చాదస్తపు బ్రహ్మయ్య
- Karlapalem Hanumantha Rao

- Aug 26
- 3 min read
#చాదస్తపుబ్రహ్మయ్య, #ChadasthapuBrahmaiah, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Chadasthapu Brahmaiah - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 26/08/2025
చాదస్తపు బ్రహ్మయ్య - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఒక ఊరిలో ఒక చాదస్తపు బ్రహ్మయ్య ఉండేవాడు. అతను ఒక రోజున పొరపాటున భార్య ఎంగిలి తిన్నాడు. ఆ ఎంగిలి తిన్న పాపం కాశీకి వెళ్లి గంగలో స్నానం చేస్తే గాని పోదనుకున్నాడు. వెంటనే తూ తూ తూ అని ఊసుకుంటూ కాశీకి బయల్దేరాడు.
అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి అతనికి దాహం వేసింది. దారి పక్కన ఒక ఊర్లో ఒక ఇంటి ఆవిడను మంచినీళ్లు అడిగితే ఎంగిలి దోషం వస్తుందని వక్క ఇవ్వమని అడిగాడు. ఆమె వక్క ఇచ్చింది. బ్రహ్మయ్య దాని నోట్లో వేసుకొని కటుక్కున కొరికాడు.
అది చూసి ఆమె "అయ్యో బ్రహ్మయ్యా! వక్క కొరికేశావా? ఇంతకు ముందు దాన్ని ఎంతమందికో ఇచ్చాను, వాళ్లు దాన్ని కాసేపు చప్పరించి తిరిగి నాకు ఇచ్చే వాళ్ళు. నువ్వు అలాగే చప్పరించి ఇస్తావనుకున్నాను, ఎంతపని చేశావయ్యా" అని అంది.
వెంటనే బ్రహ్మయ్య చచ్చాన్రా దేవుడా అనుకుంటూ వక్కను గబుక్కున ఊసేసి తూ తూ అనుకుంటూ మళ్లీ బయలుదేరాడు.
అతను వెళ్తూ వెళ్తూ మరొక ఊరు చేరుకున్నాడు. ఆకలి వేస్తుంటే ఒక ముసలమ్మ ఉన్న ఇంటికి వెళ్లి “ఆకలి వేస్తుంది. అన్నం పెడతావా అమ్మా” అని అడిగాడు.
“దానికేం భాగ్యం. స్నానం చేసి రా నాయనా” అని ఆమె చెప్పింది.
బ్రహ్మయ్య స్నానం చేసి వచ్చాడు. విస్తరిలో భోజనం పెట్టింది ముసలమ్మ. అతను భోజనం చేసిన తర్వాత “విస్తరి మడిచి ఎక్కడ పారేయాలి” అని అడిగాడు.
ఆమె "అదేమిటయ్యా అలా అడుగుతావు? తిన్న విస్తరి కడిగి దాచుకుంటారు గానీ, మడిచి పారేస్తారా? నువ్వు తిన్న విస్తరిలో ఇంతకు ముందు నీ బోటి వాళ్ళు ఎందరో తిన్నారు, మళ్లీ ఎవరైనా వస్తే భోజనం ఎందులో పెట్టమంటావూ? విస్తరి కడిగి ఇంట్లో పెట్టు” అంది.
వెనుకటి పాపాలకు తోడు పులిస్తరాకులో అన్నం తిన్న పాపం కూడా చుట్టుకుందిరా దేవుడా అనుకుంటూ బ్రహ్మయ్య మళ్లీ బయలుదేరాడు. అతను వెళ్తూ వెళ్తూ మరొక ఊరు చేరుకొని ఒక ఇంటి ఆవిడను భోజనం పెట్టమని అడిగాడు. ఆ ఇంటి ఆవిడ అతనికి పాయసంతో భోజనం పెట్టింది. బ్రహ్మయ్య భోజనం చేశాక పాయసం చాలా బాగుందన్నాడు.
అప్పుడు ఆవిడ “అయ్యో నాయనా. పైన మీగడంతా కుక్క నాకేసింది, లేకపోతె పాయసం మరింత బాగుండును” అంది.
ఆమె మాటలు వినగానే బ్రహ్మయ్య ప్రాణాలు పోయినంత పని అయ్యింది. ‘కుక్క ఎంగిలి తినవలసిన గతి పట్టింది రా దేవుడా’ అనుకుంటూ లబోదిబోమంటూ ఇంక ఎక్కడా భోజనం చేయకూడదని నిశ్చయించుకొని తిన్నగా కాశీకి చేరుకున్నాడు.
అప్పటికే కనుచీకటి పడింది. బ్రహ్మయ్య గంగా నదిలో దిగి నీళ్లలో మునిగాడు. అదే సమయానికి ఒక పల్లెటూరి అమాయకుడు తండ్రి చనిపోతే దహనం చేసిన బూడిదను చూడకుండా బ్రహ్మయ్య తల మీద పోశాడు.
బ్రహ్మయ్య ‘ఛి ఛి’ అనుకుంటూ నీటిలో నుంచి లేచాడు. పల్లెవాడు అతన్ని చూసి తన తండ్రి బతికి వచ్చాడనుకొని ‘నాన్నా’ అని కౌగిలించుకొని వదలకుండా పట్టుకున్నాడు.
“నేను నీ తండ్రిని కాదు” అని బ్రహ్మయ్య ఎంత చెప్పినా పల్లెవాడు వినకుండా “నువ్వు మా బాబువే” అంటూ ఇంటికి లాక్కుపోవడం మొదలుపెట్టాడు.
ఇది చూసి దారిలో వెళ్తున్న నలుగురు పోగయ్యారు. వాళ్ళిద్దరి గోల విని కడుపు చెక్కలయ్యే లాగా నవ్వడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ల తగవు తీర్చలేక అక్కడి జనం వాళ్ళిద్దరినీ మంత్రి దగ్గరికి తీసుకు వెళ్లారు.
మంత్రి వాళ్ళిద్దరూ చెప్పిందంతా విని “చచ్చిపోయిన తండ్రి ఎలా బతికి వచ్చాడనుకున్నావ్ రా పిచ్చోడా!” అని పల్లె వాడినీ, “నీ చాదస్తానికి తగిన శాస్తి జరిగింది లే!” అని బ్రహ్మయ్యనీ మందలించాడు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
(నేదునూరి గంగాధరం జానపద విజ్ఞాన వ్యాసాల నుంచి సేకరించింది )
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.




Comments