అల్లరి పని
- Vemparala Durga Prasad
- Aug 5
- 6 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #AllariPani, #అల్లరిపని, #తెలుగుకథలు

Allari Pani - New Telugu Story Written By Vemparala Durga Prasad
Published In manatelugukathalu.com On 05/08/2025
అల్లరి పని - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
"హాయ్ మామ! ఈ మధ్య ప్రాంక్ వీడియోలు బాగా చేస్తున్నావు రా" అభినందించాడు మిత్రుడు గణేష్.
నవ్వి.. "వ్యూస్ బాగా వస్తున్నాయి రా" అన్నాడు రమేష్.
అతన్ని "ప్రాంక్ స్టార్" అని స్నేహితులు ముద్దుగా పిలుస్తారు. రమేష్ డిగ్రీ చేసి ఖాళీ గా వున్నాడు. రమేష్ చాలా తెలివయిన వాడు. కానీ వుద్యోగం వెతుక్కోవడం కంటే ఎక్కువ సోషల్ మీడియా లో బిజీ గా ఉంటూ ఉంటాడు. అతనికి తల్లి, తండ్రి పోయారు. అన్న, వదిన సంరక్షణ లో కాలం గడిపేస్తున్నాడు.
అతని అన్న గోవింద్ విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్. వదిన సుగుణ రమేష్ ని తల్లిలా చూసుకుంటూ ఉంటుంది. వదిన అన్నింటికీ వెనుక వేసుకుని రావడం తో బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని, గోవింద్ అభిప్రాయం. గోవింద్ కి తమ్ముడి తెలివితేటల మీద నమ్మకం. అతడు మంచి వుద్యోగం సంపాదించుకోగలడని, కొద్దిగా బాధ్యత గా కష్టపడాలని అనుకుంటూ ఉంటాడు.
***
అప్పుడు ఉదయం 10 గంటలు అయింది. రమేష్ గణేష్ లు రెస్టారెంట్ లో కూర్చుని స్నాక్స్ తిని, టీ తాగుతూ వున్నారు. రమేష్ టీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు.
రమేష్ కి సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. జేబులోంచి కొత్త 200రూపాయల నోటు తీసేడు. పేపర్ లో ఓ మూల కనపడిన ప్రకటన చూపించి, మిత్రుడి తో ఇలా అన్నాడు:
“ఈ నోటు మీద తెల్లగా వున్న చోట, ఈ ఫోటో లో వున్న లేడీ సైకియాట్రిస్ట్ పేరు రాసి, “హెల్ప్ మీ అని పెడదాం”.. “ఇదో రకం ప్రాంక్” అన్నాడు.
"అప్పుడు?" అర్ధం కాక అడిగేడు గణేష్.
"ఈ నోటు దొరికి, పరిశీలనగా చూసిన ఎవడో ఒకడు ఫోన్ చేసి ఈవిడని “హెల్ప్ చేయాలా” అని విసిగిస్తాడు. ఆవిడ “షట్ అప్” అంటుంది. ఆవిడకి విషయం తెలీక పిచ్చెత్తినట్లు అవుతుంది" అన్నాడు.
"నిజమే.. కానీ మనకి ఎలా తెలుస్తుంది.. మనకేమిటి ఎంజాయిమెంట్” అన్నాడు గణేష్.
“ఒక్కోసారి వైల్డ్ గా వేసిన రాయి ఎక్కడో తగులుతూ ఉండచ్చు.. అన్నీ మనకి తెలియాలని లేదు. ఇది అలాంటి అల్లరి పని. మనకి ఖర్చు ఏముంది" అన్నాడు రమేష్.
ఒక్కోసారి ఎవరూ ఫోన్ చెయ్యక పోవచ్చు కదా" అన్నాడు గణేష్.
"అవుననుకో, ఫోన్ చేస్తే, వాళ్లకి తలనెప్పే కదా" అన్నాడు రమేష్.
"దాని బదులు, మనకి తెలిసిన వాళ్ళకే చేస్తే, మనకి తెలియచ్చు, ఇంకా వినోదం కదా" అన్నాడు గణేష్.
"అయితే, ఆ పేరేదో నువ్వే చెప్పు "అన్నాడు రమేష్.
వెంటనే గణేష్, ఆ కొత్త 200 నోట్ తీసుకుని, ఒక నెంబర్ రాసేడు.
"ప్లీజ్ హెల్ప్ మీ" అని రాసి, దాని కింద, సుచిత్ర అని సంతకం లాగ పెట్టేడు.
"ఈ సుచిత్ర ఎవరు?” అన్నాడు రమేష్.
"మా వీధి లో ఉంటుందిలే. ఒక డాక్టర్. పెద్ద పోజు కాండిడేట్, ఒక సారి ఏడిపించాలి" అన్నాడు గణేష్.
అంతకు ముందు ఒక సారి అతను వీధి లో క్రికెట్ ఆడుతుంటే, బంతి వాళ్ళ ఇంటి కిటికీ కి తగిలి పెద్ద గొడవ అయింది. గణేష్ కి అప్పట్నుంచీ ఆవిడ మీద కోపం.
బిల్ పే చేసినప్పుడు కౌంటర్ లో ఆ నోట్ ఇచ్చేసేడు రమేష్.
ఫ్రెండ్ కేసి నవ్వుతూ “ఆ నోట్ ఇచ్చేసేను.. ఇప్పుడు” అన్నాడు.
కొంపతీసి ఈ కౌంటర్ క్లర్క్ ఆ నెంబర్ కి ఫోన్ చేసి “మే ఐ హెల్ప్ యు మేడం" అంటాడేమో” అని నవ్వేసేడు గణేష్.
15 రోజులు గడిచేయి. అప్పుడు వాళ్లకి తెలియదు, వాళ్ళు ఒకనాడు సరదాగా చేసిన “అల్లరి పని ” సృష్టించబోయే సినిమా.
ఒక్కోసారి ప్రపంచం ఇంత చిన్నదా అనిపించేలా జరుగుతూ ఉంటాయి సంఘటనలు.
ప్రకాష్ ఆ రోజు పెట్రోలింగ్ లో వున్నాడు. జీప్ లో గోవింద్ తో బాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ వున్నారు. బందర్ రోడ్ లో 11 గంటల సమయం లో బెంజ్ కంపెనీ దగ్గర ఒక టీ స్టాల్ దగ్గర ఆగేరు.
అప్పటికి ఆ 200 రూపాయల నోటు అనేక చేతులు మారి, ఆ టీ స్టాల్ లో టీ తాగినప్పుడు ప్రకాష్ చేతికొచ్చింది.
ప్రకాష్ జీప్ లో కూర్చుని నోటు పర్సు లో పెట్టుకుంటుంటే ఆ "హెల్ప్ మీ" మెసేజ్ చూడడం జరిగింది. కింద “ఫోన్ నెంబర్”, “సుచిత్ర “అని ఉండడం చూసేడు.
“ఇంత రాత్రి వేళ అక్కడ ఆడ పిల్ల వుండే ఛాన్స్ లేదు. అలాగని, సంకేతం చూపడానికి కౌంటర్ క్లర్క్ ఇలా రాసేడా అని అనుమానం వచ్చింది. టీ స్టాల్ చుట్టూ చూసేడు. ఎవరూ అనుమానాస్పదం గా లేరు. కౌంటర్ క్లర్క్ వంచిన తల ఎత్తకుండా బిజీ గా ఉన్నాడు. పైగా అక్కడ ఆడవాళ్లు ఎవరూ లేరు.
తేలిగ్గా తీసుకుని, పర్సు లో పెట్టేసుకుని, డ్రైవర్ ని జీప్ ముందుకు పోనిమ్మన్నాడు. కానీ కొంత దూరం వెళ్ళేక పటమట ఏరియా లో ఒక అపార్ట్మెంట్ దగ్గర కుక్కల అరుపులు వినపడి జీపు ఆపించేడు.
వాచుమన్ నిద్ర లో జోగుతున్నాడు. జీపు శబ్దానికి, మెలకువ వచ్చింది వాడికి.
“నీ పేరేమిటి “ అన్నాడు ప్రకాష్.
“రంగయ్య బాబూ “ అన్నాడు అతను.
“ఏమయినా ప్రాబ్లెమ్ ఉందా” అని అడిగేడు.
“లేదు సార్” అన్నాడు వాడు.
“కుక్కలు అరుస్తున్నాయి చూడు”.. అంటూ ఆ అపార్ట్మెంట్ పక్క వీధి వైపు చూసేడు. 4, 5 వీధి కుక్కలు 1వ ఫ్లోర్ వైపు చూస్తూ అరుస్తున్నాయి.
జీపు లో వున్న కానిస్టేబుల్సు ని “అటువైపు చూడండి” అని పంపించి, ముందు గేట్ వైపు వచ్చేడు ప్రకాష్.
అది ఒక 20 ఫ్లాట్స్ వున్న అపార్ట్మెంట్. బయట నిలబెట్టబడిన బోర్డు అతని దృష్టి దాటిపోలేదు. ఆ బోర్డు చూసిన ప్రకాష్ నిర్ఘాంత పోయాడు.
"డాక్టర్ సుచిత్ర BHMS " ఆయుర్వేదిక్ డాక్టర్, Flat 102 అని వుంది.
కింద ఫోన్ నెంబర్ వుంది. ఆ ఫ్యాన్సీ నెంబర్ తాను చూసిన నెంబర్ లా అనిపించింది. ఆశ్చర్య పోతూ ఇందాక తాను టీ స్టాల్ దగ్గర తీసుకున్న నోటు బయటికి తీసేడు.
చిత్రం గా అదే ఫోన్ నెంబర్. ప్రకాష్ ఆలస్యం చేయకుండా.. ఆ ఫోన్ కి డయల్ చేసేడు.
ఫోన్ ఎత్తుతూనే, కీచు గొంతుతో ఒక స్త్రీ "హెల్ప్" అంటూండగా.. ఫోన్ ఎవరో లాక్కున్నట్లు, వెంటనే ఏదో పెద్ద వస్తువు కింద పడిన శబ్దం వచ్చింది. ఇంతలో ఫోన్ కట్ అయింది.
వెంటనే అలెర్ట్ అయిపోయాడు ఇన్స్పెక్టర్ ప్రకాష్. మళ్ళీ ఫోన్ చేసేడు. ఈసారి కట్ చేసినట్లు తెలిసింది.
మళ్ళీ చేస్తే.. స్విచ్ ఆఫ్ వస్తోంది. అనుమానం బలపడింది. గోవింద్ ని మెయిన్ గేట్ దగ్గర ఉండ మన్నాడు. రంగయ్య ని తనతో రమ్మని, ఇద్దరు కానిస్టేబుళ్ళని బిల్డింగ్ వెనుక వైపు కుక్కలు అరుస్తున్న చోటే అలెర్ట్ గా ఉండమని, మొదటి అంతస్తు మెట్లు ఎక్కేడు.
ఫ్లాట్ 102 ముందు ఆగి, బెల్ కొట్టేడు. 3 సార్లు మోగినా ఎవరూ తలుపు తీయడం లేదు.
రంగయ్య ని అడిగేడు.. ”సుచిత్ర గారు వాళ్ళు ఎవరూ ఇంట్లో లేరా” అని.
“మేడం గారు ఒక్కరే వున్నారు. అయ్యగారు సాయంత్రం ఫ్లైట్ కి వూరు వెళ్ళేరు” అన్నాడు.
సైడ్ బాల్కనీ లోంచి వెనుక వైపు దారి వుంది.
వెనుక వైపు కిటికీ ఉందేమో చూద్దామని వెళ్ళేడు. వంట గది కిటికీ గ్రిల్ వంచేసి కనపడింది.
రివాల్వర్ తీసి, అలెర్ట్ గా వంట గది తలుపు దగ్గరకి వచ్చేడు.
సడన్ గా తలుపు తోసి వచ్చిన ఎవడో ఆగంతకుడు ప్రకాష్ ని తోసేసి, బాల్కనీ గోడ మీద నుంచి కిందకి దూకేసేడు.
ఊహించని ఆ పరిణామానికి కింద పడ్డ ప్రకాష్ వెంటనే తేరుకున్నాడు.
బాల్కనీ మీద నుండి చూస్తూ కానిస్టేబుల్స్ ని "పట్టుకోండి వాడిని" అని అరవడం, ఆ ఆగంతకుడు, వెనుక ప్రహరీ గోడ దూకడం ఒకే సారి జరిగేయి.
అప్పటికే అక్కడ కాపలా వున్న కానిస్టేబుల్స్ వాడిని పెడ రెక్కలు విరిచి పట్టుకున్నారు.
ఈ హడావిడికి చుట్టుపక్కల వాళ్ళు ఇళ్లల్లోంచి లేచి వచ్చి, ఆ దొంగ ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
గోవింద్, కానిస్టేబుల్స్ కలిసి ఆ దొంగ ని జీపు ఎక్కించేరు.
అప్పుడు ప్రకాష్ వంట గది తలుపు తోసుకుని, ఫ్లాట్ లోకి వెళ్ళేడు. అక్కడ కుర్చీకి కట్టేసి వున్న డాక్టర్ సుచిత్ర కనపడింది. ఆవిడ నోట్లో గుడ్డలు కుక్కేసి వున్నాయి. కింద దొర్లి పడిపోయిన బిందె, స్టూలు, గది అంతా చిందర వందర గా వుంది.
సమయానికి తాను ఫోన్ చేయడం తో ఆమె అటెండ్ అయ్యి ఉంటుంది, గమనించిన దొంగ ఫోన్ లాగేసుకుని ఉంటాడు. శబ్దం చేస్తే ఎవరైనా రావాలి అని, కాళ్ళకి అందిన స్టూల్ మీద వున్న బిందెని తన్నేసిందని అక్కడి పరిస్థితి అర్ధం చేసుకున్నాడు.
ఆమె కట్లు విప్పి, మంచం మీద కూర్చోమని, సీసాలో మంచినీళ్లు ఆమెకి అందించాడు. ఆమె చాలా షాక్ కి గురి అయింది. మరో అరగంట వరకూ తేరుకో లేకపోయింది.
"మీ కాల్ వచ్చేటప్పటికి నా చేతిలో ఫోన్ వుంది. అది వాడు చూడలేదు. నన్ను మంచం మీద కదలకుండా కూర్చోమని, లేకపోతే చంపుతానని బెదిరించాడు. మీ కాల్ రాగానే లాక్కున్నాడు. ఇంకేమి చెయ్యాలో తెలీక, ఆ స్టూల్ ని తన్నేశాను.. చప్పుడవుతుంది అని".
“ తర్వాత వాడు నన్ను కుర్చీకి కట్టేసేడు”.
“మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడేరు.. మీ మేలు జన్మలో మర్చిపోలేను..మీ పేరు సార్?” అంది.
"నా పేరు ప్రకాష్. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. మేము నైట్ పెట్రోలింగ్ లో ఉండగా అనుమానం తో మీ ఫ్లాట్ లో కి వచ్చేము. ముందు మీరు రిలాక్స్ అవండి. తర్వాత మాట్లాడుదాం" అన్నాడు ప్రకాష్.
ఇంతలో ఆవిడ ఫోన్ చేసి తన భర్త సుధీర్ కి విషయం చెప్పింది. ప్రకాష్ ఒకసారి ఇల్లంతా పరిశీలించాడు. ఎవరయినా ఇంకా నక్కి ఉన్నారేమో అని.
ఆమె దగ్గర “ఆ నోటు సంగతి, హెల్ప్ మీ సందేశం” గురించి చెపుదామను కుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ మోగింది. అది డీఎస్పీ గారి దగ్గర నుండి.
“ప్రకాష్ నువ్వు ఇవాళ చేసిన అసైన్మెంట్ చాలా గొప్పది. ఎస్పీ గారి చెల్లెలు డాక్టర్ సుచిత్ర గారిని ప్రాణాపాయం నుండి కాపాడేవని తెలిసింది. ఎస్పీ గారికి వాళ్ళ బావగారు ఇప్పుడే ఫోన్ చేసేరుట” అన్నాడు.
ఇంక, తన క్రెడిట్ తగ్గించుకోవడం ఎందుకు అని అనిపించింది ప్రకాష్ కి.
నోటు మీద రాసిన “ హెల్ప్ మీ “ గురించి ఎవరితోనూ అనలేదు.
దొంగని అరెస్ట్ చేసి సెల్ లో వేసేడు.
గోవింద్ ఆ రోజు ఇంటికి వచ్చేక, వాళ్ళు వెళ్లి, డాక్టర్ సుచిత్ర ని ఎలా కాపాడారో తమ్ముడికి, భార్య కి గొప్పగా చెప్పేడు. సుచిత్ర గారి ఎపిసోడ్ విన్న రమేష్ బిత్తర పోయాడు. తానూ, మిత్రుడు కలిసి చేసిన అల్లరి పని కి విచిత్రమైన రెస్పాన్స్ రావడం, కధ ఇలా సుఖాంతం అవడం అతనికీ వింత అనుభవం. కానీ పైకి చెబితే, అన్నదగ్గర చీవాట్లు తినాలేమో అని మిన్నకుండిపోయాడు
***
మరుసటి రోజు భర్త తో కలిసి స్టేషన్ కి వచ్చి స్టేటుమెంట్ ఇచ్చింది డాక్టర్ సుచిత్ర. దొంగని కోర్టు లో హాజరుపరిచారు.
ఇప్పటికీ ప్రకాష్ కి ఆ 200 నోటు మీద “హెల్ప్ మీ” అని సుచిత్ర ఎందుకు రాసిందో. , ఆ నోటు తనకి ఎలా చేరిందో.. ఇంత కాకతాళీయంగా తానూ ఆమెనే ఎలా కాపాడేడో యెంత ఆలోచించినా అర్ధం కాలేదు.
వారాంతం లో కమీషనర్ గారు పిలిచి ప్రకాష్ టీమ్ ను అభినందించడం కూడా జరిగింది.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
Comments