top of page

అంతా మంచికే జరిగింది



'Antha Manchike Jarigindi' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 21/06/2024

'అంతా మంచికే జరిగింది' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఒరేయ్.. ! బాలూ.. !" అంటూ బాత్రూంలోంచి గట్టిగా కేకలు వేసింది జానకమ్మ.. 


"ఏమైందమ్మా.. !" అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు బాలు. అక్కడ జారి పడిపోయిన తల్లిని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు బాలు


"ఒరేయ్.. కాలు కదలట్లేదు రా.. ! విరిగిందో ఏమిటో.. ? బాగా నొప్పిగా ఉంది.. " అని మూలుగుతూ అంది జానకమ్మ 


బాలు వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి, ఒక పెద్ద హాస్పిటల్ లో అమ్మని జాయిన్ చేసాడు. బాలుకి ఈ లోకంలో అమ్మ తప్ప ఎవరూ లేరు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో, బాలుకి అమ్మే లోకం. ఒక ప్రైవేటు కంపెనీ లో బాలుది మంచి ఉద్యోగం. ఎప్పటినుంచో పెళ్లి చేసుకోమని అమ్మ చెప్పినా.. బాలు తన పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు అమ్మకి ఇలా జరగడంతో చాలా బాధపడ్డాడు బాలు. అమ్మకి బీపీ, షుగర్ ఉండడంతో.. ఏం జరుగుతుందో అని ఇంకా ఎక్కువ భయపడుతున్నాడు బాలు.. 


"బాలు అంటే మీరేనా.. ? డాక్టర్ గారు పిలుస్తున్నారు.. " అని ఎమర్జెన్సీ లో నుంచి బయటకి వచ్చిన నర్స్ అడిగింది.. 


లోపలికి వెళ్ళిన బాలు.. "నేనే బాలు డాక్టర్ గారు.. మా అమ్మకి ఎలా ఉంది.. ?"


"మీ మదర్ కి కాలు విరిగింది.. ఆపరేషన్ చెయ్యాలి.. " అని చెప్పింది అక్కడ డాక్టర్.. 


"నేనెంత దురదృష్టవంతుడని.. అమ్మకి ఇలా ఎందుకు జరిగింది.. ?" అని బాధపడుతున్నాడు బాలు 


"ఊరుకోండి.. ఏమీ కాదు.. " అని ఒక అందమైన గొంతు బాలుని పలకరించింది.. 


తల పైకెత్తి చూసాడు. అంత బాధలో కూడా బాలుకు ఆమె మాటలు చాలా హాయిని,కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. చూడడానికి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. 


ఎవరబ్బా ఈ అమ్మాయి..?' అనుకున్నాడు. మొదట్లో డాక్టర్ ఏమో అనుకున్నాడు.. కానీ డాక్టర్ కాదని తర్వాత తెలిసింది.. 


"రండి.. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తాను.. మీ అమ్మ గారికి ఆపరేషన్ చేసేది మా మేడం.. " అంది ఆ అమ్మాయి. 


"అంటే.. మీరు డాక్టర్ కాదా.. ?"


"కాదు.. డాక్టర్ గారి పర్సనల్ అసిస్టెంట్. మీ అమ్మగారికి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి.. " అంది ఆ అందమైన గొంతుతో ఆ అమ్మాయి. 


"మీ మాటలతో నా మనసులో బాధని సగం పోగొట్టారండీ.. " అని అన్నాడు.

 

"అవునా.. ?" అని చిన్నగా నవ్వింది ఆమె.. 


డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయి. ఈమెది ఎంత అందమైన గొంతో, డాక్టర్ ది అంత కఠినమైన గొంతు. డాక్టర్ ఆపరేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్పి, డబ్బులకి ఏర్పాటు చేసుకోమని చెప్పి, ఏమైనా డౌట్స్ ఉంటే, తన పర్సనల్ అసిస్టెంట్ తో టచ్ లో ఉండమని చెప్పారు. అలాగే అని చెప్పి.. బయటకు వచ్చేసాడు బాలు. 


"విన్నారుగా.. డాక్టర్ గారు మీతో టచ్ లో ఉండమన్నారు.. మీ పేరు చెప్తారా.. ? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా.. ?" అని ధైర్యంగా అడిగేసాడు.

 

"నా పేరు మీనా.. " అని ఆమె తన ఫోన్ నెంబర్ ఇచ్చింది.


"నా పేరు బాలు.. " అని పరిచయం చేసుకున్నాడు. 


ఆపరేషన్ డేట్ అండ్ టైం డాక్టర్ చెప్పనేలేదు. వెంటనే మీనా గారికి కాల్ చేసాడు.. 


"హలో.. ! మీనా గారు.. ?"


"అవును బాలుగారు.. ! మీ మదర్ ఆపరేషన్ రేపు ఉదయం.. మేడం చెప్పమన్నారు. అన్ని విషయాలు నేను చూసుకుంటాను" అంది మీనా.


మర్నాడు ఆపరేషన్ బాగా జరిగిందని డాక్టర్ చెప్పారు. బాలు టెన్షన్ ఇప్పుడు కాస్త తగ్గింది. చుట్టూ చూసాడు.. మీనా ఎక్కడా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేసాడు. 


"హలో మీనాగారు.. ! ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్ చెప్పారు. మీతో ఒక మాట చెబుదామని ఫోన్ చేసాను.. "


"కంగ్రాట్స్.. ! నేను ఈ రోజు హాస్పిటల్ కు రాలేదండి.. వొంట్లో బాగోలేదు.. " అంది మీనా.

 

"అయ్యో.. ! మరి డాక్టర్ కి చూపించారా.. ?"


"లేదండి.. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు.. నేను సింగల్ గానే ఉంటాను.."


"అయ్యో.. ! అందరికీ సాయం చేసే మీకు.. సాయం చేయడానికి ఎవరూ లేరా.. ? మీ అడ్రస్ చెప్పండి.. నేనే వస్తాను.. ఇప్పుడు మా అమ్మకు బాగానే ఉంది.."


"మీకెందుకు శ్రమ చెప్పండి.."


"పర్వాలేదు.. చెప్పండి మీనాగారు.." 


అడ్రస్ చెప్పి.. ఫోన్ పెట్టేసింది మీనా. బాలు ఆ అడ్రస్ కు వెళ్లి బెల్ రింగ్ చేసాడు. కొంత సేపటికి మీనా తలుపు తీసింది. 


"ఇప్పుడు ఎలా ఉంది మీనా గారు..?"


"టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.. ఇప్పుడు కొంచెం బెటర్ అండి.."


"ఇదిగోండి.. మీ కోసం పండ్లు తెచ్చాను.. జ్యూస్ తీసి ఇస్తాను.. అలా పడుకోండి.."

"నాకు వచ్చింది మామూలు జ్వరమే.. పర్వాలేదు.."


"మాట్లాడకుండా జ్యూస్ తీసుకోండి.." అని తీసిన జ్యూస్ ని అందించాడు. 


"ఒక మాట అడగనా మీనాగారు.. ? మీకు ఎవరూ లేరని అంటున్నారు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే, మీకు తోడుగా ఉంటారు కదండీ.. ఈ ఒంటరి జీవితం ఎందుకు.. ?"


"నా గురించి మీకు చెప్పి మీకు బోర్ కొట్టించలేను.. "


"చెప్పండి.. పర్వాలేదు.. మీరు నాకు చాలా స్పెషల్.. మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు"


"మాది ఒక పల్లెటూరు. మా అమ్మనాన్నకి నేను ఒకే అమ్మాయిని. నన్ను చదివించడం కోసం, మా నాన్న చాలా కష్టపడ్డాడు. చేసిన అప్పు మొత్తం వడ్డీతో చాలా పెద్ద మొత్తం అయ్యింది. అప్పు తీర్చమని అప్పులవాళ్ళు రోజూ గొడవ పెట్టేవారు. నా చదువు మధ్యలోనే ఆపేసి.. ఉద్యోగం కోసం ఈ సిటీ కి వచ్చాను. నా అదృష్టం కొద్ది.. ఈ హాస్పిటల్ లో, జాబ్ వచ్చింది. ఇలా ఒంటరిగా ఇక్కడ ఉంటూ.. అప్పు కొంచం కొంచంగా తీరుస్తున్నాను. నాకూ పెళ్ళి చేసుకుని, లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలనే ఉంది. కానీ ప్రస్తుతం ఒకటే లక్ష్యం.. అప్పు తీర్చి, మా అమ్మనాన్నని హ్యాపీ గా ఉంచడం. నేను ఒక కూలి పని చేసుకునే వాడి కూతురని.. నాకు ఇక్కడ ఎవరు ఫ్రండ్స్ కూడా లేరు.."


"ఇంతకీ మీరు ఏం చదవాలనుకున్నారు మీనా..?"


"మంచి డిగ్రీ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలని ఉంది.. విధి వేరే లాగ నిర్ణయించింది బాలుగారు. అయినా, నాలాంటి దానిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు..? నన్ను చదివించి నా ఆశయం సపోర్ట్ చేసేవారు ఎక్కడ దొరుకుతారు..? ఎవరైనా తన స్టాయిని తగ్గించుకుని, నన్ను ఎలా పెళ్ళి చేసుకుంటారు చెప్పండి..?"


"అలా అనకండి మీనాగారు.. ఈ లోకంలో ఇంకా మంచితనం, మంచివారు ఉన్నారు.."


"ఒకవేళ ఉన్నా.. నా కంత అదృష్టమా చెప్పండి బాలుగారు.."


ఈ లోపు ఫోన్ రావడం తో, బాలు హాస్పిటల్ కు అర్జెంటు గా వెళ్ళాల్సి వచ్చింది.. 


"సరే బాలుగారు.. రేపు మిమల్ని హాస్పిటల్ లో కలుస్తాను.." అని బై చెప్పింది మీనా. 


మర్నాడు మీనా హాస్పిటల్ లో బాలుని కలిసింది. “మీ అమ్మగారిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్ మేడం చెప్పారు. ఆ విషయాన్నే మీకు చెబుదామని హ్యాపీ గా వచ్చాను. మీలాంటి మంచివారిని నేను కలుస్తానని అనుకోలేదు బాలుగారు..” 


"నేను మంచివాడినని మీరే అంటున్నారు.. మరి మీరు అదృష్టవంతులు కారా..?"


"అంటే..?" అంది మీనా. 


"మిమల్ని ఫస్ట్ డే చూసినప్పుడే నా మనసు దోచారు. నేను మీ ఆశయానికి సపోర్ట్ చేస్తాను. మీ అప్పులు కుడా తీర్చేస్తాను. ఇకమీదట నన్ను 'బాలుగారు' అని కాకుండా.. 'ఏమండీ' అని రోజూ ప్రేమగా పిలవాలి.."


"మీ మనసులో మాట అర్ధమైంది.." అని నవ్వుతూ అంది మీనా. 


"రా మీనా.. నిన్ను మా అమ్మకి పరిచయం చేస్తాను.. కోడలిని చూసి చాలా మురిసిపోతుంది అమ్మ..".


కాబోయే కోడలిని చూసిన జానకమ్మ.. "నా కాలు విరిగితే గానీ.. నీకు నచ్చిన అమ్మాయి దొరకలేదు రా బాలు..! ఏదైనా.. అంతా మంచికే జరిగింది.." అని అందరూ నవ్వుకున్నారు.


************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ




83 views0 comments

Comments


bottom of page