top of page

భూమాత

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #భూమాత, #ఆవెన్నెలరేయి

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 39

Bhumatha - Gayathri Gari Kavithalu Part 39 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 13/10/2025

భూమాత - గాయత్రి గారి కవితలు పార్ట్ 39 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


భూమాత

వచన కవిత.


(పదాల పదనిసలు: గ్రహం, ఆగ్రహం,అనుగ్రహం, విగ్రహం,నిగ్రహం

 ఉపగ్రహం,సంగ్రహం,సత్యాగ్రహం, శనిగ్రహం,ప్రేమగ్రహం.)

**********************************


మన నివాసమే అసమాన సుందరమౌ భూగ్రహం.

ఘనమైన భూమాతకు హాని చేస్తే వస్తుందామె కాగ్రహం.


ఆ తల్లి జీవులందరి మీద కురిపిస్తుంది అనుగ్రహం.

నీతి తప్పక జనులందరూ పాటించాలి నిగ్రహం.


ఈ పృథ్వి చుట్టూ తిరుగుతున్న జాబిల్లే మన కుపగ్రహం.

భూపరితాపాల గురించి సేకరిద్దామెంతో విషయం సంగ్రహం.


కాపాడదామంటూ భూమికై ఉద్యమిస్తూ చేద్దాము సత్యాగ్రహం.

పాపాత్ముల వక్ర సిద్ధాంతాల గరళమే మన పాలిటి శనిగ్రహం.


ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించు కొందామీ భూదేవి విగ్రహం.

అజరామరంగా నిలిచే పుడమితల్లి మనందరికీ ప్రేమగ్రహం.//


************************************


ree

















ఆ వెన్నెల రేయి...

(వచనకవిత )

************************************

వెన్నెల కాంతి వెచ్చగా కురిసింది పుడమి పైన 

కనులు మూస్తే నిదుర రాక కలవరిస్తూ పడుకున్నా!


వేణుగాన మప్పుడే వీనుల విందుగా వినిపించింది 

ఆ గాన మధుఝరిలో నా హృదయం తడిసింది.


కనుల ముందు నా స్వామి సాక్షాత్కరించాడు.

తనువు మరచి నేనప్పుడు తనివితీర చూస్తున్నా!


ముంగిటిలో ముచ్చటైన ముగ్గులేవి లేవు లేవు!

సంగతిగా స్వాగతించ సత్కారానికేమి లేవు!


పీతవస్త్రాలింటనిపుడు పెట్టుబడికి లేవు లేవు!

ప్రీతి మీర భుజియింప పిండివంట లిచట లేవు!


నవ్వుచూ నా స్వామి నట్టింటి కొచ్చినపుడు 

దివ్వెలన్ని వెలిగింపగ తీరైన సరుకు లేదు!


పూవులన్ని అలసిపోయి ముద్దుగా బజ్జున్నాయి!

దేవదేవుని సేవకిపుడు తీరిక లేదన్నాయి!


అయ్యో!దేవ!నీ పూజల కవరోధము కలిగిందని

చెయ్యలేని దిగులుతో చిన్నబోయి నిలుచున్నా!


చిన్న నవ్వు నవ్వుతూ చెక్కిలిపై చిటికేసి

"మన్ను తిన్నవాడిని నీ మమకారము చాలులే!


ప్రేమ చాలు నాకింత!పెన్నిధిగా తలచెదనే!

నీ మనసే తెలిసిందని "నీలమోహను డన్నాడు.


వెన్నెలిపుడు చల్లగా పృథ్విపైన కురిసింది.

కన్నయ్యను చూస్తుంటే కనుల నీరుబికింది.//




ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page