top of page
Writer's pictureGanga Koumudi

"బామ్మా" కలాపం


'Bamma Kalapam' - New Telugu Story Written By Ganga Koumudi

'బామ్మా కలాపం' తెలుగు కథ

రచన: గంగా కౌముది


“తొందరగా తెమలండి రా! రాహుకాలం వచ్చేస్తుంది" అంటూ తొందర పెట్టసాగింది జానకమ్మ.


"ఆ వస్తున్నాం అత్తయ్య. అంతా సిద్ధంగా ఉంది. ఇక బయలుదేరడమే. రాము కూడా వస్తున్నాడు" అని కోడలు లక్ష్మీ జవాబిచ్చింది.


"లేవండీ! పెళ్ళి చూపులకి బయల్దేరాలి" అని జానకమ్మ అనేసరికి "గుళ్లో హరికధకా, పూజారి గారు వచ్చేసారా ఏమిటి" అన్నారు రామనాధం గారు.


"అబ్బబ్బా ! గుళ్లో హరికథ కాదండీ, మీ మనవడి పెళ్లి చూపులు. మీ చెవుడు తో నా ప్రాణాలు తోడేస్తున్నారు, తొందరగా బయల్దేరండి" అంటూ జానకమ్మ లేచేసరికి "అమ్మా ! నాన్న కధ తెలిసిందేగా! నేను అతన్ని తీసుకు వస్తాను, నువ్వు నీ మనవడితో బయలుదేరు" అన్నాడు ఆమె కొడుకు జగన్నాధం.


కారు బయల్దేరింది. ఊరు లేలేత సూర్యకిరణాలకి విచ్చుకున్న పూబాల లా సిగ్గు ముగ్గులేస్తోంది. ఆశ్వీజ మాసం శోభ పండగ వాతావరణాన్ని తలపిస్తూ రామాపురం గ్రామానికి కొత్త హంగులు దిద్దుతున్నాయి. ఊరంతా ఆకుపచ్చని పట్టుచీర భూమాత కట్టుకున్నట్లు పంటచేలలో మెరిసిపోతోంది.


నిండా 200 కుటుంబాలు కూడా లేని కుగ్రామం రామాపురం. ఆ ఊరిలో రామనాధం గారనే జమీందారు గారి భార్య జానకమ్మ. ఎమ్మెస్ సుబ్బలక్ష్మమ్మ లా ప్రతీ నిత్యం ఆ ఊరిని మేలుకొలిపే కంఠం ఆమెదే. డెబ్భైయ్యె పడిలో ఉన్నా ఊరినే గడగడలాడించే మహా మనిషి. చూడటానికి ఎంత గంభీరంగా ఉన్నా మనసు వెన్నపూస. అందుకే జానకమ్మ మాట ఆ ఊరికి శాశనం. రామనాధం గారికి పుట్టు చెవుడు, కానీ వ్యావహారిక గ్యానంలో అతన్ని మించిన వారు లేరు.


ఆ ఆది దంపతులకు జగన్నాధం ఒక్కగానొక్క సంతానం. అతను ఆ ఊరిలోనే హైస్కూలు మాష్టారిగా పని చేస్తున్నాడు. లక్మీ జగన్నాదం గారి భార్య. తాను అత్తగారయ్యె వయసులో ఉన్నా తన అత్తగారి మాత్రం ఇంకా భయపడే కోడలు పాపం లక్ష్మమ్మే. ఇక ఇంటి అంతటికీ ఒక్కగానొక్క వారసుడు రాము. జగన్నాధం గారు తన కొడుక్కి తన తండ్రి పేరు పెట్టుకున్నాడు. రాము ఎంబీఏ చేసి పక్కనే ఉన్న టౌన్లో బ్యాంకుమేనేజర్ గా పని చేస్తున్నాడు.


రాము తన బ్యాంకులోనే పనిచేస్తున్న సీత అనే అమ్మాయిని మూడేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. సీత కూడా చాలా సంప్రదాయమైన అమ్మాయి. తెలుగింటి వాతావరణం, ఈ పద్ధతులు అంటే ప్రాణం పెడుతుంది. కానీ పట్నంలోనే పెరగటం వల్ల, తల్లి చిన్నప్పుడే చనిపోవటం చేత, తండ్రి విశ్వనాధం అల్లారుముద్దుగా పెంచాడు. అటువంటి సీత తన భార్య కావాలంటే తన బామ్మ దగ్గర ఎలా ఉండాలో ట్రెయినింగ్ ఇచ్చి పెళ్లి చూపులు ఏర్పాటు చేయించాడు

రాము.

����


కారు పెళ్లి వారింటి దగ్గర ఆగింది. కాబోయే వియ్యాలవారిని ఆహ్వానించడానికి ఎదురేగాడు పోలీసు కమిషనర్ విశ్వనాధం.


అతన్ని చూడగానే " ఒరే విస్సు నువ్వా! పిల్ల తండ్రి కమీషనర్ అంటే ఎవరో అనుకున్నాను. నువ్వట్రా విస్సుగా" అంటూ ఎల్. కే. జీ. పిల్లాడు చాకలెట్ చూసినంత సంబరపడిపోయింది జానకమ్మ. ��అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. " బామ్మకి పాకిస్ధాన్ లో కూడా చుట్టాలుంటారు నాన్న" అని విసుక్కున్నాడు రాము. " లోపలికి రండి అమ్మా" అంటూ అందరినీ ఇంటి లోనికి తీసుకెళ్లాడు విశ్వనాధం.

��


చుట్టూ ప్రహరీ తో విశాలమైన పూపొదరింటిలా ఉంది ఆ ఇల్లు. అదంతా చూసి పొంగిపోయింది జానకమ్మ. అంత ఇంటి ముందు మిక్కీ మౌస్ బొమ్మ చూసి ఒక్కసారి ఆగి లోనికెళ్లింది. ఇంట్లోకి వెళ్ళాక కూర్చుని "ఒరే విస్సు, రంగమ్మ వదినా వాళ్ళు మన ఊరు విడిచి పెట్టే వేళకి నువ్వు పాతిక ఏళ్ల కుర్రాడివి. ఇప్పుడేంత వాడివి ఐపోయావురా, మీ అమ్మ ఉన్న రోజుల్లో మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఆవిడ పోయాక కళే పోయిందిరా," అని మాట్లాడుతూ ఉండే సరికి లక్ష్మీ పెళ్లికూతురిని తీసుకురావడానికి లోపలికెళ్లింది.


"జానకత్తా, అమ్మ పోయాక, కొంత కాలానికె నా భార్య కూడా పోయింది. మళ్లీ నా కూతురు మా అమ్మలాగే నా దగ్గరకు వచ్చింది. నా కూతురుని ఏ ఇంటికి పంపాలా అని బెంగ పడేవాడిని. మీ ఇంటికి వెళుతున్నందుకు ఆనందంగా ఉంది అత్తా" అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.


అది చూసిన రామనాధంగారు "అయ్యో, ఎందుకు బాబూ ఏడుస్తున్నావ్, ఏమైనా పోయాయా" అనేసరికి, “అబ్బా మీరు ఊరుకోండి” అని, విశ్వనాధం తో "విస్సు, నువ్వు అంతగా చెప్పాలటరా! ఇకనుంచి మీ సీత మా సీతమ్మె అనుకో!" అని చెప్పింది. ఈలోగా లక్ష్మీ సీతని తీసుకొచ్చింది.


పసుపు పచ్చని చీరలో చామంతి పువ్వులా మెరుస్తున్న సీతని చూడగానే లోకమంతా ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపించింది రాముకి. ఎప్పుడూ చూసిన సీతైనా ఈరోజు అప్పుడే భూమికి దిగిన దేవకన్యలా ఉంది. కలువ రేకుల్లాంటి కళ్ళు, సంపెంగ మొగ్గ లాంటి ముక్కు, నారింజ తొనలలాంటి పెదాలు, అసలు సీత రూపాన్ని గంగా నదిలో ముంచి చెక్కాడేమో బ్రహ్మ అన్నంత అందంగా ఉంది.


సీత రాగానే జానకమ్మకి, రామనాధం గారికి నమస్కారం చేసి ఒక వారగా కూర్చుంది. "ఏమో అణుకున్నానురా విస్సు, నీ కూతురిని చూస్తే అచ్చం మీ అమ్మలాగే ఉంది" అని "అమ్మాయ్! నిన్ను చూస్తే అచ్చం మా రంగమ్మ వదినలానే ఉన్నావ్. ఆరోజుల్లో మా రంగమ్మకి రాని పని లేదు. నీ పనితనం గురించి ఇక ప్రత్యేకంగా అడగక్కరలేదు. అవునే పిల్లా, ఇంటి ముందు వినాయకుడి వాహనం నువ్వే వేశావా?" అని అడిగింది జానకమ్మ.


అది విన్న రాముకి గుండెలో రాయి పడినట్లు అయింది. తన బామ్మకి ముగ్గులంటే చాలా ఇష్టమని, తాము వచ్చేటప్పటికి ఇంటి ముందు మంచి ముగ్గు వేసి ఉంచమని చెప్పాడు. మంచి ముగ్గు అనగానే యూట్యూబ్ లోనుంచి శోధించి చివరకి మిక్కీమౌస్ ని సాధించింది సీత. వెంటనే తేరుకుని “అదే బామ్మ! సీతకి వినాయకుడంటే చాలా భక్తి. ఇంటి ముందు గణపతి బొమ్మ వేస్తే ఎక్కడ తొక్కేస్తారో అని ఎలుక బొమ్మ వేసింది. అంతే కదూ సీత" అని రాము అనేసరికి అంతే అంటూ తలపంకించింది సీత.


��


"హ్మ్! కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని నీ నిర్వచనం బాగానే ఏడ్చింది రా రాముడు" అని మనవడి భుజం తట్టింది జానకమ్మ.


ఈలోగా రాము తాతగారు "అమ్మాయ్! నీకు పాటలొచ్చా, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. నా భార్య సంగీతం వినే నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను" అంటూ బోసిపళ్ళతో నవ్వసాగారు.


"ఆ! మీ ముందు పాడాలంటే ఆ పిల్ల గొంతు సరిపోదు నాన్నా! తరవాత పాడిద్దాం" అని సర్ది చెప్పాడు జగన్నాధం.

ఇంతలో ఎదో గ్యాపకం వచ్చినట్లు "అమ్మా సీత ! రుక్మిణీ కళ్యాణం లో ఒక పద్యం చెప్పు విందాం" అంది జానకమ్మ.


అలాంటిదేదో అడుగుతుందని కనిపెట్టిన రాము వారం క్రితమే కృష్ణ పాండవీయం సినిమా యూట్యూబ్ లింక్ సీతకి షేర్ చేసి బాగా ప్రాక్టీసు చేయమన్నాడు. కానీ అత్యుత్సాహం వల్ల సీత ఈ విధంగా పాడటం మొదలు పెట్టింది.


" జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన

ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్

తొలగన్ ద్రోచె లతాంగి ! యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ పే

రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే !!"


అంటూ శ్రావ్యంగా పాడేసరికి జానకమ్మ విస్తుపోయింది. రాము గొంతు తడారిపోయింది. లక్ష్మి కైతే తన అత్తగారు ఎం చేస్తుందో అని బెంగ పట్టుకుంది.


వెంటనే జానకమ్మ "అదేమిటే అమ్మీ! రుక్మిణీ కళ్యాణం లో పద్యం చదవమంటే పారిజాతాపహరణం లో సత్యభామ కృష్ణ పరమాత్మని తన్నిన సందర్భంలో పద్యం చెప్పావేమిటి?�� " అని గద్దించేసరికి సీతకి తన తప్పు తెలిసొచ్చింది.


రాత్రి బాగా పాడాలనే ఉద్దేశ్యంతో కృష్ణ తులాభారం సినిమా చూసి తెచ్చుకున్న కష్టానికి ఎర్రకలువ లాంటి మొహం వాడిపోయింది.


అప్పుడు జగన్నాధం "అమ్మా, రుక్మిణీ దేవి భక్తి కన్నా, సత్యాదేవి ప్రేమే అగణ్యమ్. అయినా నీకు పారిజాతాపహరణం అంటే చాలా ఇష్టం కదే! పాట మటుకు చాలా బాగుంది. మీరే నేర్పారా బావగారు?" అని అడిగే సరికి "ఆ వీడి మొహం, పదో తరగతే మూడు సార్లు తప్పి తగలడ్డాడు, వీడి కేం వచ్చురా" అని జానకమ్మ అనేసరికి విశ్వనాధం గచ్చుమన్నాడు. కూతురి పెళ్లి చూపులు కాస్తా తన మీదకి సంధించే తూపుల్లా మారాయి అని తల పట్టుకున్నాడు.


"నీ గొంతు చక్కగా సుశీల గొంతు లా ఉందే మనవరాలా" అంటూ మెచ్చుకుంది జానకమ్మ.


అత్తగారు అంతా అడిగాక తాను అడగడానికి ఇంకా ఏం మిగిలిందా అని ఆలోచించి "సీతా! నీకేం వంటలొచ్చమ్మ?" అని ఆప్యాయంగా అడిగేసరికి "చాలా వచ్చు అత్తయ్య గారు. నేను ఖాళీ సమయాల్లో ఎదో ఒక ప్రయోగం చేసి మా నాన్నగారికి రుచి చూపిస్తుంటాను" అని ఉత్సాహ పడింది.


వెంటనే వంట గదిలోకి వెళ్లి పెళ్ళివారి కోసం తాను ప్రత్యేకంగా తయారు చేసిన పిజ్జా పట్టుకొచ్చింది. అది చూడగానే రాము ట్రాఫిక్ సిగ్నల్ ఇచ్చిన బండిలా ఆగిపోయాడు. పెళ్లి చూపులకి పిజ్జా చేసిన సీతని కళ్ళతోనే ఎర్రగా చూడటం మొదలెట్టాడు. ఇంతలో ఒక ముక్క తీసుకున్న రామనాధంగారు "ఒరే జగన్నాధం! ఏవో నవరత్నాలు పొదిగినట్టు మీదంతా కూరలు ఇలా పరిచి పెట్టారు. ఈ కూరలతో పాటు అట్టుముక్కలేవిరా" అంటూ అడిగేసరికి విశ్వనాధం నోటి వెంట మాట రాలేదు.


"రొట్టె ముక్కలా ఉన్న దీనిని ఎలా తినాలే మనవరాలా? ఇంతకీ ఇది ఏ దేశపు అట్టుముక్క?" అని అనేసరికి రాము “అదీ బామ్మ! ఇది విదేశీ అట్టు. పచ్చడి లేకుండా ఎక్కడైనా తినేయచ్చని ఇలా కూరలు అద్దారు. అంతే" అని సర్ది చెప్పాడు.


ఇలా పెళ్లి చూపుల ప్రహసనం కాస్తా మూడో ప్రపంచ యుద్ధంలా ముగిసి సీత రాము కుటుంబీకులకు బాగా నచ్చటంతో పెళ్లికి ఒక మంచి ముహూర్తం పెట్టారు. అయితే పెళ్లి దాకా ఆగలేని మన కథానాయకుడు సీతని కలవాలని, ఇంట్లో అయితే తన బామ్మ ఒప్పుకోదని పంటపొలానికి పిలిపించాడు. అది కాస్తా చాకలి నూకాలమ్మ కంట పడనే పడింది.


"అమ్మా, జానకమ్మ గారు! అప్పుడే మీ మనవడు గోరికి పెల్లి కళ ఒచ్చేసినాదండి. ఆడ పొలంలో కాబోయే పెళ్ళంతో సికార్లు కొడతన్నారండీ" అని చెప్పింది నూకాలు.


ఆ మాటలు విని అప్పుడే వచ్చిన మనవడితో "ఏరా! దొంగా', ఎక్కడినుంచి రాక?" అని ఆడిగేసరికి "గుడికి వెళ్ళాను బామ్మ! నిన్ను జాగ్రత్తగా చూడమని దేవుడికి మొక్కుకున్నాను" అని అబద్ధం చెప్పాడు.


"దేవుడికా! దేవతకా? తిప్పులాడీ తిప్పులాడీ తీర్ధంలో తప్పిన అవ్వను చూసావా, అంటే లేదు! తిరనాళ్ళకెళ్లిన మా బావని చూసా అందట వెనకటికి నీలాంటిది. ఇక ఆ చేలమ్మట నీ కృష్ణ లీలలు ఆపి పెళ్లి దాకా బుద్ధిగా ఉండు" అంది. సిగ్గుపడి అక్కడి నుంచి పారిపోయాడు రాము.


మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా సీతారాముల వివాహం జరిగిపోయింది. కొత్త జంటని చూడటానికి రెండు కళ్లు చాలనంతగా వివాహ వేడుకలు బాగా జరిగాయి. మనవడి పెళ్లితో జానకమ్మ ఆనందం ఆకాశానికి చేరింది. అన్ని కార్యక్రమాలు ముగిశాక వధూవరులకి ఆ రాత్రికి శోభనం ఏర్పాటు చేశారు. ఇన్నాళ్ల తన కలల రాకుమారి తన చెంత చేరి తనే తానై, తానే తనై న వేళ కోసం ఆగలేకపోతున్నాడు రాము. ఇటు సీతమ్మ కళ్ళలో కూడా శృంగార గంగ పరవళ్లు తొక్కుతోంది.


ఇంతలో జరుగుతున్న అలంకరణ అంతా చూసి రామనాధం గారు "జానకీ ఏమిటి విశేషం? ఈరోజు అలంకరణ చూస్తుంటే నాకు మన పెళ్లి సంగతి గుర్తు వస్తోందోయ్" అంటూ చిలిపిగా నవ్వే సరికి "హ్మ్! తాతల కాలానికి నారు పెడితే మనవళ్ళ కాలానికి మారాకు తొడిగిందని, ఎప్పుడో జరిగిపోయిన మన పెళ్లి ముచ్చట ఇప్పుడు ఎందుకు? కృష్ణా రామా అనుకుందురూ" అని వెళ్ళిపోయింది.


రాము ఎదురుచూస్తున్న రాత్రి రానే వచ్చింది. ఆనందం ఉండబట్టలేక కాలు గాలిన పిల్లిలా ఇల్లంతా తచ్చాడుతున్నాడు. ఇంతలో ఎవరో వస్తున్న శబ్దమయ్యేసరికి వచ్చేది తన భామ అని ఒక్క సారిగా గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న తరవాత తెలిసింది ఆమె తన "భామ" కాదని, బామ్మ అని.


వెంటనే రాముని చూసి "ఆరాటపు పెళ్ళికొడుకు పురోహితుడి మెడలో పుస్తె కట్టాడని, ఏమిట్రా ఈ తొందర? అదిగో నాయనా నీ సీత" అంటూ సీతని రాముని కలిపింది జానకమ్మ.

గంగా కౌముది గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత్రి పరిచయం:

కలం పేరు - గంగా కౌముది

నేను ఒక సాహిత్యాభిమానిని. సాహిత్య సాగరాన ఒక చిన్న రచనాభిలాషిని.

వెన్నెలలో వెలిగే నిండు జాబిల్లి నా కవనం

వన్నె చిన్నెల శ్రీ కృష్ణ జాబిల్లి నా జీవనం


139 views2 comments

2 Comments


sudershanap44
Aug 13, 2023

కథ బాగుందమ్మా అభినందనలు.

Like
Ganga Kaumudi
Ganga Kaumudi
Aug 13, 2023
Replying to

ధన్యవాదములు సార్ 🙏

Like
bottom of page