అమ్మ అమృత వాక్కులు
- Gadwala Somanna

- 1 day ago
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaAmruthaVakkulu, #అమ్మఅమృతవాక్కులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 153
Amma Amrutha Vakkulu - Somanna Gari Kavithalu Part 153 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14/12/2025
అమ్మ అమృత వాక్కులు - సోమన్న గారి కవితలు పార్ట్ 153 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అమ్మ అమృత వాక్కులు
--------------------------------------
కష్టాల కడలిలో
నష్టాల కొలిమిలో
ఉండాలోయ్! ధైర్యము
గగనమంత సహనము
కన్నోళ్ల సేవలో
వారి ఘన ప్రేమలో
వేయాలి ముందడుగు
కావాలి వార్కి గొడుగు
గురుదేవుల నీడలో
విజ్ఞానపు వనంలో
ఎదగాలి గొప్పగా
వెలగాలి తారగా
పెద్దవారి మాటలో
అనురాగపు కోటలో
ఒదిగి ఒదిగి ఉండాలి
గౌరవం చూపాలి

అమ్మ అక్షర సత్యాలు
-----------------------------
తప్పరాదు ధర్మము
చేయరాదు మోసము
మంచి పనులు చేయాలి
పదిమంది కోసము
నింపరాదు ద్వేషము
వేయరాదు వేషము
తలపెట్టకూడదోయ్!
ఏమాత్రం ద్రోహము
చెడ్డవారి స్నేహము
కాదు కాదు క్షేమము
పొరుగువారి బ్రతుకున
వెదకరాదు దోషము
పదే పదే వాదము
అధికమైన క్రోధము
తెచ్చునోయ్! నాశనము
చేరుపునోయి! బంధము

తగు మాత్రం భద్రం!
----------------------------------------
ఆశయంతో ఉన్నోడు
అభివృద్ధి కాంక్షిస్తాడు
ఆశ ఎక్కువైనోడు
దోచుకొనుటకు చూస్తాడు
ఆశలెక్కువైతేనే
అసమాధానం మదిలో
సంతృప్తి ఉంటేనే
సార్ధకత జీవితంలో
దుఖానికి కారణము
పరికింపగ కోరికలు
నియంత్రణ లేకపోతే
కకావికలమే బ్రతుకులు
తగు మాత్రము కోరితే
బ్రతుకుంతా హాయి హాయి
కోరికలు గుర్రాలైతే
మనశ్శాంతి శూన్యమోయి

మేలి మాటల ముత్యాలు
-----------------------------------------
పెద్దల మాట సద్దిమూట
విన్నారంటే పూల బాట
పెడ చెవిని పెట్టకపోతే
అదే భవితకు కంచుకోట
అమ్మానాన్నల ప్రేమలే
వారు చేసే త్యాగములే
అజరామరం చూడంగా
మన బాల్యమున చేయు సేవలే
కన్నోళ్ల గద్ధింపు మాటలు
ఉపాధ్యాయుల ఘన బోధనలు
అభివృద్ధికవి సోపానాలు
చక్కదిద్దును జీవితాలు
మంచినే తీసుకోవాలి
చెరుపునే తరిమికొట్టాలి
మహనీయుల మార్గంలోనే
ఆశయాలు సాధించాలి

మననం చేసుకో!
-------------------------------------------
అనుకున్న లక్ష్యాన్ని
అడ్డంకులు వచ్చినా
కష్టాలు తెచ్చినా
చేధించి తీరాలి
కన్నోళ్ల త్యాగాన్ని
వారు చూపు మార్గాన్ని
గుర్తించుకోవాలి
గౌరవం చూపాలి
పెద్దోళ్ల మాటలను
గురుదేవుల బోధలను
మనసులో నిలపాలి
భవిత బాగు పడాలి
మంచినే గ్రహించాలి
క్షమ గుణం చాటాలి
వైరాన్ని తరిమేసి
ప్రేమగా బ్రతకాలి

గద్వాల సోమన్న




Comments