
'Amma Avatharam' - New Telugu Story Written By Pitta Gopi
'అమ్మ అవతారం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"ఏమండీ.. ఈరోజు ఆఫీసు సెలవు కదా.. ఎక్కడికి బయలుదేరారు" ఆశ్చర్యంగా అడిగింది భార్య సుశీల కాంతరావుని.
"ఏమీ లేదే.. ఒక మగ పనిమనిషిని వెతికి తీసుకొద్దామని.." తల దువ్వుకుంటూ అంటాడు కాంతారావు.
"ఆ ముసల్ది ఉంది కదా.. అది చాలదా .. అన్నీ బాగానే చేస్తుందిగా" పనిమనిషి పై ఏదో కోపం ఉన్నట్లు అంటుంది.
"హే ఊరుకోవే.. తాను వింటే బాదపడుతుంది. ఇన్నాళ్లు తనని మనం ఎన్ని తిట్టాం, ఎంత అవమానించాం.. అయినా మన పిల్లల్ని, మనల్ని ఎప్పుడూ ప్రేమతోనే సేవ చేసింది. అసలు ఏనాడూ సెలవు అంటూ పెట్టకుండా పనిచేసింది. పాపం ముసల్ది అవుతోంది. ఇంకొకరిని తెస్తే తనను మనం తిట్టిన, ఆవమానించిన పాపాలు కడిగేసినట్లు అవుతుంది. నీకు దండం పెడతా కాదనకే" ఆంటాడు కాంతారావు.
"హ.. ఏం పాపాలులెండి.. తన ముఖం చూస్తేనే తిట్టాలనిపిస్తుంది. సరే వెళ్ళండి. మీకెందుకు అడ్డు చెప్పాలి" లోపలికెళ్తుంది.
అవన్నీ వంటగదిలో నుండి విన్న ముసలి పనిమనిషి కస్తూరి నోటికి కొంగు అడ్డం పెట్టుకుని ఎవరికి వినపడకుండా ఏడవసాగింది.
కొత్త పనివాడు వస్తాడు. తన పేరు రామయ్య గా సుశీల కు పరిచయం చేసుకుంటాడు.
సుశీల వంటగది వైపు చూసి "ఒసేయ్ ముసలి.. వంటగది లో ఏం చేస్తున్నావే.. ఇలా రా ఒకసారి" అంటుంది.
కస్తూరి రాగా..
"ఇదిగో ఇతను రామయ్య. నీకు తోడుగా ఉంటాడని మా ఆయన తీసుకొచ్చారు. నీలాగే మంచి నిజాయితీగా పని చేస్తాడని విన్నాను" అంటుంది.
ఇద్దరు పని వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు.
రామయ్య షాక్ తో "అమ్మగారు.. మీరా".. అనగానే ‘ఎవరికి చెప్పకు’ అన్నట్లు తల ఊపుతుంది కస్తూరి.
"ఏంటీ రామయ్య.. ఈవిడ నీకు తెలుసా" అంటుంది సుశీల.
తెలివి తెచ్చుకున్న రామయ్య "ఆ.. ఆ .. అది .. అది గతంలో మేము ఒకే ఇంటిలో పని చేశాం అమ్మగారు"
"సరే వెళ్ళండి..”
వంటగది లో కస్తూరి ని కూర్చోబెట్టి కాళ్ళు పడుతూ.. "ఏమైంది అమ్మగారు.. మీలాంటోళ్ళు ఇక్కడ".. ఏడుస్తూ అంటాడు.
రామయ్య ని ఓదార్చి జరిగింది చెప్తుంది.
కోపంతో ఊగిపోతూ "నాకు ఒక్క చాన్స్ ఇస్తే.. వాళ్ళకి బుద్ధి చెప్పి వస్తాను" అంటాడు
"వద్దులే. చివరి దశలో వాళ్ళతో గొడవలు ఎందుకు" అని సముదాయిస్తుంది.
ఒకరోజు బజారు కి వెళ్ళిన కస్తూరి ఇంటికి రాలేదు. ఇంట్లో మాత్రం ఏ వస్తువు చోరి కాలేదు. దీంతో ఆచూకీ కోసం రామయ్య నుండి ఆమె వివరాలు తెలుసుకుని ఇంటికి వెళ్లిన కాంతారావు ఆశ్చర్యపోయాడు.
ఇంద్ర భవనం లాంటి ఇళ్ళు వాళ్ళది.
‘రామయ్య పొరపాటున ఈ అడ్రస్ ఇవ్వలేదు కదా’ అని అనుకున్నాడు.
‘కస్తూరి నిలయం’ అని ఉండటంతో దైర్యం తెచ్చుకుని లోపలికెళ్ళాడు.
సోఫాలో కూర్చున్న ఇద్దరు ఆడపడుచులను "ఇక్కడ కస్తూరి గారు ఉన్నారా.. అండీ" అడిగాడు కాంతారావు.
"కస్తురా.. ఇంకేం కస్తూరి. ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా ఏళ్ళయింది" అంటుంది.
"ఏ.. మెల్లిగా మాట్లాడు. మీ ఆయన, మా ఆయన వినగల”రంటుంది మరో ఆడపడుచు.
వాళ్ళ మాటలు, గోడల పై ఫొటోలు చూసే సరికి మేటర్ కాంతారావు కి అర్థం అయింది.
ఇంటికి వెళ్ళి "అమ్మా .. అమ్మా" అని పిలవసాగాడు.
"ఏమండీ మతిపోయిందా.. అత్తగారు ఎప్పుడో పోతేను"
"లేదే. ఇన్నాళ్లు మనం ముసల్ది ముసల్ది అని తిట్టామే.. ఆవిడనే అమ్మ అని పిలిచాను" అంటూ జరిగింది బాదపడుతూ చెప్తాడు
"అయ్యయ్యో.. పెద్ద తప్పే చేశాం మనం. ఆవిడకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోలేకపోయాం. ఇప్పుడైనా తెలుసుకుందాం" అంటుంది.
రామయ్య ని పిలిచి "రామయ్య.. నీకు కస్తూరి అమ్మగారు గూర్చి అంతా తెలుసా"
ఆశ్చర్యం గా తెలియదంటాడు.
"అబద్ధం చెప్పకు. గతంలో నువ్వు ఆమె ఇంట్లో పనిచేశావ్ అని నాకు తెలుసు. ఆమె గూర్చి నాకు తెలియాలి చెప్పు" అంటాడు.
ఏడుస్తూ "పూటగడవని నాకు పని ఇప్పించి నలుగురు కొడుకులు, భర్తతో ఇంద్ర భవనం లాంటి ఇంట్లో ఆమె మహలక్ష్మి .
నలుగురు కొడుకులకు తల్లి ఈమె, తొలుత ఇద్దరు కవలలు, రెండో కాన్పులో ఇద్దరు కవలలు.
కస్తురమ్మకు పెళ్ళి అయి పదిరోజులకే నా పరిస్థితి చూసి పనిలో పెట్టుకుని బతుకు దారి చూపిన దేవత.
పిల్లలను పెంచిన విధానంలో ఏ తల్లి కి సాటిరాదు.
అలాంటి తల్లి ని పెళ్ళి అయ్యాక భార్య మాటలకు, పరిస్థితి లకు లొంగిపోయి ఈ పరిస్థితి తెచ్చారు.
నీకు తల్లి కావాలా .. భార్య కావాలా అనే ఆప్షన్లు ఆ కోడళ్ళు తన కొడుకులకు ఇస్తే భార్య నే కావాలన్నారు. వారిష్టం ప్రకారమే ప్రేమ పెళ్ళి చేస్తే.. చివరకు ఇలా తలదన్నారు ఆ కొడుకులు.
పిల్లల చిన్నప్పుడే తండ్రి పోతే, తండ్రి లేని లోటుని ఆ తల్లి భర్త చేస్తే.. ‘ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే బయటకు వెళ్ళిపో’ అనే మాటను వాళ్ళు కానుకగా ఇచ్చారు. అందుకే ఆమె ఇంటి నుండి వచ్చి ఇక్కడ చేరింది" అని కన్నీరు పెట్టుకున్నాడు రామయ్య.
"అంతేకాదు. ఆమె లేని ఇంట్లో పనిచేయటానికి మనసు రాక పని మానుకోగా చాలా ఏళ్ళ తర్వాత మీ ఇంట్లో పని కుదిరింది. ఆమె సూచనలు మెరకే మీకు చెప్పలేదు" అన్నాడు.
ఆ మాటలకు సుశీల, కాంతారావు తీవ్ర భావోద్వేగం చెందారు.
ఇంతలో ఇంటి ముందుకు ఓ పోలీసు వచ్చి "మీ ఇంట్లో పని చేసిన ఆవిడ చనిపోయింది. సొంత వాళ్ళు ఎవరో తెలియరాలేదు. అందుకే మీ అనుమతి ఉంటే ఇక్కడ కి తీసుకొస్తాం. లేదంటే అనాథ శవంగా అంత్యక్రియలు చేస్తా" మన్నారు.
"వద్దు వద్దు.. ఆ పని చేయొద్దు. నా తల్లి పోయినప్పుడు నాకు ఊహ తెలియదు. ఈమె నా ఇంట్లో నాకు, నా పిల్లలకు, భార్యకు ఎంతో సేవ చేసింది . ఆమెను నా తల్లిగా భావించి అంతిమ సంస్కారాలు చేస్తాను. ఆమెను నాకు అప్పగించండి" అంటాడు.
బంధుమిత్రులను పిలిచి ఆమె పరిస్థితి ని చెప్పి సొంత కొడుకు గా, సొంత కూతురు గా సుశీల, కాంతారావు కన్నీరు పెట్టుకుని పుట్టెడు దుఃఖం తో చితికి నిప్పు పెడతాడు.
కానీ ఆమెను పెట్టిన బాధలు, ఆ పిలుపులు కాంతారావు మనసు నుంచి పోలేదు.
ఆమె వంటగది లో తన డైరిలో ఇలా రాసింది.
"బాబు కాంతారావు.. కొడుకులు చేసిన గాయంను నీ ఇంట్లో నాకు కాసంత చోటు, తిండి పెట్టి నయం చేశావు. నా గూర్చి నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు బాధపడతావని నాకు తెలుసు.
సొంత కొడుకులు, సొంత కోడళ్ళు ఇంట్లో నాకు పెట్టిన బాధ అవమానం కంటే నువ్వు నొప్పించినది చిటికెడు. ఆస్తులు రాసిస్తే అమ్మని చూసుకోటానికి ఏ అడ్డంకులు ఉండవు, లేకపోతే ఆస్తుల కోసం అమ్మను బలితీసుకునే పరిస్థితి వస్తే.. అంటు నా భర్త చివరి రోజుల్లో ఆస్తులు రాయించుకున్నారు.
పెళ్ళాం పిల్లలతో రోడ్డున ఉన్న రామయ్య కు నేను పని కల్పించినందుకు అతను నాకు అపార గౌరవం ఇచ్చాడు. అది విశ్వాసం అంటే..
నా కర్మకాండలు నువ్వే చేస్తావని నాకు తెలుసు. ఎలా అంటే.. నన్ను తిట్టినా అవమానించినా.. నీ మనసు సున్నితమైనదని, సాటి మనిషి కోసం ఆలోచిస్తుందని నాకు తెలుసు. నిజంగా అది జరిగితే మరో జన్మ అంటూ ఉంటే.. మీలాంటోళ్ళు కు అమ్మ అవతారం ఎత్తుతా తప్పకుండా”
ఈ బాధలనుంచి ప్రశాంతత కోసం "కస్తూరి అమ్మ" పేరు తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నేటికీ కొనసాగిస్తున్నాడు కాంతారావు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
@user-lx2bb3on5h • 1 hour ago
సూపర్