top of page

అనురాగ బంధం


Anuraga Bandham written by Saraswathi Ponnada

రచన : సరస్వతి పొన్నాడ


డాక్టర్ శ్రీధర్ ఆ ఊరికి పేరు మోసిన పెద్ద డాక్టర్. ...భార్య డాక్టర్ శ్రావణి, మేనరికమే చేసుకున్నాడు....


వారి స్వంత హాస్పిటల్ ...ఎప్పుడూ రోగులతో కిటకిటలాడుతుంది. శ్రీధర్ పిడియాట్రిషియన్ , శ్రావణి గైనకాలజిస్టు...


వారుండే ఏరియాలో ఇళ్ళన్నీ ధనవంతులవే. పెద్ద పెద్ద పొజిషన్ లో వున్నవారివే. అక్కడ వున్న వారి పిల్లలందరూ పెద్ద రెసిడెన్షియల్ స్కూల్లో, వేరే రాష్ట్రాలలో చదువుతున్నారు. ఒకరి మించి ఒకరు, అలా జేర్చడం వారికి స్టేటస్ సింబల్.


డబ్బు వుండడంతో చిన్నప్పటి నుండి వారిని ఇంటికి దూరం చేసి వారికి ఉన్నత విద్యను ఇవ్వాలనే తపన తప్ప...వారు ఏ స్పర్శ, అనురాగానికి దూరం అవుతున్నారో మరచిపోతున్నారు..డబ్బు సంపాదించడం... ఏలోటూ లేకుండా పెంచుతున్నామని మాత్రమే అనుకుంటున్నారు...వారిలాగే వాళ్ళ పిల్లలని యాంత్రికంగా తయారు చేస్తున్నారు...


శ్రీధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు శ్రేయస్,శ్వేత ...ఇంటి నిండా నౌకర్లు...వంటమనిషి కాకుండా పిల్లల సంరక్షణకు ఒక ఆయా. శ్రావణి కేసులు లేనప్పుడు పిల్లలతోనే ఎక్కువ గడిపేది. ఆ సమయం పిల్లలకు చాలా ఆనందంగా వుండేది.


వాళ్ళు స్కూల్లో చేరే సమయం వచ్చే వరకూ బాగా ఆనందంగా జరిగింది. శ్రేయస్ ని ఊటీ లో రెసిడెన్షియల్ స్కూల్లో వేసినప్పుడు ...వాడికి మొహం వాడిపోయింది. వెళ్ళడానికి ఇష్టపడలేదు...ముందునుండి ప్రిపేర్ చేసినా....


శ్వేత అయితే గొడవ గొడవ చేసింది అన్నయ్య ని పంపవద్దని...


శ్రావణి కొడుకు తో "శ్రేయస్! నీవు బాగా చదువుకుని డాడీ అంత వాడివి అవ్వాలంటే...శ్రద్ధగా చదువుతున్నావో లేవో ఎప్పుడు కనిపెట్టుకుని వుండాలి నాన్నా! ...మా షెడ్యూల్ టైం లో మేము బాధ్యత గా అలా చూడలేము. మా తదనంతరం ఈ హాస్పిటల్ మీరే చూసుకోవాలి. దానికి మంచి చదువు కావాలి... మన ఇరుగు పొరుగు పిల్లలంతా అలా చదువుతున్నవారే. అక్కడ అన్ని వసతులతో...మంచి చదువు నేర్పిస్తారు" అని నచ్చచెప్పింది.


అన్నయ్య వెళ్ళేక శ్వేత వంటరిదయింది..సంవత్సరం కి ఒకసారి శెలవులకు వచ్చేవాడు. అతనున్న రోజులూ ఎంతో ఆనందంగా వుండేది శ్వేతకి.


రెండేళ్ళకి ఆ సంవత్సరమే శ్వేత ని అదే స్కూల్లో జేర్చాలి. ఆవిషయం తెలిసినప్పటి నుండి ఉత్సాహం పోయింది శ్వేతలో. ఇంక రెండు రోజులలో జేర్చుతారనగా...హైఫీవర్ వచ్చింది శ్వేతకి. ఒళ్ళు తెలియని స్థితిలో హాస్పిటల్ ల్లో జేర్చేరు. శ్రేయస్ వెళ్ళేక శ్వేత మరీ దగ్గరైంది శ్రావణి కి.

అంత డాక్టర్ అయినా పిల్ల అలా ఒళ్ళు తెలియక పడివుండడం చూడలేకపోతోంది శ్రావణి...


విపరీతంగా కలవరిస్తోంది అస్పష్టంగా శ్వేత …” నన్ను పంపించేయద్దు అమ్మా అంటూ…”


మూసిన కన్నులు మూడో రోజు తెరిచింది శ్వేత. ఆ మూడు రోజులూ డ్యూటీ వేరే వారికి అప్పచెప్పి కూతురు దగ్గరే వుంది శ్రావణి. కళ్ళు తెరచిన శ్వేతకి ఎదురుగా తల్లి కనపడింది. కూతుర్ని వెంటనే అక్కున జేర్చుకుంది శ్రావణి... నీరసంగా వున్న శ్వేత, తల్లి తన దగ్గరే వుండడంతో ...


“ నన్ను ఎప్పుడూ విడిచి వెళ్ళవద్దు, నీవు నాతోనే వుండాలి “ అమ్మా! అని స్పష్టంగా అంటూ గట్టిగా కావలించుకుంది....


అప్పుడే వచ్చిన శ్రీధర్ ఆ మాటలు విన్నాడు. " నిన్ను విడిచి నేనెక్కడకు వెళతాను తల్లీ అంటూ" దగ్గరకు హత్తుకుంటున్న శ్రావణిని చూసి ...శ్రీధర్ మనసు చలించింది.


మూడు రోజులనుండి శ్వేతని విడవక దిగులుగా కూర్చున్న శ్రావణి ని చూస్తూనే వున్నాడు శ్రీధర్ ...ఎందరినో మాతృ మూర్తులను చేసిన ఈ డాక్టర్ మాతృ హృదయాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. రొటీన్ గా ఎన్నో రోగాలను...వారి బాధలను చూస్తున్నా...మూడు రోజులు నుండీ కన్ను తెరవని కూతురిని, అలాపడి వుండడం చూడలేకపోయారు...ఇద్దరూ. డాక్టర్ల కీ మనసుంటుంది...మమకారం వుంటుంది.. కుటుంబం తో ఎక్కువ గడిపే సమయమే వుండదు.


“అమ్మా! అయితే నన్ను రెసిడెన్షియల్ స్కూలుకు పంపవు కదూ" అని బేలగా అడుగుతున్న కూతురు బాధ అర్థం అయింది.


'అన్నయ్య ని పంపినట్లే తననీ పంపేస్తున్నారని మనసులో దిగులు పెట్టేసుకుని...భయంతో జ్వరం తెచ్చుకుందన్నమాట...వెళ్ళకుండానే ఇంత జ్వరం తెచ్చుకుంది...ఇక పంపిస్తే ఈ పిల్ల మనకు దక్కుతుందా' అని మనసులో అనుకుంటూ, భర్త వంక చూసింది శ్రావణి...


శ్రావణి మనసు అర్థం అయిన శ్రీధర్ తలపంకించి...కూతురుతో " శ్వేతా! నిన్ను విడిచి మేమెక్కడకీ వెళ్ళము...అలాగే నిన్నూ ఎక్కడికీ పంపము..మాతోనే నీవుంటావు" అన్నాడు


"మరి అన్నయ్య" అన్న శ్వేత దగ్గరకు వచ్చి కూర్చుంటూ "అలాగే శ్వేతా! అన్నయ్య ను కూడా తీసుకొచ్చీ ఇద్దరనీ ఇక్కడే మంచి స్కూల్లో జేర్పిస్తాము ... ఓకేనా.... నీవు ఎప్పటిలా ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలి" అని అన్నాడు...ఆమాటతో అంత నీరసంగా వున్న శ్వేత మొహం వేయి ఓల్ట్స్ బల్బులా వెలిగింది....ఇద్దరిని కరుచుకునిపోయింది ఆర్తిగా...

శుభం

సరస్వతి పొన్నాడ 😊


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం : నాపేరు సరస్వతి పొన్నాడ...హైదరాబాద్

చిన్నప్పటి నుండి మనసుకి హత్తుకున్న సంఘటనలు కాగితం మీద పెట్టేద్దాన్ని. ...ప్రమదావనం(ఆంధ్రప్రభ) లో నా పోస్టులు, వంటలు వచ్చేవి. శ్రీశ్రీ, ఆరుద్ర పద ప్రహేళికలు పూరించిడమే కాకుండా బహుమతులు వచ్చేయి. ఒక గ్రూపు లో ప్రహేళిక (గడుల నుడికట్టు) సంవత్సరం పైనే నిర్వహించేను. నన్ను ప్రోత్సాహిస్తున్న మనతెలుగుకథలు ఎడ్మిన్స్ కి ధన్యవాదాలు🙏


76 views1 comment
bottom of page