top of page

అంతఃశత్రువుని అంతం చేద్దాం

#RCKumar #శ్రీరామచంద్రకుమార్ #కోపం #అంతఃశత్రువు #TeluguArticle

ree

Antaahsatruvuni Antham Cheddam - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 31/07/2025

అంతఃశత్రువుని అంతం చేద్దాం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


కోపం, క్రోధం, ఆగ్రహం ఈ మూడు ఒకటేనా ? కోపం తాటాకు మంటలాగా క్షణికం. క్రోధం చింతనిప్పుల్లాగా తీవ్రంగా దీర్ఘకాలంగా ఉంటుంది. సమాజ హితానికి చేసే నిరసనలు, ధర్నాలు, సత్యాగ్రహం లాంటివి ధర్మభద్దమైన ఆగ్రహాలు. పని జరగడం వరకు, అవసరం ఉన్న మేరకే కోపాన్ని ప్రదర్శించేవి. కార్యం నెరవేరగానే ఆగ్రహాన్ని మరిచిపోవడం జరుగుతుంది. ఎవరైనా మనకు నచ్చినట్లు ప్రవర్తించకపోయినా, మనల్ని విమర్శించినా లేదా ఎదురు తిరిగినా వారిపై మనకు కలిగే వ్యతిరేక భావమే కోపం. దానివల్ల ఎదుటివారిని దూషించటం లేదా దాడిచేయటం వంటి భావోద్రేకాలకు లోనై చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. ఉత్తముడికి కోపం అప్పటికప్పుడే మాయం అవుతుంది. మధ్యముడికి కోపం ఓ గడియ వరకు, అధముడికి ఒక రోజు వరకు, పాపిష్టి వాడి కోపం మాత్రం జీవితాంతం ఉంటుంది అన్నది పెద్దల మాట. 


కోపంతో కోల్పోయేది ఏమిటి 

------------------------------------

క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే కోపం, అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు రక్తనాళాలు, కణజాలం కుచించుకుపోయి గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కోపం దివ్యమైన మనస్సును అపవిత్రంగా మార్చి, మనిషి మనుగడను అధోగతి పాలు చేస్తుంది. కోపంలో ఉన్నా, ఉద్వేగం కలిగినా అటువంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సమాయత్త పరచే కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోనులు విడుదల అవుతాయి. దీనివల్ల బీపీ పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్ళూ చేతులకు రక్త ప్రసరణ ఎక్కువ కావటం, ఊపిరి ఎక్కువగా తీసుకోవటం వంటి లక్షణాలు కనపడతాయి. కోపం వచ్చినా, భయం వచ్చినా శరీరంలో వచ్చే మార్పులు, కనపడే లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. రోడ్డుపై ట్రాఫిక్ రద్దీలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇతర వాహనదారులు ఎవరైనా అడ్డు తగులుతున్నప్పుడు వారిపై ఎలా స్పందిస్తామనేది అప్పటి స్థితిగతులు, భావోద్రేకాలపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఒక ఉద్యోగిని అతని బాస్ నలుగురి ముందు కించపరిచినప్పుడు సహజంగానే కోపం కలుగుతుంది. అటువంటి సందర్భాలలో అవతలి వ్యక్తి మీద బాగా కక్ష పెంచుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా మారి ఒత్తిడికి బిపి పెరుగుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో సహజంగానే ప్రతికూల హార్మోన్లు విడుదలవుతాయి. అవి శరీరానికి చాలా హాని చేస్తాయి. పేదవాడి కోపం పెదవికి చేటు అనే సామెతలోని చేటు పేదవాడికే కాదు అన్ని వర్గాల వారికీ వర్తిస్తుంది. 


ఇతర జీవరాశుల్లో కోపతాపాలు 

------------------------------------------

కోపం మనకేనా, జీవరాసులు అన్నింటికీ వస్తుందా అంటే ఎటువంటి సందేహం లేకుండా జంతువులకి, పక్షులకి కూడా కోపం వస్తుంది. ఇతర జీవుల వల్ల తమ ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, ఆహారం మరియు లైంగిక విషయాలలో సాటి జీవులతో పోటీ ఏర్పడినప్పుడు అవి వాటిని ఒక సవాలుగా తీసుకుంటాయి. పోటీదారు తనకన్నా శక్తివంతమైనదిగా గుర్తిస్తే భయంతో దూరంగా పారిపోతాయి. పోటీదారు కాస్త బలహీనపడితే వాటిని బెదిరిస్తూ దబాయింపుకు దిగుతాయి. మనుషుల్లో కోపానికి కారణాలను పరిశీలిస్తే ప్రకృతి పరమయిన సహజ పరిస్థితుల (ప్రాణాపాయం, ఆహారం) కంటే కూడా సామాజిక పరిస్థితులే ప్రభావాన్ని చూపుతున్నాయి. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం, అహంభావం, నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం, వంటి అంశాలకు భంగం వాటిల్లినప్పుడు కోపం కలుగుతుంది. ఆ విధంగా ప్రదర్శించే కోపాలు రెండు రకాలుగా ఉంటాయి. అరవటం, తిట్టటం, అవమాన పర్చటం, చెయ్యి చేసుకోవడం, దాడి చేయడం, చేతికి అందిన వస్తువులను పగలగొట్టటం లాంటి చర్యలను క్రియాత్మక కోపంగా చెప్పుకోవచ్చు. అలగటం, మౌన పోరాటం, నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ లాంటి వాటిని మెతక కోపంగా పరిగణించవచ్చు. 


కోరికలు మరియు కోపాలు 

----------------------------------

కొందరు చిన్నచిన్న విషయాలకే అసహనంతో చికాకు పడుతుంటారు. ఇంకొందరు ఆవేశంతో గట్టిగా అరిచేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో విశ్లేషించుకుంటే భగవద్గీతలోని సాంఖ్యయోగంలో గల 62 వ శ్లోకంలో జవాబు దొరుకుతుంది. ఇంద్రియాలు విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారం, ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది. తీరని కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అదే అధ్యాయంలో 63వ శ్లోకంలో కృష్ణ భగవానుడి వివరణ ఉంటుంది. కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, (ఇంగిత జ్ఞానం కోల్పోవడం, విచక్షణా రాహిత్యం), బుద్ధి నాశనంతో మానవత్వం మంటకలిసి మనిషే నాశనం అవుతాడు. క్రోధం, అసహనం వంటి అవలక్షణాలతో తపోసంపన్నులైన ఋషులు కూడా అనేక సందర్భాలలో తప్పటడుగులు వేయడం మనకు తెలిసిందే. పాతిక సంవత్సరాలు తపస్సు చేసి కోపాన్ని జయించాను అని చెప్పుకునే సాధువుని ఎవరైనా నిజంగానే మీరు కోపాన్ని జయించారా అని మూడు నాలుగు సార్లు పదేపదే అడిగితే ఒంటి కాలు మీద లేచి చికాకుగా కోపంగా స్పందించడంతో ఆ మహానుభావుడు కోపాన్ని ఏ మేరకు జయించాడో అర్థమవుతుంది. 


తపస్సంపన్నుల కోపాలు పర్యవసానాలు 

-----------------------------------------------------

తనకు ఆతిథ్యం ఇవ్వకుండా తపో దీక్షలో ఉన్న శమీక మహర్షిపై కోపగించిన పరీక్షిత్తు మహారాజు రాజ్యాధికార మదంతో ఆయన మెడలో ఒక చచ్చిన పామును వేశాడు. ఆ విషయం తెలుసుకున్న శమీకుని కుమారుడు శృంగి తక్షకుడి కాటుతో పరీక్షిత్తు ప్రాణాలు వదులుగాక అని శపించాడు. కార్తవీర్యార్జునుడిపైన పరుశరాముడికి వచ్చిన కోపం యావత్తు క్షత్రియ జాతి పై క్రోధంగా మారి ఆ జాతి వినాశనంతో పాటు తన తపశ్శక్తిని కూడా బలితీసుకుంది. పరమభక్తుడైన అంబరీషుడిపై అకారణంగా కోపాన్ని చూపిన దుర్వాస మహర్షిపై విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అంబరీషుడు మాత్రం మంచితనంతో ఆ మహర్షిని సంరక్షించి చరిత్రలో భక్తాగ్రగణ్యుడుగా నిలిచిపోయాడు. ద్రోణుడు, ద్రుపదుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు, మంచి స్నేహితులు కానీ ద్రుపదుడు రాజు అయ్యాక, వారి స్నేహం విచ్ఛిన్నమైంది. ద్రోణుడు అర్జునుడి ద్వారా ద్రుపదుడిని ఓడించి, అతనికి అవమానం కలిగించాడు. దీనికి ప్రతీకార జ్వాలతో రగిలిపోయిన ద్రుపదుడు ద్రోణుడిని చంపడానికి యజ్ఞం చేసి ధృష్టద్యుమ్నుడిని కొడుకుగా పొందాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు ద్రుపదుని చంపగా, ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపాడు. ఆ విధంగా వారి కోపతాపాలు, ద్వేషాలు ఇరువురిని బలి తీసుకున్నాయి. సత్రయాగ సందర్భంలో శివుడు తనను గౌరవించలేదనే కక్షతో దక్షుడు తాను తలపెట్టిన యజ్ఞానికి కూతురు అల్లుడు అయిన శివపార్వతులను ఆహ్వానించలేదు. అయినా సతీదేవి అక్కడికి వెళ్లి యోగాగ్నిలో దగ్ధమైపోయింది. అది శివుడి ఆగ్రహానికి కారణమై దక్షుడి మరణానికి దారి తీసింది. చివరికి ధర్మరాజు కూడా ఒకానొక సందర్భంలో మిక్కిలి కోపానికి గురై అర్జునుడిని నిందించి వాడే. కార్యసిద్ధి కోసం కొన్ని సందర్భాలలో మహానుభావులు ప్రదర్శించిన కోపతాపాలలో అంతర్లీనంగా ఉన్న ధర్మ సూక్ష్మాల ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి. 


కోపం అనే అంతఃశత్రువుని జయించడం ఎలా ?

--------------------------------------------------------------

బాహ్య శత్రువులను జయించడం కన్నా అంత శత్రువులను జయించడమే కష్టం. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో కోపానిది రెండో స్థానం. అది వ్యక్తికి ప్రధానమైన అంతశ్శత్రువు. సుమతి శతక కర్త అందుకే అన్నారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ, చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము, తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ. ఒక వ్యక్తి మీద కోపం పెంచుకుంటే అతడు ఏం చెప్పినా, ఏంచేసినా తప్పే కనిపిస్తుంది. అసలు జరిగినదానికి అవతలి వ్యక్తికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. మనకు కోపం తెప్పించిన వ్యక్తిని క్షమించేస్తే మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది, రోగ నిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది. ఆవేశాన్ని దిగమించుకొని సంయమనంతో ఆలోచించి సహనంగా ప్రవర్తించి నిర్ణయం తీసుకునే శక్తి రావడానికి సాధన కావాలి. ‌ కోపాన్ని నియంత్రించడానికి ఒత్తిడిని తగ్గించడానికి ప్రధాన మార్గాలు యోగా, ప్రాణాయామం, వ్యాయామం, ధ్యానం. వాటివల్ల శరీరంలో ఎండార్ఫిన్ల వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి శరీరాన్ని మనసును రెండింటిని ప్రశాంతంగా ఉంచే విధంగా సహాయపడుతాయి. 


సామాజిక బాధ్యత 

------------------------

అందమైన సామాజిక జీవితం అనే ఒక పచ్చని తోటలో కోపం అనేది కలుపు మొక్కల వంటిది. వాటిని ఎప్పటికప్పుడు నిర్మూలించకపోతే అవి అందమైన అనుభూతులు అనే ఆ సుందర వనాన్ని కప్పేసి మనుషుల మనసులను చెదల పొదలుగా మార్చేస్తాయి. కోపంలో జీవించటం అంటే తాను విషాన్ని తాగి ఎదుటివ్యక్తి మరణించాలని కోరుకోవటం. ఎందుకంటే ఆ కోపం రగులుతూ, రగులుతూ తన అంతరంగాన్నే దహిస్తూ ఉంటుంది. తరచుగా కోపం తెచ్చుకునే వాళ్ళు బంధువులకు స్నేహితులకు దూరమవుతారు. ఆందోళన, వత్తిడి నిరాశ వంటి సమస్యలు తీవ్రమై ఆత్మహత్య ఆలోచనలు కూడా రావచ్చు. సుభాషితాల్లో "తస్మాత్ క్రోధం విసర్జయేత్" అన్న పదానికి అర్థం క్రోధాన్ని వెంటనే వదిలిపెట్టమని. ఎందుకంటే అన్ని అనర్థాలకూ, సంసార బంధనానికి, ధర్మ వినాశానికి క్రోధమే కారణం. అందువల్ల క్రోధమనే అవగుణాన్ని తప్పనిసరిగా వదిలివేయాలి. లేనిచో దివ్యమైన మనస్సును అపవిత్రంగా మార్చి, మనిషి మనుగడను అధోగతి పాలు చేస్తుంది. కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇరుగుపొరుగు ఎవరిమీదా వ్యక్తిగతంగా కోపమును పెంచుకోరాదు. సద్విమర్శ, భాద్యత, త్యాగ భావంతో కుటుంబ సభ్యుల మధ్యన తలెత్తే కోపమును కూల్ గా నియంత్రించు కోవచ్చు. అదేవిధంగా ప్రణాళిక, పారదర్శకత, చర్చలు, (కూర్చుని మాట్లాడుకోవడం) సామాజిక భాద్యత అనే పనిముట్లతో వ్యాపార భాగస్వాముల మధ్య, ఉద్యోగస్తుల మధ్య, రెండు వర్గాల మధ్య కోపోద్రిక్త పరిస్థితులను నివారించవచ్చు. 


సాధనతో సాధ్యము కానిది లేదు 

------------------------------------------

ఎవరైనా మనల్ని తీవ్రంగా విమర్శిస్తూ దూషిస్తుంటే, భగవంతుడు అతని రూపంలో మనకు, మన సహనానికి పరీక్ష పెడుతున్నాడు అని తెలుసుకోవాలి. సమయం చూసి వారి తొందరపాటు ప్రవర్తనని వారే గుర్తించే విధంగా తెలియజేయాలి. అంతేకానీ వెంటనే ఆవేశంగా స్పందించకూడదు. పైనుంచి చూస్తుంటే నీటిలో పయనించే బాతు ఎటువంటి ప్రయత్నం లేకుండా సాఫీగా తేలిపోతూ ముందుకెళుతున్నట్టు కనబడుతుంది. కానీ నీటి లోపల మనకు కనబడకుండా రెండు కాళ్లతో తెడ్డులా పెడలింగ్ చేస్తూ అది సాగుతుంది. మనం కూడా పైకి ప్రశాంతంగా స్థిరచిత్తంతో ఉంటూ, అంతర్గతంగా చేయవలసిన ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగాలి. మనసులో పుట్టిన కోపాన్ని పాము కుబుసం వదిలినట్టు వదిలిపెట్టాలి. ‌ క్రోధం అనే మంటను ఓర్పు అనే నీళ్లతో చల్లార్చాలి. ‌ అది మాట్లాడుకున్నంత సులువుగా పొందే లక్షణం మాత్రం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. సాధనతోనే క్రమంగా ఓర్పును నేర్పుగా అలవాటు చేసుకోవాలి. ‌ ఆ విధంగా అసహనానికి వీడ్కోలు చెప్పి సంతోషాన్ని స్వాగతిద్దాం.


కృష్ణం వందే జగద్గురుం 

***


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page