top of page

బాల నేస్తాలు

Bala Nesthalu Written By Ranganath Sudarsanam రచన : రంగనాథ్ సుదర్శనం


"ఒరేయ్..శివుడు, రా(తి ఒద్దు, ఒద్దనుకుంటూనే, చికెన్ బిర్యానీ రుచికి టెంప్ట్ అయి గట్టిగా లాగించానురా! పర్యవసానంగా రాత్రంతా ఇబ్బంది పడ్డానురా!" అన్నాడు రొప్పుకుంటూ వాకింగ్ చేస్తున్న భానుమూర్తి.


"ఒరేయ్..మూర్తి! అప్పుడప్పుడు ఇబ్బంది పడ్డా, మరీ జిహ్వ ఛాపల్యాన్ని కూడా చంపుకోవద్దురా! పర్లేదు, ఇవ్వాళ్ళ నాలుగడుగులు ఎక్కువ వేద్దాంరా.., అదే సర్దుకుంటుంది" అన్నాడు ఆయాసపడుతూ నడుస్తున్న శివరాం.


"కానీ..తినేటప్పుడు బాగానే ఉన్నా, తిన్న తరువాత ఇబ్బంది తలచుకుంటేనే, మళ్ళీ తినాలంటే భయం వేస్తుందిరా!" అన్నాడు మూర్తి పక్కనే ఉన్న సిమెంట్ బల్ల మీద సాగిలపడి కూర్చుని, కాళ్ళు బార్లా చాపుకుంటూ .

“హూ... ఈ వయసులో ఏది తిన్నా, మితంగా, వేడి, వేడిగా కాస్త పెందలాడే తిని, అలా కొంచెం సేపు అటూ ఇటూ తిరిగి, కాళ్లు చేతులు కదిలించి పడుకుంటే ఏ ఇబ్బంది ఉండదురా! “అంటూ ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఆ పక్కనే మఠం వేసుకొని కూర్చున్నాడు శివరాం.

ఇద్దరూ కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని, (పాణాయామాలు పూర్తి చేసుకొని ఇండ్లకు వెళ్లారు.

భానుమూర్తి, శివరాం మంచి మిత్రులు, ఇద్దరూ రిటైర్ అయ్యారు. రోజూ ఉదయం వాకింగ్ చేస్తూ..., లోకాభిరామాయణం మాట్లాడుకోవటం, సాయంత్రం పార్కులో చర్చలతో కాలక్షేపం చేయడం వారి దిన చర్య.

*******

ఆ రోజు సాయంత్రం ఇద్దరూ పార్కులో కూర్చున్నారు.


"ఒరేయ్ మూర్తి, మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయిరా"..,

అన్నాడు శివరాం రవ్వంత బాధ నిండిన స్వరంలో.


"నాకూ అంతేరా! దానికి తోడు, నీ లాగే నాకూ బీపీ, షుగర్ జంటకవుల్లా ఎంటరయ్యాయి". అన్నాడు మూర్తి చేతులతో మోకాళ్ళను నొక్కుకుంటూ.


"ఈ రోజుల్లో మనుషులకు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెరిగిందిరా! ఆరోగ్యం కోసం ఎవరేమి చెప్పినా పాటించే ప్రయత్నం చేస్తున్నార్రా" అన్నాడు మూర్తి.


"అవునురా.., అయితే ఎవరు ఏది చెప్పినా.., విషయాలేవి కొట్టిపారేసేవి కావురా!,

అన్నిoటిలోను ఎంతో కొంత మంచి ఉంది కానీ ...,

మనమే ఆచరణలో ఆరంభ శూరత్వం చూపి, ఆ తరువాత వదిలి వేయటం వలన తుది ఫలితం రావటం లేదురా". అన్నాడు శివరాం విషయాన్ని విశదీకరిస్తూ.


"కానీ ఏదైనా మితంగా మంచి ఆహారం, కాస్త శారీరక శ్రమ,మంచి అలవాట్లు ఇవి ఉంటే చాలనుకుంటానురా.., ఆరోగ్యoగా ఉండటానికి" అన్నాడు భానుమూర్తి సారాంశాన్ని ఒక్క ముక్కలో తేల్చి వేస్తున్నట్లు.


"కానీ ఇక్కడే చిక్కొచ్చిందిరా! మన పూర్వీకులు ఇదే ఆహారం తిని వందేండ్లు ఆరోగ్యoగా బ్రతికారు. మరి మనం చిన్న వయసులోనే బీపీలు ..షుగర్ల తో చాలా ఇబ్బంది పడుతున్నాము. కారణం మన ఆహార విధానమేరా! అన్నాడు శివరాం.


"అంటే మనం తినే ఆహారం మంచిది కాదంటావా! అన్నాడు భానుమూర్తి.


"అవునురా! రసాయనాలతో పండిన కల్తీ ఆహారం ఒక కారణమైతే, శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణమేరా” అన్నాడు శివరాం.


"నిజమేరా ..! ముఖ్యoగా మనం ఆకలై తినడం మరచిపోయామురా..! టైం అయితే తినడం అలవాటు చేసుకున్నాము. అది కూడా ఒక కారణమేరా! అన్నాడు మూర్తి.


"అవునురా...! ఉదయం లేవగానే టీ త్రాగాలి, ఎనిమిదయింది బ్రేక్ ఫాస్ట్ చేయాలి,

మధ్యాహ్నం ఒంటిగంట అయింది భోజనం చేయాలి,.సాయంత్రం నాలుగైయ్యింది మళ్ళీ ఏవో స్నాక్స్, టీ పూర్తి చేయాలి ,రాత్రి తొమ్మిదైంది డిన్నర్ చేయాలి...ఇలా ఆకలితో సంబంధం లేకుండా, శారీరక శ్రమకు అవకాశం ఇవ్వకుండా, నడవగలిగిన దూరలను కూడా వాహనాల, లిఫ్టుల సౌకర్యానికి అలవాటుపడి, అవసరం వున్నా లేకున్నా తినడం వలన శరీరంలో వ్యర్ధాలు, కొవ్వులు పెరివి పోయి ఇలాంటి జబ్బులు బహుమానాలుగా అందుతున్నాయిరా!"అన్నాడు శివరాం.


సూర్యుడు డ్యూటీ ముగించి తాపాన్ని చల్లార్చుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లాంటి సముద్రంలో దూకాలని ఆరాటపడుతున్నట్లు వేగంగా జారిపోతున్నాడు. అప్పటి వరకు ఉన్న వేడి తాపం కాస్త చల్లబడి ఊరట నిస్తున్నట్లుగా ఉంది. పార్కులో చల్లదనంతో పాటు సందడి కూడా పెరిగింది.

3

ఐసు బండ్ల దగ్గర పిల్లలు హడావిడి చేస్తున్నారు. ఉప్పు వేసి వేయించిన వేరుశనగ పప్పుల వాళ్ళు గుంపుగా ఉన్న వాళ్ల దగ్గరికి వెళ్లి "సార్ పల్లి..గరం పల్లి" అంటూ కొనిపించే ప్రయత్నం చేస్తున్నారు.


ఆ పక్కనే బెంచ్ మీద కూర్చున్న పిల్లలు వాళ్ళమ్మను ఏదైనా 'స్టోరీ' చెప్పమని మారాం చేస్తున్నారు. దూరంగా పిల్లలు పెద్దలు గుండ్రంగా కూర్చొని అంత్యాక్షరి ఆడుతున్నారు.


"ఒరేయ్..శివ మన అనారోగ్యానికి మరో కారణం కూడా ఉందిరా! అన్నాడు మూర్తి ఏదో కొత్త విషయం స్ఫురించినట్లుగా!”


"అదేంట్రా!....చెప్పు మరి అన్నాడు శివరాం వినడానికి ఆసక్తిని కన బరుస్తూ.


“ రోజూ ఇలా ఏదో తోచింది మాట్లాడుకొని ఇండ్లకు వెళ్లడం, మళ్ళీ రొటీన్ జీవితమే కదరా! అందుకే మనకంటూ ఒక పని, మన మనసుకు సంతోషాన్నిచ్చే వ్యాపకం లేకపోవడం వలన జీవితం స్ధబ్ధతగా, నిస్సారంగా అనిపిస్తుందిరా! ‘యాన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ పారడైజ్’ అన్నట్లు మనం మాటిమాటికి మన ఆరోగ్యాన్ని తలుచుకోవడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా భూతద్దంలో పెట్టి చూడటం కూడా ఒక కారణమేరా! “అన్నాడు మూర్తి గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన వాడికి మల్లె.

“నిజమే కావొచ్చు కానీ, కృష్ణ రామ అనుకునే వయసులో ఏం చేస్తామురా! అదీను అనవసరంగా ఈ వయసులో రిస్క్ చేసి నష్టపోవడం అవసరమంటావారా! “అన్నాడు శివరాం విషయం పట్ల అనాసక్తిని చూపిస్తున్నట్లు ముఖ భావాలను పలికిస్తూ.


“కాదురా!...మనం సంతోషంగా ఉంటూ, ఆర్ధికంగా నష్టపోకుండా, ఇతరులను వీలైనంత సంతోషపెడదాం, ఏమంటావురా!” అన్నాడు మూర్తి ఆసక్తిగా శివరాం సమాధానం కోసం ఎదురు చూస్తూ.


"సరేరా!... నువ్వన్నట్లు మన వలన ఇతరులకు సంతోషం కలుగుతుందంటే అభ్యoతరం ఏముందిరా! అది మంచిపనైతే మన స్థోమతకు సరిపోయే ఖర్చు చేయాల్సి వచ్చినా సిద్ధమేరా"! అన్నాడు శివరాం.


“సరే, నాతో రారా!” అంటూ శివరాంను రమ్మని, అటుపక్కగా నాలుగడుగుల దూరంలో కథ చెప్పమనే పిల్లల దగ్గరకు నడిచాడు మూర్తి.


వారి అమ్మగారి అనుమతితో ఆ పిల్లలను దగ్గరగా కూర్చోపెట్టుకొని ఒక మంచి నీతి కథను వారికి వినిపించాడు మూర్తి.కథ విని నిజంగా పిల్లలు ఎంత సంతోష పడ్డారో! మాటల్లో చెప్పనలవికాదు. వారి ముఖాలు చంద్రబింబాలవలె వెలిగిపోయాయి. కథ పూర్తికాగానే పిల్లలు పెద్దలు అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు మూర్తిని.

"తాతయ్య! రోజూ ఇక్కడికి వస్తాము. మాకు రోజూ ఒక కథ చెపుతారా" అన్నారు పిల్లలంతా ఆప్యాయత నిండిన పలుకులతో, అభ్యర్ధిస్తున్నట్లుగా.


“ఓహ్...తప్పకుండా” అన్నాడు మూర్తి సంతోషంగా.


“ఒరేయ్! శివ... చూశావురా.., కథలకు పిల్లలు ఎంత ముఖం వాచి ఉన్నారో.., అదేరా మనం చేయబోయే పని” అన్నాడు మూర్తి కనుబొమ్మలు విజయ గర్వంతో ఎగరేస్తూ..


“నిజమేరా మూర్తి!.., నువ్వు కథ చెపుతుంటే ఆ పిల్లల ముఖాలు ఎంత ఆనందంగా మెరిసిపోయాయో కళ్లారా చూసానురా..!” అన్నాడు శివరాం.


“అందుకేరా.. ఈ పిల్లలను సంతోషపెట్టే పని మొదలెడుదామురా..! మనం విన్న, చదివిన చక్కని చిన్న చిన్న నీతి కథలను ఒక్కపేజీలో ఆకర్షణీయంగా అచ్చు వేయించి, పాఠశాలలకు వెళదామురా, అక్కడ ముందుగా పిల్లలకు ఒక కథ చెప్పి, ఈ అచ్చువేసిన కథలను ప్రమోట్ చేద్దాము. అలాగే పార్క్స్, బుక్ స్టాల్స్ లో వీటిని అందుబాటులో ఉంచుదామురా. దీని ధర కూడా కేవలం ఒక్కరూపాయి మాత్రమే పెడదామురా. మంచి కథల పుస్తకాలు అచ్చువేయించి పిల్లలకు అందిద్దామురా!”, అన్నాడు మూర్తి తన మనసులోని ఆలోచనలన్నీ వివరిస్తూ..


"నిజంగా బాగుందిరా..! ఇది కార్యాచరణలోకి తేగలిగితే, మనిద్దరికీ ఒక మంచి వ్యాపకంతో పాటు, చక్కని నీతి కథలను ఈ భావి భారత పౌరులకు అందించిన వారమౌతామురా!. ఇంతకన్నా మన జీవితానికి అర్ధం పరమార్ధం ఏముంటుంది చెప్పు" అన్నాడు శివరాం మహాదానందపడుతూ.

********

భాను మూర్తి, శివ రామ్ చక్కని నీతి కథలను అచ్చువేసి, పాఠ శాలలకు, బుక్ స్టాల్స్ కు అందించడం మొదలు పెట్టారు.

అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా చక్కని నీతి కథలను పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. వారి కృషి ఫలించింది, వారి కథలకు మంచి ఆదరణ లభించింది.

అనతి కాలంలోనే మిత్రులిద్దరూ బాల బంధువులుగా వాసికెక్కారు. వారిని గురించి ప(తికలలో అనేక వార్తా కథనాలు ప్రచురితం అయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు, సాహితీ సంస్థలు వారి సేవలను గుర్తించి, తగురీతిగా సత్కరించి గౌరవించాయి.


రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి, బాలల దినోత్సవం నాడు భాను మూర్తి, శివరాం లిద్దరిని సత్కరించింది.

ఆ తరువాత వారు "బాల నేస్తం" మాస ప(తికను కూడా స్థాపించి బాల సాహిత్యానికి బహుళ ప్రచారం కల్పించారు.అలా ఒక చిన్న అంకురం శాఖోప శాఖలుగా విస్తరించి, మిత్రులిద్దరికీ మంచి వ్యాపకాన్ని, చిరస్థాయిగా వారిని గుర్తుచేసే జ్ఞాపకాన్ని, వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిo ది.

ఇప్పుడు ఇద్దరికీ, మోకాళ్ళ నొప్పులు, బి.పి, షుగర్ల వంటి ఆరోగ్య సమస్యలేవీ గుర్తుకు రావడం లేదు. ఇద్దరూ ఎప్పుడు మంచి కథల గురించే ఆలోచిస్తూ అన్వేషిస్తున్నారు.


మంచి కథలకోసం దసరా, దీపావళికి కథల పోటీలు నిర్వహించి ఎందరో రచయితలకు గుర్తింపునిస్తున్నారు . అందుకే.., మనసు పనిమీద లగ్నమైతే, శారీరక బాధలు గుర్తుకు రావు .కారణం? అంతకన్నా పెద్ద లక్ష్యం కోసం మనసు పోరాడుతుంది కనుక. అందుకే మనసుకు సంతోషకరమైన పని వత్తిడిని కల్పించగలిగితే, శరీరం దానికి అనుగుణంగా స్పందిస్తుంది.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


రచయిత పరిచయం

పేరు :రంగనాధ్ సుదర్శనం

విద్యార్హతలు: MA సోషియాలజి

సింగరేణి సంస్థలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాను. సాహత్యాభిలాషిని, ఇప్పటి వరకు రాసిన కథలు 70. అందులో వివిధ పత్రికలలో ప్రచురితం అయినవి, సాహిత్య పోటీలలో బహుమతులు అందించినవి కూడా ఉన్నాయి. సాహిత్య ప్రక్రియలో నాకు కథలు, కథానికలు, గల్పికలంటే లంటే మక్కువ.46 views0 comments
bottom of page