top of page
Original.png

శంకరాచార్యుల ఆధ్యాత్మిక ప్రయాణం వివాద రహితం

#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #శంకరాచార్యులఆధ్యాత్మికప్రయాణంవివాదరహితం, #TeluguArticle

 

Sankaracharyula Adhyatmika Prayanam Vivada Rahitham - New Telugu Article Written By R C Kumar Published In manatelugukathalu.com On 18/01/2026

శంకరాచార్యుల ఆధ్యాత్మిక ప్రయాణం వివాద రహితం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్

శంకరాచార్యుల ఆధ్యాత్మిక ప్రయాణం వివాద రహితం వైదిక విజ్ఞాన సిద్ధాంతకర్తలైన శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు ఎవరికి వారే ఉద్దండులు, అసాధారణ పండితులు. మా సిద్ధాంతమే గొప్పది ఇతర సిద్ధాంతాలపైన మా ఆధిపత్యమే కొనసాగుతుందని త్రిమతాచార్యులు ఎవరూ చెప్పుకోలేదు. తమ భాష్యాలతోనూ, వాదాలతోనూ సమకాలీన పండితులను మెప్పించి, ఒప్పించి తమ సిద్ధాంతములకు గుర్తింపు, మన్నన సాధించారు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలన్నీ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. ఏ సిద్ధాంతం కూడా మరొక దానికంటే తక్కువ కాదు. ఇవన్నీ పరమాత్మను చేరుకోవడానికి వేర్వేరు మార్గాలు. త్రిమతాచార్యుల సిద్ధాంతాల్లో, రచనల్లో, వ్యాఖ్యానాల్లో  బేధభావాలు వర్గ వైషమ్యాలు లేశమాత్రమైనా కనపడవు.


కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది స్వాములు తెలుసో తెలియకో వాస్తవాలను వక్రీకరించే ప్రచారం చేస్తున్నారు. ఇతర మతాల్లో కనబడని ఇటువంటి విమర్శలు, వక్రీకరణలు మన మతంలోనే వెలువెత్తడం దురదృష్టకరం. శంకరులు ఒక దేవుడికి పరిమితం కాదు : మన దేశం భారతీయత, సనాతనత్వ మేళవింపుతో వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో త్రిమతాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతాలపై, స్థాపించిన మఠాలపై కొందరు స్వాములు ప్రతికూలంగా వ్యాఖ్యానం చేయడం ఆందోళన కలిగించక మానదు.


శంకరాచార్యులు శుద్ధ వైష్ణవులు అని బల్లగుద్ది చెప్పగలను, మొహమాటం కొద్దీ ఆయన ఇతర దేవుళ్ళ పేర్లు చెప్పారు అంటున్నారు కొందరు స్వాములు. నిజానికి శంకరాచార్యులు తాను కేవలం శివ భక్తుడిని అని గానీ, విష్ణుమూర్తి భక్తుడని గానీ ఎక్కడా ప్రకటించుకోలేదు. వారిని ఒక దేవుడికి పరిమితం చేయడం అవివేకం. ఆదిశంకరాచార్యుల దృష్టిలో శివుడు మరియు విష్ణువు ఇద్దరూ ఒకే పరబ్రహ్మ స్వరూపాలు. శివుడిని, శ్రీమహావిష్ణువుని ఇరువురిని స్తుతిస్తూ వారు చేసిన శక్తివంతమైన స్తోత్రాలు, రచనలను పరిశీలిస్తే శివ కేశవుల పట్ల వారికి ఉన్న అబేధ భావాన్ని ఎవరైనా గ్రహించవచ్చు.


శివకేశవులపై శంకరుని రచనలు : శివునిపై భక్తిని తెలిపే అద్భుతమైన కృతి శివానందలహరి, శివశక్తి ఏకత్వాన్ని శివుని సౌందర్యాన్ని వర్ణించే స్తుతి సౌందర్యలహరి, శివ స్వరూపమైన ఆత్మను వర్ణించేది నిర్వాణ షట్కం, శివునిపై రచించిన భుజంగ ప్రయాత ఛందస్సు స్తోత్రమే శివ భుజంగం, జ్ఞానానికి అధిపతి అయిన దక్షిణామూర్తిని స్తుతించేది దక్షిణామూర్తి స్తోత్రం, బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులపై తన వ్యాఖ్యానాలలో శివుని పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొనే వేదాంత రచనలు అనేకం.


అదేవిధంగా శ్రీమహావిష్ణువుపై కూడా ఆది శంకరాచార్యులు ఎన్నో భక్తి పూర్వక రచనలు చేశారు. అందులో వారు రచించిన విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం అత్యంత ప్రామాణికమైనది. సామాన్య ప్రజలకు కూడా భక్తి మార్గాన్ని బోధించే ఉద్దేశంతో శ్రీకృష్ణుని (గోవిందుని) ఉద్దేశించి చేసిన ప్రసిద్ధ రచన భజగోవిందం. ఇవే కాకుండా శ్రీమహావిష్ణువుని స్తుతిస్తూ చేసిన రచనల్లో విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం, అచ్యుతాష్టకం, శ్రీ విష్ణు షట్పది స్తోత్రం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, గోవిందాష్టకం, శ్రీ కృష్ణాష్టకం, పాండురంగాష్టకం, జగన్నాథాష్టకం, శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం, హరి స్తుతి మొదలైనవి ఉన్నాయి.


ఈ విధంగా శివ కేశవుల అభేద భావాన్ని ఆయన తన రచనలు, నెలకొల్పిన సంప్రదాయాల ద్వారా స్పష్టం చేశారు.చక్రి సర్వోపగతుండు : కొందరు బూడిద పూసుకొని స్మశానంలో తిరగాడే శివుడిలో పరమాత్మను చూస్తే మరికొందరు శంఖచక్ర గధాయుధాలతో, పట్టుపీతాంబరాలు, కౌస్తుభంతో విరాజిల్లే విష్ణుమూర్తిలో చూసుకుంటారు. కొందరు దిగంబర రూపంలోని శ్రీపాద వల్లభుడిలో, మరికొందరు అడవి బిడ్డలైన సమ్మక్క సారక్కల్లో వారి ఆరాధ్య దైవాన్ని దర్శిస్తారు. ఎవరు ఏ రూపంలో కొలుచుకున్నా ఈశ్వరుడు ఒక్కడే అని మన సనాతన ధర్మం చెప్పింది.


చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడన్న జ్ఞానాన్ని బోధిస్తూ ఆధ్యాత్మికవేత్తలు, స్వాములు జన బాహుళ్యానికి మెరుగైన మార్గాన్ని చూపాలి సర్వ మానవ సౌభ్రాతృత్వానికి పాటుపడాలి. మనకు, దేవుళ్లకు మధ్య స్వాములు వారధిలా ఉండాలే కానీ శైవులు గొప్పవారా వైష్ణవులు గొప్పవారా అనే చర్చకు దారి తీసే ప్రసంగాలు చేయకూడదు. హిందూయిజం, సనాతన ధర్మం వేళ్ళూనుకొని చిగురు తొడిగి పునరుద్ధరించబడుతున్న ఈ తరుణంలో వివాదాలు తగాదాలతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని ఖండించక తప్పదు.


మనది యతులను పీఠాధిపతులను, స్వాములను గౌరవించే సంప్రదాయం కాబట్టి అభ్యంతరకరంగా మాట్లాడే స్వాముల గురించి ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేము. చతురామ్నాయ మఠాల స్థాపన :హిందూమతాన్ని, వైదిక ధర్మాన్ని తమ తమ సిద్ధాంతాలు, బోధనలతో ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ఆది శంకరాచార్యులు ప్రప్రథములు. జగద్గురువు తాను ప్రబోధించిన వైదిక మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ధర్మ ప్రచార నిమిత్తం నాలుగు పీఠాలను స్థాపించి, తన ప్రధాన శిష్యులైన నలుగురు  పీఠాధిపతులను నియమించారన్నది చరిత్ర చెబుతున్న సత్యం.


తూర్పున పూరి, దక్షిణంలో శృంగగిరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరంలో బదరి క్షేత్రంలో నెలకొల్పిన పీఠాలు సనాతన ధర్మానికి నాలుగు దిక్కులా రక్షణ కవచాలై నిలబడ్డాయన్నది జగమెరిగిన సత్యం. ఇటీవల కొందరు స్వాములు శంకరాచార్యులు ఎలాంటి మఠాలను స్థాపించలేదని సంచలన వ్యాఖ్యలు చేయడం మనం విన్నాం. 13వ శతాబ్దంలో విజయనగర మహా సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర బుక్కరాయల ఆధ్వర్యంలో విద్యారణ్యస్వామి వారు నాలుగు మఠాలను స్థాపించారని వారి వాదన. 


వాస్తవాలు :"మఠామ్నాయ మహానుశాసనము" అనేది జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్వయంగా రచించిన ఒక విశిష్ట గ్రంథం. ఇది ఆయన స్థాపించిన చతురామ్నాయ పీఠాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ పీఠాల స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం అద్వైత వేదాంత ప్రచారం, గురు-శిష్య పరంపరను కొనసాగించడం, మరియు భారత దేశాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేయడం. వేదా చత్వారః పీఠా చత్వారః" అనే వాక్యం హిందూ ధర్మంలోని అత్యంత పవిత్రమైన నాలుగు వేదాలను మరియు వాటి సంరక్షణ కోసం ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలను సూచిస్తుంది. 


శృంగేరి శారదా పీఠం : నాలుగు పీఠాలలో ఒకటైన శ్రీ శృంగేరి శారదా పీఠం వారే విద్యారణ్యస్వామికి సన్యాసాన్ని ప్రసాదించినట్టు చరిత్ర చెబుతోంది. ఈయన 14వ శతాబ్దానికి చెందినవారు మరియు శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాధిపతిగా నియమించబడ్డవారు. గురు పరంపర లేకుండా పీఠాధిపతి ఎలా అవుతారు?


అంతకు ముందు 11 మంది పీఠాధిపతులు ఉన్నట్టే కదా. విద్యారణ్యులవారు 1380 నుంచి 1386 దాకా శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయనకన్నా ముందు విద్యారణ్యులవారి సోదరుడు (తమ్ముడు) భారతీ తీర్థ 1333నుంచి 1380 దాకా 11వ పీఠాధిపతిగా ఉన్నారు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, చింపేస్తే చిరిగిపోయేది కాదు. దీన్నిబట్టి మనకు తెలిసేది ఏమిటంటే విద్యారణ్య స్వామి వారు శారదా పీఠాన్ని స్థాపించలేదు కానీ ఆయన పీఠాధిపతి అయిన తర్వాత దాన్ని పునరుద్ధరించారు. 


మరిన్ని ఆధారాలు : మరొక నిదర్శనం ఏమిటంటే, ఆది శంకరాచార్యుల జీవిత చరిత్రను వివరించే అత్యంత ప్రామాణికమైన శంకర విజయం అనే గ్రంథాన్ని విద్యారణ్య స్వామి (మాధవాచార్యులు) రచించారు. ఆ శంకర విజయంలోనే శంకరాచార్యులు తన నలుగురు శిష్యుల ద్వారా చతురామ్నాయ పీఠాల ప్రతిష్టాపనకు సంబంధించిన ప్రస్తావన ఉంది.  శృంగేరి శారదా పీఠం అధికారిక వెబ్‌సైట్లో "మాధవీయ శంకర దిగ్విజయం" అనే పీఠికలో 18వ భాగంలో శంకర భగవత్పాదులచే నాలుగు ఆమ్నాయ మఠాల స్థాపన గురించి వివరంగా తెలుపబడింది.


గతంలో బాంబే, పట్నా హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పుల్లో శంకరాచార్యులే నాలుగు మఠాలను స్థాపించారని పేర్కొనడం గమనించదగ్గ విషయం. ఆ విధంగా చట్టపరమైన గుర్తింపు కూడా పొంది ఉన్నది. 


పంచాయతనం : పంచాయతనం అనే పూజా విధానాన్ని కూడా శంకరాచార్యులు పరిచయం చేయలేదని, అసలు పంచాయతనాన్ని పరిచయం చేసింది కూడా విద్యారణ్య స్వామి గారే అంటున్నారు. ఈ విషయం గురించి చర్చించుకునే ముందు పంచాయతనం అనే పదానికి కొంత వివరణ అవసరం. పంచాయతనం అనేది ఐదుగురు ముఖ్య దేవతలను ఒకేసారి ఆరాధించే విశిష్ట పద్ధతి. దీనిని జగద్గురు ఆది శంకరాచార్యులే ప్రచారంలోకి తెచ్చారు.


"ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం" అంటూ ఐదుగురు దేవతలైన శివుడు, విష్ణువు, అంబిక (అమ్మవారు), గణపతి మరియు సూర్యుడు గురించి తెలిపిన శ్లోకం అది. ఈ విధానంలో భక్తుడి ఇష్ట దైవాన్ని (ఉదాహరణకు శివుడైతే శివుడిని, విష్ణువైతే విష్ణువుని) మధ్యలో ఉంచి, మిగిలిన నలుగురు దేవతలను నాలుగు దిక్కులలో ఉంచి పూజిస్తారు. ఈ పూజలో మూర్తులకు బదులుగా సహజ సిద్ధమైన స్పటికం, శివలింగం, సాలగ్రామం వంటి శిలలను కూడా ఉపయోగిస్తారు.


ఈ పూజా విధానం వల్ల ఐదు రకాల శక్తి రూపాలను ఒకేసారి ఆరాధించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. నేపథ్యం : శంకరాచార్యులకు పూర్వం సనాతన ధర్మం శిధిలమైపోయి దాని స్థానంలో బౌధ్ధ, జైన మతాలు వ్యాప్తిలోకి వచ్చాయి. దానికి కారణం, హిందువులు అప్పటికే తమ ఇష్ట దేవత ఆరాధనలో మునిగిపోయి, మిగతా హిందువులు అందరూ ఆ దైవాన్నే పూజించాలని, ఇతరులు దైవాలు కాదనీ, వాళ్లలో వాళ్లు వాదులాడుకొనే వారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటూ శైవులు, వైష్ణవులు, గాణపత్యులు, శాక్తేయులు, సౌర ఆరాధకుల్లో తగాదాలు మొదలైనవి.అందుకే శంకరులు దైవం ఒక్కటే అని, అదే వేరు వేరు రూపాల్లో వ్యక్తం అవుతుందని చాటి చెప్పారు.


అందరినీ ఒకే తాటి పైకి తేవడానికి పంచాయతన పూజలో ఈ ఐదు దైవాల్ని పూజించాల్సిందే అని, తమ ఇష్ట దైవాన్ని మాత్రం మధ్యలో ఉంచి ప్రధాన దైవంగా భావించవచ్చని బోధించారు. ఇది చారిత్రిక సత్యం. ఒక విధంగా చూస్తే, ఇప్పటికీ మనం కొద్దో గొప్పో మనకు తెలియకుండానే అన్ని పూజా కార్యక్రమాల్లో దీన్ని పాటిస్తున్నాము, మొదట గణపతి పూజ, తర్వాత పసుపు గౌరీ పూజ, ఆ తర్వాత అర్చామూర్తి .... ఇలాగా.గొప్ప కాశీ పండితులని మెప్పించి, మన్ననలు పొందిన మహా జ్ఞాని శంకరాచార్యుల పాండిత్యాన్ని శంకించడం ఏమాత్రం సబబు కాదు.


శంకర పీఠాల మీద, పంచాయతన పూజా విధానం పైన చేసిన వ్యాఖ్యలు జగద్గురువు  విశ్వసనీయతనూ, గౌరవాన్ని, ప్రజాదరణనూ ఏ మాత్రం తగ్గించలేవు. ఆరోపణలకు ఆధారాలు చూపకుండా ఒక వ్యవస్థ పైన, ఒక సాంప్రదాయం పైన చేసే నిరాధారమైన వక్రీకరణలను మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. లోకా సమస్తా సుఖినోభవంతు 

*ఆర్ సి కుమార్  


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page