కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Aluperugani Alalu' written By Kiran Jammalamadaka
రచన: కిరణ్ జమ్మలమడక
తీరం చేరాలని అలలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. తిరిగి సముద్రంలోకి వెళ్లి పోతాయి.
అది పరాజయం కాదు. తీరాన్ని తాకి విజయం సాధించి వెళ్తాయి. తిరిగి మరో లక్ష్యంతో మళ్ళీ వస్తాయి. లక్ష్యాలకు అలుపు లేదు. సంకల్పానికి పరాజయం లేదు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ రైటర్ కిరణ్ జమ్మలమడక గారి అద్భుత సృష్టి ఈకథ.
ఒక చేతిలో నాన్న చెయ్యి.
చల్లని సముద్రపు గాలి.. అలల హోరు .
నడుస్తూంటే మెత్తగా దిగే సముద్రపు ఇసుక. మాటి మాటికీ కాళ్ళతో దోబూచులాడే అలలు. వాటి మధ్య నాన్న కబుర్లు…
సునైనా కి ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే.
"నాన్నా! ఈ అలలు యెంత సేపు వస్తాయి .. ఇవి అలసి పోవా " అని అడిగిన సునైనా కు, నాన్న చెప్పిన సమాధానం ఇంకా గుర్తే. ఆ పాత జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే సునైనా కు చాలా ఇష్టం.
తన కేబిన్ లో కూర్చొని ఆలోచిస్తూ వున్న సునైనా ను ఈ లోకం లోకి రమ్మన్నట్టు "మేడం! ఒక పేషెంట్ వొచ్చారు. చూస్తారా.. సారీ. పరిక్షిస్తారా?" అని అడిగిన నర్స్ కి నవ్వుతూ ‘రమ్మను’ అని చెప్పింది.
ఒక నడి వయసు వున్న వ్యక్తి వొచ్చి సునైనా ని విష్ చేసి నుంచున్నాడు.
నర్స్ అతనిని సునైనా కి దగ్గర వున్న బల్ల మీద కూర్చోమని చెప్పి "ఈయన సెకండ్ ఒపీనియన్ కోసం వొచ్చారు మేడం. వేరే డాక్టర్. ‘వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ’ చెయ్యాలని చెప్పారట " అని అతను తెచ్చిన రిపోర్ట్స్ చదవటం మొదలు పెట్టింది నర్స్. అన్నీ శ్రద్దగా విన్న సునైనా. వచ్చిన అతని గుండెల దగ్గర వొచ్చే చప్పుడులో వున్నా తేడాని పసిగట్టింది.
వెంటనే తన వేళ్ళను అతని గుండెలమీదకు పొనిచ్చింది. అక్కడ అతని స్కిన్ మీద నొక్కి మరింత శ్రద్దగా వింది. నిర్ధారించుకోవడం కోసం స్టెతస్కోప్ ని తీసేసి ఆమె చెవులను అతని గుండెలకు దగ్గరగా పోనిచ్చి మరీ వింది.
ఆమె అనుమానం నిజమే! వొచ్చిన అతనికి వాల్వ్ మూసుకుపోతోంది. ఐతే అతనికి వెంటనే వాల్వ్ రీప్లేస్మెంట్ చెయ్యక్కరలేదు. అంతకు ముందు percutaneous mitral commissurotomy అనే ప్రక్రియ చెయ్యాలి. అది నయం చెయ్యక పొతే అప్పుడు సర్జరీ చేయాలి. ఎందుకో PMC గురించి ప్రస్తావించలేదు.. అదే విషయం అతనితో చెప్పింది. అతను ఆనందిచాలో లేదో కూడా అర్థం కాని అయోమయ స్థితి లో "సరే" అని వెళ్ళిపొయాడు.
సునైనా నర్స్ తో "మళ్ళీ వస్తాడంటావా?” అని నవ్వేసింది.
దానికి నర్స్ కూడా నవ్వేసి "నేనూ అదే అనుకున్నా మేడం. జనరల్ గా మీ దగ్గరికి. మీ కొలీగ్ డాక్టర్స్ వొస్తారు కదా డిస్కస్ చెయ్యడానికి. పేషెంట్ వొచ్చాడేంటి అని అనుకున్నా" అని తానూ నవ్వేసింది. కానీ ఆ నర్స్ నవ్వు లో తన బాధ తాలూకు జీర కనపడనివ్వకుండా జాగ్రత్త పడింది.
సునైనా ఛాంబర్ ఎప్పుడూ పెద్దగా రద్దీగా ఉండదు. సునైనా గురించి తెలియని వాళ్ళు మాత్రమే వొస్తారు. అదీ ఒక సారి వొచ్చాక మళ్ళీ రారు. ఒక కళ్ళు లేని డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి అనారోగ్య మొక్కటే సరి పోదు. బోలెడంత ధైర్యమూ కావాలి..
సాయంత్రం వరకు తాను ఐపాడ్ లో ఆడియో మెడికల్ జర్నల్స్ ని వింటూ . కొలీగ్స్ తో కేసు డిస్కషన్స్ . నర్స్ తో కాసేపు జోక్స్ వేసుకుంటూ గడిపేది. ఆ రోజు కూడా అలాగే గడిపేసిన తరువాత వెళ్ళిపోతూ ‘రేపు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా’ అని రిసెప్షన్ కి ఫోన్ చేసింది.
అది ఒక రొటీన్ కాల్. అటువైపునుండి "నో" నే వొస్తుంది. కానీ ఆ రోజు "రేపు మీకు ఒక సర్జరీ వుంది మేడం. మీరు ఒకే అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను.. నేనే మీకు ఫోన్ చెయ్య బోతున్నా. ఇంతలో మీరే చేసారు ..." అని చెప్పేసరికి నమ్మలేనట్టు గా మళ్ళీ తాను విన్నది కరెక్టటేనా అని అడిగి. నర్స్ ని కిందకి పంపించి మరీ నిర్ధారించుకుంది.
ఆ పేషెంట్ తన గురించి తెలిసే ఒప్పుకున్నాడంట. పైగా ‘యూనివర్సిటీ డిగ్రీ ఇచ్చాక నాకు భయం ఏముంది’ అన్నాడట. అని నర్స్ చెప్పింది .
తన గుండె వేగం ఒక్కసారి పెరిగింది. తాను మొదటిసారిగా ఒక సర్జరీ చెయ్యబోతున్నందుకు చాల ఉద్వేగానికి లోనయ్యింది. ప్రాక్టీస్ కి వొచ్చి ఒక 5 సంవత్సరాలయింది. తాను డాక్టర్ అవ్వాలనుకున్నదే సర్జన్ అనిపించుకోవడానికి.
ఎన్నాళ్లకు యీ అవకాశం వచ్చింది? వెంటనే నాన్నకు ఫోన్ చెయ్యాలి అనుకుంది కానీ నాన్న ఫోన్ కలవటం లేదు. నాన్న టూర్ కి వెడుతున్నాను అని చెప్పారు. సిగ్నల్స్ ఉండని ఒక ఏజెన్సీ ప్రాంతమని కూడా చెప్పారు. అయినా తాను అప్పుడప్పుడు ప్రయత్నిస్తూనే వుంది. ఆలా సిగ్నల్ లేని చోటుకి వెళ్ళటం ఎందుకు ? అని మనసు లోనే తిట్టుకుంది. తన
భర్త సిద్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇద్దరూ సంతోషం లో మునిగి తేలేరు. వెంటనే ఇంటికి బయలుదేరింది. లోపలికి వెడుతూ వెనక్కి వొచ్చి తన నేమ్ ప్లేట్ మీద తన పేరు కి ముందు ఉన్న Dr అన్న అక్షరాలను చేతితో ఆప్యాయంగా తడిమి లోపలి వెళ్ళింది.
తన రూమ్ లోకి వెడుతూనే తన స్మార్ట్ ఫోన్ ని స్పీకర్ కి కనెక్ట్ చేసి whatsup మెసేజెస్ ని ఆడియో మోడ్ కి పెట్టి వినటం మొదలు పెట్టి ఫ్రెష్ అవసాగింది. అందులో మామూలు సందేశాలు తప్ప ముఖ్యమైన సందేశాలు ఏమి లేవు. తన బెడ్ పక్కనే ఉన్న తన తండ్రి ఫోటో ని సిద్ తన కోసం ఇంగ్రేవ్ చేసి ఇచ్చాడు. ఉబ్బి ఉండడం వాళ్ళ నాన్న ను ముట్టుకున్నట్టే ఉంటుంది సునైనా కు.
ఆ ఫోటో తన వడిలోకి తీసుకొని తడుముతూ.సునైనా తన గతం స్మృతుల్లోకి వెళ్ళింది.
***********************************************************************************
ఆ రోజు తనకి ఇంకా గుర్తు . అప్పుడు సునైనా కి 5 - 6 సంవత్సరాల వయసు. తాను స్కూల్ నుంచి రాగానే ఒక మూల కూర్చొని డల్ గా ఉంటే నాన్న వొచ్చి ఏమైందని అడిగాడు. దానికి సునైనా నేను క్రికెట్ అడగలనా? అని అడిగింది.
ఒక్క క్షణం మౌనము తరువాత "ఏమో ఎవరికి తెలుసు? ప్రయత్నిస్తే గాని తెలీదు నీకైనా.. నాకైనా....లోపాలు అందరికి ఉంటాయి. ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాక, చేసే పద్దతి మారుతుంది గాని చెయ్యాల్సింది కాదు" అని తనకున్న మిగిలిన ఇంద్రియాలకు యెంత శక్తి వుందో తెలియజేసాడు వాళ్ళ నాన్న శేఖర్.
బాల్. బ్యాట్ వికెట్స్ ఎలా వుంటాయో వివరిస్తూ అవి తాకితే ఎలాఉంటాయో తన చేతికి అందించి వివరించాడు .తన కోసం రేకుతో ఒక పిచ్ లాంటిది తయారుచేసి బాల్ ఆ రేకు పైన పడితే ఎలాంటి శబ్దం వొస్తుందో రేకు మీద పడిన యెంత సేపటికి బాల్ వొస్తుందో తెలియ చేయటానికి తన శరీరానికే తగిలేటట్టు బాల్ వేసి వివరించాడు.
మొదటి దెబ్బ మాత్రం సునైనా కి చాలా గట్టిగా తగిలింది కానీ తానూ వెనుకాడ లేదు. వాళ్ళ నాన్న వద్దనలేదు . చివరిగా బాల్ లోపల ఒక చిన్న బ్యాటరీ విజిల్ పెట్టి ఆ శబ్దాన్నే వినమన్నాడు . ఆ శబ్దం ఆధారం గా సునైనా బ్యాట్ ని గాలిలోకి ఊపేది. చాల బాల్స్ కి తగల్లేదు
ఇద్దరు విసుగు లేకుండా ప్రయతింస్తూనే వున్నారు. సునైనా వాళ్ళ అమ్మ అప్పటికే రెండు సారులు వొచ్చి తిట్టి వెళ్ళింది ఈ అర్థం లేని పనిని చూసి . సునైనా కి ఏ సంగీతమో నేర్పించాలి గాని ఇలా సునైనా ఏది అడిగితే అది చెయ్యటానికి సిద్దమవుతున్న తన భర్త ని గట్టిగానే విసుక్కుంది. మరి కొన్ని ప్రయత్నాల తరువాత మొదటి బంతి బ్యాట్ కి తగిలింది ఆ క్షణం . ఇద్దరి మొహాలు వెలుగు తో నిండిపోయాయి. సునైనా కి ఆ టెక్నిక్ బాగా అర్థమైం.ది చాల ఖచ్చితంగా బాల్ ని అంచనా వేయగలుగుతోంది . ఈ సంఘటన ఇద్దరికి చాలా అవసరం. ఒక పిల్లాడికి లేదా పిల్ల కి చదువు తెలివితేటలూ కంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. పిల్లలకి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న రోజే వారి పతనం ప్రారంభం అవుతుంది.
ఈ విషయం శేఖర్ కి బాగా తెలుసు. ఇంతకాలం సునైనా కి థియరీ బాగానే చెప్పాడు కానీ, నిరూపించే అవకాశం రాలేదు. ఈ రోజు ఈ సంఘటన తో ఆ లోటు తీరింది. ఆ రాత్రి. శేఖర్ నిద్రపోలేదు. తన భార్య కళ్యాణి కి సునైనా యెంత బాగా ఆడిందో వివరిస్తూనే వున్నాడు. కళ్యాణి కి మాత్రం శేఖర్ కి తన కూతురి మీద వున్న ప్రేమ దేనికి దారితీస్తుందో అని భయపడసాగింది. అందరి లాంటి పిల్ల ఐతే అర్థం చేసుకోవచ్చు కానీ సునైనా కి కళ్ళు లేవు. దానికి తగ్గట్టు ఉండాలి కానీ అది ఏం అడిగితే అది సరే అని చెయ్యటం యెంత వరకు సబబు అని ఆమె ఆలోచన.
ఆలా కొంత కలం గడిచాక హై స్కూల్ కి తన ఊరి పక్కనే వున్నా పెద్ద స్కూల్ లో చేర్పించాడు శేఖర్. సునైనా బాగానే చదువుకుంటూ ఆటల్లో పాటల్లో అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటూ వొస్తోంది. ఒక రోజు సునైనా స్కూల్ నుంచి శేఖర్ కి ఒక సారి కలవమని ఉత్తరం వొచింది. వెంటనే బయలుదేరి వెళ్ళాడు శేఖర్. వెళ్ళగానే అక్కడ ఇద్దరు టీచర్స్, ప్రిన్సిపాల్ కూర్చొని శేఖర్ ని చూడగానే రమ్మని కూర్చీలో కూర్చోమన్నారు.
శేఖర్ కి ఎందుకో గుండె దడ గా వుంది ఏమి చెపుతారో అని.
ప్రిన్సిపాల్ గారు మెల్లిగా "సునైనా చాల కష్టపడుతోంది.కానీ ఆ కష్టానికి తగ్గ మార్కులు రావటం లేదు. ఇదే కష్టం తనలాంటి వాళ్ళ మధ్య లో ఉంటే ఆమె ఫస్ట్ వొస్తుంది. సో మీరు సునైనా ని బ్లైండ్ స్కూల్కి పంపిస్తే బావుంటుంది” అని అనగానే శేఖర్ తట్టుకోలేక పోయాడు. సునైనా జీవితం లో చూడలేదు అని తెలిసిన రోజు యెంత బాధ పడ్డాడో ఈ రోజు కూడా అంత బాధ పడ్డాడు. ఏ మాటైతే వినకూడదని తాను కష్టపడ్డాడో ఆ మాటే వినాల్సి వొచింది ఈ రోజు.
అంత లోనే తమాయించుకొని. ఒక రెండు క్షణాల మౌనం తరువాత "ఎందుకు సర్ . చదువు లో
పాస్ అవుతోంది కదా" అని తడారిన గొంతుతో అడిగాడు.
దానికి ప్రిన్సిపాల్ "మాది చాల పేరు ప్రఖ్యాతులున్న స్కూల్. మీ పాప స్పెషల్ చైల్డ్ . మీరు యెంత సమానంగా పెంచాలన్న ఆమె లోపం కప్పి పుచ్చ లేరు కదా… మీరే ఆలోచించండి. పైగా టీచర్స్ టైం కూడా ఎక్కువ స్పెండ్ చెయ్యాల్సి వొస్తోంది తన మీద . మీరు కొంచెం మా తరఫున కూడా ఆలోచించాలి. ఒక్క స్టూడెంట్ కి మార్కులు తక్కువ వొచ్చిన స్కూల్ యావరేజ్ తగ్గిపోతుంది శేఖర్ గారు. ఇప్పుటి దాక అంటే చిన్న తరగతులు పరవాలేదు. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద తరగతులు కదా..." అని ప్రిన్సిపాల్ ఆపేసారు.
శేఖర్ దానికి. "సర్. మీరు పెద్దవారు. లోపాలు అందరికి ఉంటాయి. కానీ బయటకి కనిపించేదే లోపం అనుకుంటున్నారు. ఈ లోకం లో తెలివి లేని వారు, సంకుచిత ఆలోచనలు వున్నవారు చాలా మంది వున్నారు. వాళ్ళందరిని హండీకేప్ద్ అందామా? సునైనా ని మామూలు పిల్లలాగా పెంచాలనుకున్నా. ఇప్పటిదాకా అదే చేశా. సునైనా కూడా ఎప్పుడూ తన లోపం గురించి ఆలోచించలేదు. ఎలా అధిగమించాలి అనే ఆలోచించింది. మీలాంటి వారు తనని ప్రోత్సహిస్తే బావుంటుంది. మీ టీచర్స్ సమయం ఎక్కువ తీసుకుంటోంది అనుకుంటే నన్ను క్లాస్ రూమ్ లోకి అనుమతి ఇవ్వండి. నేను ఉద్యోగం మానేసైనా తనతో వుంటాను. మీకు శ్రమ కలిగించము” అని ప్రాధేయపడ్డాడు శేఖర్.
ఇది అంతా వింటున్న గీత టీచర్ ఆ మాటలకి చలించి పోయింది. ఆమె వెంటనే కలగ జేసుకొని ప్రిన్సిపాల్ తో "సర్ నాకు ఒక అవకాశం మివ్వండి. నేను తనతో వుంటాను . మార్కులు, స్కూల్ అవేరేజెస్ దాటి ఆలోచించండి సర్ ప్లీజ్…" అని తానూ ప్రిన్సిపాల్ ని రిక్వెస్ట్ చేసింది .
ప్రిన్సిపాల్ ఇంక ఏమి అనలేక అయిష్టం గానే ఒప్పుకున్నాడు. శేఖర్ గీత టీచర్ వైపు కృతజ్ఞతతో చూసి బయటకు నడిచాడు. ఒక్క సారి ప్రిన్సిపాల్ రూమ్ ని నిశబ్దం ఆవరించింది.
"వొస్తాను సర్" అని గీత టీచర్ కూడా వెళ్ళిపోయింది.గీత టీచర్ లో ఒక్కసారిగా ఒక తెలీని ఆవేశం కమ్ముకొచ్చింది. ఐతే ఆమె ఆవేశం చిచ్చు బుడ్డిలో లేచే మంట కాదు. అగ్నిపర్వతంలో వుండే లావా లాంటి మంట. అంత తొందరగా చల్లారేది కాదు. తనకు తెలియకుండానే శేఖర్ బాధ్యత తాను తీసుకుంది సునైనా విషయం లో. సునైనా లాంటి స్టూడెంట్ తో ఎలా మాట్లాడాలో, ఎలాంటి ఎయిడ్స్ పెట్టాలో, యెంత వరకు వాటిని ఉపయోగించాలో తెలుసుకుంది. సునైనా లాంటి విద్యార్ధిని కి ఎక్కువ సాయం చెయ్యకూడదు. అది వారికీ ఇష్టముండదు. వారికి తప్పనిసరి పరిస్థితుల్లోనే సాయం చెయ్యాలి. కానీ అది గమనించడం చాల కష్టం.
అది గీత టీచర్ అర్థం చేసుకుంది. ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంది. ఐతే అది ప్రిన్సిపాల్ మెప్పు పొందడానికో శేఖర్ చేత థాంక్స్ చెప్పించుకోడానికో కాదు . తన కోసం.. తన సామజిక బాధ్యత కోసం.. వేరే టీచర్స్, మిగిలిన స్టూడెంట్స్, ఒక సైన్యం లాగా సునైనకి అండగా వున్నారు. దానికి సారథ్యం వహించింది కూడా గీత టీచరే . మిగిలిన టీచర్స్ కూడా తమ వంతు సహాయం అందించారు. అలాని సునైనని ప్రత్యేకం గా చూడలేదు. సునైనా మీద జాలి చూపించలేదు సునైనా కి ఒక మంచి వాతావరం తయారుచేసింది. ఈ మార్పు సునైనా లో చాల మార్పు తెచ్చింది తానూ అన్ని రంగాలల్లో రాణించడం మొదలుపెట్టింది.
ఒక రోజు గీత టీచర్ పాఠం చెపుతుండగా ఆఫీస్ బాయ్ నోటీసు ఇచ్చాడు. ఆ నోటీసు సారాంశం ఏంటంటే . అడ్వెంచర్ క్లబ్ వాళ్ళు పర్వత అధిరోహణ పోటీలు రాబోయే నెలలో ౩౦వ తారీఖున నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో ఎక్కవలసిన పర్వతం 36అడుగులు. ఎత్తుతో సక్రమమైన దారి లేకుండా వున్నటువంటిది. మీలో పాల్గొనాలి అనుకునేవాళ్లు వచ్చే వారం లోగా మీ పేర్లను ఇవ్వగలరు" అని టీచర్ చెప్పగానే సునైనా తన పేరును నమోదు చేసుకోమని అడిగింది.
ఒక క్షణం ఆందోళనకు గురైన గీత టీచర్ వెంటనే తేరుకొని పేరును నమోదు చేసుకుంది. లిస్ట్ పంపిన వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరనుంచి గీత టీచర్ కి పిలుపు వొచ్చింది.
అక్కడ ప్రిన్సిపాల్ "గీత... మీరు సునైనా పేరును స్కూల్ కంపీటేషన్ కి ఇచ్చారు. మనం దానికి అనుమతి ఇవ్వలేము. అది చాల ప్రమాదకరం. తను చూడలేదు. అది మీకు కూడా తెలుసు. మామూలు వాళ్లకే ఆ పర్వతం ఎక్కడం చాల కష్టం. అలాంటిది తను ఎలా ...." అని అనే లోపలే గీత టీచర్ "కానీ తను చాల ధైర్యవంతురాలు. పైగా మన తోటలో ఉన్న చిన్న చిన్న పర్వతాలు ఎక్కిన అనుభవం కూడా తనకు వుంది" అన్నారు గీత టీచర్.
దానికి ప్రిన్సిపాల్ "అవి అన్ని కృత్రిమంగా తయ్యారు చేసినవి. కానీ ఇది నిజంది. పైగా 36 అడుగులు ఎత్తు. సక్రమంగా లేని దారి. అక్కడక్కడ బండరాళ్లతో ఉంటుంది"
“నిజమే సర్ కానీ అది తనకు కష్టం కావచ్చు. చాలా ప్రయత్నం కూడా కావాలి. ఆ కృషి తాను చెయ్య డానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా మన వంతు ప్రోత్సాహం అందచేద్దాం సర్. దయచేసి అనుమతించండి “అని ప్రాధేయపడింది.
ప్రిన్సిపాల్ కి తనకేమైనా అవుతుందేమో అని భయం కానీ కాదనలేకపోయాడు. చివరికి సరే అన్నాడు. సునైనా దీర్ఘాలోచనలో వుంది. ఆ కొండ ఎలా ఎక్కాలని, దాని గురించి పెద్దగా ఏమి తెలియదు ఎలా అని ఆలోచిస్తూ వుండగా సిద్ధ్ అక్కడికి వొచ్చి “ఏంటి సునైనా ఆలా ఆలోచిస్తున్నావు?” అని అడిగాడు.
దానికి సునైనా తన భయం చెప్పింది. దానికి సిద్ నీ నోటంట భయం అనే పదం వినటం ఆశ్చర్యం గా వుంది . నీకు లేనిదాని గురించి ఆలోచించకు. నీకు వున్నదానితో ఎలా సాధించాలి అని ఆలోచించు. నీకే అర్థమవుతుంది. అని బుజం తట్టి వెళ్ళాడు.
సిద్ చెప్పింది వినటానికి బాగానే వుంది. కానీ ప్రాక్టికల్ గా ఎలా అని అన్యమస్కం గానే తన రూమ్ కి వెళ్ళిపోయింది. మర్నాడు సిద్ తనని వెతుకుంటూ వచ్చి తనని స్కూల్ స్టోర్ రూమ్ కి తీసుకెళ్లాడు. సిద్ క్లే మోడలింగ్ లో సిద్ధహస్తుడు. నమూనాని కచ్చితంగా తయారు చేస్తాడు . అదే విద్యని వుపయోగించి సునైనా కోసం ఒక 6 అడుగుల కొండని అచ్చం పోటీ కొండలాగానే చేసాడు .
దానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎలాంటి గుంతలు ఉన్నాయో అచ్చం అలానే చేసి తన చెయ్యి ని వాటిమీద పెట్టి సునైనా కి అర్థం అయ్యేటట్టు చేసాడు. అర్థం అయిపోయింది సునైనా కి. మొత్తం ఆ కొండని ఆకళింపు చేసుకుంది.
పోటీల్లో మూడవ స్థానం వొచింది. వెంటనే ప్రిన్సిపాల్ గారు సునైనా దగ్గరకు వొచ్చి “కంగ్రాట్స్ సునైనా! నీలాంటి స్పెషల్ కిడ్ నార్మల్ కిడ్ తో పోటీపడటం, నెగ్గటం అంటే మాటలు కాదు. ఈ విషయం ప్రెస్ కి చెపుతాను” అన్నాడు.
సునైనా "నాలో ఏ ప్రత్యేకత లేదు సర్. నేను అందరిలాంటి పిల్లనే సార్ . నేను ప్రత్యేకం కాదు . దయ చేసి నన్ను ప్రత్యేకం చేయకండి" అని సున్నితం గా తిరస్కరించింది.
దానికి ప్రిన్సిపాల్ "సునైనా! నిన్ను అర్థం చేసుకోడానికి ఇంతకాలం పట్టింది .నన్ను మన్నించు" అని మనసులో అనుకొని ఆప్యాయముగా భుజం తట్టి వెళ్ళిపోయాడు.
ఆరోజు నుంచి సిద్ సునైనా తోనే వున్నాడు. తనకి అవసరమైనప్పుడల్లా క్లే మోడల్స్ తయారు చేసి ఇచ్చేవాడు .ఒక రోజు నాన్న కు ఫోన్ చేసి "నాన్న! నాకు డాక్టర్ అవ్వాలని వుంది. అవ్వగలనా?" అని అడిగింది .
దాని వాళ్ళ నాన్న "ఏమో ఎవరికి తెలుసు? ప్రయత్నిస్తే గాని తెలీదు నీకైనా.. నాకైనా" అనగానే ఇద్దరు నవ్వేసుకున్నారు. సునైనా డాక్టర్ అవటానికి శేఖర్ చాల కష్టపడాల్సి వచ్చింది. చివరికి అడ్మిషన్ కోసం కోర్ట్ సాయం తీసుకోవాల్సి వొచ్చింది. చరిత్రలో నిలిచి పోయిన Dr. Y. G. పరమేశ్వర, Dr. కృతిక పురోహిత్ లను మొదలు కొని Dr. జాకబ్ బొలిటిన్ వరకు అనేక మంది గురించి చెప్పి నమ్మకం కలిగించాడు శేఖర్.. సర్జన్ చదువు చదవటానికి మళ్ళీ శేఖర్ కోర్టు మెట్లు ఎక్కాలసివొచ్చింది.
మొత్తానికి యూనివర్సిటీ డీన్, జడ్జి గార్ల చొరవతో డిగ్రీ పుచుకుంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ వెంటనే తమ హాస్పిటల్ లో వుద్యోగం ఇచ్చింది. ఐతే తను ఎవరి అంచనాలనూ నిరుత్సాహ పరచక పోయినా తన వద్దకు వొచ్చే పేషెంట్స్ కి మాత్రం ధైర్యం ఇవ్వలేకపోతోంది. అదే మాట నాన్నతో కూడా చాలా సార్లు ప్రస్తావించింది. ఇన్నాళ్లకు ఒక పేషెంట్ సరే అన్నాడు. ఇలా ఆలోచిస్తూ వుండగానే సిద్ ఆఫీస్ నుంచి ఇంటికి వొచ్చాడు. ఇద్దరు భోజనం చేసి, సిద్ చేసిన ‘హ్యూమన్ బాడీ క్లే మోడల్’ తో కాసేపు ప్రాక్టీస్ చేసి పడుకుంది.
శేఖర్, ఫోన్ స్విచ్ ఆఫ్ రావటానికి ఒక ప్రత్యేకమైన కారణం వుంది. అది సునైనా కి గాని, సిద్ కి గాని, నిజానికి ఎవరికి తెలీదు, ఒక్క కళ్యాణి కి తప్ప. జనరల్ చెక్ -అప్ కోసం శేఖర్ ఈసీజీ చూస్తే ఏదో తేడా కనిపించింది. ఇంకా పరీక్షలు చెయ్యాలని డాక్టర్ చెప్పారు. వాటి పని మీదనే శేఖర్, కళ్యాణి తిరుగుతున్నారు సునైనా కి చెప్పకుండా. రిపోర్ట్స్ అన్నీ తీసుకొని శేఖర్, కళ్యాణి ఇద్దరూ డాక్టర్ గారి అప్పోయింట్మెంట్ కోసం బయట వెయిట్ చేస్తుండగా, నర్స్ శేఖర్ని రమ్మని పిలిచింది. బయట కళ్యాణి చాలా టెన్షన్ గా కూర్చుంది .
ఒక ఇరవై నిముషాల తరువాత శేఖర్ నవ్వుతూ బయటకు రావటం చూసి కళ్యాణి మెల్లిగా ఊపిరి పీల్చుకుంది."ఆపరేషన్ అవసరం లేదన్నారా డాక్టర్ గారు?” అని ఆతృతగా అడిగింది.
దానికి శేఖర్ నవ్వుతూ “లేదు! ‘ఆపరేషన్ తప్పని సరి’ అన్నాడు డాక్టర్ “ అన్నాడు
శేఖర్ కళ్ళలో మెరుపు చూస్తే అర్థం అయ్యింది కల్యాణికి, తాను తన కూతురితోటే ఆపరేషన్ చేయించుకోబోతున్నాడని. కళ్యాణి కి ఏమి చెయ్యాలో తెలీక అలానే వుండి పోయింది.
ఆ తరువాత కొంత కాలానికి సునైనా కి నిజం తెలిసింది. తాను చాలా కంగారు పడింది . ఒక వేళ జరగ రానిది ఏదైనా జరిగితే? అని కంపించిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గర కళ్ళ నీళ్లు పెట్టుకుంది.
దానికి కళ్యాణి "ఏమీ కాదమ్మా! నీ బలం ముందు, నీ నాన్న సంకల్పం ముందు ఏది ఆగదు సునైనా... " అంది.
సునైనా కి నాన్న మాటలు ఎప్పుడు చెవిలో మెదులుతూనే ఉంటాయి "ఈ అలలు . అలసిపోవమ్మా. మనల్ని తాకే ప్రతి ఆలా మనకి సాయం చెయ్యాలనే వొచ్చేవారే. ఈ సముద్రం లో చాలా అలలు వున్నాయి. అవి ఎప్పటికి అలసిపోవు "
“నిజమే నాన్నా. గీత టీచర్, నా ఫ్రెండ్స్, సిద్, ప్రిన్సిపాల్, డీన్, జడ్జి… వీళ్ళందరూ ఈ సముద్రపు అలలే . కానీ నువ్వు మాత్రం సునామి నాన్నా..”. అని చిరునవ్వుతో నాన్న కి ఫోన్ చేసింది.
"నాన్నా! నాకు కార్ డ్రైవింగ్ చెయ్యాలని వుంది నాన్నా. చేయగలనా?" అని అడిగింది.
దానికి. శేఖర్, కళ్యాణి అందరూ పగలబడి నవ్వేశారు.
***
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం: కిరణ్ జమ్మలమడక
కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడినపిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.
Commenti