top of page

అగోచర

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Agochara' written by Bhagavathula Bharathi

రచన: భాగవతుల భారతి


మబ్బుల్లో నీళ్లను చూసి ముంత ఒలకబోసుకున్నాడు ఒక యువకుడు.

ఫలితం ఊరంతా అప్పులు.

సమస్యలను అతడు ఎదిరించాడా?

పారిపోయాడా?

ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారి 'అగోచర' కథలో తెలుసుకోండి.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


"నాన్నా! నేను పనిమీద హైదరాబాదు పోతున్నా.. " చెప్పాడు సురేష్

"ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడికెందుకురా? " అన్నాడు సుగుణారావు.

"మీటింగ్ ఉంది." అన్నాడు సురేష్

"ఇప్పుడు పరిస్థితి సరిగా లేదు. అప్పులవాళ్ళు చుట్టుముడుతున్నారు. ఒంటరిగా వెళ్ళకు " హెచ్చరించాడు సుగుణారావు

"నాన్నా! ఆ పనిమీదే వెడుతున్నాను. అప్పులన్నీ తీర్చేమార్గాన్నే వెదుకుతున్నాను" అన్నాడు సురేష్.

కోడలు బయటికి వచ్చి " మామయ్య గారూ! నా కెందుకో భయంగా ఉంది. నాలుగురోజులనుండి, పిచ్చిపిచ్చిగా....అప్పుతీర్చలేకపోతే, రైలు క్రింద తల పెట్టేస్తాను, అని మాట్లాడుతున్నారు. అక్కడ మా యిల్లు ఊరిచివర కదా? ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు. అందుకనే ఇక్కడ మనింటికి తీసుకువచ్చా " అంది.

ఇద్దరు కొడుకులకూ పెళ్ళిళ్ళు చేసి, వేరే ఇళ్ళలో కాపురం పెట్టించాడు సుగుణారావు.

కానీ ప్రొద్దున, సాయంత్రం వచ్చి పోతూనే ఉంటారు. కొడుకులూ, కోడళ్ళూ.

ఐతే పెద్ద కొడుకు వీరేశ్వర్ గవర్నమెంట్ ఉద్యోగి . చిన్న కొడుకు సురేష్ ప్రయివేట్ స్కూల్ టీచర్.. ఈ మధ్య సురేష్ ఓ ఖరీదైన కారు లో తల్లినీ తండ్రినీ చూడటానికి వస్తున్నాడు.

కోడలు మయూరి మాటలకు సుగుణారావు భయంగా, కొడుకు వంక చూసాడు.

సురేష్ మయూరి వంక చూస్తూ " నీకు ఇంటిదగ్గరే చేతిలో చేయివేసి చెప్పానుగా! ఎలాంటి అఘాయిత్యమూ చేసుకోననీ " అని చెప్పి, బయలుదేరాడు హైదరాబాదుకి.

/////////////

"మామయ్యగారూ! మీ అబ్బాయి వెళ్ళి రెండు రోజులయింది. ఫోన్ చేస్తే, రెస్పాన్స్ లేదు. మీరు చేసి చూడండి " కోడలి మాటలకి, " మీటింగ్ చూసుకుని ఏదైనా పనిమీద వెళ్ళాడేమో! " వాడే చేస్తాడులేమ్మా భయపడకు.. " కోడలికి ధైర్యం చెప్పి, తను పనిమీద బయటికి వెళ్ళాడు సుగుణారావు.

మూడోరోజున ఫోన్. "మేం సూర్యాపేట పోలీసులమండీ! సురేష్ అనే అతను మీ అబ్బాయా? ఇక్కడి హోటల్ రూమ్ లో సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్య చేసుకున్నాడు. వచ్చి శవాన్ని గుర్తుపడితే, కార్యక్రమాలు పూర్తి చేసి, శవాన్ని అప్పగిస్తాము " అన్నారు.

మతిపోయి కుప్పకూలి పోయాడు సుగుణారావు. చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

"నా కొడుకా! సురేషా!ఎంతపని చేసావొరేయ్! చచ్చిపోయే ముందు , ముద్దులు మూటగట్టే ఆరేళ్ళనీ కూతురు, నాలుగేళ్ళ నీ కొడుకు గుర్తురాలేదంట్రా " గుండెలు పిండేసిన బాధతో, ఘెల్లు ఘెల్లున ఏడుస్తున్నాడాయన. శవపంచాయితీ జరిపించి సగం కుళ్ళిన శవాన్ని తెచ్చి, కార్యక్రమాలు ముగించారు.

సూసైడ్ నోట్ లో, "నా మరణానికి కారణం, ఫలానా పారిశ్రామిక వేత్త. నన్ను ఇంటికి పిలిచి నప్పుడు అతని దగ్గర ఉన్న 20 మంది రౌడీలతో మెళ్ళో గొలుసు,వేళ్ళ ఉంగరాలూ, నా చక్కటి కారు లాక్కుని, నన్ను కొట్టించాడు. ఆ అవమానం భరించలేక పోయాను. మయూరీ! నాన్నా! మీరంతా జాగ్రత్త. నా పిల్లలను జాగ్రత్త గా పెంచే బాధ్యత అన్నయ్యదీ నీదే నాన్నా!" అంటూ ఇంకేవేవో రాసాడు.

చదివీ చదివీ ఏడుస్తున్నాడు సుగుణారావు.

ఆయన భార్యకూడా ఏడ్చిశోకాలు పెట్టి అలిసిపోతోంది.

విలేఖరులు ఛానల్ వారు వచ్చి,వివరాలు సేకరించి ప్రకటనలిచ్చే సరికి అసలు విషయం బయటకు వచ్చింది. ఇదీవార్త.

'అప్పులు చేసి మరీ ..క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టి, ఈజీమనీతో తెల్లవారేటప్పటికి, ధనవంతులైపోవాలనే అత్యాశ, ఓ కుటుంబాన్ని బజారున పడేసింది .ఓ ప్రాణాన్ని బలితీసుకుంది.వార్త టి.విలో హోరెత్తింది .

ఇంటికి వచ్చి ముఖాన మైక్ లు పెట్టి, ఆస్థి ఎంతనష్టపోయిందీ,సూసైడ్ నోట్ లో ఏమేమి వ్రాసిందీ ,ప్రతీ ఛానల్ లోనూ చూపించి, మరికాస్త ఏడిపించిన మీడియాకు నమస్కారం చేస్తూ ..

ఏడుపు ఆపేసి...

అందరూ మతిపోయిందేమోనని ఆశ్చర్యపడేట్లుగా,

హఠాత్తుగా పైకి లేచి. గోడను పట్టుకుని నిలబడ్డాడు సుగుణారావు.

"నేను చేప్పేది వినక ,కంటికి కనిపించని ఆ కరెన్సీ మీద అత్యాశ తో డబ్బే కావాలని, కనిపెంచిన ఈ తల్లి దండ్రులను,పెళ్ళాంపిల్లలు, ఇల్లూవాకిలి ,స్నేహితులనూ , ఏదీ వద్దనుకునేగా ఆత్మహత్య చేసుకున్నాడు. తను మాత్రం మాకు ఎందుకు?

"వాడి కంటే ఈగోడ నయం.

ఎన్నో ఆటుపోట్లకు నిలబడి ,నా బరువుని కూడా మోస్తోంది.

ఈ రోజు నుండీ ఈ గోడే నాకు ఆసరా

నేను పడిపోకుండా దీన్నే పట్టుకుని నడుస్తా.

పోతే పోయాడులేరా! " అంటూ కన్నీళ్ళు తుడుచుకుని గోడ ఆసరాతో నిలబడ్డాడు.

ఇదంతా చూసి ఓ విలేఖరి " ఏమండీ! రోజూ అనేక కారణాలతో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయ్. మీడియా మెుత్తం కెమెరాలు పట్టుకుని మీ ఇంటి ముందే ఎందుకు నిలబడిందో తెలుసా? " అని అడిగాడు.

వెనుదిరిగి చూసాడు సుగుణారావు,గంభీరంగా ..

మళ్ళీ ఆ విలేఖరే " జరిగింది అన్యాయం కాబట్టి, చేసింది అక్రమంకాబట్టి "

ప్రశ్నార్ధకంగా చూస్తున్నారు అంతా.

"అవును! మీ ఆస్థుల వివరాలు తెలుసుకునే వచ్చాం. మీది మామూలు కూరగాయల వ్యాపారం. మీ అబ్బాయి గవర్నమెంట్. ఉద్యోగి.. కానీసురేష్ ది ప్రయివేట్ ఉద్యోగం. మరి ఊరి చివర పదిఎకరాలలో, స్థలం కొన్నాడు. దానిలో పెద్ద స్కూల్ కట్టాడు. కోటిరూపాయలపైనే అయిఉంటుందిగా! వేరే పెద్ద స్కూల్ లో పార్టనర్ షిప్ ఉందిగా? లక్షలు విలువచేసే కారు, నివాసం ఉండటానికి పెద్ద అపార్ట్మెంట్ ఎక్కడినుండి వచ్చినాయో మీ అబ్బాయి ని అడిగారా? "

"అదీ?! " మయూరి తడబడుతూ అంది.

"ఆగమ్మా నేను చెబుతాను. అగోచరమైన క్రిప్టో కరెన్సీ అనేది... ఓ జూదం, వ్యసనం అయిపోయింది ఈ రోజుల్లో. దానికి మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో బలవుతున్నాయ్. కొంత పెట్టుబడి పెడితే తెల్లవారితే రెట్టింపు అవుతుంది. ఆ సొమ్ము దానిలోనే పెడితే, మళ్ళీ రెట్టింపు... కానీ యువత ఇక్కడితో ఆగట్లా... తృప్తి లేదు. మీ ఆయన స్కూల్ మీద, ఆస్థులన్నటి మీదా కూడా అప్పుచేసి దానిమీదపెట్టాడు.... పైగా పదిమందిని బలవంతంగా చేర్పించి, తాను పూచీ ఉన్నాడు. వస్తే కోట్లు లేదంటే దివాళా . మీకు అంతా పోయి, నష్టం వచ్చింది. మరి కట్టిిన వాళ్ళంతా పూచీ ఉన్న సురేష్ నే అడుగుతారుగా? " విలేఖరి తో వచ్చిన న్యూస్ ఎడిటర్ అన్నాడు.

"ఆ డబ్బంతా మనమే కడదాం. తొందర పడి ఆఘాయిత్యం చేసుకోవద్దని చెప్పామండీ " సుగుణారావు భార్య అంది ఏడుస్తూనే.

"అమ్మా! పదులా? ఇరవయ్యా? మీ అబ్బాయి చేసిన అప్పు పదికోట్లు, ఆస్థులన్నీ మెడలోని పుస్తెలతో సహా అమ్మినా మీరంతా బతికుండగా అప్పుతీర్చగలరా? పైగా, మీ అబ్బాయ్ వ్రాసిన మరణ వాగ్మూలం ప్రకారం ఆ పారిశ్రామికవేత్త ,అతని అనుచరులూ, మర్డర్ కేసుకింద అరెస్ట్ అయ్యారు. వ్యాపారం పోయి అతణ్ణి ఆశ్రయించిన వారు, రోడ్డున పడ్డారు. పోనీ మీరు బాగున్నారా? భార్య, పసిపిల్లలూ… వీళ్లు ఎలా పెరిగి పెద్దవాళ్లు కావాలి? దీనికంతటికీ కారణం.. కేవలం ఈజీ మనీ అంటే కష్టపడకుండా వచ్చే డబ్బు మీద అత్యాశ కాదూ?!” అన్నాడు న్యూస్ ఎడిటర్.

ఆలోచన లో పడ్డాడు సుగుణారావు.

"మీరు పట్టుకోవల్సింది గోడఆసరా కాదు. మీ అబ్బాయి చేసిన నష్టం, మీతోపాటు నష్టపోయిన వారందరి కష్టం. ఇందులోంచి ఎలా బయటపడాలో ముందు అదిచూడండి. అలాగే మాతరం ఈతరం వారైన ఆ పసిపిల్లలకు మీరు కంచుకోటలా నిలవండి. ఇవన్నీ అగోచర జీవిత జాడలు అని చెప్పండి. "అంటూండగానే…

"తాతయ్యా" అంటూ మనవడు కాళ్ళను చుట్టేసి, నవ్వుతూ, ‘ఎత్తుకో’ అంటూ చేయి చాపాడు.

గోడను వదిలేసి ఈ వయసులో మరో తరం చేతికి ఆసరాను ఇవ్వడానికి ,మనుమణ్ణి ఎత్తుకున్నాడు సుగుణారావు.

//////////////

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


191 views1 comment

1件のコメント


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2022年1月29日

Sridhar Akkaldevi • 2 days ago

యువతకు మంచి సందేశం ఇచ్చారు...నా అభిమాన రచయిత్రి భారతి గారికి అభినందనలు......

いいね!
bottom of page