top of page

కామ్రేడ్

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link



'Comrade' written By Kiran Jammalamadaka

రచన: కిరణ్ జమ్మలమడక


మానవుడే మహనీయుడు, మాననీయుడు కూడా.

తప్పులు వెదకడం ఆపి, తరచి చూస్తే మానవుడి ఆధిపత్యానికి కారణం అతని ఆలోచనా పరిణితే అని తెలుస్తుంది.

మానవుడిని మానవుడే విమర్శించడం కూడా తనను తాను మరింత మెరుగు పరచుకోవడం కోసమేనని తెలియజేసే ఈ కథను జమ్మలమడక కిరణ్ గారు రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

"నాకో కల వుంది ..

ఒక రోజు నా జాతి, అన్ని జాతుల తో సమానం గా, అంతే గౌరవం గా తల ఎత్తుకొని జీవిస్తుంది.

రాబోయే రోజుల్లో , నా జాతి పిల్లలు వారి పుట్టకతో కాకుండా, వారి గుణ గణాలతో కీర్తించబడతారని,

ఆ రోజుల కోసం నేను నిరంతరం శ్రమిస్తానని, మనం అంతా ఒకే రకమైన స్వేచ్ఛా

వాయువులను పీలుస్తామని, నేను నా జాతికి మాట ఇస్తున్నాను

అని నా ప్రసంగాన్ని నెమరవేసుకుంటూ, నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా నన్ను దత్తత తీసుకొని తీసుకొచ్చిన వాళ్ళ ఇల్లు వొచ్చింది. కార్ ఆపి నన్ను మెల్లిగా దింపి వాళ్ళ ఇంటి వైపు తీసుకు వెడుతుండగా చూసా, అదొక విశాలమైన, ఖరీదయిన ఇళ్ల సముదాయం, ప్రతి ఇంటికి చిన్న తోట, చుట్టూ హద్దులు లేని ఇళ్లు. వింతగా తోచింది, మనుషుల మధ్యన ఉండేవే హద్దులు..సరి హద్దులు ..


మరి ఇక్కడ లేవేంటి అన్న సందేహం కలిగింది నాకు.

మా అమ్మ, నాన్న నన్ను ఇంటి లోకి తీసుకెడుతున్నారు వీళ్ళని అలానే పిలవాలంట, మా ఆశ్రమం లో నా స్నేహితులు చెప్పారు. అమ్మ, నాన్న భలే విచిత్రం గా వున్నారు, ఇన్ని ప్రదేశాలు వున్నా వీళ్ళకి నేను వుండే ఆశ్రమం ఎలా తెలుసు? నన్నే ఎందుకు దత్తత తీసుకున్నారో? అర్థం కావటంలేదు, తెలుసుకుందాం తొందరేముంది. అని నాలో నేనే అనుకున్నాను. ఇల్లంతా చూపించి, నన్ను ఇంటి బయట నా కోసమే కట్టించిన ఒక ఇంటిలో నన్ను కట్టేసి, తాగటానికి నీళ్లు, తినడానికి ఆహరం పెట్టారు.


మరికాసేపటికి అమ్మ వొచ్చి, “రెడీ గా వుండు, నీకు సాయం కాలం కొంత మంది స్నేహితులని పరిచయము చేస్తా దాహం వేస్తే ఈ నీళ్లు తాగు . ఆకలివేస్తే ఈ ఆహరం తిను సరేనా కృష్ణా" అని ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఈ కృష్ణా అంటే నేనే.


చెప్పినట్టుగానే, అమ్మ వొచ్చి సాయంత్రం దగ్గర్లో లో మాకోసం కట్టిన పార్క్ కి తీసుకెళ్లింది. అక్కడ చాల జాతుల వారు వున్నారు జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ అమెరికా ఇలా ప్రపంచంలో పేరు మోసిన అన్ని దేశాల జాతుల వారు అక్కడ వున్నారు. కానీ, నా జాతి వారు అదే "స్ట్రీట్ డాగ్" జాతి వారు లేరు . నేనూహించినట్టు గానే, నా దగ్గరకి ఎవరు రాలేదు, కాదు వాళ్లతో వొచ్చిన మనుషులు రానివ్వలేదు,


నన్ను పరిచేయం చేసినా పలకరించలేదు, పలకరించనివ్వలేదు. నాకు ఈ అనుభవం ఏమీ కొత్త కాదు. ఇలాంటి అనుభవాలనుంచే నా విప్లవం అంకురించింది. మాకు జాతి విద్వేషాలను అంటగట్టిన ఈ మనుషులంటే నాకు అందుకే కోపం.

మా అమ్మ, నాకు ఎవరయినా స్నేహితులు వొస్తారేమో అని చాలా ప్రయత్నం చేసింది, కానీ ఎవరు రాలేదు. ఇంక తనే నాతొ కాసేపు ఆడింది, ఏంటో నేను ఎంత విప్లవ కారుడిని అయినా బంతి విసిరే ఆట అంటే అన్నీ మర్చిపోతాను,వెంటనే వెళ్లి తెచ్చేస్తాను.అలానే కాసేపు ఆడుకున్నాం, ఇంటికి వొచ్చాము,అమ్మ నాకు బాగా భోజనం పెట్టింది. తినేసి పడుకున్నాను.


ఈ మానవ జాతి పరిణామ క్రమం చాల విచిత్రం గా అనిపిస్తూ ఉంటుంది నాకు. సృష్టి మొదలైనప్పటి మానవుడికి, ఇప్పటి మానవుడికి యెంత తేడా!.ఆహార ప్రక్రియ పరిణామక్రమం లో ఏమాత్రం ప్రాముఖ్యత లేని ఒక జెల్లీ ఫిష్ కంటే హీన మైన బతుకు బతికే ఈ మనిషి, ఈ రోజు ఒక రకం గా, సమస్త భూమండలాన్ని శాసించే స్థాయీ కి ఎదిగాడు శత్రు వైనా కీర్తించక తప్పదు, అదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.


పొద్దున్నే ఎవరో నాదగ్గరకు వొచ్చి నా వాసనా చూస్తూ ఉంటే మెలుకువ వొచ్చింది, కళ్ళు తెరవగానే ఇంత జుట్టేసుకొని,నా మొహం లో మొహం పెట్టి చూస్తూ ఉన్నాడొకడు. హడలి పోయా!వెంటనే తేరుకొని పారిపోయే లోపు అమ్మ వొచ్చి "కృష్ణా , వీడు జెర్రీ మన పక్కింట్లో ఉంటాడునీకోసమే వొచ్చాడు, ఆడుకోండి" అని రెండు బంతులు ఆట వొస్తువులు ఇచ్చి వెళ్ళిపోయింది.


జెర్రీ బంతులు పక్కన పెట్టి , "ఒరేయ్! కృష్ణా తినడానికి ఏమైనా ఉన్నాయా?" అని అడిగాడు ,

వాడికి నా ఆహరం చూపించా.

"ఎక్కడినుంచి వొచ్చావ్” అన్నా.

వాడు దానికి "మా పూర్వికులది రష్యా నేను ఇక్కడే ఒక షాప్ లో పుట్టాను, అక్కడి నుంచి మా

అమ్మ నాన్న తెచ్చారు "

"ఓ.. రష్యానా! విప్లవాలకు పుట్టినిల్లు, స్వాగతం కామ్రేడ్" అన్నా.

"కామ్రేడా ? అంటే ?" అన్నాడు.

దానికి నేను "అంటే తోడుండేవాడు లేదా స్నేహితుడు అని అర్థం లే" అన్నాను విసుక్కుంటూ

"ఒరేయ్ జెర్రీ! మా అమ్మ, నాన్న మీలాంటి వాళ్ళని తెచ్చుకోకుండా ఏరి కోరి నన్ను ఎందుకు

తెచ్చారు రా ?" అని అడిగా.

"ఏం నీకు నచ్చలేదా వీళ్ళు ? " అన్నాడు తిండి తినటం ఆపకుండానే.

"బానే చూసుకుంటున్నారు, మానవ స్వభావానికి విరుద్ధం గా " అన్నా కాస్త వెటకారం తో

"నీకు మనుషులంటే చాలా కోపం అనుకుంటా " అన్నాడు గిన్నెలోంచి తల ఎత్తకుండానే.

"అవును, వాళ్లతో తిరిగిన పాపానికి మనకి కూడా వాళ్ళ జాతి విద్వేషాలు నేర్పారు, వీరి వల్లనే ,

నాలాంటి వాళ్ళకి గౌరవం లేకుండా పోతోంది. నిన్న నాతొ ఆడుకోడానికి ఎవరు రాలేదు,

పంపలేదు " అన్నాను.

"ఇప్పుడు నేను వొచ్చాను కదా , నన్ను మా అమ్మ పంపింది కదా అన్నాడు.

‘ఏంటి వీడు ప్రశ్నిస్తున్నాడు’ అనుకొని, "నీకు చెప్పినా అర్థం కాదులే, నువ్వు తిను"

అని దాటేసే ప్రయత్నం చేశా.

"నువ్వు చెప్పేది బయటకు కనిపించే కారణం, లోపల ఇంకా వున్నాయి, చెప్పు "

అన్నాడు .

‘చూస్తే తిండిబోతు లాగ వున్నాడు కానీ, వీడు నాలాగే తెలివైన వాడా?’ అని అనుమానం

వొచ్చింది.

‘సరే! విప్లవం లో కలిసి ముందుకు వెళ్ళవలసిన వాళ్ళం. నేను నా సైన్యాన్ని సిద్ధం

చేసుకోవాలి,

వందయినా ఒకటి తోనే మొదలు అవ్వాలి కదా, వీడు నా ఒకటి’ అని అనుకొని, నా

అనుభవాలు క్లుప్తంగా చెప్పటం మొదలు పెట్టా.

"ఒకడు, వెలుగు తున్న సిగరెట్ నా వీపు మీద పెట్టి వెళ్ళిపోయాడు తెలుసా? నా మానాన , నేను వీధిలో ఉంటే నన్ను ఆశ్రమంకి పట్టించి పంపేశారు. ప్రసాదాల బండి లో నుండి, పడిన పొట్లాన్ని నేను తిందాము అనుకునే లోపే వేరేవాడు తీసేసుకున్నాడు తెలుసా? ఇలా చెప్పుకుంటూ పొతేచాలా వున్నాయి."

దానికి జెర్రీ "చాలానే వున్నాయి నీ బాధలు, దొరుకుతాయిలే సమాధానాలు " అని అన్నాడు.

ఇంతలో వాళ్ళ అమ్మ వొచ్చి వాడిని తీసుకెళ్లి పోయింది.

"ఈ మనుషులు అంతే, వాళ్ళ స్వార్థమే అంతా, అందుకే సృష్టి నాశనం అయిపోతోంది ."

ఇంతకీ,వాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయాడు.

మళ్ళీ మర్నాడు, అదే సమయానికి వొచ్చాడు, మళ్ళీ వాడి ముందుకి ఆహారం గిన్నె పెట్టి మళ్ళీ అడిగా మా అమ్మ నాన్న గురించి.

దానికి వాడు "పెద్ద కారణం ఏం లేదు. మీ అమ్మ, నాన్న ఏ జాతిని తెచ్చుకుంటున్నాం అనే దానికన్నా ఎవరిని తెచ్చుకుంటున్నాం అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. నిన్నే ఎందుకు అంటావా.. నువ్వు నచ్చావ్. అందుకే తెచ్చుకున్నారు” అన్నాడు.


"మరి నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా అందరిని ఎందుకు తేలేదు " అన్నాను.

"అందరిని తెచ్చి న్యాయం చెయ్యలేరుగా " అన్నాడు.

"మరి ఏమి ఉపయోగం ? ఏమి మార్పు తెచ్చారు వీళ్లు? మా జాతి వాళ్ళు ఇంకా అలానే చాలా మంది ఉన్నారుగా? ఏముంది తేడా " అన్నాను కోపం గా

"నీకుంది కదా తేడా! మార్పు మొదలయింది కదా " అన్నాడు నిర్లిప్తంగా

"నిజమే, నాజీవితం లో మార్పు వొచ్చింది కదా , వాళ్ళ ఒకటి నేనా? " అని అదే ఆలోచిస్తూపడుకున్నా.

ఇలా మా స్నేహం కొంత కాలం గా నడుస్తోంది. విప్లవ ఉపన్యాసాలు వినిపిద్దామంటే ఎవరూ రావటం లేదు, జెర్రీ గాడికి తిండి తప్ప ఇలాంటివి పెద్ద ఆసక్తి లేదు. ఎప్పుడు మొదలు పెట్టినా మాట మార్చేస్తున్నాడు. ఈ మానవ జాతిని మార్చి నా కల ఎప్పుడు సాకారం చేసుకుంటానో అనే దిగులు ఎక్కువయింది నాకు.


ఈ మధ్య మా అమ్మ ఆఫీస్ కి వెళ్ళటం మానేసింది, చాలా హ్యాపీగా ఉంటోంది

“ఎందుకుఇలా?” అని జెర్రీని అడిగా.

“మీ అమ్మకి ఒక కొడుకో కూతురో పుడుతున్నారురా. అదే ఆ ఆనందం మీ అమ్మ కి “ అన్నాడు.

"ఓఒహ్! మంచి వార్త చెప్పావు" అన్నాను, ఎందుకో వాళ్ళ ఆనందం నాకు ఆనందం

అనిపించింది.

అలానే రోజులు గడిచి పోసాగాయి, ఒక రోజు అమ్మ, నాన్న చిన్న చంటి పాప తో ఇంటికి వొచ్చారు,

నాకు ఆనందానికి హద్దులు లేవు, చాలా సంతోషం వేసింది. అమ్మ కళ్ళలో ఆనందం తో పాటు

ఒక సన్నని బాధ ఛాయ కనపడింది.ఎందుకో తెలీలేదు.

నేనూ, నా ఆనందమూ, అనుమానమూ బయటకు కనపడనివ్వలేదు.

నన్ను కూడా లోపలి తీసుకెళ్లి , నాకు పాపని చూపించారు , నేను చాలా సున్నితం గా ఆ పాప ని వాసన చూసా, బాగా అనిపించింది. నాకు ,తెలీకుండానే నా విప్లవ భావాలు పక్కకు పోయి, ఈ మనుషుల మీద నా పగ, ప్రేమ గా మారుతోందని భయం వేసింది .

రోజులు అలానే గడుస్తున్నాయి, పాప పెద్దది అవుతోంది, ఇంతలో జెర్రీ ఇంట్లో కూడా ఒక పాప పుట్టింది, మేము కలిస్తే, వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం.

‘మా పాప అలా ఆంటే, మా పాపఇలా, నా తోక పట్టుకుంది, నా ముక్కు పట్టుకుంది…’. ఇద్దరం ఆ అనుభవాలను చాలా ఆస్వాదిస్తున్నాం. జెర్రీ వాళ్ళ అమ్మ , అప్పుడప్పుడు వాళ్ళ పాపని మా ఇంటికి తీసుకొస్తో వుంటుంది. తీసుకొచ్చినప్పుడల్లా, మేము అంతా కలిసి ఆడుకుంటున్నాము. రోజులు చాల వేగం గా గడిచిపోతున్నాయి, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, నాకు మా పాప లోను, జెర్రీ వాళ్ళ పాపలోను తేడాలు కనిపించ సాగాయి. జెర్రీ వాళ్ళ పాప చలాకీగా వుంది, మాటలు మాట్లాడుతోంది. కానీ మా పాప ఇంకా అంత చలాకీగా గా లేదు. నడక కూడా ఇంకా రాలేదు. కళ్లద్దాలు కూడా పెట్టారు, నాకు అస్సలు నచ్చలేదు, నాతో బాగానే ఆడుకుంటోంది, కానీ నేనే దూరం గా వెళ్లిపోతున్నా, నా దగ్గరకు వొచ్చినా చూడనట్టు వెళ్లిపోతున్నా ఒక రోజు పడిపోయింది కూడా. జాలివేసింది కానీ, నాకు పాప నచ్చలేదు.


ఇలా రోజులు గడుస్తున్న సమయం లో ఒక రోజు, జెర్రీ నన్ను వెతుకుంటూ వొచ్చాడు గంభీరం గా వున్నాడు.

“ఏమైంది?” అని అడిగా.

"అరే! కృష్ణా, మీ పాప కి ఏదో డౌన్ సిండ్రోమ్ అంటార్రా. దాని కారణం గా ఎదుగుదల, కొంచెం నెమ్మది గా ఉంటుంది అంట, మామూలు మనుషుల్లానే వుంటారు కానీ కొంచెం నెమ్మది గా వుంటారు. దీనికి వైద్యంఏమి లేదు అంట. జాగర్తగా చూసుకోవటం తప్ప. ఈ, పాప విషయం మీ అమ్మకి పాప పుట్టడానికి ముందే తెలుసునట. డాక్టర్ పాపని పుట్టనివ్వొద్దు అని చెప్పారంట. నాన్న కూడా అమ్మ ఇష్టం అన్నాడంట. కానీ మీఅమ్మే ‘ఎలా పుట్టినా పర్లేదు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను’ అని పట్టుబట్టి , పాపని భూమి మీదకి తీసుకొచ్చిందంట” అని చెప్పాడు.


దానికి నేను "ఎందుకు చేసింది అమ్మ అలా? సృష్టిలో అన్నీ జాతులు.. చివరికి మన జాతి లో కూడా పుట్టిన పిల్ల పూర్తి ఆరోగ్యం గా లేదేమో అన్న అనుమానం వొస్తేనే చాలు, పిల్లకి వైకల్యమే కూడా ఉండనవసరం లేదు , ఆ పిల్లని తల్లే చంపేస్తుంది లేదా వదిలేసి వెళ్ళిపోతుంది. నన్ను మా అమ్మ అలానే వదిలేసింది. నాతో పుట్టిన వాళ్ళని తీసుకెళ్లి, నన్ను అక్కడే వదిలేసింది , అలానే జరుగుతుంది. అది సృష్టి నియమం కదా! ఈ మనుషులు ఇంత తెలివిలేని వాళ్ళా? ఎందుకు ఇలా ఆలోచించింది మా అమ్మ?" అని అన్నా.


దానికి జెర్రీ "ఎందుకా? మనిషి కాబట్టి! ఇంకా అమ్మ కాబట్టి… నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావే ‘ఈ మనుషులు ఈ భూమండలాన్ని ఎలా పాలించగలుగుతున్నారు’ అని?ఇందుకే!సృష్టి నియమాలని కూడా మార్చ గల సమర్ధుడు మనిషి.ఇది జాతి లక్షణం అని ఏనాడూఅనుకోలేదు , తనని తాను నిరంతరం కనిపెట్టుకుంటూనే వున్నాడు. ఆ క్రమం లోనే జాతి విద్వేషాలు కూడా సృష్టించి ఉండవచ్చు, కానీ దానిని సరిదిద్దుకునే సామర్ధ్యం కూడా మనిషి కేవుంది, సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు కూడా. నువ్వు రోజూ చెప్పే ప్రసంగం వుందే, అది చెప్పినమార్టిన్ లూథర్ కింగ్ కూడా ఒక మనిషే. వేరే ఎవరినైనా ,దత్తత తీసుకునే అవకాశం వున్నా నిన్నేఎందుకు తెచ్చింది మీ అమ్మ ? తన వొంతు సాయం చేద్దామని, అలాంటిది చిన్న పసికందుని చంపేస్తుందా? “

ఒక క్షణం ఆగి “నీ , వీపు మీద సిగరెట్టు వేసాడు అన్నావ్ కదా . మరి ఎలా ఆరిందీ ఆ మంట?"

అని అడిగాడు జెర్రీ

"ఇంకో అతను వెంటనే తీసాడు .." అని మెల్లిగా అన్నా.

వెంటనే జెర్రీ "మనం అంతే, ఏం చూడాలి అనుకుంటామో అదే చూస్తాం, అదే వింటాం. నిన్ను పట్టించ్చింది మనుషులే, నిన్ను తరువాత బాగా చూసుకుంది మనుషులే. ఇప్పుడు అన్నీ ఇచ్చి పెంచుకుంటుంది మనుషులే. ఇప్పటికైనా ద్వేషం మాని, ప్రేమని చూపించు"


నేను ఏం వింటున్నానో అర్థం అవ్వడానికి నాకు సమయం పట్టింది, ఆ క్షణం జెర్రీ

చూపించిన దృష్టి కోణం నా అభిప్రాయాన్నే మార్చివేసింది. ఇంతకాలం నేను

మనుషులతో పోలిస్తే సైజు లోనే చిన్న అనుకున్నా, కానీ నా ఆలోచనల్లో కూడా చిన్నే,

అని అర్థం అయ్యింది. మనసు చాలా తేలికపడింది. ద్వేషం పోయింది.

వెంటనే అమ్మదగ్గరకు వెళ్లి , పాప చేతిని తనివి తీరా నాకి ‘నీకు, మీ అమ్మకి తోడుగా నేను వుంటాను’ అని మొరిగి, వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి "అమ్మా! నువ్వు ఏం భయపడకు, బాధ పడకు. చెల్లిని నేను చూసుకుంటా, ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. నేనురక్షిస్తాను” అని ధైర్యం చెప్పి, నేను ఇంటికి బయలుదేరా.


వొస్తూ వుంటే ఏదో తృప్తి. అందుకేనెమో, మనిషి మన ప్రపంచానికి మంచి కామ్రేడ్. ఒక్క కుక్కలేంటిసృష్టి మొత్తం మనుషులకు స్నేహితులే, వారు దానికి అర్హులే అనుకున్నాను.నా తప్పు తెలుసుకున్నాను.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: కిరణ్ జమ్మలమడక

కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడినపిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.



138 views0 comments

Comments


bottom of page