top of page

ఆమెతో నా ప్రయాణం


Ametho Na Prayanam written by Venku Sanathani

రచన : వెంకు సనాతని

ఊరెళ్దామని ఆఫీసు నుండి త్వరగానే బయలుదేరాను. ఎంత త్వరగా మొదలైనా హైద్రాబాద్ ట్రాఫిక్ సమస్యతో రూంకి వచ్చే సరికి సమయం సాయంత్రం నాల్గున్నర అయ్యింది. రైలుకు ఇంకా గంట సమయం మాత్రమే ఉంది అనుకుంటూ చకచకా తయారయ్యి రూముకి తాళం వేసి రోడ్డు వైపు వేగంగా నడిచి దగ్గర్లో ఉన్న బస్టాప్ చేరుకున్నాను. సికింద్రాబాద్ రైల్వేస్టేషనుకు వెళ్ళే బస్సు కోసం వెయిటింగ్.


ఈ హడావుడి అంతా ఎందుకోసమంటే సంవత్సరం తర్వాత ఊరు వెళ్తున్నాననే ఆనందం ఒకటైతే, ఆలస్యమైతే రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ వెళ్ళిపోతుందనే ఆదుర్దా మరొకటి.


సీట్లకు రెట్టింపు జనంతో బస్సు రానే వచ్చింది. రోజూ అలవాటైన పనే కదా అనుకుంటూ కిక్కిరిసిన జనాన్ని తోసుకుంటూ బస్సు ఎక్కాను. బస్సు బయలుదేరింది.


నగరంలోని ప్రధాన రహదారి వెంబడి బస్టాప్లలో ఆగుతూ ముందుకు సాగుతుంది బస్సు. ఈ ట్రాఫిక్ సమస్యతో స్టేషనుకి సమయానికి చేరుకుంటానన్న ఆశ మెల్ల మెల్లగా సన్నగిల్లుతుంది. ఇలా ఆలోచిస్తున్నానో లేదో బస్సు ఆగింది. ఎందుకా అని చూస్తే రెడ్ సిగ్నల్. ఈ సిగ్నల్స్ ఇవన్నీ కదిలే వాటికే కానీ కరిగే కాలానికి కాదని నాకు నేనే ఓ ఫిలాసఫీ చెప్పుకుంటుండగా బస్సు కదిలింది.


హమ్మయ్య కదిలింది అనుకున్నానో లేదో అంతలో మళ్ళీ ఆగింది.కొద్దిపాటి చిరాకుతో బస్సు డ్రైవర్, కండక్టర్ ఇద్దరి మీద అజమాయిషీ చేయాలనిపించింది. అది కుదిరే పని కాదని ఖాళీ అయిన సీట్లో కూర్చున్నాను. ఎంత సేపైనా కదలదే. కారణం ఏంటని కండక్టర్ని అడిగాను. ఏదో గొడవ జరుగుతుంది, అందుకే ఈ ట్రాఫిక్ జామ్ అని చెప్పాడు. ఇలా అయితే వెళ్ళినట్లే అని అనుకుంటుండగా పోలీసులు రావటం, ట్రాఫిక్ క్లియర్ చేయటం అంతా వేగంగా జరిగిపోయాయి. అంతే వేగంతో బస్సు కదిలింది. అప్పటికే బస్సు సగం ఖాళీ అయింది. నేనూ దిగిపోదామని అనుకున్నాను. ఇంకా 6 కిలోమీటర్ల దూరం ఉంది నడవగలనా అనే సందేహాలకు సమాధానాలు ఇస్తూ సమయం ఐదున్నర అయింది రైలు ఉంటుందా, వెళ్లిపోతుందా అన్న సంశయానికి నన్ను నేను సముదాయించుకుంటుండగా బస్సు స్టేషన్ సమీపించిందని అర్థం అయ్యింది.


బస్సు ఆగటంతో లగేజీ చేత పట్టుకుని వాయు వేగంతో స్టేషనుకి చేరాను. డిస్ ప్లే బోర్డులో నేను రిజర్వేషన్ చేయించుకున్న రైలు చెన్నై ఎక్స్ ప్రెస్ జాడ కనిపించలేదు. వెళ్ళి ఎంక్వయిరీలో కనుక్కున్నాను. ఐదు నిమిషాల క్రితమే వెళ్లిపోయిందని అన్నారు. తలచినదే జరిగినదా అని అనుకుంటూ, నాంపల్లి నుండైతే సికింద్రాబాద్ నుండి రిజర్వేషన్ చేసిన స్నేహితుణ్ణి తిట్టుకుంటూ, తరువాత రైలు ఎన్నింటికి అని అడిగాను. అరగంటలో రెండవ నంబరు ఫ్లాట్ ఫామ్ పై నారాయణాద్రి వస్తుందని అటు వైపు నుండి సమాధానం వచ్చింది.


వారికి థాంక్స్ తెలియజేసి టికెట్ కౌంటర్ వైపు నడిచాను. క్యూ చాలా పొడవుగా ఉంది. అయినా తప్పేదేముందని లైన్లో నిలబడ్డాను. టికెట్ తీసుకుని రెండవ నంబరు ఫ్లాట్ ఫామ్ వద్దకి చేరుకున్నాను.వారు చెప్పిన సమయానికి ఇంకా పది నిముషాలు ఉంది. నెమ్మదిగా జనరల్ కంపార్ట్మెంట్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను. రద్దీ తక్కువగానే ఉంది. సీట్ కన్ఫర్మ్ అని అర్థమైంది. ఇంతలోనే ఎనౌన్స్మెంట్ వినిపించింది. అంతలోనే రైలు రావటం, ఎక్కటం వేగంగా జరిగాయి. విండో సీట్ దొరికింది. జనరల్ బోగీ అందులో విండో సీట్ హ్యాపీ అనుకుంటూ వెంట తెచ్చిన లగేజీని పైన పెడుతుండగా..


ఎక్స్ క్యూజ్ మీ..

కొంచెం ఈ లగేజీ కూడా పైన పెడతారా..

అంటూ సన్నని స్వరం ఒకటి వినిపించింది.

ఎవరా అని చూస్తే, అచ్చం రవివర్మ గీసిన చిత్రంలా ఉంది అమ్మాయి.

కొన్ని క్షణాల పాటు అలాగే చూస్తుండి పోయాను.


హలో మిమ్మల్నే..

ఈ లగేజీ పైన పెడతారా..

అన్న మాటకు తేరుకుని ఆమె లగేజీ తీసుకుని పైన పెట్టి నా సీట్లో కూర్చున్నాను. ఆమె నా ఎదురు సీట్లో కూర్చుంది.


ఆహా ఏమి నా భాగ్యం. పసిడి ఛాయలో పదారణాల తెలుగందం నా ఎదురుగా కూర్చుని ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే తన అందం. గంటల తరబడి మాట్లాడాలనిపించే నా ఆనందం.మొన్న విన్న సరిపోవు కోటి కనులైనా అన్న గీతానికి సరైన అర్థం తనేనేమో అనిపించింది. అనిపించడం కాదు తనే.


ఇన్ని భావాలు నాలో ఎప్పుడూ కలగలేదు. ఇంత ప్రాసలో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేయటం మాత్రమే తెలిసిన నాకు ఆరోజే తెలిసింది నాలోనూ ఓ కవి ఉన్నాడు అని. నాలో ఉన్న ఆ కవి భావనే ఇదంతా అని. అబ్బ ఏం అందం.. ఏం అందం.. ఆ అందాన్ని వర్ణించేందుకు పదాలు వెతికే పనిలో ఉంది నా ఆనందం.


ఆమె చూపులకు దొరకకుండా దోబూచులాడుతున్న నా చూపులు మేమిక్కడ అంటూ తన కనులకు సైగ చేస్తున్నాయి. ఆమె కనులు బోగీ గవాక్షంలో నుండి ప్రకృతి హొయలు వీక్షిస్తున్నాయి. ప్రకృతి ప్రకృతిని చూస్తుంది అన్న మాటకు పట్టం కడుతూ ఆమె ఆలోచనల్లోనే లీనమవుతూ ఉండగా..


ఇంతలో ఎక్కిళ్ళ శబ్ధం..

ఎవరికబ్బా అనుకుంటూ తల పైకెత్తాను. ఎవరికో కాదు తనకే. వెంటనే వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ తీసి తన చేతికి ఇచ్చాను. వాటర్ తాగి బాటిల్ చేతికి ఇస్తూ చాలా థాంక్స్ అండి అని పలికింది. పర్లేదండి అంటూ బాటిల్ తీసుకున్నాను.


ఇదే అదునుగా భావించి తనతో మాట్లాడాలనుకున్నాను. ఆ.. మాట్లాడాలి. ఏం మాట్లాడాలి. ఎలా మొదలుపెట్టాలి. ఇలా అనుకుంటూ ఎలాగైనా మాట్లాడాలని కొద్దో గొప్పో మాటల్ని మూట కట్టాను. గొంతు పెకలటం లేదు. పెదవి పలకటం లేదు. అడ్డుపడిన పెదాల్ని పదాలు తిట్టుకుంటూ దండయాత్ర చేశాయి. ఊహూ.. లాభం లేదని వెనుదిరిగాయి.


వెనుదిరిగిన మాటలకి సాదర స్వాగతం పలికినట్లుగా..

మీ ప్రయాణం ఎక్కడి వరకు అని అడిగింది. ఆమెతో ఎలా మాట్లాడాలి అనుకున్న నాకు సందు దొరికింది. మది చిందులేస్తుంది. ఈ మాత్రం దానికే ఆత్రం మాని కొద్దిగా గొంతు సవరించుకుని బాపట్ల వరకు అన్నాను.


ఓ.. మీది బాపట్లా..

రెండు సంవత్సరాల క్రితం నేను బాపట్ల వ్యవసాయ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. బాపట్ల ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను.


ఆమె ఆ మాట చెప్పటంతో చుట్టరికం కొద్దిగా పెరిగిందని నాలో నేనే ఉబ్బి తబ్బిబ్బు అయ్యాను. తమాయించుకుని మాటలు మధ్యలో ఆగకూడదని మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు అన్నాను.


తిరుపతి వెళ్తున్నానండి..

మీది తిరుపతా అని అన్నాను.

కాదండి.. హైద్రాబాద్..

వెంటనే హైదరాబాద్లో ఎక్కడా అని అడుగుదామని అనుకున్నాను. బాగోదని ఆగాను.


ఆమె కొనసాగిస్తూ..

ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ఇదే సమయంలో తిరుపతి వెళ్తాను.

మీరు ఒక్కరే వెళ్తున్నట్లు ఉన్నారు అని అన్నాను.


హ.. అవునండి..

అమ్మా నాన్నలు కూడా వచ్చేవారే. కానీ కుదరలేదు. ఈసారికి నువ్వెళ్ళి వచ్చేయ్ అని అన్నారు ఇంట్లో.. సరేనని బయలుదేరాను.


ప్రతి సంవత్సరం రిజర్వేషన్ చేయించుకుని వెళ్తాం. ఈసారి కూడా అలానే అనుకున్నాము.టికెట్ బుక్ చేద్దామని ఆన్లైన్లో చూస్తే వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉంది. సరే నేనొక్కదాన్నే కదా అని ఇలా వస్తున్నాను. ఎప్పుడూ రిజర్వేషనే కాకుండా ఇలాంటి వేరియేషన్ కూడా చూడాలి అని అన్నది.


ఆహా.. ఏమి ఆ మాటల మాధుర్యం. మధ్యలో లేత నవ్వుల సౌందర్యం అని ఆ అందాన్ని వర్ణిస్తూ మాటలను ముడివేస్తూ, తదేకంగా ఆమెనే చూస్తూ పదాలను నెమ్మదిగా పెదాలు దాటిస్తున్నాను.


ఒక్కటేమిటి..

ఇష్టా ఇష్టాల దగ్గర్నుండి కష్ట సుఖాల వరకు స్నేహపూర్వకంగా చక్కగా మాట్లాడుకుంటున్నాం. పట్టాలపై రైలు సాఫీగా సాగుతున్నట్లు మా మాటలు కూడా అంతే సాఫీగా సాగుతున్నాయి. బోగీలో మేమిద్దరమే ఉన్నామా అన్నంత ఏకాంత సంభాషణ మా మధ్యన మెరిసింది. తనకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ప్రతీ మాట ఓ పూదోటలా అనిపించింది. ఈ మాటల అందం ఓ గ్రంథమైతే బాగుండు అని వినిపించింది. ఈ వినపడిన స్వరం ఎవరిదా అనుకుంటుండగా మౌనం నాదే అంటూ బదులు పలికింది. ఔరా.. మౌనాన్ని కూడా మాటలాడించే మానిని తానేనని అర్థమైంది. సమయం కూడా తెలియనంతగా మందార మకరంద మాటల మాధుర్యంలో తేలిపోతున్నాయి ఇరువురి మనసులు.

రైలు ఆగినట్లుగా అనిపించింది. ఫ్లాట్ ఫామ్ పై రద్దీ ఎక్కువగా ఉంది. టైమ్ చూశాను. రాత్రి 11 అయింది. ఏ స్టేషనో అని అనుకుంటూ ఉండగా గుంటూరు జంక్షన్ మీకు స్వాగతం పలుకుతుంది అన్న పదం విని నా గుండె వేగం పెరిగింది. కొంచెం కంగారు కూడా..


ఓహ్.. గుంటూరు వచ్చేశాం. గంటన్నరలో బాపట్ల. నా చుట్టూ అల్లుకున్న ఆనందాన్ని చూసి విషాదం కుల్లుకుందేమో బహుశా అది కూడా వచ్చి చేరింది. ఇప్పటిదాకా వర్తమానమైన మాటలన్నీ మరి కొద్దిసేపట్లో గతపు తాలూకా జ్ఞాపకాలైపోతాయని తలచుకోగానే ఎదలో సన్నని బాధ మొదలైంది. బాధతో పాటూ ప్రశ్నలు కూడా బయలుదేరాయి. సమాధానాల్ని వెతుక్కునే పనిలో వెలితిగా ఉన్న నా ముఖాన్ని గమనించిన ఆమె ఏమిటండీ అలా ఉన్నారు అని అడిగింది.


ఏం లేదండీ..

ఏదీ లేదనటంలోనే ఏదో ఉందని తెలుస్తోంది.

ఏమిటో చెప్పండి అని అడిగింది.


అబ్బే.. ఏం లేదండీ..

అంటూ మాట దాట వేసి ఇక్కడ ట్రెయిన్ అర్థ గంట ఆగుతుంది. తినటానికి ఏమైనా తీసుకుని రమ్మంటారా..? అని అడిగాను.


ఏం వద్దండి..

చపాతీలు తెచ్చాను. ఇద్దరం తిందాం అన్న తన మాటకు సరే అనకుండా ఉండలేకపోయాను.

బాక్స్ లో చపాతీలు తీసి ప్లేట్లో వేసి చేతికిచ్చింది.


కొద్ది సేపటి వరకు స్నేహాన్ని పంచింది. ఇప్పుడు ఆకలి తీర్చుతుంది. అందం అంతకు మించిన గుణం ఈ రెండింటి కలయికతో ఆమె సౌందర్యం అద్భుతం.


ఇలా మనసు పలికే మాటల్ని వింటూ ఆమెనే చూస్తూన్నాను నేను..

ఏంటండీ.. అలానే చూస్తున్నారు. నాకు దిష్టి తగులుతుంది అన్న ఆమె మాటకు తేరుకుని చిన్నగా నవ్వుతూ ఏం లేదు అన్నట్లుగా తలూపాను.


రైలు గుంటూరు నుండి బయలుదేరింది.

ఒక్కో స్టేషన్ దాటే కొద్ది నాలో టెన్షన్ మళ్ళీ మొదలైంది. ప్రతిసారీ నాకు ఎందుకీ కంగారు..?

పని ఒత్తిడా..! కాదు. ప్రయాణ ఒత్తిడా..! కాదు.

మరెందుకు..?

కారణం తనే అనే భావన. అవును తనే..

ఆమె గురించి నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను.

ఒక్క ఆలోచన మాత్రమేనా.. బాధ కూడా.. వీటికి తోడుగా ఓ బంధం.. ఏమిటా బంధం..? ఎందుకీ అంతర్మథనం..?


నా హృదయాంతరాళానికి ఏం మంతరమేసిందో కానీ ఇవన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నా ఈ వాలకానికి అర్థం వలపేనా..

ఇది తొలి చూపు పిలుపేనా..

ఇదేనా ప్రేమంటే.. అదే పోల్చుకోలేకపోతున్నానని

అనుకుంటూ ఆమెను చూశాను. ఆమె నా వైపే చూస్తూ, నా తీరు ఆమె గమనిస్తున్నట్లు నాకు అర్థమైంది.


మిమ్మల్ని గుంటూరు నుండి గమనిస్తున్నాను. అప్పటి దాకా బాగా మాట్లాడిన మీరు ఏదో కోల్పోతున్నట్లుగా.. ఎందుకు అలా ఉన్నారని అడిగింది.


బాపట్ల వచ్చేసింది.

ఏంటీ..? అన్న ఆమె మాటకు

నేను దిగే స్టేషన్ వచ్చేసింది.

అన్న నా మాటతో ఆమె చూపులో ఎన్నో అర్థాలు పలకరించాయి.


మా మధ్య మౌనం మూడో వ్యక్తిగా చేరింది. ఇప్పటి వరకు గలగల మంటూ సాగిన మాటల ప్రవాహానికి ఏదో అడ్డుకట్ట. మనసంతా భావోద్వేగంతో నిండిన భావన.


ఇంత వరకు నా ఒక్కడికే పరిమితమైన ఈ భావన ఇప్పుడు తనని కూడా చేరిందని. మనసుని సైతం తాకిందని నాకు అర్థమైంది. ఏదో వెలితి తనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.


బహుశా..

తనకూ నాలానే ఉందా..

అనుకుంటుండగా బాపట్ల స్టేషన్ రానే వచ్చింది.

వెళ్తున్నాను అన్నట్లుగా తలూపాను. మౌనం మాటున దాగిన మాటను పట్టి తెచ్చి మరీ సరే అని పలికింది.


గుండెకు గండి పడింది.

పైకి చెప్పలేని లోన దాచలేని బాధ గొంతు దగ్గరే ఉండిపోయింది. ఆ బాధతోనే రైలు దిగి ఆమె ఉన్న కిటికీ వద్దకు వచ్చి ఒక్కసారి ఆమెను చూసి ముందుకు నడిచాను. నడుస్తూ నడుస్తూ తిరిగి చూస్తూనే ఉన్నాను. ఆమె చూపులు నన్ను వెళ్ళనివ్వటం లేదు.


రైలు కదిలింది..

మదిలో మెదిలిన ఆలోచనతో అస్సలు ఆలస్యం చేయకుండా పరుగందుకుని మళ్ళీ రైలు ఎక్కాను. కొద్దిసేపు ఆమెకు ఏం అర్థం కాలేదు. విప్పార్చిన కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె తేరుకుని..


మీకూ తిరుపతి రావాలనిపించిందా అన్న తన మాటకు అవునండి మీకు తోడుగా అన్నాను నేను.

సన్నని నవ్వు ఆమె పెదాలపై అరవిరియటం గమనించాను.

ఆ క్షణం ఆమె నవ్వు దస్తూరి నా మనసు ఫలకంపై ప్రేమగా తన ప్రేమను రాస్తున్నట్లుగా అనిపించింది.


ఆమె తన చిరుమందహాసాన్ని దాచుకుంటూ మొదలు పెట్టిన మాటల సంభాషణ ఎన్నో కలలతో, కథలతో ముడిపడి మనసులు జతపడే పనిలో చాలా బిజీగా ఉంది. కబుర్లు కాలక్షేపం నిక్షేపంగా సాగుతుంది. బయట పడని భావమేదో.. కాదు కాదు బంధ మేదో ఇద్దరి మధ్యన దాగుడుమూతలు ఆడుతుంది.


ఆమెతో అడుగిడిన స్నేహం ప్రణయం వైపు పరుగిడుతుందని తలచుకుంటూ, నాలో నేను మురిసిపోతూనే అప్రయత్నంగా యురేకా అని గట్టిగా అరిచాను.


ఆమె ఒక్క క్షణం అచ్చెరువుతో ఏమైంది అన్నట్లుగా చూసింది.

ఏం లేదు అన్నట్లుగా ముసిముసిగా నవ్వాను.

ఆమె కూడా నవ్వింది.


అదే సమయంలో మరొకటి జరిగిందని చుట్టూ చూస్తే గానీ అర్థం కాలేదు.

బోగీలో జనమంతా ఉలిక్కిపడి లేచి నన్నే చూస్తున్నారు. నా అరుపుకి బోగీ దద్దరిల్లిందని అర్థమైంది. రాత్రి ఒంటి గంటకు నిద్ర పాడుచేసిన నా గావు కేకకు అందరూ రేవెట్టేద్దాం అనుకున్నారు. నిద్ర మత్తులో ఉండటం వలన తిట్టుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు.


హమ్మయ్యా అనుకుంటూ ఆమె వైపు చూశాను.

ఆమె నన్నే చూస్తుంది.నేనెందుకు అరిచానో ఆమెకు అర్థమైనట్లుంది. తన స్పందన చూపులతోనే సరిపెట్టింది.


ఆ చూపుల్లోని సమాధానాల గురించి ఆలోచిస్తుండగా అర్థమైంది. ఆడవారి మాటలకే కాదు చూపులకూ అర్థాలే వేరని.


కొద్దిసేపటికి తాను నిద్రలోకి జారుకుంది.

ఆమెనే చూస్తూ కూర్చున్నాన్నేను.

నాతో పాటు తారలు కూడా పోటీ పడ్డాయా అన్నట్లుగా ఆకాశంలో వేల సంఖ్యలో విచ్చుకున్నాయి. తారలెందుకు పోటీ పడుతున్నాయన్న తలపుతో అర్థమైంది నేల మీద జాబిలిని చేరేందుకని..


ఆహా.. ఏమి నా వర్ణన అని నన్ను నేనే మెచ్చుకుంటూ ఇలా కాదని పెన్ను తీసుకున్నాను. పేపర్ కోసం జేబులు వెతికాను. బస్ టికెట్ ఉంది. పర్లేదని అనుకుంటూ టికెట్ వెనుక వ్రాయటం మొదలుపెట్టాను.


నువ్వంటే నాకిష్టం

ఈ మాట చెప్పటం చాలా కష్టం

చెప్పలేను అలాగని దాచలేను

ఆగలేను అలాగని వేగలేను

పూట కూడా పూర్తవని

మన పరిచయం ప్రేమగా మారిందని

నీకు ఎలా చెప్పను..

నిన్ను దాటి వెళ్తున్నప్పుడు

ప్రాణం పోయినంత పనైందని

నీకు ఎలా తెలుపను..


కంప్యూటర్ల ముందు కూర్చుని ప్రోగ్రాం రాసే నేను ఇలా ప్రాస కవితలు రాస్తానని అనుకోలేదు. ప్రేమలో పడితే ఇంతేనని సినిమాలు చూసినప్పుడు ఎందుకు అర్థం కాలేదో ఇప్పుడు అర్థం అవుతుంది.


నాలో భావావేశం పొంగిపొర్లుతుంది. నా కలకి కలం కూడా వంత పాడుతుంది. కానీ ఆ చిన్ని కవితతో నే కాగితం పూర్తై పోయింది.


సరే అనుకుంటూ వెన్నెల వంటి ఆమెనే చూస్తుండగా..

గాలి వాలుగా ఆమె ముంగుర్ల సోయగాల సరాగం మదిని మీటుతున్నట్టుగా తోచింది. ఆ సరాగల పల్లకిలో ఊయలూగుతూనే నేనూ నిద్రలోకి జారుకున్నాను.


స్టేషన్ వచ్చింది.. అని ఆమె నిద్రలేపింది.

లేచి కళ్ళు తెరచి ఒళ్ళు విరుచుకుంటుంటే.. రాత్రి బస్ టికెట్ వెనుక వ్రాసిన కవిత గుర్తుకు వచ్చింది. టికెట్ కోసం జేబులు వెతికాను. కనపడలేదు. సీట్ కింద , పక్కన అంతా చూశాను. లాభం లేదు.


ఏంటండీ వెతుకుతున్నారు అని అడిగింది ఆమె.

అసంకల్పింగా మనసు అని అన్నాన్నేను.

ఏంటీ మనసా.. అని అంది ఆమె.

కాదు.. కాదు.. పరుసు.

అవునా.. ఉందా..

లేకపోతే వెతుకుదాం అన్న మాటకు

ఉందండీ.. బ్యాక్ పాకెట్లో ఉంది.

ఓహ్.. థాంక్ గాడ్ అని అంటూ వెళ్దామా అని ఆమె అనే సరికి లగేజీ తీసుకుని ట్రైన్ దిగాము. ఎగ్జిట్ వే ద్వారా స్టేషన్ బయటకు వచ్చాము.


తిరుమలకు చేరుకోవాలి. ఎలా వెళ్దాం..

బస్లో వెళ్దామా.. నడక దారిలో వెళ్దామా..

అన్న ఆమె మాటలకు..

మీరు ఎప్పుడూ ఎలా వెళ్తారు అన్న నా ప్రశ్నకు సమాధానంగా..

అలిపిరి వద్ద దిగి నడక దారిలోనే వెళ్తాము అని అంది.

అలాగే వెళ్దాం అన్నాన్నేను.


బస్సు ఎక్కి అలిపిరి వద్ద దిగి ఫ్రెష్ అప్ అవ్వటానికి ఎవరి దారిన వారు వెళ్ళాం. నేను తయారయ్యి లగేజీ సర్దుతుండగా.. వినపడిన అలికిడికి పక్కకు తిరిగి చూశాను.


తనే..

పట్టు పరికిణీ లో బుట్ట బొమ్మలా ఉంది. ఆ అందాన్ని దాచేందుకు నా కనులు ఒక దానికొకటి పోటీ పడుతున్నాయి. ఆ క్షణం ఆమె తప్ప నాకు ఎవరూ కనిపించలేదని అంటే నమ్మరేమో బహుశా..


విప్పార్చిన కనులతో రెప్పార్చకుండా తననే చూస్తున్న నన్ను పిలిచినా స్పందన లేకపోవడంతో ముఖానికి దగ్గరగా చేతిని ఊపింది.


ఆ గాజుల సవ్వడికి తేరుకున్న నన్ను చూసి నవ్వుకుంటూ బయలుదేరదామా అని పలికింది.

అలాగేనంటూ తలూపాను.


గాజుల సవ్వడి

మువ్వల సందడి

వీటికి నవ్వులు ముడిపడి

పక్షుల కిలకిల రావాలు రాగాలు తీస్తూ

శుభోదయం తెలిపినట్లుగా ఉంది.


ప్రతి సారీ ఆమె అందానికి నా ఆనందానికి విడిపడని అనుబంధ మేదో ముడిపడుతుండని అర్థమైంది.

ఈ అనుభూతి ప్రతిసారీ కొత్తగానే ఉందని అనుకుంటూ ఉండగానే లగేజీ కౌంటర్ వచ్చింది.


లగేజీ ఇచ్చేసి టోకెన్ తీసుకుని మొదటి మెట్టుకి నమస్కరించి మెట్ల మార్గం ద్వారా నడక ప్రారంభించాము.


తొలి అడుగులు మొదలయ్యాయి.

చుట్టూ ఉన్న చెట్టూ చేమని పలకరిస్తూ మాటలు కూడా కదిలాయి. అడుగులుగా మొదలైన నడకలతో ఆనంద నిలయం చేరుకున్నాము.


ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్న కల్యాణం టికెట్ ద్వారా స్వామి వారికి కల్యాణం జరిపించి , పద్మావతి సమేత వేంకటేశ్వరుని దర్శించాము.


ఆమె ఏం కోరుకుందో తెలియదు కానీ నేను మాత్రం.. వచ్చే సంవత్సరం మేమిద్దరం భార్యా భర్తలుగా నీ వద్దకు వచ్చేలా దీవించు స్వామీ అని కోరుకున్నాను.


ప్రసాదాలు తీసుకుని ప్రశాంతంగా ఒకచోట కూర్చున్నప్పుడు మాటల సందర్భంలో..

ఏదో పెద్ద కోరికే కోరినట్టు ఉన్నారు అంది ఆమె.

ఉన్నా కూడా చెప్పలేను కదా.. అందుకని

ఆ మాటకు చిన్నగా నవ్వి..

అదేం లేందండి అంటూ వెళ్దామా అన్న నా సైగతో అక్కడ నుండి కదిలాము.


కొండ మీద గుళ్ళన్నీ చుట్టేసి నడక మార్గంలో క్రిందకు బయలుదేరాము.నడక మొదలైన మొదలు తుది వరకు ఒకటా రెండా ఎన్ని మాటలో, ఎన్ని జ్ఞాపకాలో వాటినన్నింటిని మనసు సూట్కేస్లో సర్దేసి రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం.


ఇరువురి హృదయాల్లో అలజడి. ఆ అలజడితోనే ట్రైన్ ఎక్కాం. తిరుగు ప్రయాణం ఎక్కువగా మౌనానికే స్థానమిచ్చింది.


మరికొద్ది గంటల్లో మా గమ్యాలు వేరవుతాయి. ఈ తలపుకు ఎద తలుపులు బద్దలయ్యేలా కొట్టుకుంటున్నాయి. నిన్న ప్రయాణంలో నా ముఖంలో మాత్రమే కనిపించిన వెలితి ఇప్పుడు తన ముఖంలో కూడా..


మరో పదినిముషాల్లో నేను దిగుతాను అనగా నిన్న రాత్రి టికెట్ మీద రాసిన కవితను ఆమెకు ఎలాగైనా వినిపించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. కానీ మాట పైకి పెకలటం లేదు. గుండె తడారి పోయింది. మాట పొడారి పోయింది. ఈ లక్షణాలు కలగలిసిన శిక్ష దేనికి అనుకుంటూ ఉన్నాను.


ఇలా నా ఒక్కడికేనా..! ఆమెకు కూడానా..!!

నాకు తెలుసు. తనకి నాలానే అనిపిస్తుంది. ఆడ మనసు కదా అంత తేలికగా బయటపడదు అని నాకు నేను సర్ధి చెప్పుకున్నాను. మనసులో మాట ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను. ఎలాగైనా.. ఏదేమైనా.. చెప్పాలి. చెప్పి తీరాలి. నా మది నన్ను బలవంతం చేస్తుంది.


చెప్తే ఎలా అర్థం చేసుకుంటుందో..

తిరిగి ఏం సమాధానం ఇస్తుందో..

ఆమెకు ఆ ఉద్దేశం లేదని తేల్చి చెప్తే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు. ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను రాద్ధాంతం చేస్తున్నాయి. ఎటో చూస్తున్నాను.. ఏంటో ఆలోచిస్తున్నాను.. ఎంతో భారాన్ని మోస్తున్నాను..


ఇంతలో..

ఏదో నా చేతిని తాకినట్లు అనిపించింది. ఏంటా అని చూస్తే ఓ చిన్న చీటీని ఆమె నా చేతిలో పెట్టింది. అది చీటీ కాదు రాత్రి నేను కవిత రాసిన టిక్కెట్..


ఆమె వద్దకు ఎలా చేరిందా అన్న సందేహంతో ఆమె వైపు చూశాను. ఆమె నవ్వుతూ సిగ్గుతో తలదించకుంది. ఆ నవ్వుతో ఇప్పటి వరకు సాధించిన ప్రశ్నలన్నింటికి సరిపోయే సమాధానం దొరికింది.


ఆడపిల్ల ఇంతకన్నా ఏం చెప్తుంది అనుకున్నాను.

ఐదు నిమిషాల్లో నేను దిగేస్తాను అనగా

ఆ ఐదు నిమిషాలు సాగిన సంభాషణ మా ఇద్దరినీ ఒకటిగా చేసింది. ప్రణయానికి శ్రీకారం చుట్టిన మా ప్రయాణం పరిణయ మజిలీని చేరి మిథునంగా మారి చక్కని కథనంలా ముందుకు సాగుతుంది.


అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ..


తనే నా వాకిట మందారం..

నేనే తన పాపిట సింధూరం..

ఆమెతో నా ప్రయాణం మధురం.. మధురం..


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

రచయిత పరిచయం :

పేరు : వెంకు సనాతని

అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత

ఊరు : బాపట్ల

జిల్లా : గుంటూరు

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్


310 views0 comments

Comments


bottom of page