తొలి ఏకాదశి విశిష్టత
శయన ఏకాదశి, తొలి ఏకాదశి విశిష్టత, ఏకాదశి వ్రతం, శ్రీమహావిష్ణువు, శ్రీహరి, విష్ణుమూర్తి, చాతుర్మాస్యం, చాతుర్మాస్య దీక్ష, విష్ణు సహస్రనామం, తులసి పూజ, అంబరీషుడు, సక్కుబాయి, పద్మ ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, హిందూ పండుగలు, ఆధ్యాత్మికం, తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం, మన తెలుగు కథలు

Tholi Ekadasi Visishtatha - Telugu Devotional Article | Sudhavishwam Akondi
తొలి ఏకాదశి విశిష్టత - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 25/07/2026
తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి ఉపవాసం, విష్ణు సహస్రనామ పారాయణం, తులసీదళాలతో శ్రీహరి ఆరాధన ద్వారా పుణ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం.
ఆషాఢ మాసంలో శుక్ల పక్షాన వచ్చే పవిత్రమైన రోజు తొలి ఏకాదశి! ఈరోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజని చెబుతారు. ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్ర లోనికి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.
చాతుర్మాస్య వ్రతాలకు ప్రారంభం చేసే సమయమని, దక్షిణాయన ప్రారంభ పర్వదినమని ప్రాముఖ్యత సంతరించుకుంది.
తెల్లవారుజామునే నిద్రలేచి, తలస్నానం చేసి, తులసి దళాలతో శ్రీహరిని పూజించి, ఉపవాసం ఉంటారు. రోజంతా శ్రీహరి నామస్మరణతోనే గడపాలి. జాగరణ కూడా చేస్తారు. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం! విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఉపవాసాలు ఉండటం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
శ్రీహరిపై అచంచలమైన విశ్వాసంతో, ఆయనయందే మనసు నిలిపి ఈ వ్రతం చేస్తే ఆయన అనుగ్రహం కలిగి మోక్షాన్ని కూడా పొందగలుగుతారు. పూర్వం అంబరీషుడు అనే చక్రవర్తి ఏకాదశి వ్రతం చేసి శ్రీహరి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది, మోక్షాన్ని కూడా పొందాడు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.
పవిత్రమైన నాలుగు నెలల చాతుర్మాస్య వ్రతాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెబుతారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్న దానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు, బ్రహ్మ వరబలము గల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే "ఏకాదశి" అంటారు. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందు కోరిన రంభను తిరస్కరించాడట.
ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలలపాటు ప్రయాణాలు చేయరు.
ఈ వ్రతం చేసేవారు కామ క్రోధాదులను విడిచి పెట్టాలి. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా ఆ పేలపిండిని తింటారు.
ఈ పండుగ చేసుకోవడంలో ఆరోగ్యపరమైన కోణం కూడా దాగి ఉంది. వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఈ పండుగ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఏడాది అంతా అన్ని ఏకాదశి తిథుల్లో ఉపవాసం చేయకపోయినా ఈరోజు చేస్తే ఎంతో పుణ్యప్రదం అని పెద్దలు చెబుతారు. అందుకే తొలి ఏకాదశి రోజున అయినా ఉపవాసం చేసి, శ్రీహరిని పూజించి తరించాలి.
అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు...
సర్వం శ్రీహరి చరణారవిందార్పణమస్తు
🙏🙏🙏🙏🙏
సుధావిశ్వం
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం










Comments