top of page
Writer's pictureMohana Krishna Tata

అంతులేని సేవ



'Anthuleni Seva' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 22/09/2024

'అంతులేని సేవ' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగు పెట్టాను. ఆ ఇంట్లో నాకు అంతా కొత్తే. అందరూ కొత్త మనుషులే. మా ఆయనికి ఒక సిస్టర్. అన్నయ్య పెళ్ళి కోసం వెయిట్ చేసినట్టు తోచింది నాకు. ఆమె కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.


మర్నాడు ఉదయం నిద్రలేచాక.. ఎవరైనా కాఫీ ఇస్తారేమో అని చూస్తుంటే, ఇంట్లో ఆ సంకేతాలే లేవు. మా అత్తగారు, ఆడపడుచు ఉన్నా..ఎవరూ కిచెన్ వైపు వెళ్ళలేదు. మరోపక్క, మా ఆయనకి ఆఫీస్ కి టైం అవుతోంది..


"లావణ్యా..కాఫీ..! అని మా ఆయన తియ్యగా పిలుస్తున్నారు. ఇక ధైర్యం చేసి కిచెన్ లోకి అడుగుపెట్టాను. ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. నాకైతే తప్పదు కదా..కిచెన్ అంతా వెతికి, చివరికి కాఫీ కలిపి.. మా ఆయనికి ఇచ్చిన తర్వాత.. అందరికీ ఇచ్చాను. 


మా అత్తగారికి మోకాళ్ళ నొప్పులని తెలిసింది..అవసరమైతే తప్ప రూమ్ లోంచి బయటకు రారు. మా మావగారు నడవలేరు. ఎక్కువ మంచానికే పరిమితం. ఇక ఆడపడుచు..కాలేజీ అని అసలు ఇంట్లో పని చేస్తుందని నాకు అనిపించలేదు.


నేను రాకముందు వరకు, ఓపికుంటే మా అత్తగారు వంట చేసేవారని, లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకునేవారని మా ఆయన చెప్పారు. మా ఆడపడుచుకి గ్యాస్ వెలిగించడం కుడా రాదని, తర్వాత మా ఆయన చెబితే తెలిసింది. ఇప్పుడు నేను వచ్చాక, అంతా నా మీదే వదిలేసినట్టుగా తోస్తోంది నాకు.


టిఫిన్ ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి కదా..లేకపోతే కొత్త కోడలిగా నాకు చెడ్డ పేరు.. అందరూ నన్నే అంటారు. ఆడవారి ఆల్ టైం ఫేవరేట్ టిఫిన్, చెయ్యడానికి సులువైనది..పోపులో వేస్తే అయిపోయేది..ఆడవారికి వరమైన టిఫిన్ ఉప్మా ఉండనే ఉంది కదా..చక చక చేసేసాను.


"ఏమండీ..! ఇదిగోండి టిఫిన్..తిని ఆఫీస్ కి వెళ్ళండి. కొన్ని రోజులు ఆఫీసు క్యాంటీన్ లో తినేయండి..రాత్రికి నేను కమ్మగా చేసి వడ్డిస్తాను".


"సరే లావణ్య.."


టిఫిన్ తిని ఆయన ఆఫీస్ కి వెళ్ళారు. ఇక నెక్స్ట్ ఏమిటో..? అందిరికి టిఫిన్ ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను..ఎవరికి వారు పెట్టుకుని తినేసారు. బాగుందని ఒక మాట అంటే..వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా..? ఏమైనా మా ఆయన.. నా సంసారం నాకు ముఖ్యం..


ఇలా అందరికి సేవలు చేస్తూనే సంవత్సరాలు గడచిపోయాయి. మా అత్తగారు కాలం చేసారు..ఆవిడకు సేవ చేసి నా జీవితం సగం అలసిపోయింది. ఆ తర్వాత నాకు కొడుకు పుట్టాడు. పక్షవాతంతో పూర్తిగా మంచం పట్టిన మావగారికి సేవలు చేస్తూ.. మరో పక్క మావారిని, అబ్బాయిని చూసుకోవడంతో సరిపోయింది నాకు.


ఒకరోజు మా ఆడపడుచు..సరాసరి పెళ్ళి చేసుకుని జంటగా ఇంటికి వచ్చేసింది. మా ఆయన చాలా కోపంగా అడిగితే, చాలా కాలంగా ప్రేమలో ఉన్నామని, తప్పక పెళ్ళి చేసుకోవల్సి వచ్చిందని మా ఆడపడుచు సమాధానం. ఏమీ అనలేని తండ్రి..ఏమైనా అంటే..ఏమైపోతుందో అని అన్న ప్రేమ. మొత్తానికి, కొత్త జంటకి అన్నీ అమర్చి..వారి ముచ్చట్లన్నీ తీరేవరకు సేవలు చేస్తూనే, తెలియకుండానే కాలం గిర్రున తిరిగేసింది.


కొంత కాలానికి మా మావగారు కూడా కాలం చేసారు. అబ్బాయి చదువు కోసం, వేరే ఊరిలో హాస్టల్ ఉంటూ చదువుతున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నది నేనూ.. మా ఆయనే. కానీ ఎంజాయ్ చెయ్యడానికి వయసు లేదు. మా ఆయనకి ఒంట్లో బాగోలేక, ఓపిక బాగా తగ్గింది. సరదాగా ఎక్కడికి వెళ్ళలేము. 


ఇలా ఉండగా..ఒక రోజు మా ఆయన ఆఫీస్ లో హార్ట్ ఎటాక్ తో చనిపోయారని వార్త వచ్చింది. ఏం చెయ్యను..? ఓదార్చడానికి కుడా ఎవరూ లేరు ఇప్పుడు. గుండె రాయి చేసుకున్నాను. అన్న లేని ఇంట్లో ఉండలేనని, మా ఆడపడుచు ఏదో సాకుతో..మొగుడితో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా జీవితంలో..నేను నా కొడుకు బాలు.


నా కొడుకు పెళ్ళి చేసాను. సంవత్సరం తిరగక ముందే, వాడికి కొడుకు పుట్టాడు. ఒక పక్క..కొడుకు కోడలికి వండి పెట్టడం, మరో పక్క మనవడిని చూసుకోవడం..మళ్ళీ మొదటికే జీవితం. కొంత కాలానికి.. కోడలి నాన్నగారు చనిపోవడంతో..వాళ్ళమ్మ వొంటరి అయిపోయిందని తెగ కుమిలి పోయింది కోడలు. 


"మీ అమ్మ ఇక్కడకు వచ్చి ఉంటే, మనకీ బాగుంటుందిగా.. అసలే మనం ఇద్దరం ఉద్యోగాలతో బిజీ కదా .." అన్నాడు అబ్బాయి కోడలితో.

 

"మా అమ్మ కి ఊరిలొనే బాగుందంట. అక్కడ ఆవిడకి ఏమీ లోటు లేదు. ఇక్కడకి వచ్చి ఎందుకు ఇబ్బంది పడడం చెప్పండి..అక్కడే ఉంటుంది లెండి. మీ అమ్మగారు ఎలాగో ఉన్నారు కదా ఇక్కడ" అంది కోడలు. 


'మా అమ్మ మాత్రం ఎందుకు ఇబ్బంది పడాలి...మా అమ్మకి ఏం తక్కువ..? అమ్మకి ఓర్పు ఎక్కువ కాబట్టి..అందరికీ కాదనకుండా సేవ చేస్తుంది. తన కోసం ఎప్పుడూ బతకలేదు...ఈ అంతులేని సేవకి ముగింపు పలకాలి..ఇక్కడ ఇంట్లో మేము ఎలాగో మేనేజ్ చేసుకోవచ్చు' అని తీవ్రంగా ఆలోచించాడు బాలు. 


"అమ్మా...!"


"ఏమిటి బాబు..?"


"ఇదిగో అమ్మా..! ఈ అపాయింట్‌మెంట్ లెటర్ నీ కోసమే.."


లెటర్ ఓపెన్ చేసి చదివిన లావణ్య మనసులో ఆనందం ఉన్నా..బయటకు మాత్రం..


"ఈ వయసులో నాకు ఉద్యోగమేమిటి రా..?"


"నాకు అంతా తెలుసు అమ్మా..! నీకు బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలని.. స్వతంత్రంగా ఉండాలని ఉండేది...ఈ విషయం నీ డైరీ లో చదివాను..ఇప్పటికి కూడా ఈ నీ కోరిక నేనూ తీర్చకపొతే ఎలా..? ఇప్పటికైనా నీ కోసం..నీకు కావల్సిన విధంగా జీవించు అమ్మ..!" అని ప్రేమతో అన్నాడు బాలు. 


*********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


82 views0 comments

Comments


bottom of page