వర్ణాశ్రమ ధర్మాలు
- Rayala Sreeramachandrakumar

- Nov 3
- 6 min read
#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #వర్ణాశ్రమధర్మాలు, #బ్రాహ్మణత్వం, #TeluguDevotionalArticle
వర్ణాశ్రమ ధర్మాలు, బ్రాహ్మణత్వం
Varnasrama Dharmalu - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 03/11/2025
వర్ణాశ్రమ ధర్మాలు - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వర్ణ విభజన గురించి చెప్పండి జరిగింది... చాతుర్వర్ణ్యం మయా సృష్టం / గుణకర్మవిభాగశః ।
గుణాలను బట్టి కర్మలను బట్టి నాలుగు వర్ణములు నేనే సృష్టించినాను. మన ఇష్టాలు, మనం చేసే పనులను బట్టే ఆ నాలుగు వర్ణాల విభజన ఉంటుంది అన్నాడు కానీ, పుట్టుకను బట్టి అని చెప్పలేదు. అది కూడా వర్ణములే అని గుర్తుంచుకోవాలి ! కులములు కాదు.
కులానికి వర్ణానికి తేడా ఏమిటి ? వర్ణం అనేది వృత్తి ఆధారిత వ్యవస్థ. వర్ణం పురాతన గ్రంథాలైన వేదాల్లో మూలాలను కలిగి ఉంది. వ్యక్తులను వారి వృత్తులు, విధులు మరియు సామర్థ్యాల ఆధారంగా నాలుగు ప్రధాన సమూహాలుగా విభజించింది. కుల వ్యవస్థ అనేది భారతదేశంలో పుట్టుక ఆధారంగా సామాజిక వర్గీకరణగా రూపుదిద్దుకుంది. క్రమేణా ఇది ఒక సంక్లిష్టమైన సామాజిక నిర్మాణంగా మార్పు చెంది బ్రిటిష్ పాలనలో మరింత ప్రభావితమైంది.
వేద కాలంలో వృత్తుల ఆధారంగా ఎవరి జీవనం ఎలా గడుపుతారు అనే దాన్ని బట్టి సమాజంలో ఈ విధంగా వర్ణ విభజన జరిగింది.
శూద్రుడు - శరీర స్థాయిలో మాత్రమే జీవితాన్ని గడిపేవాడు (శరీర పోషణ, సమాజ సేవ కోసం చేసే పనులు)
వైశ్యుడు - శరీర, మనో స్థాయిలు.. రెండింటిలో జీవితాన్ని గడిపేవాడు (వర్తక వ్యాపారాలతో చేసే పనులు)
క్షత్రియుడు - శరీర, మనో, బుద్ధి స్థాయిలు … మూడింటిలో జీవితాన్ని గడిపేవాడు (నాయకత్వం, రాజ్యపాలన)
బ్రాహ్మణుడు - శరీర, మనో, బుద్ధి, ఆత్మ … అన్ని స్థాయిల్లోను జీవితాన్ని గడిపేవాడు (వేద పండితులు, ఉపాధ్యాయులు, పూజారులు)
సార్వ జనహితం, సార్వ జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం. వారు వేదాలు, ఉపనిషత్తులు, పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధిత విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. నిత్య అనుష్ఠానాలు, వేద పారాయణం, దేవతార్చనతో ఆధ్యాత్మిక భావాలకు కట్టుబడి ఉంటారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడం ద్వారా బ్రాహ్మణునిగా మారతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య మొదటిది. పంచ మహా పాతకాలు అనగా 1) బ్రహ్మహత్య: బ్రాహ్మణుడిని హత్య చేయడం, 2) సువర్ణ చౌర్యం: బంగారం దొంగిలించడం, 3) సురాపానం: మద్యపానం చేయడం, 4) గురుపత్ని సాంగత్యం: గురువు యొక్క భార్యతో సాంగత్యం చేయడం, 5) పైన చెప్పిన నాల్గు పాతకాలని సమర్థించడం.
బ్రాహ్మణులు శరీర శుద్ధి, పవిత్రతను పాటించే మడి విధానాన్ని, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తారు. వర్ణ ధర్మాల గురించి ఇదివరకే చెప్పుకున్నాం. ఇక ఆశ్రమ ధర్మాలు ఏమిటో చూద్దాం. 1) బ్రహ్మచర్యం: విద్యార్థి దశ, విద్యను అభ్యసించడం దీని ప్రధాన లక్ష్యం. 2) గృహస్థం: వివాహ బంధంలో ఉంటూ, కుటుంబాన్ని పోషించడం, సామాజిక బాధ్యతలను నెరవేర్చడం. 3) వానప్రస్థం: గృహ జీవితం నుండి విరమించుకొని, భవ బంధాలు లేకుండా హలో పాలు కావాలా ఆధ్యాత్మిక సాధన చేయడం. 4) సన్యాసం: ప్రాపంచక విషయాలను త్యజించి, ఇంద్రియ నిగ్రహంతో మోక్షం కోసం దైవాన్ని ఆరాధించడం.
ఎవరు బ్రాహ్మణుడు ? బ్రాహ్మణులను ""విప్రుడు"" (ప్రేరణ కలిగించేవాడు), లేదా ""ద్విజుడు"" (రెండుసార్లు జన్మించిన వాడు) అని కూడా పిలుస్తారు. రెండు సార్లు జన్మించినవాడు ఎలాగా అంటే, మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. బ్రహ్మజ్ఞానంతో జీవించే వారు బ్రాహ్మణులు. పుట్టుక వలన, ఉపనయనం ధరించడం వలన మాత్రమే బ్రాహ్మణుడు కాడు.
బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు బ్రాహ్మణుడుగా జీవించడం గొప్ప. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది. సదాచారాన్ని, భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ధర్మనిష్ఠతో జీవనం సాగించే ప్రతి ఒక్కడూ బ్రాహ్మణుడే. ఇంకా వివరంగా చెప్పాలంటే... జన్మనా జాయతే శూద్ర / కర్మనా జాయతే ద్విజ || అన్నది మనుస్మృతి. పుట్టుకతో ఎవరైనా శూద్రులే; చేసే పనుల (కర్మల) ద్వారా మాత్రమే ద్విజుడౌతాడు అని దాని అర్థం. బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం ఇదే.
బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆది నుండి ఆలయం పూజారులు. ఈ కాలంలో వంశపారంపర్యంగా అర్చక వృత్తిని కొనసాగించే కొందరు బ్రాహ్మణులు తప్ప చాలా వరకు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రంగాలలో స్థిర పడిపోతున్నారు. కొంత మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకొని దేశ విదేశాల్లో సైతం పౌరోహిత్య విధులు నిర్వర్తించ గలుగుతున్నారు.
గతంలో వారి బోధనకు, అందించే జ్ఞానమునకు గుర్తింపుగా ఉపకారవేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించేది. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా ఆ సాంప్రదాయం కనుమరుగయింది. జీవనభృతి కోసం నేడు వివిధ వృత్తులు, ఉద్యోగాలలో బ్రాహ్మణులు స్థిరపడుతున్నారు. ఐఐటి, ఐఐఎం చదివిన వాళ్లలో, ప్రభుత్వోద్యోగాలలో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు, ఐఏఎస్ సాధించిన అభ్యర్థులలో ఎక్కువ శాతం బ్రాహ్మణులే ఉండడానికి కారణం జన్యుపరంగా వారికి లభించిన పాండిత్యం కావచ్చు, కార్యదీక్షతో సాధించే విజ్ఞానం కావచ్చు.
ఇతర కులస్తులకు బ్రాహ్మణులకు తేడా ఉందా అంటే పెద్దగా తేడా ఏమిలేదు. వాళ్ళకి కళ్ళు ముక్కు చెవులు, చేతులు, కాళ్ళు అందరి లాగానే ఉంటాయి. కాకపోతే నోరు, మనసు, చేతలు కొంచం డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కూడ కేవలం పెరిగిన వాతావరణం బట్టి మాత్రమే ఆలా ఉంటాయి. ఒక బ్రాహ్మణ పిల్ల వాణ్ని పుట్టగానే ఒక ముస్లిం కుటుంబములో ఉంచి పెంచితే చక్కగా ఉర్దూ మాట్లాడుతాడు నమాజ్ కూడ చేస్తాడు. అదే విధంగా ముస్లిం పిల్లవాణ్ణి బ్రాహ్మణ కుటుంబంలో ఉంచి పెంచితే చక్కగా వేద విజ్ఞానం పెంచుకుంటాడు. కాబట్టి ఏ కులంలో పుట్టాడు అన్నది ముఖ్యం కాదు. ఎలా పెరిగాడు ? ఎలా పెంచారు ? అన్నది ముఖ్యం
రావణాసురుడనే రాక్షస రాజును బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు? రావణుడు పుట్టుకతో బ్రాహ్మణుడే, స్వభావపరంగా రాక్షసుడు. ఎందుకంటే అతని తండ్రి విశ్రవసుడు (మహర్షి పులస్త్యుడి కుమారుడు) ఒక బ్రాహ్మణుడు, మరియు తల్లి కైకసి రాక్షస కులానికి చెందినది. ఈ కారణంగా, రావణుడు బ్రాహ్మణ - రాక్షస సంకర కులానికి చెందినవాడు.
తండ్రి వంశం: విశ్రవసుడు బ్రాహ్మణ ఋషి కావడంతో, రావణుడికి బ్రాహ్మణ గుణాలు, వేదాధ్యయనం మరియు తపస్సు శక్తి లభించాయి. రావణుడు మహా పండితుడు, వేదశాస్త్రాలలో నిపుణుడు మరియు శివభక్తుడు. అతను శివునికి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. బ్రాహ్మణ సంస్కృతిని పాటిస్తూ యజ్ఞాలు చేయడం, వేద మంత్రాలను ఉపయోగించడం వంటి సంప్రదాయాలను అనుసరించాడు.
అయితే, అతని రాక్షస స్వభావం, అధర్మచర్య (సోదరుడు కుబేరుడుని హింసించడం, సీతాపహరణం వంటి పనులు) కారణంగా అతనిని రాక్షసుడిగానే పరిగణిస్తారు. కాబట్టి, రావణుడు బ్రాహ్మణ కులోద్భవుడే కానీ రాక్షస గుణాలుకలవాడు. ఇది మన పురాణాలలో కులం మరియు స్వభావం మధ్య ఉన్న సంక్లిష్టతను చూపిస్తుంది.
బ్రాహ్మణానాం అనేకత్వం అనే భావన, ఈ వాక్యం ఎవరు సృష్టించారు, దీని అంతరార్థం ఏమిటో చూద్దాం.
"గజానాం మన్దబుధ్ధిశ్చ
సర్పాణామతినిద్రతః
బ్రాహ్మణాణామనేకత్వం
త్రిభిర్ లోకోప కారిణః !!"
ఏనుగు, పాము, బ్రాహ్మడు - మనం చూసే దృక్పథంలో మార్పు కానీ… ఏవి వేటికి ఉండాలో వాటికి అవే ఉంచాడు భగవంతుడు !! విడివిడిగా పరిశీలిస్తే... గజానాం మందబుధ్ధిశ్చ - ఏనుగులకు బుధ్ధి (ఆలోచించ గలిగే జ్ఞానం) తక్కువగా ఉంటుంది, ఎందుకంటే భూమిమీద సంచరించే జంతువుల్లోకెల్లా అమితమైన బల సంపద ఏనుగుల సొంతం కానీ సాధారణంగా గోడలనుకూడా తోసుకుని వెళ్ళే శక్తి ఉన్నాకూడా ఏదైనా ఇంటిముందర గేటు మూయబడి ఉంటే అక్కడే నిలబడిచూస్తూ ఉంటుంది.
ఆ బుద్ధి మాంద్యం ఉండబట్టే అంత పెద్ద ఏనుగుని నిలువరించగలుగుతున్నాం. అది లేకపోతే ఏనుగును ఆపడం ఎవరితరమూ కాదు. సర్పాణామతినిద్రతః - పాములు వాటి జీవితకాలంలో సగం పైగా కేవలం నిద్రలోనే గడిపేస్తాయిట, ఆసమయంలో వాటికి వాయువే ఆధారం. ఒకవేళ ఈ గుణం (అతినిద్ర) వాటికి లేకపోతే సర్పలోకంలో మనం బ్రతుకుతున్నట్టే ఉంటుంది. అది ప్రమాదంకూడా.
బ్రాహ్మణానామ్ అనేకత్వం - విశ్వానికి జ్ఞానం అందింది అంటే అది కేవలం తపస్సంపన్నులయిన, భవిష్యద్ద్రష్టలైన మహర్షుల వలనే, అటువంటి బ్రహ్మజ్ఞానుల వలనేకదా ఈనాటికీ-ఏనాటికైనా తరతరాలుగా జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ మూడూ లోకోపకారములే కదా!! (త్రిభిర్లోకోపకారిణః)
పూర్వ కాలము లోని బ్రాహ్మలు అందరూ కూడా వేదపఠనము, పంచాంగాలూ, జ్యోతిష్యాలూ జీవన వృత్తిగా ఎంచుకున్నారు అనలేము. కొందరు సైనిక విద్యలు బోధించే వారిగానూ, వైద్య విద్యలు భోదించే వారిగానూ, కళలను భోదించే వారిగానూ వైద్యము చేసే వారిగానూ - సలహాలు చెప్పే మంత్రులుగానూ పురాణాలు రాసి చెప్పే వారిగానూ మారారు. శుశ్రుతుడు, ద్రోణాచార్యులు, చాణక్యులు ఈ కోవలోకి చెందిన వారే. ఆ విధంగా బ్రాహ్మణులు అనేక రంగాలలో ఆరితేరి ఉంటారు.
అందుకే బ్రాహ్మణులలో అనేకత్వం అనేది వచ్చింది. అదే విధంగా వేదాలకు దక్కుతున్న గౌరవం, వేదాలు చదివిన వారికి కూడా దక్కాలని వేద పండితులు కోరుకునే వారు. ఏ వేదిక పై చూసినా బ్రాహ్మణులు అభిప్రాయ భేదాలతో వుంటారు. అందుకే బ్రాహ్మణులలో అనైకత్యం అనేది వచ్చింది.
ఇద్దరు పండితుల మధ్య సిద్ధాంతాలపరంగా బేధాభిప్రాయాలు ఉండడం సహజం. బేధాబేధ వేదాంతం అంటే అదే. వారిలో అనేకత్వం, అనైకత్వం ఈ విధంగా రూపుదిద్దుకున్నది. ఇక్కడ బ్రాహ్మణానామ్ అనేకత్వం అనే పదబంధంలో బ్రాహ్మణులు అనే పదం కులానికి సంబంధించినది కాదు.... జ్ఞాన సంపన్నులయిన మహర్షుల రచనలను బ్రాహ్మణములు అని అర్థం చేసుకోవాలి
ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే మంచి శకునం కాదనేది ఒక మిథ్య. ఒంటి బ్రాహ్మణుడు అంటే విధురుడు అంటే భార్య మరణించి ఒంటరి అయిన వాడు. ఇలా ఒంటరి ఐన వాడు దీనంగా దయనీయంగా ఉంటాడనీ, ఆ విషాద ముఖం ఎదురు రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందనే అపోహ సాటి బ్రాహ్మణులతో సహా చాలామందికి ఉంది.
ఒంటి బ్రాహ్మడు పక్కింటివాడైనా, చుట్టమైనా సరే ఎదురు వస్తే చాలు వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు. ఇది చాలా పెద్ద అపోహ, తప్పున్నర తప్పు. నిజానికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం. పూర్వం గురుకులాల్లో ప్రతీ రోజూ గురువుగారు తనవద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని బిక్షాటన కోసం ఊళ్లోకి పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్లి గృహస్తుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిక్ష సేకరించి తెచ్చేవారు.
ఆ కాలంలో ఎవరైనా గృహస్తు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో, అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురయితే, వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన బిక్షవేసి పంపించే వారు. అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి, అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా వెళ్లడం అతన్ని అవమానపరచినట్టుగా ఉంటుందని భావించేవారు.
నిజానికి ఆ విధంగా బిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి, లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించు కోకుండా వెళ్లడం దోషం.
అందుకే వెనక్కి వెళ్లి బిక్ష తెచ్చి వేస్తారు. అంతే తప్ప అది అపశకునం కాదు. ఒక వేద పండితుడు, జ్ఞాని ఎదురవ్వడం మంచిదే తప్ప అది చెడు శకునం ఎలా అవుతుంది. ఒక్కో సారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక కొంతమంది ఎదురయినా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చలకో, లేక ఏ జప హోమాలకో వెళ్తూన్నారని అర్ధం. ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. అలా రోజు వారి విద్యార్థుల చేత బిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు. కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంత మంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి.
అయితే ఇక్కడ ఒక్క విషయం ప్రతి ఒక్కరు స్పష్టంగా తెలుసుకోవాలి. మనం బయటకి వెళ్తున్నప్పుడు ధర్మం చేయమని ఎవరయినా ఎదురయితే అతను బ్రాహ్మణుడు కానీ, బ్రాహ్మణేతరుడే కానీ వీలయితే అతనికి చేతనైన సహాయం నిష్కామకర్మతో చేసి కదలడం ధర్మం. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యం, వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది. అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.
శ్రీకృష్ణార్పణమస్తు
స్వస్తి..
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త




Comments