top of page
Original.png

 అమ్మ వాక్కు

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #AmmaVakku, #అమ్మవాక్కు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

ree

Amma Vakku - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 26/08/2025

అమ్మ వాక్కు - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


“ఏంటి, నీకు ఎన్ని సార్లు చెప్పాలి, నాకు ఇవ్వాల్సింది కాఫీ, టీ కాదు. ” కఠినంగా పలికాడు ఆ ఆఫీసులో వ్యక్తి. 


అలాగే చాలా మంది తమకు రావాల్సింది కాక వేరేది వచ్చిందని తెగ గోల చేశారు. రంగడు క్యాంటీన్ లో చేరి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజులనుండి అతనే ఎవరికి ఏమి కావాల్సి వస్తె అది తెచ్చి ఇస్తున్నాడు. కొందరు కావాలనే అతన్ని ఆట పట్టించి అతన్ని బెదర గొడుతున్నారు. రంగడు మూగవాడు. వినడమే తప్పించి. తిరిగి సమాధానం చెప్పలేడు. ఇదే అదునుగా చూసుకొని, కొందరు ఉద్యోగస్థులు ఒక దగ్గరకు చేరి రంగడ్ని ఆట పట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ వున్నారు. 


అది చూసిన నరసింహం వేగంగా అక్కడకు చేరుకొని. “ఏమిటి మీరు చేస్తున్నది?. మీరు బ్రేక్ కు వచ్చి ఎంత సమయం అవుతుంది? ఇక్కడ ఇతన్ని ఆటపట్టిస్తూ కూర్చొంటే, మీ పని ఎప్పటికి పూర్తి అవుతుంది. ముందు ఇక్కడ నుండి వెళ్ళండి. ” అని వాళ్ళను హెచ్చరిస్తూ అన్నాడు నరసింహం.


నరసింహం మందలించడం తో అక్కడ నుండి వాళ్ళు వేగంగా వెళ్ళి పోయారు. 

నరసింహం ఆ కంపెనీ కు అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతనికి నిజాయితీగా ఉండడం ఇష్టం. పైగా ఇలాంటి వెకిలి చేష్టలు అంటే పరమ చికాకు. ఎవరైనా తప్పుచేస్తే నేరుగా అడిగేసే మనస్తత్వం. ఇదే అతని ఎదుగుదలకు అవరోధంగా మారింది. ఎప్పటి నుండో అతను ఆ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులోనే వున్నాడు, తప్పించి అతనికి పదోన్నతి లేదు. 


దానికి కారణం తన తోటి ఉద్యోగులు కంప్లయింట్ చేయడమే. ఎన్నో సార్లు ఆ కంపెనీ యజమాని నరసింహం ను తన తీరు మార్చుకోమని హెచ్చరించాడు కానీ, నరసింహం తన తీరు మార్చుకోలేదు. నరసింహం ను ఉద్యోగం నుండి తొలగించాలని గిట్టని ఉద్యోగస్థులు లేని పోని ఆరోపణలు చేసి చెప్పారు. కానీ నరసింహం లాంటి వ్యక్తిని వదులుకుంటే తమ కంపెనీ కి నష్టమని గ్రహించి అతన్ని ఇంకా కొనసాగేలా చేస్తున్నారు. 


రోజూ నరసింహం కు ఇలాంటి సమస్య ఎదురవుతూనే వుంటుంది. కానీ తనకు అలవాటైపొయింది. అక్కడ నుండి వాళ్ళను పంపించిన తర్వాత. నరసింహం క్యాంటీన్ దగ్గరకు వెళ్ళి అక్కడ వున్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇంతలో నరసింహం దగ్గరకు వచ్చాడు రంగడు. ఏమి కావాలని చెయ్యి సైగ చేసి అడిగాడు. 


“నాకేమీ అవసరం లేదు. ఒకవేళ అవసరం అయితే నేనే వచ్చి తీసుకుంటాను. ” అని నరసింహం చెప్పడం తో, తల ఊపి అక్కడ నుండి వెళ్ళిపోయాడు రంగడు. 


నరసింహం ఏవో ఆలోచన లో పడుతూ ఒక్కసారిగా ఆ క్యాంటీన్ వైపుకు చూసాడు. ఎదురుగా పెద్ద వయసు ఆవిడ వుంది. ఆమె అక్కడకు వచ్చి వారం రోజులకు పైనే అయ్యింది. 


“చూస్తుంటే వీళ్ళు కొత్త వాళ్ళు లా వున్నారు?. ఇంతకు ముందున్న కృష్ణుడు ఏమై పోయాడు?. చాలా ఏళ్ళ నుండి వాళ్ళు ఇక్కడ క్యాంటీన్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. కృష్ణుడు వాళ్ల అమ్మగారు చాలా మంచి ఆవిడ. వాళ్లకు నాకు బాగా పరిచయం వుంది. ఇప్పుడు వున్న స్టాఫ్ కృష్ణుడు ను కూడా ఇబ్బంది పెట్టేవారు. కానీ చిన్న పిల్లాడు అయినా చాలా చాకచక్యంగా పనులు చక్కబెట్టే వాడు. వాడి ఓపికకు, సహనం కు నాకు చాలా ముచ్చట వేసేది. వాడి నుండి చాలా నేర్చుకోవచ్చు. ” అని కృష్ణుడు గురించి అనుకుంటూ “వాళ్ల గురించి వీళ్లకు ఏమైనా తెలుసునేమో అడిగి చూద్దాం. ” అని అక్కడకు చేరుకొని, 


“హాయి, అండి! ఇంతకు ముందు ఇక్కడ వుండే వాళ్ళు కదా.. ఒక పిల్లాడు, వాడి పేరు కృష్ణుడు. అలాగే వాళ్ల అమ్మగారు?. వాళ్ళు ఏమైపోయారు. ” అడిగాడు నరసింహ. 


“ఆ పిల్లాడు అమ్మ చనిపోయింది బాబు. ఆ పిల్లాడు గురించి నాకు తెలిసింది. వాళ్ళు నాకు పరిచయం వున్నవాళ్ళే. నాకు చాలా బాధకలిగింది. ఆ పిల్లాడు కు తోడుగా వుండాలి అనుకున్నాను. ఆ పిల్లాడిని బడిలో చేర్పించి. ఈ క్యాంటీన్ నేను నడుపుతున్నాను. ఇదుగో ఈ రంగయ్య కు కాస్త అలవాటు అయ్యాక నేను వెళ్లిపోతాను. ” బదులిచ్చింది ఆమె. 


ఆ మాట విని దిగ్భ్రాంతికి గురయ్యాడు. నరసింహం.. 

“అలా జరిగిందా? అసలు ఆమెకు ఏమి అయ్యింది?. ”


“ఆమెకు ఎప్పటి నుండో ఆరోగ్యం బాగాలేదు బాబు. ”


కాసేపు మౌనం వహించాడు. వాళ్ల గురించి ఆమెతో చెపుతూ బాధపడ్డాడు. నరసింహం కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. వాటిని తుడుచుకుంటూ, కాస్త స్థిమిత పడి.. 

“అప్పుడు నేను కృష్ణుడికి చదువుకోమని చెప్పాను. అవసరం అయితే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాను, కానీ వాడు నా మాట వినలేదు. పైగా నేను చదువుకోను. ఈ బిజినెస్ ను పెద్దది చేస్తా. నా జీవిత ఆశయం ఇదే అనే వాడు. వాడి మాటలు చాలా ముచ్చటగా వుండేవి. కానీ వాళ్ల అమ్మగారికి కృష్ణుడు బాగా చదువుకోవాలని, వాడు మంచి ప్రయోజకుడు అవ్వాలని వుండేది. చాలా సార్లు ఆమె నాతో ఈ విషయం చెప్పేది కూడా. ” అన్నాడు నరసింహ. 


“అందుకే బాబు, నేను వాడికి నచ్చజెప్పి చదువులో పెట్టించాను. ” అని ఆమె చెప్పింది. 


“సరే పెద్దమ్మ, ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వండి.” అని అడిగాడు నరసింహ. 


వెంటనే టీ చేసి ఇచ్చింది. 


“ఏమిటో పెద్దమ్మ. మీ చేతి టే తాగితే ఏదో తెలియని అనుభూతి. మీ చేతిలో ఏదో మహిమ వుంది.” అన్నాడు నరసింహ అనుభూతి చెందుతూ. 


“అంతా నీ అభిమానం బాబు.” నవ్వుతూ అంది ఆమె. 


“మీరు ఇక్కడ వుంటున్నారు. మీ కుటుంబం ఎక్కడ వుంటారు?.” అడిగాడు నరసింహ. 


“వున్నారు బాబు. నన్ను బాగా చూసుకుంటారు. అయితే కృష్ణ గురించి తెలిసి అతని దగ్గరకు వచ్చాను. క్యాంటీన్ వాళ్ళ అమ్మ గారిది. ఆ క్యాంటీన్ వేరే వాళ్లకు వెళ్లకుండా చూసుకుంటానని కృష్ణ కు మాట ఇచ్చాను. అందుకే ఇక్కడ వున్నాను.” అంది ఆమె. 


“మీరు చాలా గ్రేట్ పెద్దమ్మ. సొంతవారి కోసం నిలబడని ఈ రోజుల్లో. కృష్ణ కోసం మీరు నిలబడ్డారు.” అని అన్నాడు నరసింహ. 


“ఒకసారి కోసం ఒకరు నిలబడటమే నిజమైన ఆస్తి కదా బాబు. ఈ మంచే కదా మానవుడికి నిజమైన ఆస్తి.” నవ్వుతూ అంది ఆమె. 


ఆమె మాటలు నరసింహ కు బాగా నచ్చాయి. 

“మీ మాటల్ని, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మ ఎప్పుడూ ఒకటే చెప్పేవాళ్ళు. ఎంత కష్టమైన సరే ధర్మాన్ని వీడకు అని.” అన్నాడు నరసింహ. 


“అవునా, మీ అమ్మగారు ఎలా వున్నారు. ఇంతకీ నీ కుటుంబం గురించి చెప్పలేదు?. ” చనువు తీసుకుంటూ అడిగింది ఆమె. 


“ఊహవచ్చినప్పటి నుండి నాకు తండ్రి, బంధువు, స్నేహితురాలు అన్నీ మా అమ్మే. ఆమె నాకు దూరం అయ్యారు. నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు. ఉద్యోగం లో చేరి అమ్మను బాగా చూసుకోవాలనుకున్న సమయంలో ఆ భగవంతుడు కూడా ఓర్వలేక పోయాడు. మా అమ్మను, నాకు మిగిలిన ఒకే ఒక్క బంధాన్ని దూరం చేసాడు.” పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేసాడు. 


“ఊరుకో బాబు, ఊరుకో..” అని నరసింహం ను ఓదార్చింది. 


“చూసారా పెద్దమ్మ నా పరిస్థితి?. నా బాధను పంచుకునే వాళ్ళే లేరు?. నేను ఏదైనా మంచి కోసం చేస్తే దానిలో చెడే చూస్తున్నారు. నా మీద ఆరోపణలు చేస్తున్నారు. అయినా అవి ఏవీ నేను పట్టించుకోను. నా ధర్మాన్ని నేను వీడను. మహా అయితే ఏమి చేస్తారు ఈ ప్రాణాన్ని తీస్తారు. అంతే కదా. ఈ అనాథ శరీరం ఏమైనా పర్వాలేదు. ” ధారగా వస్తున్న తన కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు నరసింహం. 


“అయ్యో ఎందుకు బాబు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అనాథ ఏమిటి. నీకు నేను వున్నాను కదా. అలా నువ్వు బాధపడ కూడదు. ఈ లోకం అంతే మంచిని బ్రతక నివ్వ కుండా చూస్తుంటుంది. అది ఈ కలియుగ ధర్మం కదా. దాని ధర్మం అది పాటిస్తుంది. మన ధర్మం మనం పాటిద్దాం. ఎప్పటికైనా విజయం మనదే కదా. ” అంది ఆమె. 


ఆమె మాటలు నరసింహ కు ఊరటగా అనిపించాయి. కాస్త తన బాధను తగ్గించుకొని, 

“నన్ను క్షమించండి! మిమ్మల్ని బాధపెట్టాను, నా వ్యధలు చెప్పుకుంటూ. ” అని అన్నాడు నరసింహం. 


“అయ్యో పర్వాలేదు బాబు. నేను నీ కుటుంబం అనుకో. అప్పుడు ఏ బాధావుండదు. ” అని నవ్వుతూ అంది ఆమె. 


అప్పటి నుండి ఆమెకు, నరసింహ కు మంచి దోస్తీ ఏర్పడింది. రోజూ కాసేపు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తో మాట్లాడి వస్తుండేది వాడు. అలా రోజులు గడుస్తూ వున్నాయి. 


ఒకరోజు ఆఫీసు తెరిచి గంట సమయం అవుతుంది. ఆ సమయంలో నరసింహం క్యాంటీన్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ వున్నాడు. 


“ఎప్పుడు కూడా సరైన టైంకు మాత్రమే వచ్చే నరసింహం ఇప్పుడు ఏమిటి ఇంత వేగంగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు” అని సందిగ్ధ పడుతూ, నరసింహ దగ్గరకు చేరుకుంది బామ్మ.. 


“ఏమైంది బాబు!. ఏమిటి ఈ రోజు ఇక్కడ కూర్చొన్నావు?. ”అడిగింది ఆమె. 


ఆమె మాటలకు తన ఊహల్లో వుండి బయటకు వచ్చి, నవ్వు నవ్వి, 

“ఏముంటుంది పెద్దమ్మ. ఊహించిందే. నా ఉద్యోగం పోయింది. ” చెప్పాడు నరసింహ. 


ఆ మాట విని ఆమె కొంత సేపు మౌనం వహించింది. తర్వాత, “అయ్యో! అలా ఎలా తీసేస్తారు?. ” అడిగింది ఆమె. 


“వాళ్ళు అనుకున్నారు కదా. ఎలా ఐనా తీసేస్తారు, ” బాధపడుతూ చెప్పాడు. 


“దిగులు పడకు బాబు, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. ”


“నిజమే కానీ నాకు ఇప్పుడు చాలా డబ్బు అవసరం. వచ్చే నెల కొందరు విద్యార్థుల ఫీజులను కట్టాలి. ఇన్నాళ్ళు ఈ ఉద్యోగం ద్వారా వచ్చిన జీతం తో కొంతమంది పిల్లలకు వాళ్ళు కోరుకున్న స్కూల్లో చేర్పించాను. వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ల బ్రతుకు బాగుటుంది అని. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు. జీతం లేదు. దీని కారణంగా వాళ్ల జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు?. ” అన్నాడు నరసింహం దిగులుతో. 


“ఎంత తపన!, పేద పిల్లలకు ఉన్నత విద్య అందించి వాళ్ళ బ్రతుకుకు బాటలు వేయాలని చూస్తున్నాడు. ఎంత మంచి హృదయం వుంటే ఇలాంటి ఆలోచన వస్తుంది. నిజంగా ఇలాంటి వారికి కదా మనం అండగా నిలబడాలి. ” అని తనలో అనుకుంటూ, 

“భయపడకు బాబు! నేను సర్దుతానులే. నువ్వు తర్వాత నాకు ఇవ్వవచ్చు. ” అని అంది ఆమె. 


ఆ మాట విని ఆమె వైపుకు ఆశ్చర్యంతో చూసాడు. 

“మీరు ఇస్తారా?. ” ఆశ్చర్యంతో అడిగాడు. 


“ఏమి బాబు, ఓ తల్లి కొడుక్కి ఇవ్వకూడదా?. ” అంది ఆమె. 


ఆ మాటలకు అతని హృదయం ఉప్పొంగి పోయింది.. ఒక్కసారిగా లేస్తూ ఆమె ను కౌగలించుకున్నాడు.. 

“బాబు, నువ్వు ఎప్పుడూ బాధపడకు. నీకు ఎప్పుడు ఏ అవసరం కావాలన్న నన్ను అడుగు.. మరచిపోకు నీకు ఈ అమ్మ వుంది. ” అని అంది ఆమె. 


“సరే, ” అంటూ నవ్వుతూ తన కన్నీళ్లను తుడుచుకున్నాడు.. 


“సరే, రేపు మనం దేవాలయం కు వెళ్దాం. కాస్త నీకు కూడా ప్రశాంతంగా వుంటుంది. ” అని అంది ఆమె. 


నరసింహ కూడా ఒప్పుకున్నాడు. తర్వాత రోజూ ఇద్దరూ కలిసి ఆలయానికి వెళ్ళి దేవుడ్ని దర్శనం చేసుకొని, అక్కడే మండపం లో కూర్చున్నాడు. 


“బాబు. ” అని పిలుస్తూ ఒక లెటర్ నరసింహా చేతిలో పెట్టింది ఆమె. 


“ఏమిటి అమ్మ ఇది?. ”


“నువ్వే చూడు?. ”


తెరిచి చూసాడు. అది తనకు ఉద్యోగం ఇస్తునట్టుగా వున్న ఆఫర్ లెటర్. చూసి ఆశ్చర్యపోయి, “అమ్మ, ఈ లెటర్. ” ఆశ్చర్యంతో అడిగాడు. 


“నాకు తెలిసిన వాళ్లకు చెప్పాను. వాళ్ళు సరే అన్నారు.. ”


“సంతోషంగా వుంది అమ్మ. కానీ, మీకు వాళ్ళు ఎలా తెలుసు?. ”


చిన్నగా నవ్వింది. కానీ, సమాధానం చెప్పలేదు. 

“సరే, ఇందులో ఏ ఉద్యోగం అన్నది రాయలేదు?. ”


“నువ్వు అక్కడికి వెళ్ళు, వాళ్ళే చెప్తారు. ”


ఆమె పాదాలు మీద పడ్డాడు, “మీ రుణం ఎలా తీర్చుకోగలను. ” అని అన్నాడు. 


“అయ్యో పర్లేదు బాబు. ” అని నరసింహం ను పైకి లేవదిస్తూ అంది.. 


 కాసేపు మాట్లాడిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు. 

మరుసటి రోజు ఆమె చెప్పిన అడ్రెస్స్ కు చేరుకున్నాడు. తన దగ్గర వున్న లెటర్ వాళ్లకు ఇచ్చాడు. అది చూసిన అక్కడ వున్న స్టాఫ్ నరసింహం ను లోపలికి తీసుకు వెళ్లారు. అందరూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. 


వాళ్ళ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నాడు నరసింహ. ఇంతలో అక్కడకు చేరుకున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతూ, 

“అమ్మ మీరు ఇక్కడ ?. ” అని అడిగాడు. 


ఆమె రాక తో అక్కడ వున్న వాళ్ళ జాగ్రత్త పడి, ఆమెకు గుడ్ మార్నింగ్ చెప్తూ దూరంగా నిలబడ్డారు. 


ఆమె నేరుగా నరసింహం దగ్గర కు వచ్చి, అతని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్లి, అక్కడ వున్న కుర్చీలో కూర్చో బెట్టింది. నరసింహం కూర్చోవడం తో మిగతా వారు కూడా తమ కుర్చీల్లో ఆసీనుల అయ్యారు. అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ.. 

“డియర్ మ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన కంపెనీ సీఈఓ గా నేను నరసింహం ను నామినేట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా అభ్యంతరం వుంటే చెప్పండి. ” అని అడిగింది ఆమె. 


అందరూ కూడా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పడం తో ఫైల్ తీసుకొని నరసింహ ముందు పెట్టింది.. 

“బాబు ఇక్కడ సంతకం పెట్టు. ”అని అంది. 


అక్కడ ఏమిటి జరుగుతుందో నరసింహం కు అర్దం కావడం లేదు.. “మేడం మీరు ?.. ” అని సందిగ్ధ పడుతూ అడిగాడు. అప్పటి వరకు అమ్మ అని పిలిచిన పిలుపును మరిచిపోతూ. 


చిన్నగా నవ్వి, నరసింహం ను అక్కడ నుండి పక్కనే వున్న రూం లోపలికి తీసుకు వెళ్ళింది. 

“బాబు! నేను మిమ్మల్ని కలవడం యాదృచ్ఛికం కాదు. నేను మిమ్మల్ని కలవాలనే ఆ క్యాంటీన్ నడిపే వంకతో అక్కడకు వచ్చాను. అప్పుడే నాకు కృష్ణ వాళ్లు గురించి తెలిసింది. నేను చేయబోయే ది వాళ్లకు కూడా సహాయం అవుతుందని నేను ఆ క్యాంటీన్ బాధ్యత తీసుకున్నాను.”


అర్దం కానట్లుగా ముఖం పెట్టాడు నరసింహ. 


“బాబు! ఈ కంపెనీ ఫౌండర్ ను నేను.. నా పేరు మల్లికా దేవి. నా కంపెనీ లో సీఈఓ పోస్ట్ ఖాళీ అవ్వడం తో కొత్తగా సీఈఓ ను నియమించాలని నేను అనుకున్నాను. వాటి కోసం అప్లికేషన్స్ కూడా ఆహ్వానించాను. చాలా మంది చాలా పేర్లు రికమాండ్ చేశారు. అయితే మోహన్, అదే ఒకప్పుడు నువ్వు పనిచేసే కంపెనీలో హెచ్ ఆర్ గా పనిచేసిన వ్యక్తి నీ పేరును సూచించాడు.


మోహన్ అంటే నాకు నమ్మకం ఎక్కువ. అందుకే నీ పేరు ను కూడా నేను పరిగణనలోకి తీసుకున్నాను. వచ్చిన వారిని నేను పరిశీలిస్తూ వచ్చాను. వాళ్ళు ఈ పోస్ట్ కు అర్హులు కారని నిర్దారణకు వచ్చాను. చివరికి నీ దగ్గరకు వచ్చాను. నీ ఊహించిన దానికంటే నీలో నైపుణ్యం వుంది. మానవత్వం వుంది. ఎన్ని బాధలు పడినా సరే ఇతరుల భవిత కోసం నీ పోరాటం నాకు నచ్చింది. అందుకే నీకు ఈ పోస్ట్ ఇవ్వాలనుకున్నాను. ” అని చెప్పింది ఆమె. 


ఒక్కసారిగా నరసింహ కళ్ళలో నీరు తిరిగాయి. “అమ్మ!, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ” అని అన్నాడు నరసింహం. 


“బాబు! నేనే నీ ఋణం తీర్చుకోవాల్సి వుంది!. ఒకప్పుడు నువ్వు ప్రమాదం నుండి కాపాడి, రక్త దానం చేసి కాపాడిన వ్యక్తి నా కొడుకు, నీకు ఆ సంఘటన గుర్తుకు వుందో, లేదో నాకు తెలియదు. నాకు మాత్రం గుర్తుకు వుంది. తర్వాత వివరాలు తెలుసుకుంటే నువ్వే అని తెలిసింది. నిన్ను కలవాలని అనుకున్నాను. కానీ ఈ లోపే మోహన్ నీ పేరును సీఈఓ పోస్ట్ కు నామినేట్ చేశాడు. అప్పుడే నీకే ఈ పోస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను.


కానీ ఈ పోస్ట్ లో వుండే వ్యక్తి ఆలోచనలు, చర్యల తో ఎందరో భవిష్యత్తు ముడి పడి ఉండటం తో నిన్ను పరీక్షించవలసి వచ్చింది. చివరికి నీ మంచితనం, నీ కర్తవ్యం నిష్ఠ, ధర్మ అనుసరణ, నిన్ను ఈ స్థానం కు చేర్చింది. ఎటువంటి కల్మషం లేకుండా తమ పని తాను చేసుకుంటే వెళ్ళిపోతే రావాల్సింది అదే వస్తుందని నువ్వు నిరూపించావు. ” అని అంది మల్లికా దేవి. 


“నువ్వు తప్పకుండా ఉన్నత స్థానానికి వెళ్తావు. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఎవరు ఏమి అనుకున్నా, నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది అయితే నువ్వు వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ కల నిజం అవుతుంది. విజయం దానంతట అదే వస్తుంది. ” ఎప్పుడూ అమ్మ చెప్పే మాటలు ఘంటాపథంగా తన మదిలో మారుమ్రోగుతున్నాయి. 


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page