top of page

ఎప్పటికెయ్యది?

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Eppatikeyyadi' Written By Bhagavathula Bharathi

రచన: భాగవతుల భారతి

అతనికి అవసరం అయినప్పుడు ఎవ్వరూ సహాయం చేయలేదు.

ఎవరికి వాళ్ళు సాకులు చెప్పి తప్పుకున్నారు.

తరువాత అతనికే ఫోన్ చేసి, బాంధవ్యాలు కాపాడుకోవాలని ఉపన్యాసాలు ఇచ్చారు.

సరదాగా సాగే ఈ కథను భాగవతుల భారతి గారు రచించారు.


"బొత్తిగా నీకు రిలేషన్స్ మెయింటెన్స్

చేతకాదురా సుబ్బీ!" బావ ఫోన్ లో మళ్ళీ మెుదలెట్టాడు. ఇదే పదం వినీ వినీ అసహనం నాలో..

"రిలేషన్స్ మెయింటెన్స్ చేయటం అంటే ఏంటిబావా? " మళ్ళీ అడిగాను.

స్వగతంలో మాత్రం 'రిలేషన్స్ మెయింటెన్స్ చేయటం అంటే చాడీలు చెప్పడం, వినడం, ఫోన్ లో ఛాటింగ్ పేరుతో అక్కరలేని భేషజాల కబుర్లూ, అవతలి వారు కష్టంలో ఉంటే,పరామర్శ పేరుతో వచ్చి,వేలెడు సహాయం చేయకపోగా కుర్చీల కంటుకుపోయి , తిష్టవేసుకుని కూర్చుని , గంటలుగంటలు అవతలి వారి పనికి అడ్డం వస్తూ, సొల్లు కబుర్లు చెప్పటమా? ..'

నా ఆలోచనలకు భంగం కలిగిస్తూ...

"అంటే సంబంధబాంధవ్యాలు కాపాడుకుంటూ, సఖ్యతతో మెలగటం...

మన మధ్యతరగతి తెలుగు కుటుంబాల్లో ఈ బాంధవ్యాలు మరీ కుంటుబడి పోతున్నాయబ్బాయ్.

ఐనా ఈ ప్రశ్నా జవాబూ, మన మధ్య ఎన్ని సార్లు చర్చలు జరిగినా, విషయం మారుతుందా? " ఫోన్ పెట్టేసాడు బావ.

నలుగురు అక్కల తర్వాతి సంతానాన్ని నేను .ఒక్కగానొక్క మగసలుసుని. కానీ నన్నేమన్నా గారాబంగా చూసారా?

అక్కలందరి చదువులు, పెళ్ళెళ్ళు నా చేతుల మీదుగానే జరిగినాయ్. అప్పుడు వేరు. ఇప్పుడు రోజులు మారినాయ్.

నా పెళ్ళి దగ్గరకు వచ్చేసరికి, ఎవరికి వాళ్ళు బాధ్యతల్లో చిక్కుకుపోయి ఉన్నారు.

"పెద్దది యంబిబియస్ కి ప్రిపేర్ ఔతోందిరా మీ బావగారూ రావటానికి కుదరదు.నేనైనా వెంటనే వెళ్ళిపోవాలి, ఏమనుకోకూ" అని పెద్దక్క.

"మా అత్తగారు మంచంలో, రేపోమాపో అన్నట్లు ఉందిరా! నేనులేకపోతే మీ బావఊరుకోరూ! " చిన్నక్క.

ఇలా ఎవరికారణాలు వారికున్నాయ్.

పెళ్ళి కొడుకునైనా, నేనే అన్ని పనులూ నెరవేర్చుకుని, అరుణను అర్ధాంగిగా తెచ్చుకున్నాను. మరి ఇప్పుడు నేనూ బాధ్యతలలో బందీనే. పిల్లల చదువుల దగ్గరునుండీ, అన్నీ ఎవరోఒకరి తో

బయటివాళ్ళ సహాయమే!

"రేయ్ సుబ్బీ! ఆ కాత్యాయని ఉందే! అదినన్ను ఇలా అందిరా? " పెద్దక్క ఫిర్యాదు.

"అహా " అని నేను.

"కాదురా! అక్కే నన్ను మనిషిగా కూడా చూడట్లేదురా" చిన్నక్క ....

"ఆహా నిజంగానా "అని నేను.

"సుబ్బారావు గారూ! మరీ!ఇదివిన్నారా?మనాఫీసులో...."

అందరి సోది రామాయణానికీ...

"ఓహో సరే " అంటూ

అన్నిటికీ..అందరికీ...అవే సమాధానాలు నేను.

మళ్ళీ ఫోన్..

"ఏమిటీ బొత్తిగా ఫోన్లు లేవు.. బాంధవ్యాలు కాపాడుకోకపోతే ఎలా"?... అని ఈసారి అచ్చతెలుగు లో చినబావ.

"బాంధవ్యాలు, రిలేషన్స్... పదాలు ఏవైనా “అవంటే ఏంటి బావా? " పిచ్చి ముఖంవేసుకుని నా ప్రశ్న.

"కాదూ! ఎవరు ఏం చెప్పినా "ఆహా !ఓహో! ఊహూ! ఇవేనా నీ సమాధానాలూ!? స్పందించాలిగా!? ఏదోటి మాట్లాడాలిగా ఇలా ఐతే... ఎలా పెరుగు తాయ్ రిలేషన్స్?. నీ అవసరాలకీ నీ ఇంటికి ఎవరొస్తారు చెప్పూ?!

నాకు నవ్వాలో! ఏడ్వాలో అర్ధంకాలా ! "ఇవాళారేపూ?! కేవలం పుండుమీద కారం జల్లే పరామర్శలేగానీ!? అవసరాలు తీర్చటానికి వచ్చేవాళ్ళుకూడా ఉన్నారంటావా! బావా? కాలు లేక పోతే కొయ్య కాలు, కళ్ళు మసకేస్తే కళ్ళజోడూ, ముక్కుదిబ్బెడ వేస్తే డ్రాప్స్, చేతులు కాలితే గ్లౌజులూ, ఇవన్నీ కాక శ్వాస ఆడకపోతే, ఆక్సిజన్ సిలెండర్.... అలా ఇవన్నీ ఒరిజినల్ అవసరాలకు ప్రత్యామ్నాయాలే!"

"రిలేషన్స్ కూడా అలాగే తయారయ్ గా.. ఎప్పడి కెయ్యది, ఎవ్వరది ప్రస్తుతమో, అప్పటికయ్యది, మాటలూ, మనుషులాడి, పని జరిపంచుకోటమే! ...

రక్తసంబంధాలూ, బంధుత్వాలూ.. 'అక్కరకు చుట్టమూ'... అంటూ పద్యాల్లో చదువుకోటానికే ...కానీ!.... " మాట్లాడుతూ అవతలినుండి సడీచప్పుడూ లేకపోయేసరికి నా వాక్ప్రవాహంలోంచి బయటికొచ్చి ఫోన్ కేసిచూస్తే, కాల్ కట్ అయిందా? . కట్ చేసారా?...మెుదటి సారిగా నోరువిప్పితే... వినకుండా కట్ చేయటమేంటీ?

ఫోన్ రిలేషన్స్ మెయింటెన్స్ చేయటం కూడా బొత్తిగా రాదు వీళ్ళకి.. అనుకుని నాలిక్కరుచుని పడీపడీ నాలో నేనే నవ్వుకున్నాను. అవునూ! ఎందుకు నవ్వానూ?అసలు ..రిలేషన్స్ మెయింటెన్స్ చేయటం అంటే ఎంటీ? ఆలోచిస్తూనే ఉన్నా.

////////////,

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


107 views2 comments
bottom of page