top of page

నిన్నా మెున్నటి పూవు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Ninna Monnati Puvvu' written by Bhagavathula Bharathi

రచన: భాగవతుల భారతి

కూతురిలో వయసుకు మించిన పరిణితి చూసింది ఆ తల్లి.

ఆ మెచూరిటీ కూతుర్ని తప్పు దారిలో నడుపుతుందని భయపడింది.

ఆమె అనుమానం నిజమో కాదో..ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారి కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం

"ఎమోషన్స్ లేని మనిషే ఉండడు. వాటిని కంట్రోల్ లో పెట్టుకోటానికి ప్రయత్నించే వాళ్ళేతప్ప " భామ షూ లేస్ కట్టుకుంటూ అన్నది.

నేను పక్కనే బాంబు పేలినా అంత ఉలిక్కి పడేదాన్ని కాదేమో. వేగంగా తలతిప్పి చూసాను. మళ్లీ తనే అంది.

"ఈ విషయం మా ఫ్రెండ్స్ కి చెబితే అర్ధం కావట్లా " మళ్ళీ బాంబు..

"నువ్వేం చెప్పావ్? వాళ్ళకేం అర్ధంకాలేదంటావ్ " మళ్లీ నా ప్రశ్న.

"ఎవరో ఒకరిని పనిగట్టుకొని, ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వారికోసమే అలంకరించుకోటం, వారికోసమే, ఎదురుచూడటం, ఎదుటివారిని సంతోషపెట్టటానికి ఏదేదో చేసేయటం… ఎందుకదంతా.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండక్కర్లేదా? అమ్మా! అదే చెబుతానమ్మా వాళ్ళకీ " భామ షూ వేసుకోటం పూర్తి చేసి బ్యాగ్ భుజాన తగిలించుకుంది.

నా నోట్లోంచి మాటరాలా.. అవాక్కయి, స్థాణువై ,కొయ్యబారి పోయి, ఆ పరిస్థితికి తెలుగులో వర్ణనలు ఎన్నుంటే అన్నీ అయ్యాను. కారణం ఆ మాటలే కాదు. భామ వయసుకూడా ...

భామ ఇంకా పదవతరగతి పసిపిల్లే అనుకున్నా. నాకు తెలీకుండా ఇంత ఎప్పుడెదిగిపోయిందీ?

"భామా! ఈమాటలన్నీ ... ఎవరు నేర్పారూ? అన్నాను.

"సెల్ లో గూగుల్ సెర్చ్ లో పెరసనాలిటీ డెవలెప్ మెంట్, క్లాసెస్... ఇంకా మంచి కథలూ ఉంటాయిగా అమ్మా.. " అంది.

కరోనా ఆన్ లైన్ క్లాసులవల్ల, ఓ సెల్ కొనిపెడితే, తరగతి పాఠాలే కాక జీవిత పాఠాలూ నేర్చెేసుకుంటున్నారా? ఈ పిల్లలూ? మంచా? చెడా?

"అవును భామా!ఎమోషన్స్ అంటే ఏమిటీ?

పర్సనాలిటీ డెవలెప్ మెంట్ అంటే ఏమిటీ ?” నేను ప్రశ్నించాను.

"ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, అమ్మా!

పర్సనాలిటీ కాదమ్మా! పెర్సనాలిటీ.. అంటే వ్యక్తిత్వం " భామ సమాధానానికి బుర్ర తిరిగిపోయింది నాకు.

"అమ్మా! మన జీవితం జీవితం చివరివరకూ తోడుండేది ఎవరమ్మా? తల్లిదండ్రులా? స్నేహితులా? వ్యక్తిత్వమేగా? అంటే నేను అనే వ్యక్తి.. అంతేగా! " అంది.

ఈ సారి నన్ను నేను నిలద్రొక్కుకోటానికి ఓ గోడ మీద చేయివేసాను.

"అమ్మా! మనం మనంగా నిలబడటానికి ఊతకర్రలవసరం లేదమ్మా" అంటూనే స్కూల్ ఆటోవస్తే వెళ్ళిపోయింది.

సోఫాలో కూలబడి ఆలోచిస్తున్నాను.

ఈ వయసుకే ఇలాంటి మాటలా? మహా గురువులు కూడా యాభై యేళ్ళకి నేర్చి ఉంటారు ఇలాంటి మాటలు. ఒకవేళ నన్ను ఉద్దేశించి నన్ను పరిహసించట్లేదుకదా!?

గబగబా నా సెల్ లో మెసేజెస్ చెక్ చేసుకున్నా.. అన్నీ డిలిట్ చేయటంలో పొరపాటేమైనా జరిగిందేమో నని.

ఎవరివీపు వారికి కాకుండా, ఎదుటివారికే కనబడుతుందిట. భామకేమైనా తెలిసినాయా?! ఇంతకాలం చిన్నపిల్లేగా అనుకున్నా. పిల్లలు ఎంత తొందరగా ఎదిగిపోయారో గమనించలేకపోయానే! మనసు పరిపరి విధాల పోతోంది. దానికీ కారణం ఉంది.

ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకున్న నా విఠల్..

బాబు భాస్వంత్, పాప భామ పుట్టగానే, యాక్సిడెంట్ లో కన్నుమూసాడు. విఠల్ గవర్నమెంట్ ఉద్యోగి, కాబట్టి ఆ జాబ్ నాకు ఇచ్చారు. కానీ, పిల్లల బాధ్యతలు ,సింగిల్ పేరెంట్ గా నా సమస్యలూ, తల్లీదండ్రీ,తోబుట్టువులతో చెప్పుకోగా మిగిలిన సమస్యలు,

ఎందుకో సహోద్యోగి శేఖర్ తో చెప్పుకోవటం మెుదలు పెట్టాను. ప్రతి ఒక్కరికీ తనమనసులోని భావోద్వేగాలు పంచుకోటానికి, కష్టం సుఖం చెప్పుకోటానికి కచ్చితంగా ఓ మనిషి ఊతం కావాల్సిందే నని నా అభిప్రాయం. సమయాన్ని బట్టి, ఆ మనిషి ఎవరనేది కాలం నిర్ణయిస్తుందనీ నా వ్యక్తి గతఅభిప్రాయమే.

శేఖర్ కూ పెళ్ళయి, ఇద్దరు పిల్లలు, బాధ్యత లు తెలిసిన వాడవటం వలన, పైగా అతను ఆఫీసులో కోలీగ్స్ అందరినీ ,నవ్వుతూ పలకరించటం, అడిగిన వాళ్ళకి కాదనకుండా సహాయ పడటం, నన్ను ఆకర్షించింది. ఒంటరిదాన్నైన నేను భావోద్వేగాలన్నీ తనతోనే పంచుకునే దాన్ని.

పరిచయం 'మీరు' నుండి చనువు పెరిగి 'నువ్వు' గా మారినా పట్టించుకోలేదు నేను. ఆఫీసు వదిలాక కాసేపు పిచ్చాపాటీ.ఇద్దరమూ హద్దులు దాటలేదు. అయినా కొలీగ్స్ గుసగుసలు. రెండేళ్ళ క్రితం శేఖర్ కి వేరే ఊరు బదిలీ ఐంది. తట్టుకోలేక పోయాను.

"అయ్యో! ఇవాళా,రేపూ టెక్నాలజీ అభివృద్ధి చెంది, మనిషికీ మనిషికీ మధ్యన దూరం తగ్గించిందిగా! రోజూ వాట్సప్లో,ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. మీ శ్రేయోభిలాషి గా నీ పక్కనే ఉన్నట్లే భావించు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆర్డర్ వేయి. రెక్కలు కట్టుకుని వాలతా! " అన్నాడు.

ఆఫీసులో కొత్త స్టాఫ్, రకరకాల మనస్థత్వాలు, ఎవరితో ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా, ముఖం మీద నవ్వులూ, చాటున గాసిప్స్. ఏ పరిచాయాలైనా, కొన్నాళ్ళే, ఎవరిసమస్యలు వారివీ, ప్రక్కవారి మానసిక స్థితి ఎవరికీ పట్టనంత బిజీ.

పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళతో ఎలాంటి సమస్యలూ చర్చించలేను. ఒంటరి దాన్ననే ఫీలింగ్ క్రుంగదీసేస్తోంది. ఊతకర్ర కోసం, వెపర్లాట నాలో....

పైగా తోడులేని ఒంటరితనం, ఏదో కావాలనే వ్యామోహం ,ఆరాటం… అందుకే నా భావాలు తెలిసిన శేఖర్ పిల్లల చదువులకు చిన్న ధనసహాయం చేస్తూ, సలహాలిస్తూ, తను నాకు ఏదో ఇవ్వాలనే ప్రతిఫలాపేక్షగానీ లేకుండా తను మాట్లాడితేనే చాలు అని ఇది స్నేహం అనే ఆత్మవంచన తో బ్రతికేస్తున్నాను.

మనుషులు ఎదురుగా కూర్చుని మాట్లాడుకోటం వేరు. ఫోన్ లు వేరు. నా ఫోన్ ల వల్ల శేఖర్ కి భార్యకి, మధ్య మన:స్పర్ధలు మెుదలయ్యాయని కొంచెం లేటుగా అర్ధం అవుతూనే ఉంది.

కానీ నేను ఫోన్ లూ, వాట్సప్ మెసేజ్ లు ఆపలేదు. కొన్నాళ్ళు నన్ను తప్పించుకోవాలని, ప్రయత్నించాడు కానీ, నా మానసిక స్థితి నన్ను ప్రశాంతంగా ఉండనీలా! మెసేజెస్ పెడుతూనే ఉన్నా.

నేను చేసేది, మంచా చెడా? అనే విచక్షణ కోల్పోయా.. బ్రతిమాలటాలూ, భంగపాట్లూ చవిచూసా. ఈమధ్య "అమ్మాతల్లీ! నీతో మాట్లాడాలని నాకూ ఉంది. కానీ మనల్ని అర్ధం చేసుకునే స్థితిలో మా ఇంట్లో వాళ్ళు లేరు. కాబట్టి నువ్వు, మెసేజ్ లు పెట్టకపోయినా, నాతో మాట్లాడటం మానేసినా, నేనూ, నాభార్య, నా సంసారం ప్రశాంతంగా బ్రతుకుతాం. అర్ధం చేసుకో " అనే శేఖర్ పెట్టిన మెసేజ్ నాకు నిద్దురను దూరం చేసింది.

మానసిక క్రుంగుబాటు..".నేను డబ్బు సహాయం చేసినప్పుడు, వద్దని గొడవ పడకుండానే తీసుకుందిగా మీ ఆవిడ" అని నేడగలేక పోయాను.

విరక్తి వచ్చేస్తోంది. కచ్చితంగా ఇలాంటి మానసిక స్థితి లోనే, మనిషి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడనే నిజం అర్దమవుతోంది.

కానీ నా పిల్లలూ?...

సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వచ్చేసరికి భామ హోంవర్క్ చేస్తోంది.

ఏంటి సంగతులూ పాపాయ్? ముద్దుగా అడిగాను.

"నాకు చిరాకుగా ఉంది అమ్మా "అంది భామ.

"ఎందుకూ?" అనడిగాను.

"మా ఫ్రెండ్స్ లో చాలామంది ఈ వయసుకే ప్రేమలో పడ్డారు. కానీ నేను వద్దన్నాను . నాతో మాట్లాడటం మానేసారు " అంది.

ఈసారి ఉలిక్కిపడటం మానేసి, భామని చదవటానికి ప్రయత్నం చేసాను.

"చిన్నప్పుడు చాలా మంది ఇక్కడే తప్పుచేస్తారు " అంది.

"ప్రేమించటం తప్పా?"

ఓ స్నేహితురాలితో మాట్లాడున్నాననుకని సంభాషణ కొనసాగించా.

"కాదమ్మా! చిన్నప్పుడు పెద్దలు చెప్పింది ఏదీ పిల్లలు వినరు. పెద్దలు చాదస్తంగా చెప్పారనుకుంటారు . తప్పుమీద తప్పు చేస్తారు. మంచేం జరగదు. 30 వయసు దాటాక, చేసిన తప్పులన్నీ సరిచేయలేక ఆరోజు అమ్మానాన్న చెప్పింది వింటే ఇలా జరిగేది కాదుకదా?! అని ఏడుస్తారు.

అప్పుడు తప్పులు దిద్దుకున్నా అనుభవించటానికి జీవితం ఉండదుగా అమ్మా!? " అంది భామ.

ఎవరో చెర్నాకోలు తో ఎవరో కొట్టారా?! అనిపించి.. వెనక్కి తిరిగి చూసా.

ఆ వెనక్కి తిరిగి చూడటం జీవితం వెనక్కి కూడా ....

విఠల్ ని అలాగే ఎంచుకున్నాగా!

"మరి పెద్దవాళ్లు చేసే నిర్ణయాలన్ని కరెక్టేనంటావా?!" భామ ఆలోచనలు ఆమె వయసును నేను మర్చిపోయి రెట్టించాను.

" కరెక్ట్ కాకపోయినా ఆ మార్గంలో నడిచాము. ఐనా నష్టపోయాం, అనే ఆత్మసంతృప్తి, సమాజానికి మనపట్ల సానుభూతి ఉంటాయ్ " అంది.

"అంటే సమాజపు సానుభూతి కోసం బ్రతకాలా? " నేను ప్రశ్నించా.

"ప్రతీమనిషీ ఏదో ఓ దశలో సానుభూతి కోసం, ఊరట కోసం వెంపర్లాట పడతాడటమ్మా కానీ మామూలు స్థితిలో కన్నా, ఆ పరిస్థితిలోనే ,దాని విలువ అర్ధం అవుతుందటమ్మా " గూగుల్ లో చూసా అంది.

"ఇన్ని మాటలు ఎక్కడ నేర్చావ్ భామా నువ్వూ!? ఇదంతా మెంటల్ మెట్యూరిటీ అంటే...నీ మానసిక పరపక్వత అనుకోవాలా? నేనూ " నా పెద్దరికంతో దబాయించాను.

"అమ్మా!నువ్విలా అంటున్నావ్ కానీ!

మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు నన్ను ఎంత గౌరవిస్తారో తెలుసా?! మా మాటమీద వాళ్ళకెంత నమ్మకమో! వాళ్ళ పిల్లలను వాళ్ళు నమ్మరు. నేను చెప్పిందే నమ్ముతారు" అంది భామ ప్రశాంతంగా.

ఆ సమయంలో నా మనసులో రేగిన తుఫాను ఎవరూ ఊహంచలేరు. ఎన్నో ప్రశ్నలు.

నా వెనుక ఇంత జరుగుతోందా? నాకు తెలీకుండానే పిల్లలు ఇంత ఎదిగారా?

అంటే!? టెక్నాలజీ ఇంత మంచిని కూడా చేస్తోందా? వ్యక్తిత్వ వికాసపు క్లాసులు వినేంత కుదురు నా కూతురికి ఉన్నా,

ఆమె సెల్ ఫోన్ లో ఏం చూస్తోందో.. పట్టించుకునే స్థితిలో లేను లేనా?

అదే చెడు చూస్తే? తండ్రిలేని పిల్లలు డిప్రెషన్ లో ఏదోటి చేస్తే? అదీగాక పిల్లలని నేను గమనించలేకపోయినా, పిల్లలు నన్ను గమనిస్తున్నారా? ముఖ్యంగా భామ.

పిల్లవాడు గమనించినా ,గమనించనట్టు ఊరుకుంటున్నాడా?

బాబోయ్.. ఏమిటిదంతా?

మర్నాడు "భామా! నువ్వు చెబుతుంటే బాగుంది. ఇంకేమైనా చెప్పు " అన్నాను నేను ఆఫీసుకి, తను స్కూల్ కి రెడీ అవుతుండగా.

"అమ్మా! మన మెంటల్ బాలెన్స్ ని కోల్పోకుండా ఉండటానికి, మనం ఎంచుకునే మార్గమే మన వ్యక్తిత్వంట”

" అంటే? " అడిగాను.

"అంటే! నేను చదువువల్ల వచ్చే నా మానసిక ఒత్తిడిని తగ్గించుకోటానికి, నేను కొరియన్ సాంగ్స్ వినటానికి ఇష్టపడతాను నీకు తెలుసుగా. అలా ఎవరిమార్గంలోవాళ్ళుప్రయత్నించాలి " అంది.

"మరి నేను ఫ్రెండ్స్ తో మాట్లాడటానికీ.. "

నా మాట పూర్తి కాకముందే... భామ అందుకుంది.

"మరి వారివల్ల నీ మానసిక వత్తిడి తగ్గుతోందామ్మా? తగ్గటం లేదంటే నీది రాంగ్ రూట్ అనేగా! " .

నాకు దిమ్మ తిరిగిపోయింది. కన్నతల్లిదండ్రుల ఇన్నేళ్ళ పెంపకాన్నీ తాకట్టు పెట్టి, చనిపోయిన విఠల్ ప్రేమ తాకట్టు పెట్టి, పిల్లల బాల్యాన్నీ, తాకట్టు పెట్టి, నా వ్యక్తిత్వాన్నీ తాకట్టు పెట్టి శేఖర్ దగ్గర నేను ప్రశాంతతని కొనగలిగానా?!

"అమ్మా! ముందు మనల్ని మనం గౌరవించుకోవాలమ్మా! దాన్నేఆత్మగౌరవం అంటారు ... అది లేనివాళ్లు మిగతావారిని ప్రేమంచగలరామ్మా! అందుకే! ప్రేమికులూ, ముష్టివాళ్ళూ ఒకటే అన్నారోకవి.. వీళ్ళు బిచ్చం అడుక్కుంటారు. ప్రేమికులు అవతలి వారి నుండి ప్రేమను అడుక్కుంటారట"....

భామ ఎందుకందో, ఎవరినందో, గూగుల్ నాలెడ్జో, నా తల మాత్రం భూమిలోకి కూరుకుపోయిన భావన. నిన్నా మెున్నా నా తోటలో పూచిన పూవు, ఎన్ని పరమళాలను వెదజల్లుతోందీ?

"ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయ్. అనుభవించేవాళ్ళకు తెలుస్తాయ్,.."

పౌరుషం తో నా మాట పూర్తి కాలా.

"సెల్ఫ్ పిటీ అంటే ..మనమీద మనమే జాలి పడటం అస్సలు నచ్చదునాకు .... ఆ సమయంలో మన మెంటల్ స్టెబిలిటీనే మన వ్యక్తిత్వం అమ్మా ...మన నుంచి మనమే పారిపోయే ప్రయత్నం ఎప్పుడూ పనికిరాదమ్మా... నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా అమ్మా? " అడిగింది భామ.

////////////////

రోజూ భామ స్కూల్ నుండి, నేను ఆఫీసునుండి రాగానే గంటసేపు, నేను భామకి ,బాబుకి సబ్జెక్టు టీచర్ గా,

భామ నాకు జీవిత పాఠాల టీచర్ గా కొత్త అవతారం ఎత్తామ్. ఇప్పుడు నా ఊతకర్ర నా కూతురే. మరి సెల్ నా చేతిలో ఉన్నా, అందులో కొన్ని నెంబర్లు, మనుషులూ వారి పేర్లూ లేవు.. ఇప్పుడు సెల్ కేవలం నాకొక ,నిత్యావసరాల లాగానే..

అలంకారం మాత్రమే.

///////////////////

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


130 views7 comments
bottom of page