top of page
Original.png

మజిలీలు


జీవితంలోని వివిధ మజిలీలను, అనుభవాలను, బంధాలను ప్రతిబింబించే స్ఫూర్తిదాయక దృశ్యం
జీవితంలోని వివిధ మజిలీలను, అనుభవాలను, బంధాలను ప్రతిబింబించే స్ఫూర్తిదాయక దృశ్యం

Majileelu - Telugu Poem | A. Annapurna

మజిలీలు - తెలుగు కవిత | ఏ. అన్నపూర్ణ(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

Published in manatelugukathalu.com on 24/07/2026


జీవితం ఒక నిరంతర ప్రయాణం. ప్రతి మజిలీ ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త పాఠాన్ని మనకు అందిస్తుంది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి ఎదుర్కొనే మార్పులు, బంధాలు, జ్ఞాపకాలు, సవాళ్లు, ఆశలు, అనుభవాల సారాంశాన్ని హృదయాన్ని తాకే పదాలతో చెప్పిన తాత్విక కవితే "మజిలీలు".


జీవన యానంలో మజిలీలు ఎన్నో.

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, మరెక్కడో చదివి, వేరొక చోట నివసిస్తాము.

బాల్యం, కౌమారం, యవ్వనం, నడివయసు దశలు దాటి ఎన్నో అనుభూతులు పోగుచేసుకుంటాము.

పిల్లల చదువులు, వారి అభివృద్ధి కోసం పాటుపడతాము; 

మారుతున్న ప్రపంచానికి ప్రతీకలు వారు.


కొత్త చోట నూతన పరిచయాలు, గతించిన జ్ఞాపకాలను పంచుకుంటాము; వినోదాలు, విహారాలు, వేడుకలతో కొంతకాలం గడుస్తుంది.


ఆరోగ్య సూత్రాలతో ప్రయోగాలు చేయడం, నడక పేరుతో ప్రకృతిని ఆస్వాదించడం.


జీవితం పూలబాట కాదు సుమా అంటూ కలవరపరిచే సంఘటనలు కొన్ని, జీవితానికి అర్థం చెబుతాయి.


అన్నీ అధికమించగల స్థైర్యం, ధైర్యం అలవర్చుకుని మనుగడ సాగించాలి.


జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది.

మనిషి నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉంటాడు.

కొందరు దూరం అవుతారని దిగులు వద్దు, కొత్తగా చేరువ అయ్యేవారు ఉండొచ్చు.


మనుషులు దూరమైనా మనసులు దగ్గరగానే ఉంటాయి; దూరాభారాలు అయినా, దేశాంతరాలు అయినా, గాఢంగా అల్లుకున్న పొదరింటి బంధంలో అందరమూ బందీలమే!


=================================






Roju Chuse Andalu - Telugu Poem | A. Annapurna -

రోజూ చూసే అందాలు - తెలుగు కవిత | ఏ. అన్నపూర్ణ(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

Published in manatelugukathalu.com on 25/03/2026

రోజూ మనకు కనబడే  వింతలు  ...ఉషోదయంతో మొదలై

సాయం సంధ్యతో జతగట్టిన  అందాలు!

ఆకాశంలో మారే వర్ణాలను చూసారా ఎవరైనా

ఆస్వాదించే మనసుంటే ప్రతిరోజూ ఆనందమే!

మనసుకి సంతోషం కలిగినప్పుడు

అణువణువునా అందాలు కనిపిస్తాయి

కలతచెందిన మనసుకి రోజు భారంగా గడుస్తుంది

మనసుకి  గాయమైతే ప్రకృతికూడా రోదిస్తున్నట్టు అనిపిస్తుంది

నిశిరాత్రిలో కమ్ముకున్న మంచుతెరలు

సూర్యోదయంతో కరిగి హరిత పత్రాలపై బిందువులై మెరుస్తాయి

ఈ అందాలను చూస్తుంటే మైమరచి పోతాము  

 చీకటి ముసురుకునే సంధ్యవేళ మిణుకుమంటూ

ఆకాశంలో మెరిసే నక్షత్రాలు ఎంత అందాన్ని పంచుతాయో

మనసుకి ఆహ్లాదం కనులకు విందు రేపటిపై ఆశ కలిగిస్తాయి

అమావాస్యరోజుల్లో చుక్కలు కొలువుతీరి చక్కదనాలు ప్రదర్శిస్తే

పున్నమి రోజులలో చంద్రుడు వారిని అక్కున చేర్చుకుంటాడు

మనిషి మనుగడకు సూర్య చంద్రులు ప్రక్రుతి సహకరిస్తాయి

వాటిపట్ల మానవజాతి ,అన్నిప్రాణులు కృతజ్ఞత కలిగి ఉంటూ

పర్యావరణాన్ని కాపాడుకోవటం మన అందరి కర్తవ్యమ్!



------------------------------------------------------------------------------






Pula Manasu Antharangam - Telugu Poem | A. Annapurna - పూల మనసు అంతరంగం - తెలుగు కవిత | ఏ. అన్నపూర్ణ(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

Published in manatelugukathalu.com on 16/03/2026


''అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం...'' అన్నాడో కవి.


అక్షరాలా ఇది నిజం!


నీటిలో ఈదులాడే రంగు రంగు చేపలున్న నీటి తొట్టెను తెచ్చి పెట్టి రోజూ


వాటిని చూస్తుంటే కాలమే తెలియదు!


ఒక మొక్కను నాటి, నీరు పోసి, అది చిగురులు వేసి, మొగ్గలు తొడిగితే


చెప్పలేని మమకారం!


గాలివాటానికి కొట్టుకువచ్చే గింజలు, వర్షం నీరు తగలగానే మొలకెత్తిన గడ్డిపూలే


అయినా ఎన్నెన్నో రంగులతో హొయలు పోతూ ఉంటాయి!


అందంగా లేకపోవచ్చు, ఊరేదో పేరేదో తెలియకపోవచ్చు, దాన్ని ఎవరూ పట్టించుకోకపోవచ్చు,


కానీ పరిమళం వెదజల్లి దగ్గరకు రప్పించుకుంటాయి!


పూల రాణి గులాబీ అంటారు, కానీ నీటిలోని తామర పూవులు, శ్రావణంలో పూసే చామంతులు


తక్కువా? దేని అందం దానిదే కదా!


భ్రమరానికి తేడా లేదు, తేనె కోసం వెతుకుతుంది, మనసైన వాడు తాకితే చాలని


మురిసిపోతాయి పూల కన్నెలు!


అందాల ఆరబోత పూలకు సహజం, ఎవరైనా పులకరించి పోతారు, కొందరు అలంకరణకు వాడితే,


మరికొందరు చెట్టుకే వదిలేసి సంతోషపడతారు!


ప్రకృతి వరప్రసాదాలు వాడుకోవడంలో మనుషులు రకరకాలుగా ఉంటారు.


కొందరు మంచికి ప్రాధాన్యం ఇస్తే, మరికొందరు నిర్దయగా నాశనం చేస్తారు.


ఏదైనా భరిస్తుంది, 'నా పుట్టుక ధన్యం' అనుకుంటుంది!



******************* 

-ఏ. అన్నపూర్ణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page