా ఆవిడ ఒప్పుకోలేదు. మాంగల్యం వీక్ అయ్యిందేమో అని డౌట్ కాబోలు. డాక్టర్ చెక్ చేసి, మీకు బీపీ చాలా ఎక్కువగా ఉంది. మీరు వెయిట్ తగ్గాలి... లేకపోతే ప్రమాదమని చెప్పేశాడు. ఇదే మాట మా ఆవిడకి చెప్పాను. వెంటనే, నాకోసం ఆన్‌లైన్‌లో వాకింగ్ సెట్ మొత్తం ఆర్డర్ పెట్టేసింది.


ఉదయం అలారం పెట్టి మరీ లేపింది. రెండు రోజులు వాకింగ్ కి బాగానే వెళ్ళాను. మూడో రోజు ఎంత లేపినా, బద్ధకంతో నేను లేవలేదు. మా ఆవిడకు తెగ కోపం వచ్చింది.


"ఇప్పుడు అర్జెంటుగా వెయిట్ తగ్గకపోతే ఏంటి? మహా అయితే నీ మాంగల్యానికి ప్రమాదం. నీకైతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయిలే... కంగారు పడకు," అని అనేశాను.


"ఆపండి ఆ అమంగళపు మాటలు! రావాల్సిన టైం లో ఆ ఇన్సూరెన్స్ డబ్బులు నేనే తీసుకుంటాను గానీ... మీరు ఇప్పుడే పోతే ఎలాగో చెప్పండి? మీరింకా నాకోసం, ఈ ఇంటికోసం బోలెడంత చెయ్యాలి కదా! మిమ్మల్ని అప్పుడే పోనిస్తానా చెప్పండి?"


ఆరోజు నుంచి నాకు మాత్రం నేచర్ ఫుడ్. పిల్లలకీ తనకీ మాత్రం ఆవకాయ, మసాలా కూరలు. పోనీలే! నేను తగ్గితే మంచిదే కదా! అప్పుడు చూపిస్తా నా తడాఖా అనుకున్నాను.


ఈలోపు పెళ్ళిళ్ళ సీజన్ రానే వచ్చింది. ఏం చేస్తాం? పెళ్లి కార్డ్స్ తెగ వచ్చి పడ్డాయి. నిజానికి పెళ్ళికి వెళ్ళేది, పెళ్లి చూడడానికంటే కూడా భోజనం చేయడానికే ఎక్కువ అనేది ఒక సర్వేలో తేలిందట. నా విషయంలో అది రెండు వందల శాతం కరెక్ట్ మరి! నా పర్సనాలిటీ చూస్తే, అర్థం అయిపోతుంది ఎవరికైనా సరే!


భోజనాల దగ్గర ఏం తినకుండా తిరుగుతున్న నన్ను చూసి అందరూ అడగడం, "మీరేం తీసుకోవట్లేదా?" అని. పక్కనుండి మా ఆవిడ "ఆయన డైటింగ్ లో ఉన్నారులెండి. ఏమీ పెద్దగా తినరు," అని జవాబిచ్చింది.


దానికి నేను ఏం చేయలేని పరిస్థితి. వంటల సువాసనలు నాలోని నిగ్రహాన్ని అంతం చేస్తున్నాయి. అందరూ తెగ తినడం చూసి ఆగలేక, అమాంతం అన్నీ తినేయాలన్న కోపం వచ్చింది. వెంటనే ప్లేట్‌లో అన్నీ వడ్డించుకుని 'ఆహా ఏమి రుచి' అని పాడుకుంటూ లాగించేశాను.


దానితో డైటింగ్ కు మంగళం పాడేసినట్టే. మా ఆవిడ చాలా సీరియస్ గా నా వైపు చూసింది. ఆవిడ చూపులకు భయపడితే కడుపు నిండదు, ఆకలి తీరదని కొట్టి పడేశాను.


డాక్టర్ చెక్-అప్ సమయం వచ్చింది. ఒక్క గ్రాము కూడా తగ్గలేదని డాక్టర్ బాగా తిట్టాడు. వెంటనే వాకింగ్, వెయిట్ రిడక్షన్ ట్రీట్‌మెంట్, సైక్లింగ్ అన్నీ మొదలుపెట్టాను. దానికి తగ్గట్టే, తిండి, జ్యూస్‌లు బాగా లాగించేశాను. ఏం అవుతుంది? బరువు తగ్గడం కాదు కదా! ఇంకా పెరిగిపోయాను.


ఇక ఈవన్నీ నా వల్ల కాదని, మళ్ళీ అంతా మొదటికే వచ్చేసింది. మా ఆవిడ ప్లేట్‌ నిండా ఉప్మా ఇస్తే, పక్కన ఒక అడ్డ గ్లాసులో కాఫీ సిప్ చేస్తూ, ఉప్మా తింటూ ఉన్నాను. అమాంతం ఒక్కసారిగా వెయిట్ తగ్గిపోయే మాత్రలు కనిపెట్టే వరకు మన పరిస్థితి ఇంతే అనుకుంటూ... ఆలోచనలో మునిగాను.


సమాప్తం. 

***********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

తాత మోహనకృష్ణ, తెలుగు హాస్య కథ, dieting comedy Telugu, weight loss story Telugu, Aha Emi Ruchi, ఆహా ఏమి రుచి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page