top of page

ఆకుపచ్చ రక్తం

 #IndumathiPalegaru, #ఇందుమతిపాలేగారు, #ఆకుపచ్చరక్తం #AkupachhaRaktham, #TeluguStory, #తెలుగుకథ

ree

Akupachha Raktham - New Telugu Story Written By Indumathi Palegaru

Published In manatelugukathalu.com On 13/07/2025

ఆకుపచ్చ రక్తం - తెలుగు కథ

రచన : ఇందుమతి పాలేగారు


భారీ వృక్షాలపై గొడ్డలి వేటు! అని హెడ్ లైన్.

 

రోడ్డు విస్తరణలో భాగంగా చెట్లని కొట్టేందుకు అనుమతి లభించిందని వివరణలో ఉంది. ఆ న్యూస్ తర్వాత రాజకీయాలు, సినిమారంగం ఇంకా క్రీడా వార్తలన్నీ చదివేసి పేపర్ పక్కన పడేసి వెళ్లిపోయా. 


ఆఫీసుకి బయలు దేరుతుండగా “ఇవాళ శుక్రవారం. అమ్మవారి గుడికి వెళ్లి ఆఫీసు కి వెళ్లండి” అంది మా ఆవిడ ఆర్డరేస్తున్నట్టుగా. 


‘లేదు.. కాదు.. కుదరదు’ అనకుండా సరేనన్నట్టు తలాడించాను. 


కాస్త ముందుగానే ఆఫీసు కి బయలుదేరి, వెళ్లే దార్లోనే గుడి, బైక్ ని బయటే పార్క్ చేసి కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లా. గర్భ గుడికి ఎదురుగా గోపురానికి సమానంగా ఊడలతో విరబోసుకుని గుడి ముందు కూర్చున్న అమ్మవారిలా ఉంది ఆ మర్రిచెట్టు!


ఆ చెట్టుని చూస్తుంటే అమ్మవారు గుడి బయటనే ఉన్నట్టనిపించింది. చెట్టు మొదలు దగ్గర పసుపు కుంకుమలతో దీపదూపాలతో పూజిస్తున్నారు. ఆ చెట్టు కొమ్మలకి లెక్కలేనన్ని ఊయలు ఊగుతున్నాయి. గాలి వీస్తున్నప్పుడల్లా ఊడలకి చుట్టిన గాజులు గలగలమంటూ కదులుతున్నాయి. ఆ చెట్టు దగ్గర మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని అంటారు. 


అందరి మొక్కుల్ని మోస్తూ విస్తారంగా కొమ్మల్ని చాచి నిలబడి ఉంది. అవే కాకుండా ఆ చెట్టు మీద కొన్ని పక్షులు గూడ్లు కట్టుకుని ఉన్నట్టున్నాయి. చెట్టు తొర్రల దగ్గర ఉడుతలు,తొండలు తచ్చాడుతున్నాయి. 


చెట్టుని ఎవరు నాటారో ఎవరికీ తెలీదు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు ఆ చెట్టు మొలిచిందని కథలు గా చెబుతూ ఉంటారు. దర్శనం పూర్తి చేసుకుని బయటకి వస్తుండగా “ఈ చెట్టుని కూడా కొట్టేయమని ఆర్డరొచ్చింది. కాని ఇక్కడున్న వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెండింగ్ లో ఉంది” అని ఒకతను ఎదురుగా ఉన్నతనితో అంటూ ఉన్నాడు. 


“ఏంటి..గుడి లో చెట్టుని కూడా వదలి పెట్టారా?” అని మనస్సులో అనుకుంటూ వెళ్లిపోయాను. 


గుడి బయటకి రాగానే రోడ్డు మొత్తం వాహనాలతో కదల్లేక ఆగిపోయి ఉన్నాయి. గుడి దాని ముందున్న మర్రి చెట్టు రోడ్డు ని ఆనుకుని ఉండటం వల్ల వాహనాల రాకపోకలు నెమ్మదిగానే సాగుతున్నాయి. పదినిమిషాలు ట్రాఫిక్ లో నిలబడి రెండు చెమట చుక్కలు రాలగానే రోడ్డు విస్తరణ కోసం చెట్టుని కొట్టాలనుకోవడంలో తప్పులేదనిపించింది. 


లేదంటే రోజూ రాకపోకలకి ఇబ్బందవుతుంది అనిపించింది. ట్రాఫిక్ దాటుకుని హైవే రోడ్డ్ మీదకి వెళ్లగానే విస్తారంగా నల్లగా నిగనిగలాడుతున్న రోడ్డుని చూసి ఊపిరి పీల్చుకున్నా. చెప్పాలంటే హైవే పక్కన చెట్లేవి లేవు, వాహనాల్లోంచి వచ్చే పొగ తప్ప! 


కొన్నేళ్ల ముందు హైవే పక్కనున్న చెట్లని గుర్తు చేసుకున్నా. అంతరించిపోయిన వాటి గురించి చెప్పుకున్నట్టు చెట్లు ఉండేవని గుర్తు చేసుకోవడం ఏంటో విచిత్రంగా. 


రోడ్డు మీద వెళ్లే కొద్ది సూర్యుడి ప్రతాప సెగ శరీరాన్ని తాకుతూ ఉంది. కొమ్మలు అడ్డు పెట్టి సూర్యున్ని ఆపడానికి చెట్లే లేవు. తిరిగి ఇంటికొచ్చేటప్పుడు అదే ట్రాఫిక్ తిప్పలు. 

రోజు రోజుకి పెరుగుతున్న జనాభా, వాళ్ల అవసరాలు. అవసరానికి తగ్గట్టు అన్నిటిని మార్చుకోవడంలో సహజమే కదా! 

 ****

వారం రోజులు గడిచాయి. గుడి వైపుగా వెళ్తుంటే గుడి సమీపం లో ఉన్న చెట్లన్నిటిని నరికేసారు. గుడి లోపల ఉన్న చెట్టుని మాత్రం వదిలేసారు. వయస్సు మళ్లిన ముసలి మర్రి చెట్టు బిక్కు బిక్కుమని నేల మీద తెగి పడి ఉన్న చెట్లని చూస్తున్నట్టుగా అనిపించింది. 


చెట్లని నరికేసాక ట్రాఫిక్ గొప్ప మార్పులేం కనిపించలేదు. ఓ రోజు రాత్రి గాఢ నిద్రలో ఉండగా కరెంటు పోయింది. ఉక్కపోత తట్టుకోలేక కిటికీలు,తలుపులు బార్లా తెరిచి ఉంచా, ఎంతసేపైనా చెమట తడార్చాడానికి పిసరంత గాలి కూడా రాలేదు. 


చెట్లుంటే గా మరి గాలి వీయడానికి! మా సమీపం లో అగ్గి పెట్టెల్లాగా మూడునెలలకొక సారి బిల్డింగ్ లు మొలుస్తాయి కాని చెట్లు మొలవవు. అట్ట ముక్కతో విసురుకుంటూ బయటకి వెళ్లి కూర్చున్నాను. 


విశాలమైన ఆకాశం నల్లటి దుప్పటిని కప్పుకుని చుక్కల్ని అంటించుకుని నాలోకి చూస్తున్నట్టనిపించింది. ఎక్కడో దూరంగా చెట్టు పై కొమ్మ కదులుతూ ఆ కాంతిలో పచ్చటి బంగారం మెరుస్తున్నట్టుగా అనిపించింది. 


ఎవరో మోసుకొచ్చి వదిలేసినట్టు కొద్ది గాలి స్పర్శ శరీరాన్ని తాకి వెళ్లిపోయింది. 

పచ్చని ప్రపంచం.. అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్న కుసుమాలు! 

చూస్తున్నంత దూరం పచ్చ! 


ఆ పచ్చని చెట్లని అల్లుకుని ఎగిరే, ప్రాకే, నడిచే జీవరాసులు ఎన్నో! 


ఆ అందాల్ని భస్మం చేస్తూ పెద్ద పెద్ద అడుగులతో భారీ భీకర శబ్దాలతో వృక్షాలని నరుకుతూ వాహనాలొస్తున్నాయి. చెట్లు మూగగా రోధిస్తున్నాయి. ఆ వృక్షాలకే గనుక మాట్లాడే శక్తి ఉంటే ప్రకృతి ప్రతిధ్వనించేదేమో! 


జరుగుతున్న ఆ యుద్దంలో ఆకుపచ్చ రక్తం ఏరుగా ప్రవహిస్తూ ఉంది. 


ఎన్నో ఆంక్షలతో కట్టుకున్న ఇంటిని ఎవరో కళ్లముందు కూల్చేస్తే తల్లడిల్లిపోయే మానవుడిలాగానే చెట్లతో బంధాన్ని అల్లుకున్న ప్రాణులన్నీ విలవిలాడుతూ భోరుమంటున్నాయి. 


పచ్చని ప్రపంచం నల్లగా మారిపోయింది. ఎన్నో వరదలు, తుఫానులు, భూకంపాల నుండి కాపాడిన మహా వృక్షాలు యుద్దంలో మరణించిన యోధుల్లా నేలకొరిగి మట్టిలో కలిసిపోతున్నాయి. 


మసి పొగల మధ్య వీపుకి సిలిండర్లు కట్టుకుని జనాలు తిరుగుతున్నారు. 


మానవుని మేధస్సుతో కనిపెట్టిన యంత్రాలు, పరికరాలు తప్ప మరేం లేదక్కడ. అందరూ యాంత్రికంగా బ్రతికేస్తున్నారు. 


“ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయాయి. ఆఫర్ లో ఒకటి కొంటే మరొకటి ఉచితం అని ఉంది వెళ్లి తీసుకుని రండి అంటూ మా ఆవిడ భుజాన్ని కుదుపుతూ ఉంది. 


దిక్కున కళ్లు తెరిచి చుట్టూ చూసాను. అది కల! 

దూరంగా రాత్రి కనిపించిన చెట్టు మళ్లీ కనిపించింది బంగారు వర్ణంలో కాదు పచ్చగా. 

ఆఫీసుకు వెళ్తూ చెట్లు మాయమైన వాటి స్థలాల్ని చూస్తూ గుర్తు చేసుకున్నా. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం,వాటికి తోడు ప్రకృతి ధ్వంసం భయాన్ని పుట్టించింది. 


రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫోన్ చేసాడు. 


“సార్.. ఒక మంచి స్థలం ఉంది, సిటీ అవుట్ కట్స్ లో” అంటూ అడ్రెస్ చెప్పాడు. 


అతను చెప్పిన అడ్రెస్ ప్రకారం చూస్తే ఊరి చివరన మిగిలిన చిన్నపాటి అడవిలాంటిది అదొక్కటే. అది కూడా పోతే ఆనవాళ్లు కూడా మిగలవనిపించింది. 


సిటిలో అలాంటి చిన్న గుట్టల్ని చదును చేసి రెండు మూడు ఫ్యాక్టరీలు, బిల్డింగ్లు కట్టడం, ప్లాట్లు లాంటివి చేస్తూనే ఉన్నారు. ప్రకృతిలో భాగమైన అడవుల్ని, వన్యప్రాణుల స్థావరాల్ని కూడా ఆక్రమించేసే స్వార్థ జీవి ఒక్క మానవుడు మాత్రమే! 


కొన్ని నెలల గడిచాయి. దార్లో వెళ్తూ గుడి దగ్గర చెట్టు ముందు నిలబడి “ఆ చిన్నపాటి అడవి, చెట్లు అలానే ఉండిపోతే బావుండు” అనుకున్నా మనస్సులో. 


 *****

పొద్దున్నే "వన్యప్రాణుల సంరక్షణ కారణంగా చెప్పి ఊరు మూలనున్న అడవిని స్మార్ట్ సిటిగా మార్చలనుకున్న అనుమతిని నిరాకరించిన అటవీ శాఖ అధికారులు” అని న్యూస్ ఛానల్లో మాటలు స్పష్టంగా వినిపించాయి. 


తొందరగా బయలు దేరి గుడి కి వెళ్లి చెట్టు కి దగ్గరగా కూర్చుని మనస్సులో కోరిక నెరవేరింది అనుకుంటూ చెట్టు వైపు చూసా. పక్కనే కొన్ని ఎండుటాకులు రాలి పడ్డాయి. 

ఇంతలో శ్రీమతి నుండి ఫోన్ "మనవాడి పుట్టిన రోజుకి రిటర్న్ గిఫ్ట్ గా ఏదైనా కొనుక్కుని రండి” అంది. 


సాయంత్రానికి రిటర్న్ గిఫ్ట్స్ తన చేతుల్లో పెట్టా. 

గిఫ్ట్ ని చూసి మొహం అదొలా పెట్టి "విత్తనాలా?” అంది. 


"అవును.. మన వాడితో పాటు ఎక్కడో ఒక దగ్గర అవి మొక్కలుగా పెరుగుతాయి” అన్నాను లోపలికి వెళ్లిపోతూ. 


***

ఇందుమతి పాలేగారు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం:

పేరు  ఇందుమతి పాలేగారు , స్వస్థలం చిత్తూరు జిల్లా. బి టెక్ పూర్తి చేసుకుని ఐటీ లో ఉద్యోగం చేస్తున్నాను. కథలు , కవితలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టం తో సరదాగా రాయటానికి ప్రయత్నిస్తున్నాను.


Comments


bottom of page