top of page

ఆజన్మాంతపు కృతజ్ఞత


'Ajanmanthapu Kruthajnatha' New Telugu Story


Written By Kotthapalli Udayababu


రచన : కొత్తపల్లి ఉదయబాబు(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది.


ఉదయం 6 గంటలకు మా ఊళ్లో బస్సు ఎక్కిన వాడిని బస్టాండ్ లో దిగి రిక్షా కట్టించుకుని రూమ్ కి వచ్చేసాను.


రేపే బిఈడి పరీక్షలు ప్రారంభం. మా రూమ్మేట్స్ ఐదుగురిలో ముగ్గురు వాళ్ల వాళ్ల స్థానాల్లో కూర్చుని సీరియస్ గా చదువుకుంటున్నారు.


"వావ్. వచ్చేసాడు మన హీరో. ప్రిపరేషన్ హాలిడేస్ లో అన్ని సబ్జెక్టులు బాగా చదివేసి ఉంటావు. మన అయిదుగురిలో నీదే ఫస్ట్ మార్క్." అన్నాడు వెంకటరత్నం.


నాకు ఒళ్ళు మండింది."భూషణం రాలేదా ఇంకా?" అడిగాను.


"అతని ఊరి మీదుగానే కదా నీ బస్ వచ్చేది..... మీ ఇద్దరు కలిసి వస్తారు అనుకుంటున్నాం" అన్నాడు నటరాజ్.


"సరే మీ చదువు ఎందుకులే పాడు చేసుకుంటారు కానీ బాగా చదవండి." అనే బట్టలు మార్చుకుని కాళ్లు చేతులు కడుక్కుని వచ్చి నేను తెచ్చిన బ్రీఫ్ కేస్ ముందు కూర్చున్నాను.


అంతలోనే భూషణం కూడా రిక్షా దిగి లోపలికి వచ్చాడు.


వస్తూనే" గురువుగారు.. మీరు ఒకసారి నాతో ఇలా పెరట్లోకి రండి. మీతో ఒక మాట మాట్లాడాలి." అన్నాడు.


మిగతా ముగ్గురు తనని పలకరించలేదు. అతనితో పాటు పెరట్లోకి వెళ్లా. చాలా ఆందోళనగా కనిపించాడు.

"ఏమైందండీ"అన్నాను.


"గురువుగారు. ఈ నెలరోజుల ప్రిపరేషన్ హాలిడేస్ లో ఒక్కరోజు పుస్తకం తీస్తే ఒట్టు. నేను పరీక్ష పేపర్ మీద ఒక్క అక్షరం కూడా పెట్టలేను. కానీ నేను పరీక్ష పాస్ అవ్వకపోతే మా నాన్నగారు నా భార్యని నా పిల్లలిద్దరిని నాతో సహా ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నన్ను ఎలాగైనా ఈ పరీక్ష మీరే పాస్ చేయించాలి. మీరు ఏం సలహా ఇచ్చినా పాటిస్తాను. నా పిల్లల మీద ఒట్టు" అతని కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కటే తక్కువ.


రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు అతను చెప్పిన మాట విని నేను నివ్వెర పోయాను.


ఎందుకంటే ప్రిపరేషన్ హాలిడేస్ కి పుస్తకాలన్నీ సర్దుకుని బ్రీఫ్ కేసులో పెట్టుకుని ఎలా వెళ్లానో నెల రోజుల తర్వాత నేనూ అలాగే తిరిగి వచ్చాను. దానికి కారణం నేను ఇంటికి వెళ్లిననాడే, కడుపులో కంతి తో పాటు గర్భసంచిని కూడా తీసేసి, పెద్ద ఆపరేషన్ జరిగిన అమ్మని ఆ రోజే నాన్నగారు వైజాగ్ నుంచి తీసుకొచ్చారు.


వాళ్లు వస్తున్నారు అన్న వార్త తెలుసుకున్న నేను బ్యాగ్ ఇంట్లో పెట్టి తాళం వేసి వెంటనే రైల్వే స్టేషన్ కి వెళ్లాను. అమ్మ ఆపరేషన్ చేసిన పొత్తికడుపును రెండు చేతులతో అదిమి పట్టుకుని అతి నెమ్మదిగా రైలు దిగింది. అక్కడి నుంచి మరో అరగంటలో ఇల్లు చేరాము.


ఇంటికి వచ్చాక అమ్మ సేవ మొదలైంది.

నాన్నగారు పోస్ట్మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు.


"ఈ సరిత ఆఫీస్ కి వచ్చిందంటే సరిగ్గా సమయం తొమ్మిది గంటలు అయింది అన్నమాట" అని అంతులేని కథ చిత్రంలో జయప్రద అన్నట్లుగా సరిగ్గా ఏడు గంటలకి పోస్ట్ ఆఫీస్ లోకి తాళాలు గుత్తితో అడుగుపెట్టడం ఆయన అలవాటు.


సమయపాలన పాటించడంలో సూర్యుడు తూర్పున ఆరు గంటల రెండు నిమిషాలకు ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితం.


అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చదువు మళ్లీ చదువుకోవచ్చు. కానీ అమ్మ ఆరోగ్యంలో తేడా వస్తే.... ఆ ఊహే భరించలేకపోయాను.


అమ్మ ఋణం ఎలాగూ తీర్చుకోలేము.. కనీసం నూలుపొగంత సేవ చేసి తీర్చుకునేటువంటి ఒక మంచి అవకాశం నాకు కల్పించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. చదువు విషయంలో నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నందుకు ఆ చదువుల తల్లికి క్షమాపణ చెప్పుకొని నా బాధ్యతలో ప్రవేశించాను.


అమ్మ కనీసం 45 రోజులపాటు బరువులు ఎత్తకూడదట... వంట చేయకూడదట.


నేను సెవెంత్ లో ఉండగానే అమ్మ నాకు వంట అంతా చేయడం నేర్పింది.


అమ్మ ఆపరేషన్ వార్త తెలుసుకున్న బంధువులందరూ ఒక్కొక్కరే రాసాగారు.


వచ్చిన బంధువులు మగవాళ్ళు అయితే కాఫీ తాగేసి వెళ్లిపోయేవారు. అదే పిన్నో, పెద్దమ్మో అత్తయ్య... ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు

"నీకు వచ్చిన వంట ఏదో చేసేయరా అబ్బాయి. అమ్మకి పక్కన నేను కూర్చుంటానుగా. ఈ సమయంలో అమ్మ పక్కన ఆడ తోడు ఉండడం ఎంతో అవసరం'' అని చెప్పి ఆమె పక్కన సెటిల్ అయిపోయేవారు.


ఆ రోజుల్లో టిఫిన్ అలవాటులే ఉండేవి కాదు.


పొద్దున్నే కాఫీ, మధ్యాహ్నం భోజనం, నాలుగు గంటల వేళ టీ, సాయంత్రం ఏడు గంటల వేళ భోజనం, రాత్రి 9 గంటలకు నిద్ర.


అందువల్ల ఈ నెల రోజులపాటు ఒక్క క్షణం కూడా పెట్టె తెరిచి పుస్తకం చదవడానికి అవకాశం లేకపోయింది నాకు.


ఎలా తీసుకువెళ్లిన పెట్టె అలాగే తీసుకుని బస్సు ఎక్కేసాను. ఒకవేళ 'పరీక్ష ఎందుకు ఫీల్ అయ్యావు రా అబ్బాయి?' అని నాన్నగారు అడిగితే 'నేను బాగానే రాసాను నాన్న... మరి ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు తెలియదు" అని దబాయింపు సమాధానం చెప్పడానికే నిర్ణయించుకున్నాను.


ఇలాంటి పరిస్థితుల్లో నాకు భూషణం అనేటువంటి ఒక చిరు దీపాన్ని చూపించినందుకు ఆ చదువుల తల్లికి మనస్సులో నమస్కరించుకున్నాను. ఇప్పుడు నాకోసం నేను చదవక్కలేదు అతని కోసం నేను చదవాలి. ఈ ఆలోచన రాగానే చాలా ధైర్యం వచ్చింది.


"ఏంటి సార్ నేను ఏదో నా సమస్యకు పరిష్కారం అడిగితే మీరు అలా ఆలోచిస్తూ ఉండిపోయారేమిటి?"


ఉలిక్కిపడి ఆలోచనలలోంచి ఒక్కసారి బయటికి వచ్చాను.


"అయితే నేను చెప్పినట్లు చేస్తారా మరి?"


"చెయ్యకపోతే పిల్లల తండ్రి అని కూడా చూడొద్దు. లాగి లెంపకాయ కొట్టేయండి. నేను తప్పు చేస్తే బాగు చేయడం స్నేహ ధర్మం లో భాగమే కదా" అన్నాడు భూషణం ఏడవలేక నవ్వుతూ.


"భోజనం చేశారా మరి'' అడిగాను

''నేను పొద్దున్న మీ బస్సునే క్యాచ్ చేద్దాం అనుకున్నాను... కానీ మా పాపకి జ్వరంగా ఉండడంతో కొద్దిగా లేట్ అయి బస్సు మిస్ అయ్యాను. అందుకని భోజనం చేసే అవకాశం లేకపోయింది" అన్నాడు భూషణం


''పదండి. మెస్ లో భోంచేసి వచ్చేద్దాం'' అన్నాను. వెంటనే మెస్ కి వెళ్లి భోజనం చేసి వచ్చాం. భోజనం చేస్తున్నంతసేపు ఎలా ఈ పరీక్షలు గట్టెక్కాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను.


నాన్నగారు నాకు నేర్పిన పుస్తక పఠనం గుర్తొచ్చింది.


''ఎక్కడ ఎలాంటి పుస్తకం దొరికినా చదివే అలవాటు చేసుకో. ఆపుస్తకం నుంచి నువ్వు ఏం గ్రహించావో ఒక నోట్స్ లో రాసుకో... మంచి గ్రహిస్తే మంచి రాయి, చెడు గ్రహిస్తే ఆ గ్రహించిన చెడే రాసుకో. దానివల్ల నీకు మంచి చెడు తెలుస్తాయి. దానికన్నా ముందు పుస్తక పఠనం వల్ల మనిషిలో ఓర్పు, సహనం పెరిగి చెడు అలవాట్లకు పోకుండా ఉండటం, సమయం వృధా చేసుకోకుండా ఉండటం అలవడతాయి. అర్థమైందా?'' అని దగ్గరుండి అలవాటు చేశారు. అది ఈనాడు నాకు ఒక వ్యసనంగా మారిపోయింది.


సమయం రెండున్నర అయింది. రేపు ఉదయం 8 గంటలకు వంద మార్కుల పరీక్ష. రేపు సబ్జెక్టులో ఒక్క వాక్యం రాదు నాకు గాని, అతనికి గాని. ఏం చేయాలో ఆ చదువుల తల్లి నాకు మెరుపులాంటి ఆలోచనలతో సూచించింది.


"నేను మీకు ఒక పద్ధతి చెప్తాను. ఆ పద్ధతి యధాతధం ఫాలో అవ్వాలి. ఏకాగ్రత చాలా అవసరం. దృష్టి ఒక్క క్షణం కూడా పక్కకెళ్లకూడదు. మీరు అలా చేస్తానంటే నా వంతు సహాయం చేస్తాను" అన్నాను.


"మీతో చెప్పాను కదా ఈ పరీక్ష నేను ఫెయిల్ అయితే మా నాన్నగారు బిడ్డల తండ్రి అని కూడా చూడకుండా బాదుతారు. అది కాదు నా బాధ. మా కులంలో తండ్రి మాట విననందుకు నన్ను వెలివేస్తారు. అందుకోసమేనా మీరు చెప్పినట్టు చేస్తాను" అన్నాడు భూషణం ఆందోళనతో.


నేను నా పథకం అంతా చెప్పాను.

అంతా విన్నాక భూషణం శిక్షణ కోసం సిద్ధమైన సైనికుడిలా తను గూట్లో రేపు పరీక్ష పాఠ్య పుస్తకం, పెన్ను, రఫ్ నోట్ బుక్ తెచ్చుకుని నా ప్లేస్ లోకి వచ్చాడు.


అప్పటికే చాప మీద సిద్ధంగా కూర్చున్న నా ముందు బాసిం మఠం వేసుకుని నిటారుగా కూర్చుని "నేను సిద్ధం సార్" అన్నాడు!


నా పథకాన్ని ఆచరణలో పెట్టాను. మేము చదవవలసిన పాఠ్యపుస్తకాలు అన్ని 200 పేజీల లోపే.


నా పథకంలో భాగంగా అతడు మొదటి పాఠంలో మొదటి పేరా చదవాలి. దానిని నేను శ్రద్ధగా విని అందులోని ముఖ్యమైన పాయింట్లను అతనికి నేను గుర్తుపెట్టుకుని చెబుతాను. వాటిని అతడు మళ్ళీ యథార్థంగా తిరిగి నాకు చెప్పాలి.


అంటే ఇద్దరమూ కూడా ఆ పేరాలలో ముఖ్యమైన విషయాన్ని రెండు సార్లు వింటున్నామన్నమాట. వాటిని గుర్తు పెట్టుకోవాలి. మరీ కఠినమైన పదజాలం ఉంటే కనుక పుస్తకంలో నోట్ చేసుకోవాలి. అలా ఆ పాఠంలో ప్రతి పేరా అతని చదవాలి నేను చెప్పాలి. నేను చెప్పింది విని అతని మళ్ళీ చెప్పాలి.


అలా అన్ని పాఠాలు పూర్తి చేయాలి... అది రేపు ఉదయం 5 గంటల లోపుగా.


సాయంత్రం నాలుగు గంటలకు మొదలుపెట్టాం. 10 గంటల వరకు చదివాం.

అప్పుడు లేచి వెళ్లి దగ్గర్లో ఉన్న టీ కొట్టుకు వెళ్లి రెండు వేడి వేడి కప్పులు టీ తాగేసి వచ్చాము.


మళ్లీ సరిగ్గా 11 గంటలకు చదవడం మొదలుపెట్టాం. అనవసరమైన పేరాలను వదిలేసి అన్ని పాఠాలు ఉదయం 4 గంటలకల్లా పూర్తి చేసాము.


సరిగ్గా ఐదున్నర గంటలకు మెలకువ వ చ్చేలా అలారం పెట్టుకుని ఆ గంటన్నర పడుకున్నాము.

5:30 నుంచి 6 గంటలకు లేచి స్నానాలు పూర్తి చేసుకుని కాలేజీకి వెళ్లడానికి సిద్ధమయ్యాం.


అప్పుడు భూషణాన్ని దగ్గరికి పిలిచి ఆరున్నర నుంచి 7:30 వరకు మొత్తం పేజీలు తిప్పుతూ రివిజన్ చేసుకున్నాం.


మిగతా ముగ్గురు ఏడు గంటలకే కాలేజీకి వెళ్లిపోయారు.


మేము టిఫిన్ చేసేసి పరీక్ష ప్రారంభానికి ఐదు నిమిషాలకు ముందుగా ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొని మా రూముల్లోకి హాల్ టికెట్ తో వెళ్ళిపోయాం.


11 గంటలకు పరీక్ష పూర్తయ్యాక బయటకు వచ్చాము. అప్పటికే భూషణం నా కోసం నిరీక్షిస్తున్నాడు.


"ఎలా రాశారు?" అని అడిగాను నా సంతోషాన్ని కనబడనియ్యకుండా.


"కచ్చితంగా పాస్ అయిపోతాను సార్ మీరు ఈ మార్గంలో నన్ను తీసుకువెళ్లకపోతే నా బతుకు బస్టాండ్ అయిపోయేది." అన్నాడు నవ్వుతూ.


నేను చాలా బాగా రాశాను కనీసం 60 శాతం పైన వస్తాయి.


"మీకే నా కృతజ్ఞతలు భూషణం" మనసులో కృతజ్ఞతాభవంగా అనుకొని "అప్పుడే అయిపోలేదు. ఇంకా అయిదు పరీక్షలు ఉన్నాయి. అసలు ముసళ్ళ పండగ అంతా ముందే ఉంది. భోజనం చేసి సరిగ్గా రెండు టు 3. 40 వరకు పడుకోవాలి. తర్వాత లేచి టీ తాగి సరిగ్గా నాలుగు గంటలకు రేపటి పరీక్షకు ఈరోజు మాదిరిగానే చదవడం మొదలు పెట్టాలి. పదండి ఆకలేస్తుంది. భోజనం చేసి రూమ్ కి వెళ్దాం" అన్నాను.


ఇద్దరం సంతోషంగా రూమ్ కి వెళ్లాం.


మొదటి నాలుగు పరీక్షలు మా ఇద్దరికీ కామన్. ఎందుకంటే అతను బీకాం. అతని బోధన సబ్జెక్టు ఇంగ్లీషు, సోషల్.

నేను బిఎస్సి. నా బోధనా సబ్జెక్టులు గణితం, భౌతిక శాస్త్రం.


ఇదే పద్ధతి పాటిస్తూ నాలుగు పరీక్షలు అద్భుతంగా రాసాను నేను భూషణం తోడుగా ఉండడం వల్ల. తానూ కూడా నాలుగు పరీక్షలు పాస్ అవుతానన్న ఆత్మవిశ్వాసం అతని వెన్నుపూస నిటారుదనంలో కనిపించింది నాకు.


నాల్గవరోజు పరీక్ష అయ్యాక అడిగాడు భూషణం. ఇద్దరం భోజనం చేసి రూమ్ కి వచ్చి హాయిగా నిద్రపోయాం. కారణం తరువాత నాలుగు రోజులు సెలవు. అయిదవరోజున, ఆ మరునాడు ఎవరి గ్రూప్ పరీక్షలు వాళ్ళకి.


అయిదు గంటలకు మెలకువ వచ్చింది.


''ఈ నాలుగు పరీక్షలు మన ఇద్దరికీ ఉమ్మడివే కాబట్టి రాసేసాం. మరి గ్రూప్ పరీక్షలు ఏంచేద్దాం సర్? '' అడిగాడు భూషణం.


''నాలుగు రోజుల టైం ఉందిగా. '' అన్నాను.


''మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట సర్. ''


''ఏమిటది?''


''ఇంటికి వెళ్తే పిల్లలు ఒక్క సినిమాకు కూడా వెళ్లనివ్వరు సర్. మీరేమీ అనుకోనంటే సినిమాకు వెళ్ళొద్దాం సర్. కంటినిండా నిద్రపోయి నాలుగు రోజులైంది. రెండు రోజులు సినిమాలు చూసి తరువాతి రెండు రోజులు చదువుకుందాం. ప్లీజ్. మళ్ళీ జీవితంలో ఎపుడు కలుస్తామో... సినిమా ఖర్చులు మాత్రం నావైయితేనే వెళదాం సర్. '' అన్నాడు భూషణం.


"అయితే ఇప్పుడే ఫస్ట్ షో కి వెళ్దాం" అన్నాను ఏమంటాడో అని. అతను ఉత్సాహంగా కదిలాడు.


**


ఏంటో ఈసారి నా బుద్ధి కూడా మందగించింది. రెండు రోజులు అనుకున్నవాళ్ళం మూడు రోజులు అదేవిధంగా చేసేశాం.


నేను కిందటి నెలలో అమ్మ సేవలో మునిగిపోయానేమో అతనితోపాటు మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో... చూసి రూమ్ కి వచ్చేసి పొద్దున 8:00 వరకు పడుకోవడం టిఫిన్ తినేసి మళ్ళీ పడుకోవడం భోజనానికి వెళ్లి రావడం... అక్కడ నుంచి మళ్లీ మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో.


వరుసగా మూడు మూళ్ళు 9 కొత్త సినిమాలు చూసేసాం. నాలుగో రోజంతా పడక వేసాము.

మధ్యాహ్నం భోజనం చేశాక అప్పుడు గుర్తు వచ్చింది రేపు అంటే ఐదవ రోజు ఎనిమిది గంటలకు ఉదయం పరీక్ష అని.


అతనివి నావి ఒకే పరీక్షలు కాదు కదా... అతన్ని సినిమాలకు వెళ్ళనిచ్చి నా గ్రూప్ సబ్జెక్ట్ నేను చదువుకుంటే బాగుండేది... ఇంత పశువులా ప్రవర్తించాలనే మిటి అని నన్ను నేను నెత్తిమీద కొట్టుకున్నాను.


ఒక్క అక్షరముక్కరాదు... రేపటి పేపరు.


భూషణం కూడా సినిమా మైకం నుంచి బయటపడ్డాడు.


"సార్ రేపు ఉదయమే పరీక్ష. నా సినిమా పిచ్చితో మీ చదువు కూడా పాడు చేశాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి సార్" అని కాళ్ళ మీద పడబోయాడు.


"తప్పు మీ ఒక్కడిదే కాదు. మీకు చెప్పాల్సిన నేను మీతో పాటు గడ్డి తిన్నాను గా. పోన్లెండి నాలుగు పరీక్షలు ఎలా రాసామో ఈ రెండు కూడా అలాగే రాద్దాం. లేచి సిద్ధమైతే టీ తాగి వచ్చి నాలుగు గంటలకి చదువు మొదలు పెడదాం. అయితే మొన్నట్లా కాకుండా ఎవరి పుస్తకాలు వాళ్ళు చదువుకోవాలి అంతే. లేకపోతే ఈ పరీక్ష పాస్ అయ్యేది లేదు" అన్నాను.


భూషణం ఏమనుకున్నాడో ఏమో... నాతో పాటు సమానంగా శ్రద్ధగా చదివాడు. ఈ రెండు పరీక్షలు కూడా బాగానే రాశాం.


పరీక్ష పూర్తి అయ్యాక బయటికి వస్తూ"మీ దయవల్ల అన్ని పరీక్షలు పాస్ అవుతానని నమ్మకం ఉంది సార్... నా దురదృష్టం నన్ను వెక్కిరించకపోతే" అన్నాడు భూషణం నా చేతులు పట్టుకుని.


"మీరు తప్పకుండా పాస్ అవుతారు. మనం ఇలా చదివిన గుర్తుగా ఒక ఫోటో తీయించుకుందాం. ముందు ఫోటో స్టూడియో కి వెళ్దాం పదండి" అని చెప్పి ఫోటో స్టూడియో కి వెళ్లి ఫోటో తీయించుకున్నాం.


"ఈసారి కలుస్తామో లేదో ఎందుకంటే మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తేదీలు వేరు నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వేరు" అన్నాడు భూషణం.


"ఫలితాలు వచ్చాక తప్పనిసరిగా కలుద్దాం" అన్నాను నేను.


***


ప్రాక్టికల్స్ ఎవరికి వాళ్లను విడివిడిగా వచ్చి పరీక్షలు రాసి మా వాళ్లకు తిరిగి వెళ్ళిపోయాం.


పరీక్ష ఫలితాలు వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో, భూషణం సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాం.


ఒకరోజు భూషణం పళ్ళబుట్టతో సహా నా గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. వెనుక తన భార్య పిల్లలు కూడా ఉన్నారు.


అందరూ నా కాళ్లకు నమస్కరించబోయారు.


నేను చటుక్కున కాళ్ళు వెనక్కి తీసుకున్నాను.


"ఏమిటీ పిచ్చి పని భూషణం గారు. నిజానికి పుస్తకం చదవడం అనేటువంటి నా హాబీని మీ మీద బలవంతంగా రుద్ది, మీలాగే అక్షరం ముక్క చదవని నేను, మీరు నాకు తోడుగా ఉండడంతో ఇద్దరము పరీక్షలు పాస్ అయ్యాము." అనుకొని మనసులో అనుకున్న నేను -


"ఇందులో భగవంతుని కటాక్షం తప్ప నేను చేసింది ఏమీ లేదు భూషణం గారు... ఇదంతా మీ పిల్లలు చేసుకున్న పుణ్యం" అని భూషణాన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాను.


అనంతరం అందరం కలిసి భోజనాలు చేసాక గృహస్తు ధర్మంగా వాళ్లందరికీ బట్టలు పెట్టి పంపించాను.


****


ఆరు నెలల తర్వాత ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి.


తాను ఉంటున్న మండలంలో సోషల్ టీచర్ గా పోస్టింగ్ వచ్చిందని భూషణం సంతోషంగా నాకు ఉత్తరం రాసాడు.


నా మండలంలో నాకు లెక్కల మాస్టర్ గా ఉద్యోగం వచ్చిందని నేను అతనికి ఉత్తరం రాసాను.


***


డ్యూటీ లో చేరిన మొదటి రోజు నుంచి బోర్డు మీదకి లెక్క చేయడానికి వెళ్లే ముందు ఆ జన్మాంతపు కృతజ్ఞతగా నా చెయ్యి జేబులోకి వెళ్లి నా పర్సును బయటకు తీస్తుంది.


పర్సు తెరుచుకోగానే నేను భద్రంగా దాచుకున్న ఫోటోలో నా పక్కన నిలబడిన భూషణం"నేను మీకు తోడుంటాను మాస్టారు" అని చెప్పినట్టు అనిపించగానే పాఠం మొదలు పెడతాను.


నేను బ్రతికి ఉన్నంతవరకు ఆ కృతజ్ఞత ఆ జన్మాంతపు కృతజ్ఞతగానే ఉంటుంది.


సమాప్తం

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link

Twitter Linkమనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్60 views0 comments

Comments


bottom of page