top of page

అక్షర ప్రబోధ గీతి

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AksharaPrabodhaGeethi, #అక్షరప్రబోధగీతి, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 16

Akshara Prabodha Geethi - Somanna Gari Kavithalu Part 16 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 05/02/2025

అక్షర ప్రబోధ గీతి - సోమన్న గారి కవితలు పార్ట్ 16 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అక్షర ప్రబోధ గీతి


ధైర్యాన్ని నింపుకొని

సింహంలా జీవించు

నమ్మకాన్ని పెంచుకొని

పక్షి వోలె విహరించు


పిరికితనము వదులుకొని

వీరునిలా కన్పించు

స్వయం కృషిని నమ్ముకొని

ప్రగతి బాట పయనించు


నిరంతర సాధనతో

విజయాలు సాధించు

సడలని పట్టుదలతో

లక్ష్యాన్ని ఛేదించు


చరిత్రలో నీ కోసము

ఒక పుట కేటాయించు

దానికై అహర్నిశలు

పోరాటం సాగించు


కన్నవారి కలలను

సాకారం గావించు

గురుదేవుల ఆశలను

ఖచ్చితంగా బ్రతికించు

















బామ్మ గారి వాక్కులు

----------------------------------------

చెట్టుకున్న ఆకులు

కొలనులోని కలువలు

బలే బలే అందము

ఇంటిలోని బాలలు


గగనంలో తారలు

సదనంలో మహిళలు

అందానికి అందము

వదనంలో నగవులు


ఖగముకున్న రెక్కలు

పుడమిలోని మొక్కలు

చూడంగా అందము

వజ్రాల ముక్కలు


బ్రతుకులోన విలువలు

మనసులోని మమతలు

చేకూర్చును అందము

శ్రేష్టమైన బుద్ధులు
















సత్యాలు

----------------------------------------

అయ్యవారు వాక్కులు

అరుణోదయ కిరణాలు

అలకిస్తే అవే

బాగు చేయు బ్రతుకులు


కోల్పోతే హక్కులు

అగును స్వేచ్ఛ ముక్కలు

కాపాడుకుంటేనే

అభివృద్ధికి త్రోవలు


మహనీయుల సూక్తులు

విలువైన ముత్యాలు

సొగసులు చేకూర్చే

మెడలోన హారాలు


గురువర్యుల సూచనలు

పాటిస్తే మేలులు

లేకుంటే మాత్రము

వర్ధిల్లుట శూన్యము
















అమ్మ అభిలాష

----------------------------------------

గొప్పగా చదవాలి

జ్ఞానాన్ని పొందాలి

ఎవరెస్టు రీతిలో

బ్రతుకులో ఎదగాలి


శ్రమను ఆయుధంగా

చేసుకుని సాగాలి

ధైర్యాన్ని కవచంగా

తొడుక్కొని నడవాలి


సుగుణమే హారంగా

మెడలో ధరించాలి

ఆకాశం హద్దుగా

సాహసము చేయాలి


విజయానికి గుర్తుగా

చరిత్రలో మిగిలాలి

పదిమందికి స్ఫూర్తిగా

జగతిలో నిలవాలి















వాస్తవాల వెలుగులు

----------------------------------------

మది నిండా ధైర్యము

శిఖరమంత సహనము

కలిగియున్న బ్రతుకున

చేకూరును విజయము


పసి పిల్లల తత్వము

మేలిమి బంగారము

చేయదు ఆపకారము

దైవానికి ఇష్టము


కష్టించే తత్వము

చేయునోయ్! సాహసము

సాధించును ఫలితము

అందించు గౌరవము


హృదయమే కోమలము

భగవంతుని నిలయము

కాకూడదు కఠినము

చేయరాదు మలినము
















కష్టే ఫలి!

---------------------------------------

శిలలాంటి జీవితము

కావాలోయి! శిల్పము

అయితేనే అందము

అందరికాదర్శము


గాలిలోన దీపము

దివ్యంగా వెలుగునా!

లేకుంటే ప్రయత్నము

ప్రయోజనముండునా!


కష్టాల మెట్లపై

ఫలితాల్ని చూసుకో!

అమావాస్య పిమ్మట

పౌర్ణమని తెలుసుకో!


తప్పటడుగులు లేక

నడక మనకు వచ్చునా!

ఉచితంగా వచ్చింది

కలకాలముండునా!


ఎదిగేందుకు బ్రతుకున

స్వయం కృషియే నిచ్చెన

గృహ శోభకు మూలము

ఇల్లాలే గృహమున















కల కాదు ఒక కళ నవ్వడం

---------------------------------------

నవ్వడమే ఒక కళ

కట్టలేం! దాని వెల

సెలయేరై గలగల

నవ్వాలోయ్! కిలకిల


శశి మాదిరి అందము

పెదాలతో బంధము

ముఖమున దరహాసము

చూడ వర్ణ శోభితము


హాయిగా నవ్వాలి

నవ్వుతూ బ్రతకాలి

బాధలన్నీ మరచి

గాలిలో తేలాలి


నవ్వించడం వరము

అక్షరాలది నిజము

ఆరోగ్య ఔషధము

పంచును ఆనందము















కొరగానివి నేస్తం!!

---------------------------------------

తావి లేని పూవులు

నవ్వు లేని ముఖములు

కొరగానివి నేస్తం!!

ప్రేమ లేని మనసులు


పూలు లేని వనములు

నీరు లేని చెరువులు

కొరగానివి నేస్తం!!

స్త్రీలు లేని గృహములు


తీపి లేని చెరుకులు

ఫలం లేని తరువులు

కొరగానివి నేస్తం!!

సాయపడని చేతులు


గాయపరచు పలుకులు

మంచి లేని తలపులు

కొరగానివి నేస్తం!!

విలువ లేని బతుకులు















అంతులేని ఆనందము

---------------------------------------

అనురాగాల వాడలో

మమకారాల మేడలో

అంతులేని ఆనందము

తల్లిదండ్రుల ప్రేమలో


అందాల పల్లె సీమలో

సెలయేరుల సవ్వడిలో

అంతులేని ఆనందము

నెమ్మది ఉన్న బ్రతుకులో


అక్షరాల తోటలో

విజ్ఞానపు కోటలో

అంతులేని ఆనందము

మహనీయుల బాటలో


చిరునవ్వుల ముఖంలో

ప్రేమలొలుకే గుండెలో

అంతులేని ఆనందము

చిన్ననాటి చెలిమిలో


శుద్ధమైన మనసులో

కన్నవారి మాటలో

అంతులేని ఆనందము

భరతమాత సేవలో





















గురుదేవుల సూక్తులు

---------------------------------------

మానాలోయ్! కలతలు

చూపాలోయ్! మమతలు

వద్దు వద్దు గొడవలు

ముద్దు ముద్దు ప్రేమలు


తెలపాలోయ్! శుభములు

చేయాలోయ్! మేలులు

వారు కదా మనుషులు

గౌరవానికర్హులు


వద్దు వట్టి నీతులు

ఉండాలోయ్! చేతలు

వారే పుణ్యాత్ములు

భువిలో అతిశ్రేష్టులు


కోయాకోయ్! కోతలు

చెప్పొద్దు అబద్ధాలు

ఉండాలోయ్! విలువలు

వర్ధిల్లును బ్రతుకులు

-గద్వాల సోమన్న


25 views0 comments

Comentários


bottom of page