top of page

ఆషాఢం - పార్ట్ 1



'Ashadam - Part 1/4' - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 22/08/2024

'ఆషాఢం - పార్ట్ 1/4'  పెద్ద కథ ప్రారంభం

రచన: అల్లు సాయిరాం 

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



వర్షాకాలంలో అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చే తొలకరి జల్లులతో పచ్చగా ఉన్న చెట్ల ఆకుల సందుల మధ్య నుంచి సూర్యోదయ కిరణాలు ప్రసరిస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, పక్షులు కిలకిలరావాలు చేస్తున్నాయి. నాట్లు వెయ్యడానికి సిద్ధంగా ఆకు నారుమళ్లు, పొలాల పనులు చెయ్యడానికి వెళ్తూ, వస్తూన్న రైతులతో, కూలీలతో దారిపొడవునా హడావిడిగా ఉంది. 


ముందు ముందంతా, వర్షాలు పడిపోయి, వర్షాలు యిలాగే పడతాయని రైతులని భ్రమలోకి దించేసి, తీరా ఆకు నారులు పోశాక, నాట్లు వేశాక, వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తూ మెడలు నొప్పులు పుట్టేలా ఎదురు చూపించుకోవడం అలవాటైపోయింది అని ఊరి వీధుల్లో మాట్లాడు కుంటున్నారు. 


వారి మధ్య నుంచి బుల్లెట్ హారన్ కొడుతూ వస్తున్న వినయ్ ని చూసి “గణపతి కొత్త అల్లుడు వస్తున్నాడు!” అని మాటలు మారాయి. 


వినయ్ పెళ్లి తర్వాత ఊరిలో తాను తెలిసినవారు, తనకి తెలిసినవారు, కొత్తగా బంధువులు అయినవారు నవ్వుతూ పలకరిస్తుంటే, తనకి పూర్తిగా తెలియకపోయినా మొహమాటంతో నవ్వుకుంటూ పలకరిస్తూ బుల్లెట్ ఆపకుండా వస్తున్నాడు వినయ్.

 

 ఊరిలో రామమందిరం నుంచి దేవుడి పాటలు వినిపిస్తున్నాయి. ఆ పాటలు వింటూ యింట్లో పనిచేసుకుంటున్న నీలిమ, యింటి ముఖద్వారానికి పచ్చని తోరణాలు కట్టి, గుమ్మం ముందు అందంగా ముగ్గులు వేస్తుంది. తమ యింటి వైపుగా వీధిలో వస్తున్న బుల్లెట్ బండి శబ్దానికి అటు ఒక చూపు చూసింది. చూస్తే, బుల్లెట్ పై వస్తుంది, తన బావ వినయ్ లా అనిపించి, చెప్పాపెట్టకుండా బావ యిప్పుడు ఎందుకు వస్తాడని, తన కళ్ళని తానే నమ్మలేనట్లుగా మరొకసారి కళ్లు తుడుచుకుని చూస్తే, వస్తున్నది వినయ్ బావ అని తెలిసిపోయిన వెంటనే, నీలిమ ముగ్గు పిండి పట్టుకుని పరుగెత్తుతూ "అక్కా! అమ్మా!" అని అరుస్తూ యింటి లోపలికి వచ్చింది. 


"అబ్బబ్బా! యిప్పుడు ఏమయ్యిందని! ఎందుకిలా అరుచుకుంటూ వస్తున్నావు?" అని వంటింట్లో నుంచి బయటికి వస్తూ అడిగింది రమణమ్మ. 


"మీ కొత్త అల్లుడు వస్తున్నాడంటే, యి మాత్రం అరవకపోతే ఏలా?" అని నవ్వుతూ అంది నీలిమ. 


రమణమ్మ ఆశ్చర్యపోతూ "మా అల్లుడా! అంటే వినయ్ బావ వస్తున్నాడా! ఆషాఢం కదే! బావగారు యిప్పుడు ఎందుకు వస్తున్నాడమ్మా!" అని అంది. 


నీలిమ నవ్వుతూ "ఎదురుగా వెళ్లి ఎందుకు వస్తున్నావు బావ అని అడిగేసి రానా పోనీ! లేకపోతే, ఎందుకు వస్తున్నాడంటే నాకేం తెలుసు! ఒకవేళ అక్క రమ్మందో, బావ అక్కని వదిలి ఉండలేక వస్తున్నాడో! అక్క, బావ లకి మే నెల చివరిలో పెళ్లయింది. 


పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే, ఆషాఢమాసం పేరు చెప్పి సంప్రదాయం ప్రకారం మీరు వెళ్ళి ఆషాఢమాసానికి వారం రోజుల ముందే, జూలై ఒకటో తేదీకి అక్కని పుట్టింటికి తీసుకువచ్చేశారు. మే నెల నుంచి జూలై అంటే మధ్యలో ఉన్నదే నెల రోజులు, అందులో, బావ పనిచేస్తున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి, ఎలక్షన్స్ డ్యూటీలు, ట్రైనింగ్లు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత లెక్కలు చూడడం, వీటికే సగం టైం పోయింటుంది. మరింకేక్కడ అక్క, బావలు కలిసి మాట్లాడుకునేది! 


ఆమాత్రం ఉంటుంది కదా! అక్క బావని రమ్మని పిలిచిందేమో! లేకపోతే అక్క నుంచి విరహాన్ని భరించలేక బావ వచ్చేస్తున్నాడేమో అని నాకు డౌట్ గా ఉంది!" అని అంది. 


"ముదురు మాటలు ఆపు! డిగ్రీలు, డిగ్రీలు చదువులు చదివేశావు. అయినా, బావగారు యింటికి వస్తున్నారంటే, ఎదురుగా వెళ్లి పలకరించకుండా, మనిషిని చూసి యిలా పరిగెత్తుకుని లోపలికి వచ్చేస్తే, మన గురించి ఏమనుకుంటారు! ఆ మాత్రం తెలియదా! ఇదేనేంటి మర్యాద!" అని నీలిమని మందలిస్తూ గాభరాగా యింటి గుమ్మం వైపు నడుస్తుంది రమణమ్మ. 


 ఇంటి ముందు బైక్ పార్క్ చేసి దిగి జుట్టు సర్దుకుంటూ వస్తున్న వినయ్ ని చూస్తూ "అదిగో బావగారు వచ్చేసినట్టున్నారు! తను ఏమనుకుంటారో నాకేం తెలుస్తుంది. అది తననే అడుగు! నేను యి విషయం అక్కకి చెప్పి, మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి!" అని అంటూ చున్నీ ఎగరేస్తూ, మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళింది నీలిమ. 


"తింగరి పిల్ల తయారయ్యింది!" అని చేతిలో ఉన్న గరిటె పక్కన పెట్టి, చేతులు తుడుచుకుంటూ "రా బాబు! బాగున్నారా బాబు!" అని అంటూ వినయ్ కి ఎదురుగా వెళ్ళి, కాళ్లుచేతులు కడుక్కోవడానికి నీళ్ళు యిచ్చింది రమణమ్మ. 


నీళ్ళు అందుకుంటూ "హఁ బాగున్నాను అత్తయ్య! మీరు ఎలా ఉన్నారు?" అని అంటూ కాళ్లుచేతులు కడుగుతున్న వినయ్ ని పైనుంచి కిందికి చూస్తున్న రమణమ్మకి, నీలిమ ఏదో సరదాకి చెప్పినా, వినయ్ వాలకం చూస్తుంటే నిజంగానే ఆషాఢం విరహ వేదనలో ఉన్నట్లనిపించింది. 


వినయ్ కాళ్లుచేతులు తుడుచుకుని, రమణమ్మ చేతికి తువ్వాలు యిస్తున్న కుడా గమనించకుండా, రమణమ్మ తననే తీక్షణంగా చూస్తుంటే "యిదేంటి అత్తయ్య యిలా చూస్తుంది. వాళ్ళ అమ్మాయిని వదిలి వుండలేక వచ్చేశాను అనుకుంటుందా ఏంటి? అయినా అనుకోవడానికి ఏముందిలే, అదే నిజమే కదా!" అని మనసులో అనుకుంటూ, "అత్తయ్య! అత్తయ్య!!" అని గట్టిగా పిలిస్తే, ఊహల్లో నుంచి రమణమ్మ బయటికి వచ్చి, "ఆఁ మేం బాగున్నాం బాబు! లోపలికి రా బాబు!" అని అంటూ లోపలికి పిలిచింది. 


 ఇంటి లోపలికి వచ్చాక, కూర్చోవడానికి కుర్చీ వేసి, ఫ్యాను ఐదులో పెట్టి "కూర్చో బాబు! మీ మామయ్య ఉదయాన్నే పొలానికి వెళ్లి యింకా రాలేదు. నువ్వు వస్తున్నావని ఒకమాట చెప్పుంటే, యింట్లోనే ఉండేవారు. యిప్పుడు అన్నం తినడానికి వచ్చేస్తారు బాబు!" అని రమణమ్మ గుమ్మం వైపు చూసి చెప్తుంటే, వినయ్ చూపులు ఆత్రంగా యింటి నలువైపులా తన భార్య గాయత్రి కోసం వెతకసాగాయి. 


ఆ చూపులు గమనించిన రమణమ్మ "బాబు! మీకు తెలుసు కదా! మీ పెళ్ళికి ముందు, మంచి భర్త రావాలని మా యింటి పేరంటాలమ్మకి తొమ్మిది మంగళవారాలు పూజ చేస్తానని గాయత్రి మొక్కుకుంది. మీ పెళ్లికి ముందు ఏడు వారాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి పనుల హడావిడిలో వారాలు చెయ్యడం కుదరలేదు. ఆషాఢం నెల యిక్కడ ఉంటుంది కాబట్టి, మిగతా రెండు వారాలు పూర్తి చేద్దామనుకుంటుంది. 


గత మంగళవారం ఒక వారం చేసేసింది. ఈరోజు మంగళ వారం కదా, ఈరోజు చివరి మంగళవారం పూజ చేసేస్తే పూర్తి అయిపోతుంది. ఇంతవరకు ఆ పూజ పనులు సిద్దం చేసుకుని, యిప్పుడే స్నానం చెయ్యడానికి వెళ్లింది!" అని వినయ్ అడగకుండానే విషయం వివరంగా చెప్పింది రమణమ్మ. 


తను రావడం గురించి అత్తయ్య ఏమనుకుంటుందో అని కంగారుపడుతూ వినయ్ "ఆఁ వ్రతం గురించి నాకు గాయత్రి చెప్పింది అత్తయ్య! ఈరోజు చివరి పూజ అని చెప్పింది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మా ఆఫీస్ మీటింగ్ కి అవసరమైన ఒక పెన్-డ్రైవ్ కనిపించట్లేదు. గాయత్రి తీసుకొచ్చిన లగేజీ బ్యాగులో ఏమైనా పడిపోయిందేమో, ఒకవేళ ఉంటే పెన్-డ్రైవ్ వెతికి తీసుకు వెళ్దామని వచ్చాను!" అని అన్నాడు. 


వినయ్ బయటికి చెప్తున్నా, లోలోపల గాయత్రిని చూడకపోతే ఊపిరాడనట్టుగా పెరిగిపోతున్న గుండె బరువుతో మాటలు కుడా తడబడుతూ, ఎంతో విరహ వేదనలో ఉన్నాడని వినయ్ ని చూస్తేనే తెలుస్తుంది. అది అర్థం చేసుకున్నాక "అలాగా బాబు! గాయత్రి వచ్చేస్తుంది! నేను వెళ్లి, టీ తీసుకొస్తాను బాబు!" అని అంటూ లోపలికి వెళ్ళింది రమణమ్మ. 


 పెద్దవారి మాట కాదనలేక ఆషాఢమాసం అని వినయ్ దగ్గర్నుంచి వచ్చేసింది కానీ, గాయత్రి మనసంతా వినయ్ దగ్గరే ఉంది. ఏం పని చేసినా వాళ్ళిద్దరి కలిసి ఉన్న క్షణాల జ్ఞాపకాలే! ఒక్కోసారి పూజలు చేస్తున్నప్పుడు కూడా, కోరికల పరవశంలో మనసు అదుపు తప్పితే, దేవుడి ముందు లెంపలు వేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. 


మా ఆయనగారు యిప్పుడు ఏం చేస్తున్నారో అని ఆలోచించుకుంటూ స్నానం చేస్తున్న గాయత్రి దగ్గరికి నీలిమ వెళ్లి "అక్క! బావ వచ్చాడే!" అని చెప్పిన క్షణాన గాయత్రి మనసులో ఉన్న ఫలానా పరుగెత్తికొచ్చి వినయ్ ముందుకి వచ్చేయాలనంత ఉత్సాహం వచ్చినా, అంతలోనే మరొక ఆలోచన చటుక్కున వచ్చింది. 


"ఇప్పుడు, ఆఫీసు టైంలో ఆయన యిక్కడికి ఎందుకు వస్తారు! అది, నాకు ఒకమాట కుడా చెప్పకుండా! వూరికే నన్ను ఆటపట్టించడానికి ఆయన వచ్చారని చెప్తున్నావు కదా నీలిమ!" అని గాయత్రి నమ్మలేక అడిగింది. 


"సరే! నమ్మకపోతే, నీ యిష్టం! ముందు చెప్తే, బాగుంటుంది కదా అని చెప్తే, తిరిగి నన్ను అంటావా!" అని యింట్లోకి వచ్చేసింది నీలిమ. 


"మా ఆయన నిజంగానే వస్తే బాగుణ్ణు కదా!" అని మనసులో అనుకుంటూ స్నానం పూర్తి చేసి గదిలోకి వచ్చింది. 


 రమణమ్మ టీ చేసి, టీ తో పాటు యింట్లో చేసిన అరిసెలు, జంతికలు తీసుకొచ్చి వినయ్ ముందు పెడుతూ "టీ తాగు బాబు! గాయత్రి యింకా రాలేదా! యిది పెళ్లయిన తర్వాత స్నానాలు కుడా గంటలు కొద్దీ చేస్తుంది. పూజకి టైం అయిపోతుందని, తిరిగి మా అందరికి వాయించేస్తుంది! ఉండండి బాబు. పిలుచుకొస్తాను!" అని అంటూ గదిలో ముస్తాబవుతున్న గాయత్రి దగ్గరికి నడుస్తుంది. 


"అల్లుడుగారు వచ్చారమ్మా! బాబు వస్తారని నీకు తెలిస్తే, కాస్త ముందు మాకు చెప్పుంటే, నాన్నకి చెప్పి మటన్, చేపలో తెప్పించేవాళ్ళం కదా! ఇప్పుడుకిప్పుడంటే, ఏం చెయ్యగలం! సమయానికి మీ నాన్న కుడా పొలం నుంచి రాలేదు! నీలిమని దుకాణానికి పంపించి ఏదోకటి తీసుకుని రమ్మని చెప్పాలి. మీ తింగరి చెల్లెలు వెళ్తుందో లేదో!" అని కంగారుపడుతూ చెప్తుంటే, రమణమ్మ వైపు చూడకుండా కొంపదీసి నిజంగానే ఆయన వచ్చేశారా ఏంటి అని కిటికిలోంచి తొంగి చూసింది గాయత్రి. 


కుర్చీలో కూర్చుని టీ తాగుతూ తన కోసం ఎదురుచూస్తున్న వినయ్ కనిపించాడు. "అబ్బా! నిజంగానే వచ్చేశారు!" అని మనసు లోపల సంతోషంగా, బయటికి ఆశ్చర్యంగా ఉబ్బితబ్బిబ్బైపోతుంది గాయత్రి. 


రమణమ్మకి చిర్రెత్తుకొచ్చి “అనుకోని విధంగా అల్లుడుగారు వచ్చారు. ఉన్నట్టుండి ఏం చెయ్యాలా అని నేను నాపాటికి యింత కంగారుపడుతుంటే, మీ అక్కాచెల్లెళ్ళు నన్ను పట్టించుకోరేంటే! నువ్వో తిక్క పిల్లవి, అదోక తింగరి పిల్ల! యిద్దరూ సరిపోయారు నా ప్రాణానికి!" అని తలపట్టుకుని అంది. 


గాయత్రి తన మనసులో “ఆయన వస్తున్నారని ముందు నాకు తెలిస్తే కదా, మీకు చెప్పడానికి!" అని అనుకుంటూ “ఇప్పుడు ఏమైందని అమ్మ! అంత కంగారు పడిపోతున్నావు? ఆయన వచ్చారు కదా!” అని రమణమ్మ భుజాలపై రెండు చేతులు పెట్టి, వినయ్ వైపు చూస్తూ ఆనందంగా అంది. 


“మీ ఆయన వస్తే, నీకు ఆనందంగానే ఉంటుంది. మా అల్లుడు వస్తే, మర్యాదలు తక్కువ కాకుడదని మాకు కంగారు ఉంటుంది!” అని అంది రమణమ్మ. 


గాయత్రి నవ్వుతూ “నువ్వు కంగారుపడకమ్మా! ఆయన ఆ ఎక్కువ తక్కువలు లాంటివి ఏం పట్టించుకోరు!” అని నమ్మకంగా అంది. 


రమణమ్మ గాయత్రి వైపు చూస్తూ “మా అల్లుడు గురించి మాకు తెలుసు. మనిషి మంచోడు. ఏది తక్కువైనా, ఎక్కువైనా పట్టించుకోడు కదా అని మనం అది అలుసుగా తీసుకుని తన మంచితనానికి ఉన్న విలువని పోగొట్టకూడదు! బాబు ఏదో పని మీద వచ్చాడమ్మ! ఆఫీసుకి కావాల్సిన ఏదో వస్తువు నువ్వు వచ్చినప్పుడు నీ బ్యాగులో ఉండిపోయిందంట. యిప్పుడు అది తీసుకెళ్లడానికి బాబు వచ్చారంట!" అని ఉన్న విషయం చెప్పింది. 


"ఓహో! అలా చెప్పారా! కారణం ఏదోకటి ఉండాలి కదా!" మనసులో అనుకుంటూ నవ్వుతుంది గాయత్రి. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


     ఆషాఢం - పార్ట్ 2 త్వరలో

=================================================================================


 అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


78 views4 comments

4 comentarios


Raghavamma Veera

19 hours ago

Super👌💐

Me gusta

@saniyaayinas4873

• 21 hours ago

Super

Me gusta


@santoshkumar-bb3pj

• 22 hours ago

Nice sai bro

Me gusta

@nagarajubhallamudi2297

• 23 hours ago

కథ చాలా బాగుంది సాయిరాం కి అభినందనలు.పద్మావతి గారు. చదివే విధానం కూడా చాలా బాగుంది. అభినందనలు

Me gusta
bottom of page