top of page

అపార్థం

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #Apartham, #అపార్థం, #TeluguStory, #కొసమెరుపు


Apartham - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 16/05/2025

అపార్థం - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



హోటల్ మోతీ ముందు క్యాబ్ దిగి, ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి, గబగబా లోపలకు అడుగుపెట్టి చుట్టూ కలియజూసింది స్రవంతి. ఆమె కళ్ళు సాగర్ కోసం వెతుకు తున్నాయి. హోటల్లో ఓ కార్నర్లో కూర్చొని ఉన్న సాగర్ కనిపించగానే ఆమె ముఖం వికసించింది. 


అప్పుడే అతను కూడా లోపలకు వస్తున్న స్రవంతిని చూసి చేయి ఊపి చిరునవ్వు నవ్వాడు. స్రవంతి కూడా నవ్వుతూ చెయ్యి ఊపి అటువైపు నడిచింది. హ్యాండ్ బ్యాగ్ టేబులుపైన పెట్టి అతని ఎదురుగా కూర్చుందామె. 


"ఇంత ఆలస్యం అయ్యేసరికి నువ్వు ఇక రావనుకున్నాను." చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్.


"క్యాబ్ దొరికేసరికి కొద్దిగా ఆలస్యం అయింది అంతే! ఎందుకు రాననుకున్నారు?" అడిగిందామె మంచినీళ్ళు తాగుతూ. 


"ఎందుకంటే...సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయివి, అందులోనూ పూర్తి కట్టుబాట్లలో ఉన్న అమ్మాయివి నువ్వు కదా! ఎంత మనిద్దరికీ పెళ్ళి కుదిరి, నిశ్చితార్థం జరిగినా బయట తిరగనిస్తారా మన పెద్ద వాళ్ళు, అందులోనూ మీ వాళ్ళు? అందుకే అలా అనుకున్నాను." అన్నాడతను.


ఆమె ఏదో జవాబు చెప్పబోయేంతలో బేరర్ వచ్చి మెనూ కార్డు అందించాడు. సాగర్ ఆ మెనూ కార్డ్ అందుకొని ఇద్దరికీ ఆర్డరిచ్చాడు. 


బేరర్ వెళ్ళిపోయాక నోరువిప్పింది స్రవంతి.


"బిటెక్ చదువుకొని, ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని. ఎంత సంప్రదాయ కుటుంబంలో పెరిగినా, నా మాటలకు మా తల్లి తండ్రులు విలువిస్తారు. నా అభిప్రాయాలను గౌరవిస్తారు. అయినా, వాళ్ళ అనుమతి తీసుకొనే వచ్చాను. మీరు పిలిచారని చెప్పగానే ఒప్పుకున్నారు." అందామె.


"అమ్మయ్య! అయితే అనుమతి తీసుకొని వచ్చావన్న మాట!" నవ్వాడు సాగర్.


ఏమీ మాట్లాడలేదు స్రవంతి. సాగర్ వైపే చూస్తూ అతని మనసులోని భావాలు చదువుతోందామె.


ఈలోగా బేరర్ వచ్చి ఆహారపదార్థాలు వాళ్ళ టేబులు మీద సర్దాడు.


రెండు నెలల క్రితం జరిగిన పెళ్ళి చూపుల్లో సాగర్, స్రవంతీ ఒకరికొకరు నచ్చడంతో పెళ్ళికి ముహూర్తం నిర్ణయించారు ఇరువైపుల పెద్దలు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే. ఎన్నో సంబంధాలు చూసినా ఏవీ కుదరలేదు సాగర్ కి. అన్ని విధాలా స్రవంతి నచ్చడంతో చాలా సంతోషించాడు. 


స్రవంతికి మాత్రం ఇది మొదటి పెళ్ళి చూపే. చాలా సులభంగా పెళ్ళి కుదిరినందుకు ఆమె తల్లి తండ్రులు చాలా సంతోషించారు. మంచి కుటుంబంలోంచి వచ్చిన పిల్ల గనుక సాగర్ తల్లి తండ్రులకూ స్రవంతి బాగా నచ్చింది. వాళ్ళు కూడా ఏ అభ్యంతరమూ చెప్పకుండా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. 


మాఘ మాసంలో పెళ్ళి నిశ్చియించి, ఈ లోగా నిశ్చితార్థం అత్యంత వైభవంగా చేసుకున్నారు. పెళ్ళి నెల రోజుల్లోకి వచ్చేయగా అన్ని ఏర్పాట్లూ చకచకా సాగిపోతున్నాయి. పెళ్ళి మండపం బుక్ చేసారు. క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడేసారు. శుభలేఖలు కూడా అచ్చు వేయించి దూరంగా ఉన్న బంధువులకు, స్నేహితులకు పంపేసారు. రైల్లో రిజర్వేషన్ కోసం ముందుగా తెలపకపోతే తర్వాత ఇబ్బంది కదా! అందరికీ వాట్సప్ లో మెసేజులు కూడా పెట్టేసారు. 


పెళ్ళికి ముందు స్రవంతిని కలుసుకోవడం కోసం తహతహ లాడసాగాడు సాగర్. ఇద్దరికీ ఆఫీసు వేళలు వేర్వేరు కావడంతో ఇప్పటివరకూ కలసుకోలేకపోయారు. ఈ రోజు ఆదివారం ఎలాగైనా కలిసి లంచ్ చెయ్యాలని నిశ్చయించుకొని స్రవంతికి ఫోన్ చేసి చెప్పాడు. అందుకు అంగీకరించింది ఆమె.

"నాకు పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం. అలాగే వెజిటేబుల్ బిర్యాని. నీకూ అవి ఇష్టమైనవే అనుకుంటాను." అన్నాడు సాగర్.


తలూపింది స్రవంతి. తన ఇష్టాయిష్టాలు ముందే అతను తెలుసుకున్నట్లు గ్రహించిందామె.


"ఏమైనా మాట్లాడు. ఇక్కడికి నిన్ను పిలిచింది కలిసి మాట్లాడుకుంటూ భోజనం చెయ్యాలని. నీ చిన్నప్పటి విషయాలు, స్కూలు, కాలేజీలో చదివినప్పుడు విశేషాలు, అలాగే చేస్తున్న జాబ్ గురించి. అలాగే నీ హాబీస్, నీకిష్టమైన సినిమాలు గురించి కూడా చెప్పొచ్చు." నవ్వుతూ అన్నాడు సాగర్.


"స్కూలు, కాలేజీలో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకొనేదాన్ని. బి.టెక్ కూడా మంచి కాలేజీలోనే పూర్తి చేస్తాను. క్యాంపస్ సెలెక్షన్లో సులభంగానే ఉద్యోగం దొరికింది. ఇక హాబీల విషయానికి వస్తే, కవితలు, కథలు రాయడం అంటే నాకిష్టం. ఇక మీ గురించి చెప్పండి." చాలా టూకీగా తన గురించి చెప్పింది స్రవంతి.


"అంతేనా, మరే విశేషాలు లేవా!" ఎందుకో అతని కంఠంలో నిరుత్సాహం ధ్వనించిందామెకు.


తల అడ్డంగా ఊపిందామె.


"నాకైతే పెద్దలు కుదిర్చిన సంబంధం కన్నా ప్రేమ వివాహం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది, కానీ తప్పింది కాదు." అంటూ స్రవంతి వైపు చూసాడు ఆమె ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ. 


అయితే, సాగర్ అనుకున్నట్లుగా ఆమె మొహంలో ఏ భావాలూ వ్యక్తమవలేదు.


"పెళ్ళికి ముందే మనసు విప్పి మాట్లాడుకోవటం చాలా ముఖ్యం. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవాలి, కాదంటావా?" అన్నాడు సాగర్.


"నిజమే...తెలుసుకోవాలి. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది." అందామె. ఏం చెప్తాడోనని ఆసక్తిగా అతనివైపు చూసిందామె. 


"ప్రేమించి పెళ్ళి చేసుకోవాడం నా అభిలాష అని చెప్పాను కదా! కాలేజీలో చదువుతుండగా ప్రమీల అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఇద్దరం కలిసి షికార్లు, సినిమాలకు తిరిగాం. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం, కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఆమెకు మరో సంబంధం నిశ్చయించి పెళ్ళి చేసేసారు. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్న నా కోరిక తీరేదెలా? 


అందుకే ఉద్యోగంలో చేరిన కొత్తలో మా కోలీగ్ సుష్మ అంటే ఇష్టపడ్డాను, కానీ అప్పటికే ఆమె మరొకర్ని ప్రేమించిదని, అతనితో పెళ్ళి కూడా నిశ్చయమైందని తెలిసి నిరాశ చెందా! ఆ తర్వాత మా పెద్దవాళ్ళు ఒత్తిడి చేయగా కొన్ని పెళ్ళి సంబంధాలు చూసినా ఏవీ నచ్చలేదు. చివరికి, మన పెళ్ళి చూపులు జరిగాయి. నువ్వు బాగా నచ్చావు. మీ కుటుంబం, సంప్రదాయాలు మా వాళ్ళకి నచ్చాయి. మన పెళ్ళి కుదిరింది." అని చెప్పి స్రవంతి ముఖంలోకి చూసాడు సాగర్.


సాగర్ చెప్పినదంతా జాగ్రత్తగా విందామె.


"కాలేజీలో చదువుతున్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమ అన్నది చాలా సహజం. మన ఇద్దరి మధ్యా ఏ రహస్యాలూ ఉండకూడదని నీకీ విషయాలు చెప్పాను. నీకూ అలాగే ఏవైనా ప్రేమ వ్యవహారాలు ఉండి ఉంటే నిరభ్యంతరంగా చెప్పవచ్చు. నేనేమీ అనుకోను. నాది విశాల హృదయం." అన్నాడు ఆమెవైపు చూస్తూ.


ఒక్కక్షణం తటపటాయించింది స్రవంతి. చెప్పాలా వద్దా అని ఆలోచించింది.


"పర్వాలేదు చెప్పు, నేను అర్ధం చేసుకుంటాను." అన్నాడు సాగర్.


చెప్పక తప్పిందికాదామెకు. తన గురించి సాగర్ పూర్తిగా చెప్పినప్పుడు, తను చెప్పడంలో తప్పు లేదనిపించింది స్రవంతికి.


"స్కూలు, కాలేజీలో చదివేటప్పుడు నాకెవరూ పెద్దగా స్నేహితులు లేరు. అయితే అయిదేళ్ళ క్రితం అమెరికా నుండి ఒకరోజు మా ఇంటికి మా బావ వచ్చాడు అత్తయ్యతో. అప్పటివరకూ మా బావని చూసి ఎరగను. అదే మొదటిసారి చూడటం. ఎర్రగా, బొద్దుగా చాలా ముద్దుగా ఉంటాడు మా బావ. అతన్ని చూడగానే నా మనసు పారేసుకున్నాను. అతనంటే నాకు చాలా ఇష్టం..." చెప్తున్నది ఆగి సాగర్ మొహంలోకి ఓరగా చూసింది స్రవంతి.


సాగర్ మొహంలో అసూయా ద్వేషాలు కొట్టొచ్చినట్లు కనపడసాగాయి. అతనికి షాక్ తగినట్లు అనిపించిందామెకు. సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఆమెకు కూడా లవ్ అఫైర్ ఉంటుందని ఊహించని సాగర్ నిర్ఘాతపోయాడు. తింటున్నవాడల్లా ఆగిపోయి ఏం చెప్తుందోనని ఆమె వైపే అతృతగా చూడసాగాడు. 


"బావను ముద్దు పెట్టుకున్నాను. ముద్దులు పుచ్చుకున్నాను కూడా. నాతో సినిమాకు తీసుకెళ్ళడమే కాకుండా, అత్తయ్య అక్కడున్నాళ్ళూ ఇద్దరం కలిసి తిరిగాం. మాకెవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటికీ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటాం. మనిద్దరిమధ్యా ఏ రహస్యాలూ ఉండకూడదని మీరు చెప్పారు గనుక నేను కూడా నా గురించి పూర్తిగా చెప్పాను, అంతే!" అంది స్రవంతి.


అతని మొహంలో రంగులు మారడం గమనించింది స్రవంతి. కళ్ళు ఎర్రబడ్డాయి. అతని మొహంలో కోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. గబగబా సీట్లోంచి లేచి వాష్ బేసిన దగ్గరకెళ్ళి చెయ్యి కడిగేసుకున్నాడు.


తిరిగి వచ్చాక అడిగిందామె, "ఏమైంది, పూర్తిగా తినకుండా మధ్యలోనే చెయ్యి కడిగేసుకున్నారు?"


రెండు నిమిషాలపాటు ఏమీ మాట్లాడలేకపోయాడు సాగర్. ఇది అతను ఊహించనిది. తనకేం లవ్ అఫైర్ లేదని చెప్తుందనుకున్నాడు.


"మీ బావనే పెళ్ళాడలేకపోయావా? బావను ప్రేమించి నన్నెందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నావు? అమెరికా సంబంధం కదా, ఎందుకు వదులుకున్నావు?" అన్నాడు ఉక్రోషంగా.


గట్టిగా నవ్వేసింది స్రవంతి. అది చూసి అతని కోపం మరింత పెరిగింది.


"ఓహో...మీ బావ నిన్ను వదిలేసి ఇంకెవర్నైనా పెళ్ళి చేసుకున్నాడా?" అన్నాడు వ్యంగ్యంగా.


"ఛ...పెళ్ళి చేసుకోవడమేమిటి? ఇప్పుడింకా స్కూల్లోనే చదువుతున్నాడు మా బావ." అందామె నవ్వుతూ.


బిత్తరపోయాడు సాగర్.


"అవును మరి, మూడేళ్ళ వయసున్నప్పుడు మా ఇంటికి వచ్చాడు. చాలా ముద్దుగా ఉంటే...ముద్దు పెట్టుకోనా ఏమిటి? నా దగ్గరే పడుక్కున్నాడు కూడా." అనేసరికి సాగర్ మొహంలో రంగులు మారాయి.


"అంటే..." బిత్తరపోయి ఆమె వంక చూసాడు సాగర్.


"అంటే, మహానుభావా...మా బావ నా కన్నా పదిహేనేళ్ళు చిన్న! ఇప్పటికైనా తెలిసిందా? మీ ప్రేమ విశేషాలు మీరు దాచకుండా చెప్పేసారుగానీ, నేను చెప్పిన విషయం మాత్రం మీరు జీర్ణించుకోలేకపోయారు, కదా! 


మీరైతే మొగవాళ్ళు, ఏమైనా చెల్లుతుందనుకున్నారేమో! నాకేదైనా ప్రేమ వ్యవహారం నిజంగానే ఉండి ఉంటే, ఏం చేద్దురో? మీకో న్యాయం, మాకో న్యాయమా? ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోను అంటే..." 


"నన్ను క్షమించు స్రవంతీ. నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు నా అపోహ పూర్తిగా తొలగిపోయింది. నా ప్రేమ వ్యవహారం అంతా నిజం కాదు..." అంటూ ఇంకా చెప్పబోతూంటే అడ్డుపడిందామె.


"ఆ విషయం నాకూ తెలుసు. నన్ను కేవలం టెస్ట్ చెయ్యడానికే మీరు కథ కల్పించి చెప్పారని తెలుసు. మీ గురించి మా నాన్నగారు అన్నీ విచారించే పెళ్ళి కుదిర్చారు. నన్ను మీరు ఆటపట్టించినట్లే, మిమ్మల్ని కూడా ఆటపట్టించాలనుకున్నాను. కాని, మీరు ఏ మాత్రం తెలుసుకోకుండా నిజమని నమ్మేసారు." అంది స్రవంతి.


తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు సాగర్. "నన్ను క్షమించు స్రవంతీ. పెళ్ళి చూపుల్లోనే నిన్ను మనస్పూర్తిగా ప్రేమించాను. నాకు చెందవలసిన నువ్వు మరెవర్నో ఇష్టపడటం సహించలేకపోయాను. నేను చేసిన తప్పుకు పరిహారంగా నీ బావను నేను కూడ ముద్దుపెట్టుకుంటాను, సరేనా!" అన్నాడు ఆమె చేతులు పట్టుకుంటూ.


వాస్తవం, ప్రస్తుత పరిస్థితి గ్రహించాడు సాగర్. చాలా కష్టం మీద తనకీ సంబంధం కుదిరింది. ఈ సంబంధం వదులుకుంటే తనకి మళ్ళీ పెళ్ళి కుదురుతుందో లేదో! రోజులు మారాయి. నిశ్చితార్థం జరిగిపోయినా, పీటల మీద పెళ్ళి ఆగిపోయినా అమ్మాయికి చాలా సులభంగా మరో పెళ్ళి తొందరలోనే కుదిరిపోతుంది. 


ఎటొచ్చీ తనే అభాసుపాలవుతాడు. స్రవంతి గురించి అన్నీ తెలిసి, ఆమెను టెస్ట్ చెయ్యాలనుకోవడం ముమ్మాటికీ తన తప్పే! అందుకే తన తప్పు ఒప్పేసుకున్నాడు.


నవ్వేసింది స్రవంతి. సాగర్ హృదయం తేలికపడింది. 


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


bottom of page