నా మతం మానవత్వం
- Pitta Govinda Rao
- Mar 19, 2024
- 4 min read

'Na Matham Manavathvam' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 19/03/2024
'నా మతం మానవత్వం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
శరత్ అప్పుడే ఆఫీసు నుండి వచ్చి స్నానం, వంట, బోజనం ముగించేసరికి రాత్రి 11అవుతుంది. వారం రోజుల్లో ఉగాది పండగ వస్తుంది. అంతా కలిసి అత్తారింటికి వెళ్ళాల్సి ఉంది కానీ కంపెనీలో వర్క్ ఎక్కువ ఉండటం వలన భార్య పిల్లలను మాత్రమే పంపించి తాను ఒక్కడే ఉంటున్నాడు. పడుకుందామని పరుపు సర్దుతుండగ తలుపు చప్పుడు అయింది. తలుపుతీసి చూడగా ఎదురుగా మాసిన దుస్తులు, భుజానికి ఏదో సంచి, చేతిలో ఒక కాగితం పట్టుకుని ఒక ముసలాయన ఉన్నాడు.
"ఎవరండి మీరు?" శరత్ అడిగాడు.
"బాబు.. ఇది ఈ కాగితంలో ఉన్న అడ్రసే కదా" అని ఆ కాగితం శరత్ కి ఇచ్చాడు.
కాగితం చూసి "అవును " అన్నాడు శరత్.
"నీ పేరు శరత్ కదా.. "
"అవును. మీరెవరు?” ప్రశ్నించాడు శరత్.
" అదేంటి బాబు మీ నాన్న నీకు చెప్పలేదా నా రాక గూర్చి.. ? పోని నువ్వు కూడా గుర్తుపట్టలేదే.. ? నా పేరు రాములు. మీ నాన్నకు బాల్య స్నేహితుడిని. మనది శ్రీకాకుళంలో లకిదాసుపురం నువ్వు కూడా అక్కడే పుట్టి పెద్దవాడివి అయ్యావు.
శరత్ ఏదో ఆలోచిస్తూ తెలివి తెచ్చుకుని "హో.. మీరా రాములు గారు.. క్షమించండి. ఎప్పుడో చూశాను కదా.. పైగా మీరు కూడా ముసలివాళ్ళు అయిపోయారు. అందుకే సరిగ్గా గుర్తు పట్టలేదు, లోపలికి రండి " అహ్వానించాడు శరత్.
" ఆ.. తాత ఏమైనా తిన్నావా.. "
"ఏం తింటాను బాబు.. ? మీ నాన్న పంపిన నీ అడ్రస్ కి చేరుతానో లేదో అని ఒకటే బెంగ అయితేను.. "అన్నాడు రాములు.
తానే మరలా వంట చేసి రాములకు వడ్డించాడు శరత్. రాములుకి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు ఉంది గబగబా నోట్లో ముద్దలు పెట్టుకుని తిన్నాడు.
అంతా అయ్యాక శరత్ అడిగాడు.
" ఏంటీ విషయం.. ఇంత రాత్రి సమయంలో కష్టపడి ఇక్కడికి వచ్చారు.. ? ప్రశ్నించాడు.
"బాబు మన ఊరు కరువుకాటకాలతో కొట్టుమిట్టాడుతుందని మీ నాన్న మన ఊరికి దగ్గరలో పట్టణంలో ఇళ్ళు కొనుకున్నాడు కదా.. ఇక నేను అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కొడుకులు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ విషయం తెలిసి నీ తండ్రి రాకపోయినా.. ! స్నేహితుడిగా నాకొక సహాయం చేశాడు.
‘హైదరాబాద్ లో నా కొడుకు ఉంటాడు. వాడి అడ్రస్ చెప్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి మన విషయాలు చెప్పు. నేను ఆల్రెడీ ముందే వాడికి చెప్తాను నీ రాక గూర్చి. వాడు నీకు డబ్బులు సహాయం చేస్తాడు. ఆ డబ్బు నీకు వ్రుద్దాప్యంలో ఉపయోగపడుతుంది. నేను అనారోగ్యంతో ఉన్నాను కోలుకోటానికి నెల పడుతుంది. ఈలోగా నువ్వు పని పూర్తి చేసుకొచ్చేయి” అన్నాడు.
అడగకుండానే సహాయం చేసే గొప్ప స్నేహితుడు చెప్పటంతో ఇక కాదనకుండా రైలు ఎక్కాను. ఒక రాత్రి, ఒక పగలు గడిచాక రైలు హైదరాబాద్ వస్తుంది అని తెలుసుకున్నాను. తెచ్చుకున్న చిల్లర డబ్బులతో ఏవో కొనుక్కుని తిన్నాను.
రైలు ఆగగానే ప్రయాణీకులను తోసుకుంటు గాభరగాభరగా దిగాను. స్టేషన్ మొత్తం ప్రయాణీకులతో కిటకిట లాడుతుండగా అక్కడ నుండి ఎటు వెళ్ళాలో తెలియక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడసాగాను. ఎవరినైనా సహాయం అడుగుదామంటే నా వాలకానికి బిచ్చగాడు అనుకుంటారని అడగకుండా కొంతమంది ప్రయాణీకులను అనుసరిస్తూ నడవసాగాను.
అలా స్టేషన్ నుండి బయటకు రాగా అక్కడ రహదారి మార్గం కనపడగానే కాస్త నా మనసు కుదట పడింది. అసలే చీకటి పడింది. ఆపై ఆకలి దహించివేస్తుంది. తాను చేరవల్సిన చోటకు చేరుతానో లేదో అని రైల్లో బెంగపెట్టుకుని గడిపి చివరకు ఆ నరకం నుండి బయటపడి ఇక్కడికి వచ్చానని, ఇక్కడ సరిగ్గా అడ్రస్ చెప్పి ఏదో ఒకటి ఎక్కితే డ్రైవరే నాకు కావల్సిన చోట వదలడా అని మనసులో అనుకుంటు ఒక ఆటోవాలా వద్దకు వెళ్ళి నేను వెళ్ళల్సిన అడ్రస్ చెప్పాను.
" అంత దూరం ఆటోలు వెళ్ళవు " అని చెప్పి అటుగా వస్తున్న బస్సు ఎక్కించి "నీకు కావల్సిన అడ్రస్ కి ఈ బస్సు వెళ్తుంది" అని చెప్పి నీకు తెలియకపోతే కండక్టర్ సార్ ఉంటారు అడిగితే చెప్తాడని చెప్పి తనకున్న మానవత్వం చాటుకున్నాడు ఆటోవాలా.
అలా ఇక్కడ దిగి బస్సు దిగగానే అశోక్ నగర్ లు రెండు ఉన్నాయి. అందులో ఇది ఫస్ట్ ఉంది దీని తర్వాత ఇంకోటి ఉంది. ఈ ఊరిలో నీకు కావల్సిన వారి పేరు చెప్పి అలాంటివారు ఎవరైనా ఉన్నారో లేదో కనుక్కుని తర్వాత రెండో అశోక్ నగర్ కి వెళ్ళు అని కండక్టర్ చెప్పాడు. ఎలాగో దేవుడి దయ వలన నీకు కలవగలిగాను " గోడు వెల్లదీశాడు రాములు.
"సరే మీరు ఇప్పుడు నన్ను చేరుకున్నారు. మీకు ఏ భయము అక్కరలేదు. మీకు నేనున్నాను. మీకు అవసరమైన డబ్బులు నేను ఇస్తాను. మీరు క్షేమంగా మీ గమ్యం చేరేలా నేను సహాయం చేస్తాను. ప్రశాంతంగా నిద్రపోండి " అని శరత్ కూడా పడుకున్నాడు.
తెల్లవారి రాములు కంటే ముందే లేచి వంట చేశాడు. ఆఫీసుకి అత్యవసర సెలవు పెట్టాడు. రాములు కోసం గోరువెచ్చని నీరు స్నానానికి సిద్ధం చేశాడు. రాములు స్నానం చేశాకా ఇద్దరు త్రుప్తిగా బోజనం చేశారు. తర్వాత రాములను తన బైక్ పై షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళి అతనికి సరిపడే ఐదు జతలు బట్టలు కొన్నాడు. బ్యాంకులో మూడు లక్షల రూపాయలు తీసుకుని ఎక్కడో వేరే ఊరిలో ఒక ఇంటి ముందు రాములును దించాడు.
శరత్ కూడా దిగి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుండి ఒకతను బయటకు వచ్చాడు.
" శ్రీకాకుళంలో లకిదాసుపురం మీదేనా " అడిగాడు శరత్.
" అవున"న్నాడు అతను.
రాములు శరత్ వెనుక ఉండి ఏమీ అర్థం కానట్లు చూస్తున్నాడు.
" చింతాడ. శరత్ మీరేనా.. ? మీ నాన్న పేరు సింహాచలం కదా.. ?
" అవును "
శరత్ రాములను చూపిస్తు..
" ఇతను మీకు తెలుసా.. "
"హో.. తెలుసు. రాములు తాతా.. మీకోసమే రాత్రంతా నిద్ర మానుకుని ఎదురు చూశాను. నాన్న ఫోన్ చేశాడు.. ఇంకా రాలేదా.. చూడు పట్టణంలో తప్పిపోయాడేమో అని. చీకటి పడింది కదా తెల్లవారి చూద్దామని ఆగిపోయా. ఇంతలో నువ్వే వచ్చావు " అన్నాడు అతడు.
అప్పుడు అర్థం అయింది రాములకు రాత్రి వచ్చింది రాంగ్ అడ్రస్ కి అని.
" మొదటి శరత్ వైపు తిరిగి
"బాబు నువ్వు దయగల హ్రుదయుడివి. నీకు ఒకసారి కాదు వందసార్లు చేతులెత్తి దండం పెట్టినా.. అది సరిపోదు " అన్నాడు రాములు.
"బలేవారండి.. అవేం మాటలు.. ! ఆపదలో ఉన్న మనిషికి ఆదుకోవటం, ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టే గుణం సాటి మనిషికి లేకపోతే ఆ మనిషి పుట్టుకకు అర్థం ఏముంటుంది చెప్పండి.. ? అన్నాడు శరత్.
" నిజమే బాబు కానీ.. దిక్కు ముక్కు తెలియని నాకు, బిచ్చగాడిలా ఉన్నా.. గెంటివేయకుండా మానవత్వంతో అక్కున చేర్చుకుని, వంటచేసి వడ్డించి, నా కష్టాలు ఓపిగ్గా విని ఒక తండ్రికి సేవ చేసినట్లు సేవ చేశావ్ నువ్వు దేవుడితో సమానం బాబు " కన్నీరు పెట్టుకున్నాడు రాములు.
ఇదంతా అర్థం కానీ.. రెండో శరత్ "ఏమైంద"ని అడిగాడు
" ఏం లేదు బ్రదర్.. నా పేరు కూడా శరత్ నే. ఫస్ట్ అశోక్ నగర్ లో ఉంటున్నాను. పొరపాటున నా అడ్రస్ కి వచ్చాడు. తెల్లవారి వరకు నా వద్దే ఆశ్రమం కల్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. నా వంతుగా ఈ మూడు లక్షల రూపాయలు ఇతనికి ఇస్తున్నాను. ఇక మిగతాదంతా మీ నాన్న నీకు చెప్పే ఉంటాడు. ఇతనికి సహాయం అందించి క్షేమంగా మీ ఊరు పంపే ఏర్పాట్లు చేయండి. ఇతనికి ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను" అన్నాడు మొదటి శరత్.
"శరత్ గారు.. మీరు రియల్లీ గ్రేట్ అండి. మీకు సంబంధంలేని వ్యక్తికి ఎంతో సహాయం చేశారు. ఈ మహా నగరంలో అందరూ మాయగాల్లనే చూశాను. ఇన్నాళ్ళకి మానవత్వం కలిగిన మనిషిని చూస్తున్నాను. అయినా.. ! ఆశ్రమం కల్పించటమే ఒక ఎత్తు మూడు లక్షలు ఇవ్వటం కూడా గొప్పే. "అన్నాడు రెండో శరత్.
" చూడు బ్రదర్.. ! పదిమంది కళ్ళలో ఆనందం చూస్తేనే నాకు, నా భార్య, పిల్లలకు కడుపునిండా భోజనం చేయాలనిపిస్తుంది. మనిషిగా మానవత్వమే నా మతంగా పెరిగాను.
కళ్ళ ముందే ఒకరు కష్టాల్లో ఉంటే కనికరించని మనం నిజంగా మనిషికి పుట్టినట్లేనా.. ? నాకు టైం అవుతుంది. నేను వస్తాను. రాములు తాత జాగ్రత్త" అంటు తన నివాసానికి వెళ్ళేందుకు బైక్ స్టార్ట్ చేశాడు మొదటి శరత్.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments