'Allukunna Bandhalu' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 21/03/2024
'అల్లుకున్న బంధాలు' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అది ఒక పెద్ద హౌసింగ్ కాలనీ. హైద్రాబాద్ నగరంలో ప్రసిధ్ది చెందిన ఒక ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు దాదాపు పది హేను వందలు మంది కలసి స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకున్నారక్కడ.
శ్రీధర్, ఉషా కూడా అదే ప్రభుత్వ రంగ సంస్థలో పని చేసి రిటైర్ అయి అక్కడే ఇల్లు కట్టుకున్నారు.
వారి అబ్బాయి సూరజ్ ఐ. ఐ. టి ఖర్గపూర్ లో చదివిన తరువాత అమెరికా ఉన్నత చదువుల నిమిత్తమై వెళ్లి అక్కడే స్తిరపడిపోయాడు. కూతురు అపర్ణని మెడిసన్ చదవించాలని ఉవ్విళ్లూరారు. కానీ ఆ అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ ఉండగా శ్రీధర్, ఉషా ఇంట్లో లేని సమయంలో తన గదిలో ఫేన్ కి ఉరివేసుకుని చనిపోయింది. తాను మెడిసన్ లో సీట్ తెచ్చుకోలేనని, సీట్ రాకపోతే అందరూ హేళన చేస్తారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అపర్ణ తన నోట్ బుక్ లో తల్లీ తండ్రికి ఒక లెటర్ వ్రాసి పెట్టింది చనిపోయే ముందు.
ఆరు సంవత్సరాలు కాలగర్భంలో కలసిపోయాయి. అపర్ణ మరణం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసినా కాలక్రమేణా వారి ఆలోచనలూ, ఆశయాలన్నింటినీ సూరజ్ పై పెట్టుకుని రోజులు వెళ్లతీస్తుండగా గోరుచుట్టు మీద రోకటి పోటులా సూరజ్ అమెరికాలో ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఇద్దరూ నిర్విణ్ణులయ్యారు. సూరజ్ తో తమ సంబంధాన్ని పూర్తిగా త్రెంచేసుకున్నారు.
ఇద్దరూ సాయంత్రాలు కాలనీ లో ఉన్న పార్క్ కి వాకింగ్ కని వెడ్తూ, అక్కడ రోడ్ పక్కగా ఉన్న సిమెంట్ బెంచ్ పై కూర్చుని కాసేపు కబుర్లాడుకోవడం వారి దినచర్యలో ఒక భాగమై పోయింది.
ఇద్దరూ ఆ రోజు మామూలుగానే వాకింగ్ చేసివచ్చి ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఉష ముఖం వడిలిపోయి కళ్లు ఎర్రగా ఏడ్చినట్లు ఉన్నాయి.
"ఏం ఉషా.. ఆరోగ్యం బాగా లేకపోతే వాకింగ్ చేయకపోతేనేమమీ? రాకుండా ఉండాల్సిం”దంటూ శ్రీధర్ కొంచెం వ్యాకుల పడుతూ అన్నాడు.
"దేవుడు మనకే అన్ని కష్టాలూ ఇవ్వాలాండీ? ఈరోజు మన అపర్ణ పుట్టినరోజు. అది పదే పదే గుర్తొస్తోంది. సూరజ్ చూస్తే వాడు అలాగ. పిల్లలు లేకుండా ఈ ఒంటరి జీవితం ఇంకా ఎన్నాళ్లండీ?”
కన్నీరు మున్నీరై విలపిస్తున్న భార్యవైపే జాలిగా చూస్తూ "లోకంలో మనం ఒక్కరమే ఒంటరిగా బ్రతుకుతున్నామని భ్రమ పడకు ఉషా. మనలాంటి వాళ్లు కోకొల్లలు. ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. రోజూ ఇలా దుఖిస్తుంటే మన సమస్యకి పరిష్కారం దొరికిపోతుందా? అన్నింటికీ భగవంతుడు ఉన్నాడు, బాధపడ”కంటూ శ్రీధర్ అనునయిస్తున్నాడు.
అదే సమయంలో ఒక ఇరవై రెండు, ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి ఆ పార్క్ రోడ్ మీద నడుస్తూ వీళ్లు కూర్చున్న సిమెంట్ బెంచ్ వద్దకు వచ్చి ఆగిందో క్షణం.
వీరిరువురినీ చూస్తూ చిరునవ్వుతో "నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ" అంటూ విష్ చేసింది.
"ఎవరి అమ్మాయివమ్మా, మాతో ఏదైనా పని ఉందా” అని శ్రీధర్ అడిగాడు.
"అవును అంకుల్, నాకు ఇల్లు అద్దెకు కావాలి. ఇక్కడ ఏమైనా పోర్షన్లు ఖాళీగా ఉన్నాయా, మీకేమైనా తెలుసా?”
"మా ఇంట్లో ఖాళీగా ఉందమ్మా. ఇంతకీ నీవెవరూ” అంటూ ప్రశ్నించాడు.
"నా పేరు అవంతి అంకుల్. నాతో మా అమ్మ, చెల్లి ఉంటారు. మా నాన్నగారు చనిపోయి అయిదు సంవత్సరాలైంది. నాకు ఇక్కడే విద్యారణ్యా హైస్కూల్ లో మేధ్స్ టీచర్ గా జాబ్ వచ్చింది. ఇక్కడ ఇల్లు తీసుకుంటే మా స్కూల్ కి వాకబుల్ డిస్టెంన్స్ అని రెండు రోజుల నుండి వెతుకుతున్నాను. మేము మెహదీపట్నంలో ఉంటున్నాం. ఇల్లు దొరకగానే ఇక్కడకు మారిపోతాం” అని చెపుతున్న అవంతి కి "మా ఇల్లు ఆ పక్కనే, రా చూద్దువుగా”నంటూ వారింటికి తీసుకెళ్లి ఖాళీగా ఉన్న పోర్షన్ ను చూపించాడు.
అవంతి కి ఆ ఇల్లు ఎంతగానో నచ్చింది. శ్రీధర్, ఉషా ఆత్మీయత ఆ అమ్మాయిని ఎంతగానో ఆకట్టుకుంది. మంచి రోజు చూసుకుని వస్తామని ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయింది.
అసలు ఇన్నాళ్లూ ఆ పోర్షన్ ఖాళీగానే ఉంది. ఎవరికీ అద్దెకీయలేదు. ఆ అమ్మాయి అడిగేసరికి అసంకల్పితంగా ఉందని చెప్పేసాడు శ్రీధర్. అయినా లంకంత ఇల్లు. రెండు గదులు అద్దెకిచ్చేసినా వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు.
మలయ మారుతంలా వచ్చిన ఆమెని చూసేసరికి ఇన్నాళ్ళ నైరాశ్యం ఒక్కసారిగా పోయింది. ఆ ముఖారవిందానికి చంద్రుడైనా చిన్నబొవాలి, ఆ కురుల విరులు చూసినవారెవరైనా కవి కావల్సిందే.. ! కోటి భావాలు ఒక్క క్షణంలో పలికించగల కళ్ళు, సంధ్యాసమయపు ఎరుపుని పూసుకున్న ఆ అధరాలు.. ఏ దేవకన్యనో దారితప్పి ఇలా చేరిందా అని ఆశ్చర్యంతో, ఒకరకపు అనుభూతితో ఆమె వైపు కళ్ళార్పనియ్యకుండా చేస్తున్నాయి.
చెప్పినట్లుగానే ఒక వారం తరువాత అవంతి అమ్మా చెల్లి ఆమనితో కలసి ఆ పోర్షన్ లోకి దిగిపోయింది.
అవంతి కి లక్కీగా మంచి స్కూల్ లో టీచర్ జాబ్ వచ్చిందని, బి. ఎస్. సి పాస్ అయ్యాక బి. ఇడి చేసిందని అవంతి తల్లి హైమావతి శ్రీధర్ దంపతులకు చెప్పింది.
"అన్నయ్యగారూ, వదిన గారూ” అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైపోయింది.
ఇంక అవంతి, ఆమని అయితే శ్రీధర్ ఇంట్లోనే తిరుగుతూ వారి ఒంటరి తనాన్ని దూరంచేసారు.
హైమావతి భర్త స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన మూలాన ఆయన తరపున పెన్షన్ కొంత ఈవిడకు వస్తుంది.
చిన్న కూతురుకి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి చదువులో పడితే మెల్లిగా అవంతికి పెళ్లి సంబంధాలు చూడాలని హైమావతి ఆలోచన.
ఇదే ఆలోచనను ఒక రోజు హైమావతి శ్రీధర్ కు చెపుతూ "చూడండి అన్నయ్యా అవంతి ససేమిరా పెళ్లి చేసుకోనంటోంది. ఎందుకంటే నేను ఒంటరిదాన్ని అయిపోతాననిట. దానికి మీరు కాస్త నచ్చ చెప్పండి. అలాగే మీకు తెలుసున్న సంబంధాలు ఏమైనా ఉంటే చూడండంటూ చెపుతున్న హైమావతితో "అవంతికి ఎలా నచ్చ చెప్పాలో అలాచెప్పాలి గానీ తొందరపడకూడదమ్మా. ఆడ పిల్లలు పైకి ఎంతో ధైర్యంగా కనిపించినా సున్నిత హృదయులు. ప్రతీ సారి పెళ్లి పెళ్లి అంటుంటే అవంతి లో ఒకలాంటి మొండితనం ఏర్పడి తను అనుకున్నదేదో చేసేసే ప్రమాదముంది".
"నేను లేనామ్మా మీకు" అనగానే అతని ఆప్యాయతకు హైమావతి కళ్లు చెమర్చాయి.
ఉష కి అవంతిని చూస్తున్నప్పుడల్లా అపర్ణ గుర్తుకొస్తుంది. ఎంతో భవిష్యత్ ఉన్న ముక్కుపచ్చలారని తన చిన్నారి అప్పూ తమకు శాశ్వతంగా దూరమైంది. అపర్ణ పై ఎక్కువ ఆశలు పెట్టుకుని ఆ పసిపిల్లను బాధ పెట్టేమేమోనన్న ఆలోచనలతో అశాంతికి లోను అవుతూ ఉంటుంది.
ఆమనికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి జాయిన్ అయింది.
ఇక్కడ ఇల్లు, స్కూలూ, పరిసరాలకు బాగానే అలవాటుపడ్డారు అవంతీ వాళ్లూ.
శ్రీధర్ పెదనాన్న మనవడు కిరణ్ బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ అతన్ని హైద్రాబాద్ ఆఫీస్ కి పోస్టింగ్ ఇచ్చింది. "వాడికి ఆఫీస్ దగ్గరలో ఎకామ్ డేషన్ దొరికే వరకు మీ ఇంట్లోనే ఉంటాడు అన్నయ్యా” అంటూ పెదనాన్న కొడుకు శేఖర్ ఆ ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పాడు.
"ఎకామ్ డేషన్ ఏమిటిరా శేఖర్, మతిగానీ పోయిందా? కిరణ్ మా ఇంట్లోనే ఉంటాడు, నీకు తెలుసుగా ఇంట్లో నేనూ మీ వదినేగా గా ఉంటున్నది” అనగానే “నీ ఇష్టం అన్నయ్యా” అనేసాడు శేఖర్. శ్రీధర్ అంటే విపరీతమైన గౌరవం అతనికి.
కిరణ్ వచ్చాడు. నవ్వుతూ నవ్విస్తూ ఉండే కిరణ్ రాక శ్రీధర్ ఉషా దంపతులను ఆనందడోలికల్లో ముంచేసింది.
అవంతి కూడా కలివిడిగా ఉండడంతో కిరణ్ అవంతిల మధ్య కొంత స్నేహ భావమేర్పడింది.
ఉష లో అదివరకటి శూన్యత దూరమైంది. ఉత్సాహంగా ఉంటోంది ఈ మధ్య. భార్యలోని ఈ మార్పు శ్రీధర్ కి ఆనందాన్నిచ్చింది.
అవంతి కిరణ్ ను చూడగానే ఆమె ముఖంలో కనీ కనిపించని చిరుసిగ్గులు శ్రీధర్ దృష్టిని దాటిపోలేదు. అలాగే కిరణ్ అవంతి కనిపిస్తే చాలు అవంతిని ఏదో చిలిపిగా ఏడిపించడానికి చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఉష కి చెపుతూ "వాళ్లిద్దరూ మంచి జోడీ అవుతారు కదూ ఉషా. ఇద్దరికీ పెళ్లి చేసేద్దామా" అన్నాడు నవ్వుతూ.
"హమ్మో, మీ తమ్ముడు ఏమంటాడో” అంటూ గుండెలమీద చేయి వేసుకుంది.
"వాడి మొహం, అవంతి కి ఏమి తక్కువ? అందం, చదువు, మంచితనం అంతకంటే ఏమికావాలి? పైగా ఇద్దరూ ఒకరి నొకరు ఇష్టపడుతున్నారు కూడా".
"మా శేఖర్ గాడిని నేను వప్పిస్తాను. శ్రీనగర్ కాలనీ లో ఉన్న మన ఫ్లాట్ అవంతి పేరు మీద వ్రాసేస్తాను”.
"నిజమాండీ"?
"అవును ఉషా. మన అపర్ణ ఉండి ఉంటే దానికి ఇవ్వనా? ఎందుకో అవంతి మన అపర్ణ లాగే అనిపిస్తుంది. చూసిన మొదటి రోజే అనుకున్నాను. దేవుడే దాన్ని తిరిగి అవంతి రూపంలో పంపలేదు కదా అని".
"అబ్బా నా మనసులోని మాట చెప్పారండీ"!
"మనకి ఉన్న ఆస్తులన్నీ ఏమి చేసుకుంటాం ఉషా? మేడమీద భాగమంతా అద్దెకిచ్చేసినా కింద ఉన్న లంకంత భాగం చూసుకోలేకే రెండు గదులు అవంతి వాళ్లకూ అద్దెకిచ్చేసాం. ఎందుకో అవంతి అద్దెకు ఇల్లుకావాలని అడిగినప్పుడు అసంకల్పితంగా మన ఇంట్లోనే ఉందని చూపించేసాను. చూసావా, భగవంతుడు మనుషులను ఎలా కలుపుతాడో"?
"నిజమే, మీరు చెప్పిన ఆలోచన బాగుందండీ. హైమావతి గారితో ఒకసారి మాట్లాడి చూడండి". ఉష ముఖంలో ఆనందం చిందులేస్తోంది.
హైమావతి ని పిలిచి విషయం చెప్పేసరికి ఆవిడ కళ్లనీళ్ల పర్యంతమై "అన్నయ్యా ఇది నిజమా, ఎంత మంచి మనసు మీ”దంటూ ఏడ్చేసింది.
"ఆస్తులేమీ వద్దు అన్నయ్యా, అవంతిని పెళ్లికి ఒప్పించి దానినో ఇంటిదాన్ని చేయండి చాలు” అంటూ ఉద్వేగభరితురాలైంది.
"చూడమ్మా, చనిపోయిన నా చిట్టితల్లిని అవంతిలో చూసుకుని మురిసిపోతున్నాం. అవంతి కిరణ్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. నేను పూర్తిగా పెళ్లి ఖర్చులు పెట్టుకుని సకల లాంఛనాలతో పెళ్లి జరిపిస్తాను. ఇంకేమీ అడ్డు చెప్పకమ్మా” అని నచ్చచెప్పాడు.
‘ఏ బంధుత్వమూ లేని ఈ దంపతులకు మా మీద ఇంతటి అభిమానం, దయ. భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడనుకుం’టుంటే హైమావతి కళ్లు తడిఅయినాయి.
ఆవిడకు శ్రీధర్, ఉషా దంపతులు పార్వతీ పరమేశ్వరులాగ అనిపించారు.
ఆ రోజు ఆదివారం. కిరణ్, అవంతి ఖాళీగా ఉండడం చూసి ఇద్దరినీ పిలిచి తన దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడాడు.
"మీ ఇద్దరి అభిప్రాయమూ తెలుసుకోకుండా నేనొక నిర్ణయానికొచ్చా”నంటూ ఇద్గరివైపూ ఓరగా చూసాడు.
"మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను".
"అంకుల్, అమ్మ కోసం పెళ్లి చేసుకోకూడదనుకున్నాను ఇంతక మునుపు. ఈ లోగా కిరణ్ తో పరిచయం నా ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. అతని వ్యక్తిత్వం, మంచితనం నన్ను ఆకర్షించాయి".
"ఇకనుండి నన్ను మామయ్యా అని పిలువమ్మా"!
"సరే మామయ్యా, నాకొక కోరిక ఉంది మామయ్యా".
"ఏంటది అవంతీ"?
మీరూ, అత్తా, అమ్మా ఒంటరి వారు కాకూడదని, మీకు ఎప్పుడూ మేము సపోర్ట్ గా ఉంటామన్న నా కోరికను కిరణ్ మన్నిస్తే నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే”. సిగ్గుదొంతరల మధ్య కిరణ్ వైపే ఓరగా చూస్తూ అంది.
"మీరందరూ ఉండగా మేమెలా ఒంటరి వాళ్లమౌతాం అవంతీ"?
“అదీ నిజమే కానీ మామయ్యా..”
అవంతి మాటలకు కిరణ్ మథ్యలో కలగచేసుకుంటూ.. .. .
"పెదనాన్నా, నాకు అవంతి అంటే చాలా ఇష్టం. తనని నేను ప్రేమిస్తున్నాను. అవంతి మాటల్లో వాస్తవం ఉంది. అవంతి కోరికను అంగీకరిస్తున్నాను. మీకందరికీ నేనూ అవంతీ ఉన్నాం, మీరు ఒంటరితనంతో బాధపడే అవకాశాన్ని కలగనీయం".
కిరణ్ మాటలకు శ్రీధర్ మనస్సు అర్ధ్రమైంది. కన్నకొడుకు అనవలసిన మాటలను కిరణ్ అంటున్నాడు ఎంతో అభిమానంగా.
మనుషుల మథ్య అను బంధాలు ఏర్పడాలంటే బంధుత్వాలే ఉండాలా? మలి వయస్సులో తమని చూసుకోడానికి కడుపున పుట్టిన పిల్లలే ఉండాలని లేదు. మన మంచితనం, చూపించే ప్రేమ కిరణ్ అవంతి లాంటి వాళ్లనెందరినో మన దరికి చేరుస్తాయి. శ్రీధర్ మనసు పులకించిపోయింది.
శ్రీధర్ రాయపూర్ లో ఉన్న తమ్ముడు శేఖర్ తో వివరంగా మాట్లాడాడు.
"పెద్దవాడివి. మంచీ చెడూ నీకంటే నాకేమి తెలుసన్నయ్యా? కిరణ్ నీ కొడుకే అనుకో అంటూ సమాధానమిచ్చాడు".
కిరణ్ కూడా వాళ్ల నాన్నతో అవంతిని తాను ఇష్టపడుతున్నట్లుగా చెప్పాడు.
అవంతి, కిరణ్ ల పెళ్లిలో అంతా తానై తిరిగి సొంత కూతురి పెళ్లి చేసినట్లుగా అన్నీ దగ్గరుండి జరిపించారు శ్రీధర్ ఉషా. ఆనందంతో సంబరపడిపోతున్న ఉష కళ్లల్లో వేయి మతాబుల వెలుగుని చూస్తూ శ్రీధర్ మురిసిపోయాడు.
---#---
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
Opmerkingen