top of page

ఆమె కోరిక


'Ame Korika' New Telugu Story

Written By Thirumalasri

'ఆమె కోరిక' తెలుగు కథ

రచన: తిరుమలశ్రీ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పి.జి. ఫైనలియర్లో ఉన్న మహిజ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తికాగానే భువనేశ్వర్ లో ఉంటూన్న ఆమె పిన్ని లలిత దగ్గర నుండి ఫోన్ వచ్చింది, దసరాకి రమ్మని. లలిత భర్త అక్కడ ఎ.జి. ఆఫీసులో పనిచేస్తున్నాడు. లలితకు ఆడపిల్లలు లేనందున మహిజ అంటె ప్రేమ. మహిజకు కూడా పిన్ని అంటె ఎంతో ఇష్టం. పిన్ని కొడుకులు కవలలు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నారు. దసరాకి తమ్ముళ్ళతో సరదాగా గడపవచ్చునని ఉవ్విళ్ళూరింది మహిజ. కాని, తీరా వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ కాలేజ్ ఎడ్యుకేషనల్ టూర్ కి వెళ్ళినట్టు తెలియడంతో కించిత్తు నిరుత్సాహానికి గురయింది.


మహిజ వచ్చిన రెండు రోజులకు మోహిత్ వచ్చాడు. పాతికేళ్ళుంటాయి. హ్యాండ్సమ్ గా ఉంటాడు. లలిత భర్త గోపాలరావు, మోహిత్ తండ్రి జనార్దనం మంచి స్నేహితులు. సంపన్న కుటుంబానికి చెందిన జనార్దనం కోల్ కత్తా హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్. మోహిత్ స్టేట్ స్ లో ఎమ్మెస్ చేసి ఆమధ్యే ఇండియాకి తిరిగివచ్చాడు. గోపాలరావు అంకుల్నీ, లలిత ఆంటీనీ చూడ్డానికని భువనేశ్వర్ వచ్చాడు. అతని కలుపుగోరుతనము, స్నేహతత్వమూ మహిజను ఆకర్షించుకున్నాయి.


నగరంలో దసరా సందడి ఆరంభమయింది. లలిత ప్రోత్సాహం పైన దుర్గాదేవి పూజా పందిళ్ళను దర్శించి వచ్చారు మహిజ, మోహిత్ లు. లింగరాజు గుడికి వెళ్ళి, చెరో ప్రమిదను వెలిగించి భక్తితో శివుడికి నమస్కరించారు. వారిని దంపతులుగా ఎంచిన అర్చకుడు వారి పేర్లను కలిపి అర్చన చేస్తూంటే బిత్తరపోయారు. ఆ పురాతన దేవాలం యొక్క శిల్పసౌందర్యాన్ని మహిజ అబ్బురంగా తిలకిస్తూంటే, మోహిత్ కన్నులు ఆమె అందాలను ఆస్వాదించసాగాయి…


ఇరవై రెండేళ్ళ మహిజ పొడగరి. స్లిమ్ గా, పసిడిచాయలో… అనుభవజ్ఞుడైన శిల్పి ఉలి నుండి జాలువారిన సుందర శిల్పంలా ఉంటుంది. క్రీమ్ కలర్ పట్టుచీరలో కవులు వర్ణించే కావ్యకన్యలా తోచింది అతనికి. “మహిజా! ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు” అన్న అతని కాంప్లిమెంటుకు ఓపక్క సంతోషము, మరోపక్క గుండె ఝల్లూ కలిగాయి మహిజకు. “ఇక వెళ్దాం” అంటూ బైటకు నడచింది.


మర్నాడు పూరి, కోణార్క్ లకు బైలుదేరారు. ముందుగా కోణార్క్ కి వెళ్ళారు. అక్కడ ‘బ్లాక్ పగోడా’ గా పిలువబడే సుమారు వెయ్యేళ్ళ చరిత్రగల సూర్యదేవాలయాన్ని దర్శించారు. ఇరవై నాలుగు చక్రాలు గల రాతి రథం, దాన్ని లాగుతూన్న సప్తాశ్వాలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏడాదికోసారి - రథసప్తమి రోజున – తొలి సూర్యకిరణాలు రథం మీది రవి చరణాలను తాకడం అచ్చటి విశేషత. రథం మీద, కట్టాడాల మీద అందంగా మలచబడ్డ శృంగారభంగిమలు ఉత్సుకతను రేకిత్తిస్తాయి.


లంచ్ తరువాత పూరీకి బైలుదేరారు మోహిత్, మహిజలు. సముద్రపు గాలి చల్లగా వీస్తూంటే కోణార్క్, పూరీల నడుమనున్న పాతిక కిలోమీటర్ల మెరైన్ డ్రైవ్ ఉల్లాసకరంగా ఉంది. పూరీలో వెంటపడ్డ పండాలను కష్టం మీద వదిలించుకుని గుడిలో ప్రవేశించి జగన్నాథుడి దర్శనం చేసుకున్నారు.


బీచ్ కి వెళ్ళి నీళ్ళలో దిగారు ఇద్దరూ. ఇసుకలో చిన్నపిల్లల్లా పరుగులు తీసారు. సీ-షెల్స్ ని ఏరుకుందామె. మహిజ ఒంటె పైన ఎక్కుతూ జారిపడబోతే, చటుక్కున పట్టుకున్నాడు మోహిత్. ఓ చేయి ఆమె వక్షం పైన, మరో చేయి నడుం చుట్టూ పెనవేసుకున్నాయి. అతని హృదయానికి అంటుకుపోయింది ఆమె. ఓ క్షణం అతని కరస్పర్శ ఆమెను అవ్యక్తమైన అనుభూతికి గురిచేసింది, అతని కౌగిట్లో అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు, స్పృహలోకి వచ్చేసరికి సిగ్గుతో తత్తరపాటుకు గురయింది… అనంతరం ఇద్దరూ బోటింగ్ చేసారు. ఆమె సంతోషంతో కేరింతలు కొడుతూంటే, ఆమె వంక ఆరాధనగా చూసాడు అతను.


చీకటిపడ్డాక తిరుగు ప్రయాణమయ్యారు. త్రోవలో పిప్లీలో ఆగి హ్యాండ్ లూమ్ ఛాదర్స్, పిలిగ్రి వర్క్స్ తో ఉన్న వస్తువులు, పెయింటింగ్స్ వగైరాలు కొన్నారు. ఇంటికి చేరుకునేసరికి రాత్రి పదయింది.


పూరీ బీచ్ లోని అనుభవం తరువాత మోహిత్ కళ్ళలోకి చూడడానికి సిగ్గు ముంచుకువస్తోంది మహిజకు. రెండు రోజులు ఉండి వెళ్దామనుకున్న మోహిత్ కి అంత త్వరగా వెళ్ళిపోవడానికి మనసు రావడంలేదు. అందుకే, మరో రెండు రోజులు ఉండి వెళ్ళమన్న లలిత దంపతుల కోరికను వెంటనే మన్నించాడు.


ఓ రోజున నగరానికి పన్నెండు కిలోమోటర్ల దూరంలో ఉన్న నందన్ కానన్ ‘జూ’ కి వెళ్ళారు మోహిత్, మహిజలు. రాయల్ బెంగాల్ వైట్ టైగర్ అచ్చటి ప్రత్యేకత. సువిశాలమైన ఆ జూలో తిరుగాడుతూ, జంతువులను, పచ్చని ప్రకృతినీ తిలకిస్తూ రోజంతా గడిపారు. మోహిత్ చూపులు తన పైనే నర్తిస్తూ ఉండడం మహిజ గమనిస్తూనే ఉంది, ఆమెకు సిగ్గు ముంచుకువస్తోంది. మునుపటిలా ఫ్రీగా ఉండలేకపోతోంది. అతని సాంగత్యం తనలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నీరేకెత్తించడం ఆమెకు తెలుస్తూనేవుంది… తిరిగి వస్తూ, త్రోవలో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి రాధాకృష్ణులను దర్శించుకుని, కాసేపు అక్కడ ప్రశాంతంగా గడిపి, ఇంటిముఖం పట్టారు.


డిన్నర్ టేబుల్ దగ్గర హఠాత్తుగా అడిగాడు మోహిత్, “మహీ! నాతో కోల్ కత్తా వస్తావా?” అంటూ. సాన్నిహిత్యం పెరగడంతో ఆమెను ‘మహీ’ అని పిలవనారంభించాడు.


మహిజ ఆశ్చర్యంగా చూస్తే, “ఔనే, మహీ! దుర్గానవరాత్రులు అక్కడ మరీ గ్రాండ్ గా జరుగుతాయి. సిటీ కూడా చూసినట్టుంటుంది. వెళ్ళిరాకూడదూ?” అంది లలిత నవ్వుతూ.


“కాని, పిన్నీ!…” అంటూ ఏదో అనబోయిన మహిజకు అడ్డు తగులుతూ, “అక్క ఏమీ అనదులే. నేను ఫోన్ చేసి చెబుతాను” అంది లలిత… మహిజ మోహిత్ తో కోల్ కత్తా వెళ్ళడానికి నిశ్చయింపబడింది.

*

మోహిత్ తండ్రి జనార్దనం తన ప్రొఫెషన్ తో బిజీగా ఉంటే, తల్లి రంగనాయకమ్మ మహిళా మండలి ఉపాధ్యక్షురాలిగా ఎప్పుడూ ఏదో ఒక సమాజసేవ అంటూ హడావుడిగా ఉంటుంది. తన వద్ద జూనియర్ గా పనిచేసిన వ్యక్తికే కూతుర్నిచ్చి పెళ్ళి చేసిన జనార్దనం, వారిని ఇంట్లోనే ఉంచుకున్నాడు. డిగ్రీ చదివిన మోహిత్ అక్క షర్మిల టీచర్ ఉద్యోగం చేసేది. కొడుకు పుట్టాక ఉద్యోగం మానేసి గృహిణిగా స్థిరపడిపోయింది. జనార్దనానికి గొరియహాట్ లో లంకంత ఇల్లు… మోహిత్ కుటుంబానికి మహిజ తొలిచూపులోనే ఎంతో నచ్చేసింది.


మోహిత్, మహిజలు కాళీఘాట్ కి వెళ్ళి కాళీమాతను దర్శించుకున్నారు. దక్షిణేశ్వర్ లో కూడా పూజారి వారిని దంపతులుగా పొరబడి అర్చనలోను, ఆశీర్వచనం లోను ఇద్దరికీ ముడిపెట్టడం… మోహిత్ కి చిత్రంగా ఉంటే, మహిజను సిగ్గు పెనవేసుకుంది. అనంతరం సైన్స్ సిటీ, బిర్లా ప్లానెటేరియం వగైరాలను దర్శించి వచ్చారు.


షర్మిల కొడుకు చింటూ ఏడేళ్ళవాడు. ఫ్యామిలీ ఆల్బం తెచ్చి ఒక్కొక్కరినే మహిజకు పరిచయం చేయసాగాడు. ఆసక్తిగా చూస్తూన్న మహిజ చూపులు ఓ ఫోటో మీద నిలచిపోవడంతో, “ఇది మా మమ్మీ తాతయ్య. ఇది మా మమ్మీ నాన్నమ్మ” అని చెప్పాడు. “మమ్మీ నాన్నమ్మ ఇప్పుడు లేదు. దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది”.


“మరి తాతయ్యో? కనిపించరేం?” అనడిగిందామె.

“ఇక్కడ లేరు” అని జవాబిచ్చాడు వాడు.


అప్పుడే అక్కడకు వచ్చిన మోహిత్ చెప్పిన సంగతులు ఆమెను నిశ్చేష్టురాలిని చేసాయి... జనార్దనం తండ్రి బలరామయ్య. చదువు లేకపోయినా స్వీట్స్ వ్యాపారం చేసి కోట్లు గడించాడు. ఏకైక సంతానమైన కొడుకును చదివించి లాయర్ని చేసాడు. రాను రాను వ్యాపారంలో పోటీ పెరగడము, తనకు వయసు పైబడడము వగైరాల కారణంగా తన వ్యాపారాన్ని అమ్మేసాడు. మూడేళ్ళ క్రితం భార్య పోయింది. ముసలాయనకు చాకిరి చేయడం తన వల్లకాదంటూ శాంతినికేతన్ లోని ఓ ఓల్డేజ్ హోమ్ కి పంపేసింది రంగనాయకమ్మ, భర్తతో పోరి.


“శాంతినికేతన్ గురించి చదవడమే కాని ఎప్పుడూ చూళ్ళేదు నేను. వీలైతే వెళ్ళి వద్దామా?” అనడిగింది మహిజ. “ఓ ష్యూర్! వై నాట్?” అన్నాడు మోహిత్.

మర్నాడు చింటూని తీసుకుని కారులో శాంతినికేతన్ కి బైలుదేరారు ఇద్దరూ… చల్లటి నీడతో, ప్రశాంతతతో తనువులను, మనసులను సేదదీర్చే తరు సముదాయంతో కూడిన సువిశాలమైన శాంతినికేతన్ క్యాంపస్ ని చూస్తుంటే మహిజ హృదయం ఉప్పొంగింది. స్కాలర్స్ కొందరు అక్కడక్కడ వృక్షచాయలలో కూర్చుని చదువుకుంటున్నారు. క్యాంపస్ అంతా తిరిగి చూసి, లైబ్రరీలో కొంతసేపు గడిపారు మోహిత్, మహిజలు.

అనంతరం ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళారు. బలరామయ్య వయసు డెబ్బై ఐదు పైనే ఉంటుంది. మనిషి పీలగా, పొడవుగా ఉంటాడు. తెల్లటి ధోతి, చొక్కా ధరించాడు. వదనంలో నిర్లిప్తత... మనవణ్ణీ, మునిమనవణ్ణీ చూడగానే ఎక్కడలేని హుషారూ వచ్చేసింది ముసలాయనకు. అతనిలో ఉప్పొంగిన భావోద్రేకం స్పష్టంగా కనిపిస్తోంది. మోహిత్, మహిజను పరిచయం చేయడంతో ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపైన ముద్దుపెట్టుకున్నాడు.


తరువాత పనివాళ్ళతో సహా కుటుంబంలోని అందరి యోగక్షేమాలనూ అడిగి తెలుసుకున్నాడు బలరామయ్య. చింటూని ముద్దాడుతూ, “నీ ముద్దుమురిపాలు చూసి ఆనందించే అదృష్టం ఈ తాతయ్యకు లేదురా కన్నా!” అంటుంటే, గొంతులో విషాదఛాయలు తొంగిచూసాయి… వాళ్ళు వచ్చేస్తూంటే, గేటు వరకు వచ్చి వీడ్కోలు చెబుతూన్న అతని వదనం చూస్తే జాలి వేసింది మహిజకు.


వచ్చేటప్పుడు హుషారుగా కబుర్లు చెప్పిన మహిజ, తిరుగు ప్రయాణంలో ముభావంగా ఉండిపోవడం మోహిత్ ని చకితుణ్ణి చేసింది…


వెళ్ళిపోతూన్న మహిజకు పసుపు కుంకుమలతోపాటు బట్టలు పెట్టింది రంగనాయకమ్మ.

“మీరంతా హైదరాబాద్ రావాలి, ఆంటీ!” అని మహిజ అంటే, “నువ్వు పిలవకపోయినా త్వరలోనే మేమంతా మీ ఇంటికి వస్తాం, మహీ!” అంది షర్మిల నవ్వుతూ. మోహిత్, చింటూలు మహిజను సాగనంపడానికి ఏర్ పోర్ట్ కి వెళ్ళారు.

*

ఆ తరువాత సంఘటనలన్నీ చకచకా జరిగిపోయాయి. మహిజను కొడుకు ఇష్టపడుతున్నట్లు తెలియగానే, ఆమెను కోడలిగా చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు జనార్దనం దంపతులు. మోహిత్ వచ్చే సమయానికి మహిజను భువనేశ్వర్ కి రప్పించడంలోని తన ఉద్దేశ్యం ఫలించినందుకు సంతోషించింది లలిత. కూతురి అంగీకారంతో మహిజ తల్లిదండ్రులు కూడా ఆ సంబంధానికి సుముఖత చూపారు.


మోహిత్, మహిజల నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే మోహిత్ కి బెంగుళూరులోని ఓ ఎమ్మెన్సీలో ప్రాజెక్ట్ మేనేజరుగా మంచి ఉద్యోగం వచ్చింది. అది మహిజ అదృష్టమేనని మురిసిపోయారంతా. మరో మూణ్ణెల్లలో వారి వివాహం కూడా జరిగిపోయింది.


శోభనం నాటి రాత్రి– అతివల నవ్వుల జల్లులు, కాలిపట్టాల మువ్వల చిరు ఘళ్ళుల మధ్య బిడియంగా గదిలో అడుగు పెట్టింది మహిజ. ప్రత్యేక అలంకరణలోని మహిజ సౌందర్యాన్ని వీక్షించిన మోహిత్ మనసు పరవశంతో పరవళ్ళు త్రొక్కింది. చేరువగా వెళ్ళి బిగియార కౌగలించుకున్నాడు.


“పాలు…” అంటూ పాలగ్లాసును అందించబోయింది. “ముందుగా అధరామృతం. ఆ తరువాతే క్షీరధారలు…” అంటూ ఆమె అరుణాధరాలను అందుకున్నాడు. సిగ్గుతో ముడుచుకుపోయిందామె. ఊపిరి ఆడనివ్వకుండా అతను తన తనువంతా ముద్దులతో తడిపేస్తూంటే, తొలకరి చినుకులు పడ్డ పూతీగలా చిరుకంపనకు గురయింది.


పూలపాన్పు వద్దకు నడిపించుకు వెళ్ళి సున్నితంగా పరుండబెట్టాడు ఆమెను. పరవశంతో కన్నులు మూసుకుని అతని వక్షానికి హత్తుకుపోయిందామె. కాముడు తొందరచేస్తూంటే, పైటను తొలగించబోయాడు. అతని చేతుల్ని త్రోసేసి చటుక్కున లేచి కూర్చుందామె.

“ఏమయింది, మహీ?” తెల్లబోయాడు అతను.


“మన శరీరాలు ఏకమయ్యే ముందు నా చిరుకోరిక ఒకటి తీర్చాలి మీరు” అంది.

“కోరికా! గర్భం దాల్చినపుడే కాక, గర్భాదాన సమయంలో కూడా స్త్రీలకు కోర్కెలు ఉంటాయని నేనెరుగను సుమా!” అన్నాడు నవ్వుతూ.


తన మనసులోని మాటను బైటపెట్టింది ఆమె. అది ఆలకించి తెల్లబోయాడు అతను- ’చారులోంచి కరివేపాకును ఏరి పారేసినట్టు, వృద్ధాప్యంలో బలరామయ్యను కుటుంబం యొక్క ప్రేమాభిమానాలకు దూరం చేయడం అన్యాయం. జీవితమంతా ఆ కుటుంబపు శ్రేయస్సుకోసం పాటుపడే వ్యక్తి, వృద్ధాప్యంలో కోరుకునేది తనవారి ప్రేమాభిమానాలే తప్ప మడులూ మాణిక్యాలూ కాదు. ముసలాయన విషయంలో మోహిత్ కుటుంబం యొక్క చర్యను తాను హర్షించలేకపోతోంది...’


“సారీ, మహీ! నీ అభిప్రాయమే నాదీను. కాని, మమ్మీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు కుటుంబంలో’ అన్నాడు మోహిత్.


“రేపు మీ తల్లిదండ్రులకూ అదే గతి పడితేనో…?” సూటిగా ప్రశ్నించింది. బుర్ర గోక్కున్నాడు.


“దీనికి నా దగ్గర ఓ సొల్యూషన్ ఉంది, మోహిత్!. తాతయ్యను మనతో బెంగళూరు తీసుకుపోదాం. చివరి రోజుల్లో ఆయన కోరుకునే ప్రేమాభిమానాలను మనం పంచుదాం. ఆయన మనకు పెద్ద దిక్కుగా ఉంటారు. ఇక మమ్మీ అంటారా? దిసీజ్ అవర్ డెసిషన్!” శాంతంగానే ఐనా దృఢంగా అందామె. “మీరు కాదంటే మనం భార్యాభర్తలుగా మిగిలిపోతామే తప్ప, దంపతులం కాలేము!”


“దిసీజ్ బ్లాక్ మెయిల్! మన శోభనానికీ తాతయ్యకూ ముడిపెట్టడం అన్ ఫెయిర్” ప్రొటెస్ట్ చేసాడు మోహిత్.


నవ్విందామె. “మన పెద్దల సంతోషంతోనే మన సుఖం ముడిపడియుంటుందన్న సత్యం మరచిపోవద్దు” అంది.


ప్రేమతో ఆమెను కౌగలించుకున్నాడు అతను. “పెద్దలపట్ల ఇంతటి గౌరవాభిమానాలు గల మనవరాలు దొరికినందుకు తాతయ్య ఎంతో సంతోషిస్తారు. కొత్త కుండలోని నీరు, కొత్త పెళ్ళాం పొందూ తీయన అంటారు. ఆ రుచిని మిస్ చేయడం నాకిష్టంలేదు. మనం బెంగుళూరు వెళ్ళగానే తాతయ్యను తీసితెచ్చుకుందాం. ఇట్జ్ ఎ ప్రామిస్!” అన్నాడు.

“థాంక్ యూ!” అంటూ అతని పెదవులపైన ముద్దుపెట్టుకుందామె.


“అమ్మాయిగారి కోరిక తీరిందిగా! ఇంకా ఏమిటీ ఆలస్యం? ఈ అందాలతో నన్ను విందు చేసుకోనీ…” అంటూ అతను ఆర్తిగా ఆక్రమించుకుంటుంటే, సిగ్గుతో విభుని వక్షంలో ముఖం దాచేసుకుందామె.

***


తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపుCSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."
86 views0 comments

Kommentare


bottom of page