top of page

బుడుగు/సీగానపెసూనాంబ స్వగతం....

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Budugu Ceeganapesunamba Swagatham' New Telugu story Written By Avadhanula Vijayalakshmi

రచన: అవధానుల విజయలక్ష్మి


అసలు నాకు ఒక్కటి అర్ధం కాదు... ఈ పెద్దోళ్లందరూ బాల్యం... బాల్యం అని ఎందుకంత కొట్టుకుపోతూ ఉంటారోనని....

అప్పుడప్పుడు మళ్ళా ఆ బాల్యం తిరిగివస్తే బాగుంటుంది అంటారు... బంగారు బాల్యం అంటారు...

నా మొహం ఈ పెద్దవాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు... మేమేమీ చిన్నవాళ్ళం చితక వాళ్ళం కాదు కదా మాకు అన్నీ తెలిసిపోతున్నాయి...


అసలు బాల్యంలో జరిగినన్ని మోసాలు ఇంకెప్పుడూ జరగవు అంటాను నేను...

అదిగో అక్కడ చూడండి.... మా అమ్మ తమ్ముడిని చంకలో పెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తోంది...


"పిలు... చందమామని పిలు.... దాయ్ దాయ్ చంద మామా" అంటోంది...

వాడికేమో పాపం జరుగుతున్న మోసం తెలియదు కదా అందుకే నోరుతెరుచుకొని చందమామని చూస్తూ "దాయ్ దాయ్" అంటున్నాడు...


వాడి తెరిచిన నోట్లో అమ్మ గబుక్కున ఇంత ముద్ద పెట్టేసింది... ఎంత మోసం కదూ?... చందమామ ఎక్కడైనా దిగి వస్తాడా? మేమేమీ చిన్నవాళ్ళం చితకవాళ్ళం కాదుకదా... మా అక్కలూ అన్నలూ ఆ ఫోన్లో ఎవో... అవి చూసినప్పుడల్లా మేమూ పక్కన కూర్చునీ అన్నీ చూస్తాము కదా... చంద్రుడు ఎక్కడో దూరంగా ఉన్న ఫేధ్ధ బంతి అని మాకు తెలియదూ?


ఆ మధ్య నాకు కాలికి దెబ్బ తలిగింది... ఏడుపులంకించుకొన్నాను... మనలో మన మాట... మనం ఎంత గాఠిగా ఏడిస్తే పెద్దవాళ్ళు అంత ముద్దు చేస్తారన్నమాట...

అమ్మ నా దగ్గరికి వచ్చి, "ఓచమ్మే దెబ్బ తగిలిందా ఉండు మంత్రం వేస్తాను... నీ నొప్పి కాకి ఎత్తుకుపోతుంది" అంటూ

"హుష్... కాకీ మా అబ్బాయి నొప్పిని ఎత్తుకుపో" అంది.

అమ్మో అమ్మో ఎంత మోసం!... మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అలా అంటే నాకు అర్ధం తెలియదులే...


నేను మాత్రం మోసపోదలచుకోలేదు... నా ఏడుపు ఇంకా ఎక్కువ చేసాను... నాలుగిళ్ళ అవతల దాకా వినపడేటట్లు ఏడవడం మొదలెట్టాను...

మేమేమీ చిన్నవాళ్ళం చితక వాళ్ళం కాదు కదా మాకు అన్నీ తెలిసిపోతున్నాయి...

అమ్మ నాకు చాక్లేట్ ఇచ్చి మంచి చేసుకోక తప్పలేదు...


మరోక రోజు కూడా అంతే...

నాకేమో రాత్రిపూట అమ్మా, నాన్నా నిద్రపోడానికి ముందరే నిద్రపోడం అస్సలు ఇష్టం ఉండదు కదా...

మా అమ్మేమో

"చూడు నాన్నా... నువ్వు తొందరగా పడుక్కోకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు... చూడు బూచాడు అప్పుడే వీధిలో విజిల్ వేసుకొంటూ తిరుగుతున్నాడు" అంది...

ఇది మోసం కాక ఇంకేమిటి చెప్పండి...


అసలు బూచాడంటూ ఎవరూ లేరని నాకు తెలియదూ? ఆ విజిల్ వేసుకొంటూ తిరిగేది వీధి గూర్ఖా అని నాకు తెలియదూ?


మేమేమీ చిన్నవాళ్ళం చితక వాళ్ళం కాదు కదా మాకు అన్నీ తెలిసిపోతున్నాయి...

నేను మొండిగా మెలుకువగా కూర్చునీ అమ్మా, నాన్నా నన్ను నిద్రపెట్టలేక అలిసిపోయి వాళ్ళు నిద్ర పోయిన తర్వాతనే నేను హాయిగా నిద్రపోయాను....


అందుకే అంటాను... మళ్ళా బాల్యం కావాలని ఎప్పుడూ అనుకోకండి... అప్పుడు జరిగినన్ని మోసాలు ఇంకెప్పుడూ జరగవు...

ఉంటామరి... టాటా... బైబై...

(బాపూ, ముళ్ళపూడి గార్లకు కృతజ్ఞతలతో...)

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


69 views2 comments
bottom of page