top of page

చాంచల్య


'Chanchalya' - New Telugu Story Written By Pandranki Subramani

'చాంచల్య' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

బ్లోయింగ్ విండ్ సాఫ్టువేర్ కంపెనీ మియాపూర్ లో ఉన్న మియానీ కట్టడం ఐదవ అంతస్థులో ఉంది. కొత్త కట్టడం, కొత్త సాంకేతికపరమైన సోఫిస్టికేటడ్ హంగులతో ఫెళ్ళున చూపుల్ని తాకే అధునాతన తీరు తెన్నులతో కళ కళలాడుతూ ఉంటుంది. అటూ యిటూ ఇరువైపులా ఫ్రంట్ సపోర్టింగ్ ఆఫీసూ, బ్యాక్ సపోర్టింగు ఆఫీసూను-- ఎంతటి పని రద్దీలోనైనా సరే మోమున అలసట కనిపించని ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ ఫీల్ తో కనిపిస్తారు అక్కడి స్టాఫ్.


డ్రెస్ కోడ్ కి తావులేకుండా తాజాగా అప్పటికప్పుడు కార్యాలయానికి వచ్చినట్టు డ్రెస్సప్పయి కనిపిస్తూరు. అలా ట్రిమ్ గా నీటుగా ఉండటం కార్పొరేట్ కంపెనీ నియమం.. పెర్మార్మెన్స్ రివ్యూలో ఒక భాగం. బయటనుండి లోపలకు ప్రవేశించే చాలా మందికి, ముఖ్యంగా జాబ్ లో కుదరడానికి ప్రయాసపడే యువతీ యువకులకి అక్కడి నూతనోత్సాహపు కార్పొరేట్ వాతావరణంతో మమేకం కావడానికి కుతూహళం చూపిస్తారు.


అక్కడ ట్రేడింగ్ సాఫ్టువేర్ డెస్కు వద్ద సెటిల్ ఐన ఆరునెలల తరవాత ప్రకాశ్ నగరుకి చెందిన వరదరాజు ప్రక్క సీట్లో పనిచేస్తూన్న కోమలితో పరిచయం యేర్పడింది. యవ్వన ప్రాయ ప్రాంగణంలో డేషింగ్ పర్సనాలిటీస్ ని ద్విగుణీకృతం చేసుకునే ఇద్దరు అపోజిట్ జెండర్ కి చెందిన యువతీ యువకులు దగ్గర కావడం సహజమే కదా! సుమావాంఛకున్న సహజ గుణాంశం అదే కదా!


చూపులూ చూపులూ లాక్ అయి, గాలానికి చేపలు తగుల్కున్నట్టు యేర్పడ్డ ఆ దగ్గరితనం మోహతరంగాలలో తేలి పోయేలా చేయడం కూడా సహజ పరిణామమే కదా! అపోజిట్ సెక్స్ శరీర వాసనలు ముఖ్యంగా ఈస్ట్రోజిన్ హార్మోనులు పరస్పరం ఒరసుకోవడంలో ఆశ్చర్యం యేముంది? ఇక కావలసింది ఒడుపుగా ఆనంద తీరాలను అందుకోవడమేగా మిగిలింది. ఇక పెద్దల సమక్షాన పెళ్లి చూపులకు లాంఛన ప్రాయంగా యేర్పాటు చేయడమేగా తరవాయి.


అప్పుడు వరదరాజుకి తన కాలేజీ మేట్ మదన్ నుంచి ఫోను వచ్చింది. తను పంపించిన రెస్యూమ్ ని యెలాగో ఒకలా ఎమ్డీ కారిడర్ లోకి పుష్ చేయమని. ఎంతటి సాన్నిహిత్యం గల కాలేజీ మేటయినా వరదరాజు ఈ విషయంలో రెండడుగులు వెనక్కివేసాడు.


ఎందుకంటే మదన్ పోకడ గురించి.. ముఖ్యంగా అతడి మనస్తత్వం గురించి అతడికి తెలుసు కాబట్టి. కాలేజీలో ఒకే బ్యాచ్ మేట్సయినా వరజరాజు సాధ్యమైనంత మేర మదన్ దరదాపుల నుండి తొలగి ఉండటానికి ప్రయత్నించేవాడు. కారణం- మదన్ కి దూకుడెక్కువ. అవసరం ఉన్నా లేకపోయినా అతడు అందిరితో.. ముఖ్యంగా అందమైన అమ్మాయిల చూపుల్లో పడటానికి ఉబలాట పడుతుంటాడు. జాలరిలా ఊడి బయటకు రానివ్వని ఫ్యాబ్రిక్ వల వేస్తుంటాడు. చురుకైన హావభావాలతో పాలల్లో నీళ్ళలా వాళ్లతో కలసిపోతుంటాడు.


ఈ పోకడ వరదరాజుకి పట్టేది కాదు. వాడేసి వదలుకునే టైమ్ పాసింగ్ టైపని, ఏ యెండకు ఆ గొడుగు పట్టే రికారీ పోకడని దూరంగా ఉండేవాడు. ఇక ముందుకు పోయి ఆలోచిస్తే వ్యక్తిగత పోకళ్లే వృత్తి పధంలోనూ చాపక్రింది నీరులా జొరపడతాయన్నది వరదరాజు స్వంత అభిప్రాయం. కాని— యెంతైనా బ్యాచ్ మేటే కదా, తనతో బాటు మూడేళ్ల పాటు కలసి కంప్యూటర్ కోర్సు చదువుకున్నవాడే కదా! అటువంటప్పుడు పదే పదే మిస్సాయిల్స్ లా వచ్చి పడుతూన్న అతడి అభ్యర్థన ను రొంప పట్టిన ముక్కును చీదరించుకున్నట్టు యెలా తోసిపుచ్చడం? అదీను ఉద్యోగమన్నది జీవన ప్రాంగణానికి సంబంధించినది.


ఎప్పుడో యుక్తవయసులో రిక్కీగా తిరిగిన రోజుల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తను యేమీ పట్టనట్టు చేతులు కడిగేసుకుంటే అది ఒకవిధమైన కక్ష సాధింపే కదా అవుతుంది. ఈపాటికి మదన్ యెదిగిన వయసుతో బాటు బాగా మారిపోయుంటాడు. ఆ మాటకు వస్తే మార్పుకి లోనుకాని వాడెవడుంటాడు?


ఎట్టకేలకు వరదరాజు ప్రమేయంతో అతణ్ణి ఇంటర్వ్యూ చేసిన సీనియర్ హెచ్చారెమ్ స్టాఫ్ తోడ్పాటుతో బ్లోయింగ్ విండ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో మదన్ ప్రవేశం సాధించగలిగాడు. కంపెనీలో చేరిన తరవాత డెస్క్ సీటుని స్వంతం చసుకున్న తరవాత మదన్ మాటవరసకి కూడా వరదరాజు డెస్కుకి వెళ్లి కలుసుకోలేదు. కనీసం వరదరాజు సీటు వేపు తొంగి కూడా చూడలేదు. దానికి వరదరాజు రియాక్ట్ కాలేదు. అతడికి తెలుసు- మదన్ కి మొదట్నించీ తన పై తనకు విశ్వాసం అధికం.


కాలేజీ రోజుల్లో కూడా ఫ్రెండ్స్ వద్ద నోట్స్ తీసుకుని అవసరం తీరేవరకూ వాడుకుని తిరిగిచ్చేటప్పుడు పెదవి విప్పేవాడు కాడు;బిగించుకున్న పెదవులనుండి ముత్యాలు రాలిపోతాయన్నట్టు. దీనికి తోడు మరొక అలక్ష్యమైన పోకడ కూడాను. ”రేపు వీళ్లందరూ తన సహాయం కోసం క్యూకట్టి నిల్చోరూ!” అన్న అహంభావపు ఆకళింపు. యింకా పోలేదేమో!

ఒకరోజు ప్యాంట్రీవేపు వెళ్తన్నప్పుడు ఎదురు వచ్చిన మదన్ కి కోమలిని పరిచయం చేసాడు వరదరాజు. కోమలిని చూసి మదన్ కళ్లు పెద్దవయాయి. అతడి చూపులు పడరాని చోట పడ్తున్నాయన్నది వరదరాజు గమనించాడు..


కోమలిది యెత్తైన వక్షోజ ద్వయం. ఎప్పుడూ యెదుటి వారిని తియ్యగా పలకరించినట్లుండే చురుకైన నయనాలు. మిరుమిట్లుగొలిగే యెర్రటి అందం. ఐతే—మిత్రుడి గార్ల్ ఫ్రెండు వేపు చూస్తున్నాం కదానన్న స్పృహ గాని సంకోచం గాని లేకుండా కోమలిని తదేకంగా చూస్తూన్న మదన్ పోకడకు వరదరాజు ఇబ్బంది పడ్డాడు.


కోమలి కూడా తనలాగే ఇబ్బందిగా ఫీలవుతూ ప్రక్కకు తప్పుకుం టుందనుకున్నాడతడు. కాని ఆమెకూడా చెక్కు చెదరకుండా నిలకడగా నిటారుగా మదన్ నే చూస్తూ మాట్లాడుతూ నిల్చుంది. తను వాళ్ళ ప్రక్కనున్న వైనం తెలిసి కూడా ఆమె అలా మదన్ చూపులో చూపు నిలిపి చూడటం వరదరాజుకి నిజంగా కంపరం కలిగింది. ఇక వేరే దారి లేక చివరి ప్రయత్నంగా ఆమె నడుం చుట్టూ చేతిని వేసి ముందుకు నడిపించాడు.


ఐతే మదన్ నిజంగా మారలేదన్నమాట!’ ఎంతటి వారలైనా కాంతల ముందు దాసులే‘ అన్నది తనకు తెలియక కాదు. కాని తనతో చదువుకున్న మిత్రుడి లవర్ అని తెలిసిన తరవాత కూడానా మదన్ కి అంతటి మోహ తరంగపు కైపా---


జరిగినది దానంతట తానుగా కనుమరుగవుతుందనుకున్న వరదరాజుకి ఆశాభంగమే కలిగింది. ఒక రోజు అతడు కోమలి కోసం వెళ్లినప్పుడు మదన్ ఆమె డెస్క్ వేపు వంగి సరదాల సంబరాలు కురిపిస్తున్నాడు. అతడెందుకలా ముందుకి వంగి యేట వాలుగా వంగి నిల్చున్నాడో వరదరాజుకి తెలియనిదా! అదే ఊపుతో ఆమె పెదవులపైన నవ్వుల పూవులు పూయిస్తున్నాడు మదన్.

అప్పటికతడు వాళ్ల మధ్యకు దూసుకు వెళ్లి తన ఉనికిని తెలియచేయకపోయినా అదే రోజు సాయంత్రం కోమలిని విడిగా కలుసుకుని మదన్ సహజ ప్రవృత్తి గురించి వివరించాడు. అతడు చలాకీగా తుళ్లింతలు సృశ్టిస్తున్నా దేనితోనూ నిలకడ గల అనుబంధం ఉంచుకోడని, సత్సంబంధం పెంచుకోడని- అతణ్ణుండి సాధ్యమైనంత ఎడంగా ఉండమని కచ్చితమైన కంఠస్వరం తో చెప్పాడు.


అంతావిన్న కోమలి ఇబ్బందిగా ముఖం పెట్టి చూస్తుందనుకున్నాడు. కాని పకపక నవ్వేసింది.

నవ్వుతూ వరదరాజుకి హితబోధ చేసింది. “మరీ టచ్చీగా ఉండకు సఖుడా! జీవితాన్ని అప్పుడప్పుడు లైట్ గా తీసుకోవడం నేర్చుకో! అతడిలా నిన్నెప్పుడైనా క్లోజ్ గా మూవ్ చేస్తూ నవ్వుల పువ్వులు పూయించకని చెప్పానా! నువ్విలాగా-- అతడలాగా— అంతే సంగతులు”


“భలేదానివే! నాతో అతణ్ణి పోల్చుతావేమిటి? రేపో మాపో నీకు పసుపు పోసి పెద్దల సమక్షాన నిశ్చితార్థం జరిపి పెళ్లి కొడుకుని కాబోతున్నాను. నీతో యేడడుగులు కలిపి నిప్పు గుండం చుట్టూ నడవబోతున్నవాడిని-- ”


దానికామె వెంటనే అదే పకపకలతో ముక్తాయించింది- “నేను కాదన్నానా? నాతో క్లోజ్ గా ఉండకన్నానా! అప్పటి మాట అప్పటిది- ఇప్పటి మాట ఇప్పటిది. మరొక సారి చెప్తున్నాను ప్రియసఖా! లైఫ్ ని తేలిగ్గా తీసుకో— అప్పుడే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయగలవు” అంటూ విషయాన్ని దాట వేసింది; నీటికి యేట వాలుగా ఒరిగి జారి పోతూన్న తెప్పలా-- వరదరాజు అప్పటికప్పుడు తీర్మానించాడు ఇక జాప్యానికి తావివ్వకూడదని. నిశ్చితార్థం వచ్చే పాడ్యమి లోపల జరిగేటట్టు చూడాలని--


మరుసటి వారం అదేదో పుణ్యదినాల గొలుసు కట్టు వల్ల వారాంతపు సెలవులతో బాటు సోమవారం కూడా సెలవు దినం గా కలిసొచ్చింది. మంచి మూడ్ లో ఉన్న వరదరాజు చిక్కడ పల్లి వేంకటేశ్వర గుడి క్షేత్రానికి తీసుకెల్లాలనుకుని కోమలి ఇంటికి ఫోను చేసాడు. వాళ్ల చెల్లి ఫోను అందుకుని- “ఎవరు కావాలండీ!” అని అడిగింది.


ఆ ప్రశ్నకు అతడు వెంటనే బదులివ్వలేక పోయాడు. కారణం- కోమలి ఇంట్లో ఒకటే అరుపులు గగనానికి అంటుకున్నట్లున్న నవ్వులు వినిపించాయి. సందేహం లేదు. ఆ జోకులూ ఆ పెంకె నవ్వులూ మదన్ వే! దానితో అతడేమీ అనకుండా ఫోను క్రింద పెట్టేసాడు. గూటిలోని గువ్వలా మనసు ముడుచుకు పోయింది. బుర్ర మొద్దుబారి పోయింది. పొంగుకు వచ్చిన ఆవేశాన్ని అణచుకున్నాడు.


తనలో తను- “కూల్ కూల్ వరదా! కోమలి స్వతహాగా సరదాలూ జోకులూ అంటే ఇష్టపడే వ్యక్తి అని- ఎల్లప్పుడా గలగల పారే సెలయేరుగా తన చుట్టు ప్రక్కల మంది మార్బలం ఉండాలని కోరుకునే విట్టీ లేడీ యని నీకు తెలియదూ!” అని తనలో తను సబాళించుకోవడానికి ప్రయత్నించాడు. కాని మనసు కకావికలమైంది. ఇది మొదటి సారి కాదు; మదనూ కోమలి యిద్దరూ కలసి తన మనసుని కొనగోటితో గిల్లడం—


ఎంత వద్దనుకున్నా అతడి మనోఫలకం పైన కోమలి రూపం వయ్యారపు భంగిమలతో కదలాడసాగింది. ఆమె రూపం- బాహ్య రూపం- సుందర సుకుమార కళాఖండం. కాని తను తాకలేడు. దరిచేరలేడు. కారణం- ఆమె ఒక సైకత కళాఖండం. అద్దపు తలుపుకి ఢీకునే దీపపు పురుగుల్లా అతడిలోని ఆలోచనలు యెడా పెడా కొట్టుకుంటున్నాయి. మరి కాసేపటికి అవి రెక్కలు విరిగి నేల రాలిపోయే తీరుతాయి.


ఆ తరవాతి రోజు, అంటే మంగళవారం నాడు కార్యాలయం చేరుకున్న వరదరాజు సీటుకి వెళ్లకుండా కోమలిని కన్ఫ్రంట్ చేసాడు. అహం దెబ్బ తిన్న యే మగాడూ మంచుకొండలోని తెల్ల యెలుగులా తోకముడిచి ఉండలేడుగా! ప్యాంట్రీవేపు ఆప్యాయంగా తీసుకెళ్తూ దారిలో అలవోకగా అడిగాడు- “నిన్ను శనివారం గుడికి తీసుకెళ్లడానికి మీ ఇంటికి ఫోను చేసానోయ్! మీ చెల్లి అందుకుంది. మాటలేవీ చెవికి అందలేదు. హాలంతా గడబిడగా ఉన్నట్లుంది. ఊరి నుండి మీ బంధులెవరైనా జమిలిగా వచ్చారా!”


కోమలి ఆ మాటకు కనురెప్పలల్లార్చి కాసేపు వ్యవధి తీసుకుని చప్పున బదులిచ్చింది- “అబ్బే! ఎవరూ రాలేదే! నేనొక్కతనే ఉన్నాను మా చెల్లితో-- ఐనా ఊరినుండి యెవరో వచ్చుంటారని నీకెందుకనిపించింది?“


అతడు బదులివ్వలేదు. ఇక వాదోపవాదాలకు తావెక్కడది-- వాస్తవాలు తాలూ తప్పలా నిలకడపైన వాటికవే తేలిపోతున్నప్పుడు. తను యేదో స్పురణకు వచ్చిన వాడిలా జెర్కింగ్ ఇచ్చి- “సారీ కోమలీ! నన్ను అర్జంటుగా డిప్యుటీ మేనేజర్ పిలిచాడు. నిన్ను చూచినంతనే ఆ విషయమే మరచి పోయినట్టున్నాను. నువ్వు ప్యాంట్రీలో కూర్చో! నేనీలోపల అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను. అదిగో! మదన్ కూడా ఇటే వస్తున్నాడు. నేను వచ్చే లోపల నీకు కంపెనీ ఇస్తుంటాడులే-- “ అంటూ సరసరా నడచి వెళ్లిపోయాడు వరదరాజు.


మనసనే ఆకాశాన గాఢమై న మబ్బులా మౌనం క్రమ్ముకొస్తుందంటే అదొక విధంగా యుధ్దారంభ సంరంభమేగా--


ఎలాగూ అనుకున్నాడు కాబట్టి మనసు దిటవు పరుచుకుని మరుసటి శనివారం నాడు మరచిపోకుండా అతడు ఒంటరి గానే చిక్కడపల్లి వేంకటేశ్వరాలయ దర్శనం కోసం బయలు దేరాడు. ఈ మూడులోకాలలో దైవ దర్శనం కంటే ముఖ్యమైనది మరొకటి ఉందేమిటి— దైవదర్శనం చేయడానిక కూడా మరొకరి ఆసరా కావాలేమిటి—

------------------------------------------------------------------------------------------

వరదరాజు పని చేస్తూన్న బిల్డింగ్ గ్రౌండు ఫ్లోర్ లో- టేస్ట్ ఆఫ్ ఫైర్- రిస్టారెంటు ఉంది. అక్కడ టేస్ట్ నిజంగానే బాగుంటుంది. కావున అక్కడ మద్యాహ్నం పూట రద్దీగా ఉంటుంది. ఎందుకో ఆ పూట వరదరాజుకి అక్కడ భోంచేయాలనిపించింది. అతడలా లిఫ్టులో దిగి టేస్టాఫ్ ఫైర్ రిస్టారెంటువేపు నడుస్తున్నప్పుడు మదన్ యెదురొచ్చాడు.


నవ్వుతో విప్పారుతూన్న మోముతో, వాళ్ళ మధ్య యేమీ జరగనట్టే “ఈ రోజు నేనూ నీతో కలసి లంచ్ తీసుకుంటానురా వరదా!“ అంటూ జబ్బ పట్టుకుని లోపలకు దారి తీసాడు. వరదరాజు నోట మాట కరువైంది. కపట నాటక సూత్రధారి భారతంలోని శకుని మామ కాదు; ఇదిగో ప్రక్కన నడుస్తున్నా డే- వీడే అసలు శకుని! కోమలి తనదని తెలిసి కూడా గ్రద్దలా తన్నుకు పోవడానికి పూనుకుంటాడా! దీనిని మిత్ర ద్రోహం అనకపోతే మరేమి అనాలి. నమ్మక ద్రోహమనాలా!


ఇద్దరి భోజనాలూ పూర్తయాయి. అంతా మామూలుగానే జరిగింది. ఇకపైన కూడా మామూలుగానే జరుగుతుందనుకు న్నాడు వరదరాజు. కాని అలా జరగలేదు. సినీ షూటింగ్ లో తప్ప జీవితంలో అలా జరగదు కూడాను. కార్డ్ ద్వారా బిల్లు చెల్లించి ఇద్దరూ ఇటు వేపు కదిలారో లేదో యెదురు చూడని బీభత్సకరమైన విస్ఫోటనం చెవులు దిబ్డడలు పడేలా వినిపించింది.


సిలిండర్ పేలిపోయినట్లుంది కిచిన్ వేపు నుండి వచ్చిన నిప్పు జ్వాలలు డైనింగ్ హాలు వేపు దూసుకు వచ్చాయి. అందరూ పూనకం వచ్చినట్టు చేతిలోని బ్యాగులూ పర్సులూ యెక్కడివక్కడ విడిచి ఎగ్జిట్ వేపు దౌడు తీసారు. కాని వరదరాజు పరుగెత్తుతున్నవాడల్లా క్షణం పాటు ఆగి వెనక్కి తిరిగి చూసాడు. ఆ గంద్రగోళంలో ఒక పాప ఒక అబ్బాయి పెడబెబ్బలు పెడుతున్నారు. మిన్ను విరిగిపోయేలా అరుస్తున్నారు.


వరదరాజు చటుక్కున వెనక్కి మళ్లి ఇద్దరినీ చెరొక చేతితోనూ పొదవి పట్టుకుని బైటకు పరుగెత్తాడు. కాని- అకటా! పిల్లలిద్దరూ క్షేమంగానే బైటపడ్డారు. కాని వరదరాజుకి వీపుంతా నిప్పంటుకుంది. కళ్ళు మూతలు పడుతుండగా-- ఎవరో అతణ్ణి అంబులెన్సులోకి యెక్కిస్తున్నారు.


జనరల్ ఆస్పత్రి స్పెషల్ వార్డులో బర్న్స్ సెక్షన్ లో ఉన్న వరదరాజు చుట్టూ వాళ్ల అమ్మానాన్నలూ చెల్లెలూ నిల్చున్నా రు. వాళ్ల వెనుక కోమలీ ఆమె తల్లి దండ్రులిద్దరూ తనను తదేకంగా చూస్తున్నారు. కోమలి తండ్రి కోదండం ముందుకు వచ్చి నిశ్శ బ్దాన్ని చెదరగొట్టేలా అన్నాడు- “చాలా పుణ్య కార్యం చేసారయ్యా మీరు! నువ్వు గాని కాపాడకపోతే ఆ చిన్న పిల్లలిద్దరూ యేమై పోదురో! నిప్పుకి ఆహుతి అయిపోదురు”


అప్పుడు కోమలి కూడా తండ్రి ప్రక్కకు చేరి అక్కసుగా అంది- “నిజం చెప్తున్నాను వరదా! మదన్ అటువంటి వాడని నేనెన్నడూ అనుకోలేదు. వెనుకా ముందూ యెవరున్నారో అని కూడా చూడకుండా మిత్రుడు గాయాల పాలయాడన్నది కూడా తెలుసుకోకుండా పలాయనం చిత్తగిస్తాడా! ఛే? ఏం మనుషులో వీళ్లు!”


అప్పుడు కోమలి తల్లి సుభద్రమ్మ కలుగ చేసుకుంది- “బాగన్నావమ్మా! మిత్రుడితో కలసి భోంచేసిన వాడు ప్రక్కన మిత్రుడున్నాడో లేదో- యేమయాడో చూడొద్దూ! స్వార్థం- అంతా స్వార్థం”


ఆమె అలా చెప్పడం ముగించేలోపల సిటీ పోలీస్ కమీషనర్ వరదరాజుని చూడటానికి వస్తున్నాడన్న వార్త అందుకున్న నర్సింగ్ స్టాఫ్ అందర్నీ కాసేపు బైట ఉండమని ఆదేశించారు. పిమ్మట వచ్చీరావడంతో కమీషనర్ వరదరాజు రెండు చేతుల్నీ అందుకుని ఆప్యాయంగా పలకరించాడు. కంగ్రాట్స్ తెలిపాడు.


వారం రోజుల తరవాత ఆస్పత్రినుండి డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తరవాత కోమలి వరదరాజు సెల్ కి మూడు సార్లు ఫోన్ చేసింది. అతడు మూడుసార్లూ స్పందించలేదు; తను నీరసంగా ఉన్నాడని మాట్లాడే స్థితిలో లేడని చెల్లి ద్వారా తెలియ చేసాడు. కోమలితో బాటు ఆమె తల్లి దండ్రులు కూడా నిస్పృహ చెందారు. తమ ఉనికి మాట తరవాతి సంగతి, కనీసం తను కట్టు కోబోయే అమ్మాయితోనైనా ఓపారి హల్లో అని కూడా అనలేడా!


మరో వారం రోజుల తరవాత కోమలి ఇంట్లోవాళ్లందరూ కోమలితో బాటు వరదరాజు అమ్మానాన్నలను చూడటానికి వచ్చారు. వచ్చీ వచ్చిన తోడనే చెప్పారు, పుణ్య ముహూర్తం దాటకముందే నిశ్చితార్థం మరో మూడు రోజుల్లో జరిపించాలని. అది విని వరదరాజు అమ్మానాన్నలూ, చెల్లీ తెల్లబోయి చూసారు. ఒకరి ముఖం ఒకరు చూస్తూండిపోయారు.


అప్పుడు కోమలి తండ్రి కోదండం తత్తరపాటుతో అన్నాడు - “అదేమిటండీ అలా బిత్తరపోతున్నట్టు చూస్తున్నారు! మేమేమిటి మూడు రోజుల్లోపల పెళ్ళా జరగాలని అన్నాం! నిశ్చితార్థమేగా ముగించాలన్నాం. ఆ మాటకు వస్తే తలచుకోవాలే గాని ఇక్కడే చుట్టుప్రక్కల పెద్దల సమక్షాన తాంబూలాలు పుచ్చుకోవచ్చు. ”


అప్పుడు వరదరాజు తండ్రి ఆంజనేయులు ఇంకా తెల్లబోయి చూస్తూనే అన్నాడు- “మీకింకా విషయం తెలిదన్నమాట! వరదరాజు మీకు స్వయంగా చెప్తానన్నాడే! చెప్పలేదా మరి-- ”


“మీరు మమ్మల్ని తెగ తికమక పెట్టేస్తున్నారు ఆంజనేయులూ! ఇంతకీ యేమి చెప్పలేదంటారు?“

“అదే చెప్పబోతున్నాను కోదండం! ఇప్పట్లో నాకు పెళ్లి వద్దని ఇక్కడి పోస్టు విడిచి పెట్టి నెదర్లాండ్ వెళ్లిపోయాడు; ఐదు సంవత్సరాల కాంట్రాక్టు పైన సంతకం చేసి. అప్పటికీ మేం అడిగాం‘ ఆ అమ్మాయి సంగతేమిట్రా!’ అని. ఏదో చెప్పి వెళ్లిపోయాడు. ఐతే”


“ఐతే లేదు, గియతే లేదు. ఇంతకీ యేమి చెప్పి వెళ్ళాడని మీ పుత్రరత్నం-- “


“మరీ పెద్దగా యేమీ చెప్పలేదు కోదండం! ఒకే ఒక మాట అన్నాడు. ’నిలకడ లేని మనసు గల స్త్రీలతో మనుగడ చేయడం సాధ్యం కాదు నాన్నా!’ అన్నాడు. అంతకు మించి వాడు యేమీ అనలేదు”


అప్పుడు కోదండం దంపతులిద్దరూ కూతురు వేపు తిరిగారు. రెప్పలల్లార్చుతూ తదేకంగా చూడసాగారు. కోమలి కనురెప్పలు రెండూ తత్తరపాటుతో మెలికలు తిరుగుతున్నాయి. ఏదో అనాలనుకుంటూంది. కాని యేమీ అనలేకపోతూంది. తరచుగా ఇంటికి యేతెంచే మదన్ కూడా కనిపించడం మానేసాడు.


ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళే విజేతగా నిలుస్తారంటారు మహర్షులు.

మరి కోమలి విజేతగా నిలచిందా..?

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
52 views0 comments

Comments


bottom of page