top of page

పాత గుడ్డలు

Writer: Sammetla Venkata Ramana Murthy Sammetla Venkata Ramana Murthy


'Patha Guddalu' - New Telugu Story Written By Susmitha Ramana Murthy

Published In manatelugukathalu.com On 19/03/2024

'పాత గుడ్డలు' తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అమ్మగోరూ! పాత గుడ్డలుంటే పడేయండమ్మా! అట్టుకు పోతాను” పనిమనిషి రత్తాలు వినయంగా అడిగింది. 


“మూడు నెలల క్రితం నావి నాలుగు చీరలు, పొట్టయిన పిల్లల బట్టలు పది జతల దాకా, మావారివి అరడజను

జతలు..పెద్ద మూట కట్టుకుని తీసుకుపోయావు కదే!?.. నా చీరల్లో ఒక్కటి కూడా నీవు కట్టుకోవడం చూడనేలేదు. 

ఈ బట్టలన్నీ ఏంచేస్తున్నావే!?.. ”


“అదేటమ్మా! మీలాంటి పెద్దోల్లు కట్టి ఇడిసేసిన పాత గుడ్డలే, మాలాంటోల్లకు కొత్త బట్టలు కదమ్మా?.. ఆరునెలలకో

మారు మా ఊరికి, నాను పనిసేసే ఇల్లనుంచి బట్టలు పోగేసి అట్టుకుపోతున్నానమ్మా! మా ఊరోల్లు ఆ గుడ్డలు

సంబరంగా కట్టుకుంటున్నారమ్మా!”


పనిమనిషి సమాధానంతో అమ్మ గారి ఆశ్చర్యం పటాపంచలైంది. 


“నీవు కట్టుకుంటున్నవి కొత్త చీరలే కదా ?”


“అవునమ్మ గోరూ!.. మీరు, నాను పనిచేస్తున్న మిగతా ఇల్లోల్లు పెతి సంకురేతిరికి సీరలు ఎడతారు కదా?.. నా

ఒంటిపైవి అయేనమ్మా!”


ఆ సందేహం కూడా తీరింది అమ్మగారికి. 

ఆఫీసుకి బయల్దేరుతున్న అయ్యగారి ఆలోచనలు మాత్రం పనిమనిషి మాటల్లోని నిజాయితీని తూకం వేయసాగాయి. 

భార్య చెవిలో నెమ్మదిగా ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. 


“ అమ్మగోరూ! పాత గుడ్డలు ఇస్తానంటే ఉంటానండీ!”


అమ్మగారు దాని మాటలు పట్టించుకోలేదు. పనిమనిషి మరోమారు అడిగింది. 

“ఇప్పుడవన్నీ చూసే ఓపిక నాకు లేదే! తర్వాత చూద్దాంలే!” అనేసరికి తను వెళ్ళిపోయింది. 


సాయంత్రం భర్త ఆఫీసు నుంచి రాగానే

ఆమె ఆత్రంగా అడిగింది. 


“పాత బట్టలు ఎందుకు రత్తాలుకి ఇవ్వొద్దని చెప్పారు?”


“మన పని మనుషుల పాత బట్టల నిర్వాకం మన కమ్యూనిటీ వాసులందరికీ త్వరలోనే తెలుస్తుంది “


“సర్లెండి! మీరు చెప్పినట్లు పాత బట్టలన్నీ పక్కన పెట్టాను”


“వెరీ గుడ్! నీకు తీరుబడి ఉన్నప్పుడు, కుట్లు ఊడిన వాటిని మిషనుపై సరి చేయు. అ తర్వాత వాటిని వాషింగ్

మెషీన్లో వేయు. ఇస్త్రీ నేను చేస్తాను”


‘ఇంతిదిగా చెబుతున్నారంటే ఏదో బలమైన కారణం తప్పకుండా ఉండే ఉంటుంది!’ మనసులో అనుకుందామె. 

“సెలవులని పిల్లలు అత్తయ్య, మావయ్యల దగ్గరకు పంపించి చాలా రోజులైందండీ! వీలు చూసుకుని తీసుకు రావాలండీ!”


“అలాగే!”

*****

“నాన్న గారికి గుండె నొప్పని అన్నయ్య ఫోన్జేస్తే చాలా భయం వేసిందండీ! మిమ్మల్నీ గాభరా పెట్టేసాను”


“అది గుండె నొప్పి కాదని, గేస్ట్రిక్ ప్రాబ్లెమని డాక్టర్లు చెప్పారు కదా! ప్రశాంతంగా ఉండు”


తిరుగు ప్రయాణంలో అయ్య గారి ప్రేమ పూరిత ఓదార్పుకి ఆమె తృప్తిగా కళ్ళు మూసుకుంది. పదినిముషాల తర్వాత

కారు కుదుపుకి ఆమె కళ్ళు తెరిచింది. 


“కారు ఆపారేమండీ?.. ” ఆత్రంగా అడిగింది. 


“వెనుక టైరుకి గాలి పోయినట్లుంది “అంటూ డ్రైవింగు సీట్లోంచి దిగి చూసాడు తను. 


ఒక టైరులో గాలి పోయింది. 

మరో గంటన్నర ప్రయాణం!

మధ్యలో ఈ అవాంతరం!.. 


“సార్! పంక్చరైంది. స్సేరుందా?.. పావుగంటలో మార్చేస్తాను”  జిడ్డు మరకల బట్టల్లో పాతికేళ్ళ యువకుడు ఎదురుగా నిల్చున్నాడు. 


తలూపుతూ కారు డిక్కీ తెరిచారు అయ్యగారు. అరగంటలో పని పూర్తి చేసాడతను. పంక్చరు అయిన టైరుని కూడా

బాగు చేసాడు. చేసిన సహాయంకి మూడొందలు వాడికిస్తూ ఆశ్చర్యంగా అడిగారు— “కారు ఆగగానే పిలవకుండానే

ఎక్కడ నుంచి ఊడిపడ్డావు నీవు!?” 


సమాధానంగా ఎదురుగా ఉన్నపంక్చరు షాపు చూపించాడు

వాడు. 


ఈలోగా రెండు ప్లేస్కులతో ఒకడు వచ్చాడు. “ అయ్యగారూ! గరమ్ గరమ్ చాయ్! ఇమ్మంటారా?.. లేక పాలు

ఇమ్మంటారా?”


అమ్మ గారు,అయ్యగారు టీలు తీసుకున్నారు. పరిసరాలను చూస్తూ,వేడి వేడి టీ తాగుతున్నారు ఇద్దరూ. 

విశాలమైన ఆరోడ్డు రాత్రైనా వస్తూ పోతున్న వాహనాలతో చాలా రద్దీగా ఉంది. 


పౌర్ణమి రాత్రి కావడంతో వెన్నెల వెలుగుల్లో పట్ట పగలుగా ఉంది. రోడ్డుకి ఇరువైపుల అక్కడక్కడ మూతి బిగించిన

గోతాములు చిందరవందరగా పడి ఉన్నాయి. టీ తాగుతున్న ఇద్దరి దృష్టి వాటిపై పడింది. ఆశ్చర్యంగా వాటివేపు

చూడసాగారు. 


“అవా సార్! మీలాంటోల్లు పని మనుషులకు పాత బట్టలు ఇస్తుంటారు. వందల కోట్ల బడా బాబులు కొందరు

గోతాముల్లో, అసలు వాడని కొత్త బట్టలతో బాటు, పాత బట్టలు కూడా కుక్కేసి అప్పుడప్పుడు అలా

పడేయిస్తుంటారు”


వాడి మాటలకు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 


“అటు చూడండి సార్! కొందరు గోతాములు విప్పి బాగున్న వాటిని ఓపక్క, బాగులేని వాటిని మరోవేపు పోగులు

పెడుతున్నారు”


“అలా ఎందుకు చేస్తున్నారు?” అమ్మ గారి ప్రశ్నకు జవాబు చెప్పాడు వాడు—” బాగున్ప బట్టలను వాడుకుంటారు. బాగులేని వాటిని కార్లు,లారీలు క్లీనింగు సెంటర్లకు అమ్మేసు కుంటారు”


మరోసారి ఆశ్చర్యపోయారు ఇద్దరూ. 

వాడికి ధేంక్స్ చెప్పి బయల్దేరారు. 


“ ఏమండీ! మన పని మనుషుల పాత బట్టల మూటలకు, ఆ గోతాములకు ఏమైనా సంబంధం ఉందంటారా?”


“ రెండూ ఆర్థిక సంబంధమైనవే! పని మనుషులది స్వార్థపూరిత చర్య! వారిది పెట్టుబడి లేని బతుకు తెరువు!”


భావగర్భితమైన ఆ సమాధానం ఆమెకు అర్థం కాలేదు. 

“రాత్రిపూట ఇలా రహదారుల్లో పడే మూటల కోసం ఎందరో ఆత్రంగా ఎదురు చూస్తుంటారని అర్ధం అవుతోంది కదా?.. 

ఎక్కడో చదివాను. గుర్తు వస్తోంది. కాస్త మంచి బట్టలను శుభ్రపరచి, ప్లాస్టిక్ కవర్లలో ఉంచి, మురికి వాడలలోని పేద

వారికి అమ్ముకుని జేబులు నింపుకుంటారు వాళ్ళు” 


అర్థమైనట్లు తలాడించింది ఆమె. 


“మన కమ్యూనిటీ వాసులంతా ఒక్క మాటపై నిల్చుని సేకరించిన బట్టలను, దాతల విరాళాలతో కొన్ని కొత్త దుప్పట్లు, బియ్యం నూనె పప్పు దినుసులు.. మిగతా వంట సామాగ్రి కొని, చుట్టుపక్కలున్న అనాధ శరణాలయలకు,

వృద్ధాశ్రమాలకు అప్పుడప్పుడు పంపిణీ చేయాలన్న మంచి

నిర్ణయం తీసుకున్నారు”


“చాలా మంచి నిర్ణయమండీ! మనవంతు విరాళంగా రెండు వేలివ్వండి “ ప్రశంసా పూర్వకంగా అందామె. 


“ఈ మంచి నిర్ణయం తీసుకోవడానికి బీజం వేసింది ఓ సంఘటన!”


“ఏమిటండీ అది!?.. ”


“మన ఓనర్ల ప్రెసిడెంటు, కొందరు కాలనీ వాసులు అనుకోని సంఘటన చూడడం, దానిని వీడియో తీయడమే!

అందులో మన పని మనుషులు సేకరించిన పాత బట్టలు అమ్ముకోవడం, స్టీలు సామాన్లుగా మార్చు కోవడం

ఉంది. వారిలో మన పనిమనిషి రత్తాలు కూడా ఉండటం, మనకు మరింత ఆశ్చర్యరకమైన విషయం!”

/ సమాప్తం / 

################## ######### 

సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

      మీ సుస్మితా రమణ మూర్తి.



 
 
 

2 Comments


👌 Old materials are washed and put on rolling. This may the reason for rebate upto 50%. -యస్.నాగేశ్వరరావు

Like

నేను ఈ రోజునే సుష్మిత రమణ మూర్తి గారు వ్రాసిన "పాత గుడ్డలు" అనే కథ చదివాను.

బాగుంది. మంచి సందేశాత్మక కథ.

మరిన్ని సందేశాత్మక కథలు రచయిత కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ.

.... దిలీప్ కుమార్

Like
bottom of page