top of page
Original.png

అరుణ కిరణాలు

#KollaPushpa, # కొల్లాపుష్ప, #ArunaKiranalu, #అరుణకిరణాలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Aruna Kiranalu - New Telugu Story Written By Kolla Pushpa

Published In manatelugukathalu.com On 20/01/2025

అరుణ కిరణాలు - తెలుగు కథ 

రచన: కొల్లా పుష్ప

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ఐదుకే చీకట్లు ముసురుకుంటున్నాయి. 'ఆ సాయం సంధ్యా సమయంలో ఎదురుగుండా చక్కటి కనుముక్కు తీరుతో  ఉన్న భార్య నవ్వుతూ కాఫీ అందిస్తుంటే ఆ సంతోషమే వేరు' అనుకున్నాడు కిరణ్.


"కొత్త సంవత్సరం రాబోతుంది కదా! నీకేం కావాలి?” అన్నాడు ఉషారుగా భార్య అరుణను.    


"నాకేమీ అక్కర్లేదు మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే చాలు" అన్నది భర్త పక్కనే కూర్చుంటూ.


"భలే దానివే.. భర్త కోరుండి అడిగితే కాదనే భార్యలు ఉంటారా?" అన్నాడు నవ్వుతూ కిరణ్.      


"అయితే మీరు కొత్త స్కూటర్ కొనుక్కోండి ఎప్పుడు రిపేర్లతోటే మీకు గడిచిపోతుంది కాలం. అదే కొత్త స్కూటర్ ఉంటే పాప, మీరు, నేను ఎక్కడికైనా షికారుకు వెళ్లొచ్చు" అన్నది కాఫీ కప్పు పట్టుకెళుతూ.

 

@@@


కిరణ్ అరుణలవి మధ్యతరగతి కుటుంబాలు పెద్దలు చేసిన పెళ్లి.పెళ్లయి ఐదు సంవత్సరాలు అయింది. కిరణ్ ఒకప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. వారికి ఒక ముద్దులొలికే పాప రమ్య.     


'ఉన్నంతలో సంసారం చక్కగా నడుపుకుంటూ వస్తుంది. ఏనాడు ఇది కావాలి అది కావాలని ఇబ్బంది పెట్టలేదు భర్తను. అలాంటి అరుణకు మంచి చీరైన కొనిపెట్టడం తన ధర్మం' అనుకున్నాడు కిరణ్. 


"నాన్న, నాన్న.. అమ్మ రమ్మంటుంది" అన్నది పాప ముద్దు ముద్దుగా.  ఆ మాటలకు ఆలోచన నుంచి బయటపడి పాపని ఎత్తుకొని ముద్దాడి లోనికి నడిచాడు కిరణ్. 


@@@


ఆఫీసులో పని చూసుకుని బయటికి వచ్చాడు. ఈరోజు ఎలాగైనా అరుణకు చీర కొనాలని సెంటర్ వైపు పోనిచ్చాడు బండిని. సాయంత్రం సమయం రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి. ఆగి ఆగి బండి పోనిస్తున్నాడు. మెల్లిగా  టర్నింగ్ తీసుకుందామని బండి తిప్పాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న కారు గుద్దేసింది. ప్రక్కనున్న రాయి మీద పడ్డాడు. అక్కడున్న వాళ్ళ సాయంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. 


మందులు రాసిచ్చి "ఒక వారం రెస్ట్ తీసుకోండి సరిపోతుంది"అన్నాడు డాక్టర్. 


ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. అన్నీ భార్య చేసి పెడుతూ ఉంటే తింటూ పాపతో ఆడుకునేవాడు. వారం రోజులు హాయిగా గడిపేసాడు. ఆరోజు ఆఫీస్ కి వెళ్దామని బండి తీయబోయాడు.

 "అమ్మా" అంటూ కూలబడిపోయాడు.


"ఏమండీ" అంటూ అరుణ పరిగెత్తుకుంటూ వచ్చింది. 


"నొప్పి భరించలేకపోతున్నాను" అంటూ విలవిలలాడిపోయాడు కిరణ్. వెంటనే హాస్పిటల్కి వెళ్లారు.


డాక్టర్ పరీక్షించి కొన్ని టెస్ట్ లు,ఎం.ఆర్.ఐ స్కాన్ తీయమని చెప్పాడు. అన్ని చేయించారు. రిపోర్ట్లు వచ్చాయి. 


"నడుము క్రిందన ఎయిర్ లైన్ క్రాక్ అయింది, అందుచేత మీరు మూడు నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి" అని చెప్పడంతో కిరణ్ కి మతిపోయింది.


'ముందు వారం అంతా సెలవు లో బాగానే ఉన్నాడు కానీ మూడు నెలలు అంటే జీతం రాదు సంసారం ఎలాగా?' అని మదనపడుతూ ఏమీ చేయలేక లేవలేక ఆ కోపాన్ని అంతటిని భార్య మీద చూపించడం ప్రారంభించాడు.


ఆమె ఏమాత్రం చలించిపోకుండా ఎప్పటిలాగే అతనికి సేవలు చేస్తుంది.

రోజులు గడుస్తున్న కొద్ది ఆమె సహనం అతనిలో మరింత అసహనంగా తయారయింది.


చీటికిమాటికి తిడుతూ ఉండేవాడు కారణం లేకుండానే ఒకరోజు కిరణ్ ఫ్రెండ్ ప్రసాద్ వచ్చాడు.

"రారా ప్రసాదు.. చూడరా మీ చెల్లాయి పిలిస్తే వెంటనే పలకదు. మంచాన పడేసరికి ఆమెకు లోకువైపోయాను. నేనేమన్నా సమాధానం చెప్పదు. సేవలైతే చేస్తుంది తప్పదన్నట్లుగా" ఇంకా అలా అరుణ గురించి చెప్తూనే ఉన్నాడు. 


భార్య గురించి అన్ని చెప్తుంటే మౌనంగా విన్న ప్రసాదు "ఒరేయ్ కిరణ్. ఆగరా.. చెల్లాయి మీద నిందలు వేయకు,  నువ్వు చేస్తున్నది చాలా తప్పురా. నీకు సమాధానం చెప్తే వాదన పెరుగుతుందని ఆమె సమాధానం చెప్పటం లేదు. ఇంక పిలిస్తే  రావటం లేదని అంటావా? ఆమె ఏదో పనిలో ఉందని ఆలోచించవా నువ్వు" అన్నాడు ప్రసాద్.


"ఏం పని చేస్తుంది? ఇద్దరు మనుషులకు వండడం పెద్దపనా" అన్నాడు దురుసుగా.


"ఆమె ఏం చేస్తుందో నీకు తెలిస్తే ఆశ్చర్యపోతావ్. ఈ నెల రోజుల నుంచి ఇల్లు ఎలా గడుస్తుందో గమనించవా? ఆమె చేస్తున్న ఈ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు…


నీకు చేతనైతే ఆమెకు ఏదైనా సహాయం చేయి. లేకపోతే నీకు నచ్చిన పని ఏదైనా చేయి. అంతేకానీ అంతటి సహన మూర్తిని  ఆమెను ఏమీ అనకు.  నీ కూతురు కూడా నీ కోపం చూసి దగ్గరకు రావటం లేదని ఉన్న ఈ ఒక్క గంటలోనే గమనించాను" అన్నాడు ప్రసాద్ కిరణ్ కి నచ్చ చెప్తున్నాట్లుగా.


"నన్నేం చేయమంటావు రా.. తీరికగా ఇలా పడుకోలేకపోతున్నాను" అన్నాడు బేలగా.


"ఈ కొత్త సంవత్సరం వచ్చే లోపు ఒక లక్ష్యంగా పెట్టుకో, ముందు జీవితం పట్ల ఆశను పెంచుకో నిరాశను వదిలేయ్... ఇంటర్నెట్ పెట్టించు. ఆన్లైన్ జాబ్స్ బోలెడు ఉన్నాయి. నీకు నచ్చింది చెయ్యి. 


నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పు, ఇంకా ఖాళీ ఉంటే ఏదో ఒక  కంపెనీతో టైయప్ అయి కస్టమర్ ప్రశ్నలకు  జవాబులు ఇవ్వడం ఇలా ఎన్నో పనులు ఉంటాయి రా! శ్రీశ్రీ గారు ఏమన్నారు తెలుసు కదా పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప, ముంచి బతకడం గొప్పకాదు మంచి బతకడం గొప్ప రా " అని అన్నారు.


 "నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేలాగా బతుకు. అంతేకానీ నువ్వు డిప్రెషన్ లోకి వెళుతూ చెల్లాయిని కూడా అదః పాతాళానికి తొక్కేయకు" అని ప్రసాదు వెళ్ళిపోయాడు. 


@@@


ఆ మాటలు బాగా పనిచేసాయి కిరణ్ కి. ఆ దిశగా ప్రయాణించాడు. మంచం మీద పడుకునే సెల్ ఉపయోగించి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నాడు.

మర్నాడు భార్య లేచి బయటికి వెళ్లగానే మెల్లిగా లేచి హాల్లోకి వచ్చి పడుకున్నాడు భార్య కోసం ఎదురుచూస్తూ.


 కొంతసేపటికి రెండు సంచులు నిండా కూరలు తెచ్చింది అరుణ.  అవన్నీ బకెట్లో వేసి  కడిగి పాత దుప్పటి వేసి ఆరబెట్టింది. ఇంతలో అప్పుడే లేచిన పాప కూడా తల్లికి తన చిట్టి చేతులతో సాయం చేస్తుంది అలవాటు అయిన పనిలా.


పక్కింటి పిన్ని గారు "అమ్మాయి అరుణ.. మీ బాబాయి గారికి ఒంట్లో బాగోలేక బజారుకు వెళ్లలేదమ్మా రెండు రకాల కూరలు ఇవ్వు" అన్నది చెంగున కట్టిన డబ్బులు అరుణకి ఇస్తూ.     


"మెల్లిగా పిన్ని గారు ఆయన లేస్తారు" అన్నది చాలా మెల్లిగా అరుణ.


 "నిజమే అమ్మాయి.. మర్చిపోయాను భర్తకి బాగోలేక ఇటువంటి పనిచేస్తున్నావు. అతనికి తెలిస్తే ఏమంటాడో అని నీ భయం, చిట్టితల్లి కూడా నీకు పనిలో సహాయపడుతున్నట్టు ఉంది" అంటూ పాప  బుగ్గలు ముద్దాడి కూరలు తీసుకుని వెళ్ళిపోయింది.

 

"అత్తా! అమ్మ పచ్చిమిర్చి, అల్లం ఇమ్మంది" అన్నది ఎదురింటి పాప.    


"అలాగేనమ్మా" అంటూ పాపకి కావలసినవి  ఇచ్చి పంపి, కొన్ని కూరలు వంట గదిలోకి తీసుకెళ్లింది.

కొద్ది సేపటికి వంట గదిలోంచి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి.


"అక్కా ఒక 20 రూపాయలు వంకాయ కూర ఇవ్వవా" అంటూ వచ్చాడు పక్క మేడ మీద గదిలో అద్దెకుండే కుర్రాడు.     


అలా ఎవరో ఒకరు పచ్చి కూరలు కావాలని, వండిన కూరలు కావాలని వస్తూనే ఉన్నారు.


ఇవన్నీ గమనిస్తున్నాడు కిరణ్. 'తను మంచాన పడటంతో భార్యకెంత కష్టం వచ్చింది. ఏ ఒక్కనాడు విసుక్కోకుండా తనకు సేవలు చేస్తూ, కుటుంబం గడవడానికి ఇన్ని పనులు చేస్తూ ఉంటే, తనేమో పిలిచిన వెంటనే పలకలేదని తిడుతూ ఉన్నాడు. తను ఎంత తప్పు చేశాడు' పశ్చాత్తాపంతో కళ్ల వెంట నీరు కారాయి కిరణ్ కు.


"అరుణ.. ఇలా రా" అంటూ పిలిచాడు కిరణ్ కళ్ళు తుడుచుకుంటూ.   


"ఏమైందండీ ఏం కావాలి" అన్నది అరుణ పక్కనే కూర్చుంటూ.


"నేను తప్పు చేశాను నిన్ను చాలా బాధపెట్టాను. నన్ను క్షమించవా?" అని అడిగాడు భార్య చేయి పట్టుకుంటూ.

 

"అయ్యో అంత మాట అనకండి. మీకు బాగోలేదు గాని లేకపోతే నన్ను ఎంత బాగా చూసుకునేవారు, నాకు తెలియదా?" అంటూ ఎవరో పిలవడంతో బయటకు వెళ్ళింది.


మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 

ఇళ్లల్లో అదనంగా మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి గుడి దగ్గర ఉన్న పేదవాళ్లకు పంచిపెట్టి వచ్చింది. 


అలాగే ఇంటికి వచ్చిన వాళ్లకు "ఏమైనా పాత బట్టలు ఉంటే ఇవ్వండి" అని వాటిని కూడా సేకరించి అనాధాశ్రమంలో ఇవ్వడం చేయడం చూశాడు. భార్య చేస్తున్న పనులకి ఆనందంతో పొంగిపోయాడు. 

'బాధ ఒక టీచర్ లాంటిది. మనకు రెండు విషయాలను నేర్పుతుంది. ఒకటి భవిష్యత్తులో మనకు వచ్చిన ఇబ్బందులను ఎలా తట్టుకోవాలనే విషయాన్ని, రెండు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తే ఏం చేయాలో అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆ బాధలోంచే మనకు మార్గ నిర్దేశం ఏర్పడుతుంది' అనిపించింది కిరణ్ కు.



@@@


 కొత్త సంవత్సరం వచ్చింది. ఇటు కిరణ్ అటు అరుణ తమ పనుల్లో బిజీ అవుతూనే తమలాగ ఇబ్బంది పడే వారందరికీ సాయం చేస్తూ, తమకున్నంతలో కొంతమంది పేద పిల్లలకు చదువు ఉచితంగా చెప్తున్నాడు కిరణ్.  


ఇళ్లల్లో అదనంగా ఉండే ఆహారాన్ని పారేయకుండా వాటిని సేకరించి పేదవాళ్లకు పంచిపెట్టడం, పాత బట్టలను సేకరించడం వాటిని అనాధాశ్రమంలో ఇవ్వడం చేస్తుండేది అరుణ.


అరుణ కిరణాలు అనే సంస్థను స్థాపించి సమాజ సేవకు నడుం కట్టారు ఇద్దరూ. కిరణ్ బాగయ్యాక  తాము చేస్తున్న పనులను వదిలిపెట్టకుండా మరింత సమాజ సేవ చేసే వైపుగా ప్రయాణిస్తున్నారు.   కొత్త సంవత్సరం వారికి వారితో ఉన్న వారందరికీ పూలబాటను చూపించింది.


  కొత్త సంవత్సరం వారి జీవితానికి పూలబాట వేసింది.

                               

                    శుభం 

కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page