top of page
Original.png

శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #Devotional, #SrikrishnayanuNamamanthraRuchi, #శ్రీకృష్ణాయనునామమంత్రరుచి

శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి : కీర్తన వివరణతో వ్యాసం...

Srikrishnayanu Namamanthra Ruchi - New Telugu Article Written By  Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 25/02/2026

శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి - తెలుగు వ్యాసం

వివరణ: సుధావిశ్వం ఆకొండి


ఈ రచన చేసినది 'అమరనారేయణ ' అనే భక్తుడు. ఆ భక్తుడి కీర్తనను స్వరపరిచి, గానంచేసి  అద్భుతమైన అనుభూతిని కలిగించిన శ్రీ బాలమురళీకృష్ణ గారి పాదాలకు నమస్కారాలతో 🙏🙏🙏..


పూర్వం కొన్ని దశాబ్దాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో 'అమరనారేయణ' అనే ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా కృష్ణ దర్శన భాగ్యంతో మహాభక్తుడు అయ్యాడు. స్వయంగా గానం చేస్తూ స్వామిపై ఎన్నో కీర్తనలు రచించాడు.


భక్తిపారవశ్యం ఎవరికి, ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము. భక్తిభావానికి కుల,మత, జాతి వివక్షత లేదు. ఏ మార్గం లో భక్తితో తరించిపోతాడో చెప్పడం కష్టం. ఆ అలౌకిక భావన కలిగినప్పుడు సిద్ది పొందుతాడు.


ఆయన రచించిన కీర్తనల్లో ఇది ఒక అద్భుతమైన కీర్తన. ఇది స్వతహాగా అద్భుతమైన గానశక్తి కలిగిన శ్రీ బాలమురళీకృష్ణ గారు ఈ కీర్తనకు సంగీతం స్వరపరిచి, స్వయంగా గానం చేశారు. పూర్వం రేడియోలో ' భక్తి రంజని' లో వచ్చేది.


పాటకు ప్రాణం భావం. అర్ధవంతమైన గీతాలు అద్భుతమైన భావనలు కలిగిస్తాయి. కీర్తనలు కానీ, ఏ ఇతర రచనలు కానీ వాటి అర్ధం తెలిస్తే ఆ ఆనందమే వేరు! అటువంటి కీర్తనలు మనసుకు హత్తుకుని, భావాతీత స్థితికి తీసుకెళ్తాయి.

మీరూ ఆస్వాదించండి...


            .     ****


శ్రీ కృష్ణాయను నామ మంత్రరుచి సిద్ధించుట నాకెన్నటికో

శ్రీగురు పాదాంబుజమ్ములు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో

                                 II 2 II


మరువక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో

                                  II 2  II

హరి హరి హరియని హరినామామృతపానము చేసేదెన్నటికో

                                     II 2 II


                     II శ్రీకృష్ణాయని II


కమలాక్షుని నా కన్నులు చల్లగ కని సేవించేదెన్నటికో

                                 II 2 II

లక్షణముగ శ్రీలక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో

                                II 2 II


                 II శ్రీకృష్ణాయను II


పంచాక్షరీ మంత్రము మదిలో పఠించేదెన్నటికో

                            II 2 II

ఆదిమూర్తి శ్రీ అమరనారేయణ భక్తుడనయ్యేదెన్నటికో

                               II 2 II


               II శ్రీకృష్ణాయను II


ఎంత అర్ధవంతమైన సంకీర్తన. ఆ భక్తుడు స్వామితో తన ఆర్తిని చెప్పుకున్నాడు.


భావం :

భగవంతుని నామం ఒకసారి రుచి మరిగితే ఎప్పుడూ కావాలని అనిపిస్తుంది. అటువంటి స్థితి రావాలంటే ఆయన అనుగ్రహమే ఉండాలి.  అది ఎలా సిద్ధిస్తుంది? అంటే గురువుల అనుగ్రహముతో వస్తుంది. ఉద్ధరించే గురువులు దొరకాలి, వారిని సేవించే స్థిరమైన మనసు ఉండాలి.


ఈ నోరు ఉన్నందుకు ఆ మాధవుని మహిమలు చెప్పుకోవాలి. ఆ శ్రీహరి స్మరణ నిరంతరం చేయాలి.


ఆ కమలాక్షుని కన్నులారా చూసి మనసులో నింపుకోవాలి. ఆ లక్ష్మీరమణుడికి దాస్యం చేయాలి.


పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం పఠించాలి. ఆ ఆదిమూలం అయిన ఆ పరబ్రహ్మ భక్తుల్లో నేనూ ఒకడిని అవ్వాలి.


ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ అనుగ్రహముతో జరుగుతాయి. అందుకే నిరంతరం నీ కరుణాకటాక్షాలు కురిపించి ఈ పైవన్నీ చేస్తూ నీకు దగ్గరగా, నీ భక్తుడిగా వుండే వరం ప్రసాదించు తండ్రీ!  అని వేడుకుంటున్నాడు. శివ, కేశవ బేధం లేకుండా ఆ పరబ్రహ్మలో చేరాలని ఈయన అద్భుతమైన భావన.


ఈ సంకీర్తన బాలమురళీకృష్ణ గారి గళాన మహాద్భుతంగా వీనులవిందుగా, తన్మయత్వం కలిగించేవిధంగా ఉంది.


శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సుధావిశ్వం


సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page