top of page
Original.png

చతుషష్టి కళా శతకం

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #ChatusashtiKalaSathakamu, #చతుషష్టికళాశతకం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆటవెలది

ree

Chatusashti Kala Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 10/09/2025

చతుషష్టి కళా శతకం - తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి

 

1.)కళలు పృధ్వి యందు కమనీయ మననుండు

నిత్య కృత్య మందు నింపు యనగ

బతుకు కళల వలనె భద్రము జీవీకి

కళలు లేని జీవి కనగ లేము

 

2.)అవని యందు కళలు అరువది నాలుగు

అందు ఒకటి అబ్బ హాయి గుండి

స్వంత బతుకు బతుక స్వఛ్చందు డనబడు

కళలు లేని జీవి కనగ లేము

 

3.)వేద ములన నాల్గు వేదాంగ ములనగ

ఆరు అనగ నుండ అవియు కళలె

ఇంక గ్రంథ త్రయము ఇతిహాస మననుండు

కళలు లేని జీవి కనగ లేము

 

4.)అన్ని కళల యందు ఆగమ శాస్త్రము

కళయె అనగ పృథ్వి కనగ నుండ

ప్రతియు గమున కళలు ప్రగతికి మెట్టన

కళలు లేని జీవి కనగ లేము

 

5.) న్యాయ మనగ నుండ నదియొక శాస్త్రము

తర్క శాస్త్ర మనగ తనర నుండు

తగవు లేవి రాగ తగునటు తీర్పొంద

కళలు లేని జీవి కనగ లేము

 

6.)కావ్య మనగ గూడ కనగను శాస్త్రమె

శ్రావ్య దృశ్య కావ్య శ్రవణ చక్షు

కింపు నొంద నుండ కీర్తియు దక్కంగ

కళలు లేని జీవి కనగ లేము

 

7.)శాస్త్ర మందు జూడ సాహిత్య మనునది

కావ్య శోభ హేతు కాన నగును

భూష ణంబు లెన్నొ భూరిగ నుండగ

కళలు లేని జీవి కనగ లేము

 

8.)నాట కంబు యనగ నదియొక శాస్త్రమె

వేది కందు నటులు వేష మేసి

పద్య గద్య గ్రంథ పదములు బలుకంగ

కళలు లేని జీవి కనగ లేము

 

 

9.) గాన మనగ నదియు కళలందు శ్రేష్ఠము

పాట పల్ల వందు పదము లల్లి

సరస మనగ నట్టి సంగీత చవిగల్గ

కళలు లేని జీవి కనగ లేము

 

10.)కవిత లల్లు టయును కళనగ నుండును

కవుల భావ నెంతొ కవిత దెలుపు

కలువ గొంగ కన్న కవియేను యెరిగుండు

కళలు లేని జీవి కనగ లేము

 

11.)కామ శాస్త్ర మనగ కళయేను పుడమిన

హర్ష దోహ లంబు హాయి గొల్ప

మదను ప్రేర ణంబు మరిమరి పురిగొల్పు

కళలు లేని జీవి కనగ లేము

 

12.) కళల యందు ద్యూత కళయను క్రీడన

మష్ట సూక్త జూద మనుచు ఉంద్రు

శాస్త్ర నియమ మంటు శాస్త్రము ఒకటుండు

కళలు లేని జీవి కనగ లేము

 

13.)దేశ భాష జ్ఞాన తేజము కళయేను

అన్ని భాష లందు అమ్మ భాషె

మరువ కుండ బలుక మరిసాటి లేదేడ

కళలు లేని జీవి కనగ లేము

 

14.)అక్ష రంబు వ్రాయ అదియగు లిపియన

సాధ నెంతొ జేయ సాధ్య మగును

అంద మనగ వ్రాయ అక్షర న్యాసమె

కళలు లేని జీవి కనగ లేము

 

15.)వాచ కంబు నేర్వ వాచక కళయన

గ్రంథ మేది యైన గ్రాహ్య మొంది

గొప్ప జదువు యనగ గోముయు బెరిగేను

కళలు లేని జీవి కనగ లేము

16.)అడుగు ప్రశ్న కపుడె అవధాన క్రియలోన

ఉత్త రంబు నీయ ఉత్త మంబు

అష్ట శతము వేయి అవధాన కళలన

కళలు లేని జీవి కనగ లేము

 

17.)స్వరము గూర్చి దెల్ప స్వరశాస్త్ర కళయన

స్వర్ణరేతు చంద్ర స్వరము నామ

మనగ గలిగి దెలుపు మంచిచెడులనంగ

కళలు లేని జీవి కనగ లేము.

 

18.)శకున శాస్త్ర మనగ శకునము దెల్పెడి

కళలు అనగ నుండు కలియు గాన

శుభము అశుభ మంటు సూచన లీయగ

కళలు లేని జీవి కనగ లేము

 

19.)శయము రేఖ జూసు సాముద్రి కమనెడి

శాస్త్ర మనగ కళయె జగము నందు

భాగ్య సూచ కమను భవితను వివరించు

కళలు లేని జీవి కనగ లేము

 

20.)అబ్ది సార విధము అనగను గుర్తించ

రత్న శాస్త్ర మనుచు రాజి లునన

నాణ్య తెరుగి జెప్ప నదియేను కళయన

కళలు లేని జీవి కనగ లేము

 

21.)కళల యందు గనగ కనకము గుర్తింపు

అదియు కళయె అనగ అర్జు నమును

వన్నె లెరిగి యేనె వసుధను కొనెదరు

కళలు లేని జీవి కనగ లేము

 

22.)అశ్వ లక్ష ణంబు అనగను ఎరుగంగ

అశ్వ శాస్త్ర మంటు అనగ నుండ

కళల యందు అదొక కళయేను అననుండు

కళలు లేని జీవి కనగ లేము

23.)కరటి లక్ష ణంబు కనిపెట్ట కళయేను

మత్త కీశ జ్ఞాన మనగ దెలియ

జనులు గజము జూసి జాగ్రత్త జెందగ

కళలు లేని జీవి కనగ లేము

 

24.)మల్ల విద్య గూడ మరియొక కళయేను

అందు జ్ఞాన మనగ అరుదు గుండు

మల్ల విద్య నేర్వ మహిలోన గరిమయె

కళలు లేని జీవి కనగ లేము.

 

25.)పాక శాస్త్ర మనగ ప్రజలెల్ల మెచ్చేది

చవులు బాగ యుండ చప్ప రించి

కమ్మ నైన విందు కనగను కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

26.) చెట్ల గూర్చి దెలిసి చెప్పేది ఒకకళె

దొడ్డ శాస్త్ర మనగ దోహ ళంబె

మాను బెంచు విధము మనుజులు ఎరుగంగ

కళలు లేని జీవి కనగ లేము.

 

27.)గంధ నాళి కింపు గలిగేటి అత్తరు

చేయు విద్య గూడ జెప్ప కళయె

పరిమ ళాలు గుప్పు పన్నీరు కళయేను

కళను లేని జీవి కనగ బోము

 

28.) ధాతు వాద మనగ ధాతువు కళయగు

రసము విధము ఎరుగు లక్ష ణంబె

ఔష ధంబు గుణము అందులొ భాగమె

కళలు లేని జీవి కనగ లేము

 

29.) గనుల గూర్చి దెలుప గనులందు లభియించు

ఖనిజ సంప దెరుగ ఖాని శాస్త్ర

మనగ నదియు కళయె మహిలోని కళలందు

కళలు లేని జీవి కనగ లేము.

30.)పాద రసము తోడ బంగార మటువంటి

లోహ ములను జేయ లొసుగు లేక

రసము తోడ గాన రసవాద కళయగు

కళలు లేని జీవి కనగ లేము

 

31.)అగ్ని స్థంభ ననగ అదియొక కళయన

కవ్య వాల మందు కాల కుండ

నడుచు రీతి దెలియ నదియొక నేర్పుయె

కళలు లేని జీవి కనను లేము

 

32.) జలము స్తంభ ననగ జలముపై దేలెడి

విద్య యొకటి అనగ విపుల యందు

అదియు కళల లోన అరుదైన కళయన

కళలు లేని జీవి కనను లేము

 

33.)గాలి యందు దేలి గగనాన ఆడేడి

వాయు స్తంభ ననెడు వలను విద్య

అదియు కళయె అగును అరువది నాల్గింట

కళలు లేని జీవి కనగ లేము

 

34.)ఖడ్గ స్తంభ ననగ ఖడ్గము శత్రువు

చేత గదుల కుండ చేయు విద్య

అదియు కళల యందు అభిగాతి ణణిచేది

కళలు లేని జీవి కనను లేము

 

35.)పరుల నెపుడు వశము పరుచుక నుండెడి

విద్య యనగ వశ్య విద్య అదియె

తెలివి తేట లున్న తెలివగు కళయన

కళలు లేని జీవి కనగ లేము.

 

36.)చెంత నెపుడు పరుల చేర్చుక దిరిగెడి

విద్య యనగ కళయె వినగ నుండ

అదియె అంద రనెడు ఆకర్ష ణనువిద్య

కళలు లేని జీవి కనగ లేము

 

37.)మోహ మొంద జేయ మోహన విద్యన

పరులు వలచు నట్టు పాటు బడెడు

విధము యనగ కళయె విజయము సిద్ధించ

కళలు లేని జీవి కనగ లేము

 

38.)పరుల యందు ద్వేష భావము గలిగించు

కపట బుద్ధి గూడ కళయె గాగ

వినగ దాని నంద్రు విద్వేష ణమనుచు

కళలు లేని జీవి కనగ లేము.

 

39.) ఉన్న చోట పరుల ఉఛ్చాట నమనగ

కళగ గాంచు చుంద్రు కాన నుండ

చెడ్డ తనము గూడ చెప్పగ నొకకళ

కళలు లేని జీవి కనను లేము

 

40.)పరుల బతుకు కెపుడు ప్రాణపు హానిని

కలుగ జేయు తీరు కాన నుండ

మార ణమను కళను మనుజులు అందురు

కళలు లేని జీవి కనగ లేము

 

41.)కాల వంచ ననగ కళయేను పృథ్విన

కాల మేది గాని కాల మందు

మార్పు గలుగ జేయు మర్మమె వంచన

కళలు లేని జీవి కనగ లేము 

 

42.)వర్త కంబు యనగ వాణిజ్య మనబడు

బేర సార మనగ బెదర బోక

వ్యవహ రించ బూన వ్యాపార విధమగు

కళలు లేని జీవి కనగ లేము

 

43.)పాశు పాల్య మనగ పశువుల బెంచేది

కళయె అనుచు ఉంద్రు కనగ నుండ

అందు నేర్పు గూడ అవసర మగుచుండు

కళలు లేని జీవి కనగ లేము

44.)కృషియు సల్పు చుండ కృషియందు నేర్పుయు

హాలి కుండు బొందు హలము బట్టి

కమత మనగ కళయె కర్షకు డెరుగంగ

కళలు లేని జీవి కనగ లేము

 

45.)ఆస వంబు జేయ అదియొక కళయేను

మందు జేయు రీతి మంచి గెరుగ

వ్యాధు లెన్నొ మాన్పు వ్యాపక మదియేను

కళలు లేని జీవి కనగ లేము.

 

46.)యుద్ధ మనగ జేయ యుక్తియు నుండను

కదన మనగ సల్ప కళయె యగును

ఓర్పు నేర్పు అనిలొ ఒనరగ జయమేను

కళలు లేని జీవి కనగ లేము

 

47.) లావు కర్మ అనగ లాంగల దున్నెడు

పశువు పక్షు లనగ పట్టు విద్య

అనగ కళయె అంద్రు అవనందు జనులంత

కళలు లేని జీవి కనగ లేము

 

48.)అడవి యం దు జేరి అచటన మృగముల

వెరువ కుండ యుండి వేట యాడ

అదియు కళని జనము అనుచుంద్రు జూడగ

కళలు లేని జీవి కనగ లేము

 

49.)కామ కేళి గూడ కళయన నుండగ

రతిలొ సురతి గల్గు రతియు సల్ప

కామ శాస్త్ర నేర్పు కలిగిన యటులుండు

కళలు లేని జీవి కనగ లేము

 

50.) పరుల కంట బడక పట్టుతొ మెలుగంగ

అదియు కళన నుండ అంద రెరిగి

అనుచు నుంద్రు జనము అద్మశ్వ కరణని

కళలు లేని జీవి కనగ లేము.

 

51.)రాయ బార మనగ రాజ్యాల యందున

నేర్పు తోడ నుండి నెరపు క్రియయె

అదియె ద్యూత కళని అనెదరు జూడగ

కళలు లేని జీవి కనగ లేము

 

52.)చిత్ర మనుచు జూప చిత్రక ళయనగ

మారు చున్న కాల మహిమ దెలిపి

ప్రజల మేలు కొల్పు ప్రకృతిన జనులకు

కళలు లేని జీవి కనగ లేము

 

 

53.)లోహ కళయు అనగ లోహపు పాత్రలు

చేయు పద్ధ తనగ చెప్ప నుండ

అందు నేర్పు గూడ అవసర మగుచుండు

కళలు లేని జీవి కనగ లేము

 

54.)పట్టు తోడ శిల్పి పాషాణ కళయందు

రాళ్ళు జెక్క బూను రాటు దేలి

అదియు కళయె అనగ అరువది నాల్గింట

కళలు లేని జీవి కనగ లేము

 

55.)మట్టి తోడ పనులు మరియెంతొ నేర్పుతొ

చేయ మృత్క ళనగ చెప్పు చుంద్రు

మన్ను తోడ నైన మన్నిక నుండగ

కళలు లేని జీవి కనగ లేము 

 

56. కొయ్య నెంతొ నేర్పు కోయుచు నుంటును

చెక్క పనులు జేయు చేష్ట లేను

దారు కళలు అంద్రు ధరణిన జనులన

కళలు లేని జీవి కనగ లేము

57.)వెదురు కర్ర తోడ వేణువు లాంటివి

వస్తు వనుచు జేయ వసుధ యందు

అంద మెంతొ చెంద అదియును కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

58.)రోమ భూమి తోడ రోతయు అనకుండ

చేయు పనులు యెన్నొ చెప్ప నుండ

చర్మ కళని అంద్రు జనమంత జగమున

కళలు లేని జీవి కనగ లేము

 

59.)అంబ రంబు నేయ అదియును ఒకకళ

ఎంతొ శ్రమయు యుండు ఎరుగ గాను

వస్త్ర మంటు నేయ వంకలు ఎన్నోను

కళలు లేని జీవి కనను లేము

 

60.)దొంగ తనము జేసి దోచుడు కళయేను

ఇందు కాంత యందు ఇల్లు జొచ్చి

చౌరి కనగ జేయ చౌర్యక ళనగను

కళలు లేని జీవి కనగ లేము

 

61.)ఔష ధంబు జేయ అగునెంతొ శ్రమయన

మందు విధము నెరిగి మసలు కొనుచు

మందు వేరు దెచ్చి మరిజేయ కళయేను

కళలు లేని జీవి కనగ లేము 

 

62.)మంత్ర సిద్ధి యనుచు మనుషుల యందున

విద్య అనగ నుండు వినగ నుండ

కార్య సాధ నంటు కావించ కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

63.)స్వరము వంచ ననగ స్వరముల బట్టియు

కంఠ ధ్వనులు జేయు కళయు నొకటి

అందు నుండు జూడ ఆకర్ష ననగను

కళలు లేని జీవి కనగ లేము

 

64.)దృష్టి వంచ ననగ దృష్టిని మళ్ళించు

అంజ నమను కళయు అనగ నుండు

చూడ్కి వలన మంది చూపులు లాగను

కళలు లేని జీవి కనగ లేము.

 

65.)కళలు నేర్వ నుండ కనగను ఎన్నియొ

అనని యందు గనగ అంతు లేదు

ఏది నేర్చు కున్న ఎరుగగ సుఖమేను

కళలు లేని జీవి కనగ లేము

 

66.)శిశువు ఏడ్చు చుండు శీఘ్రము సాధించ

ఏడ్పు నందు ఎరుగ ఎన్నొ కళలు

దొంగ ఏడ్పు తోడ దొరకొను చుండును

కళలు లేని జీవి కనగ లేము

 

67.)కొత్త అంశ మనగ కోరుచు కనుగొన

అదియు కళయె అనగ అనని యందు

నూత నత్వ మనగ నుండుటె ధ్యేయము

కళలు లేని జీవి కనగ లేము

 

68.)ఎదుటి మనిషి మనసు ఎరుగుట కళయేను

ఊహ దెలుపు చుండ ఉచిత రీతి

కదలి కేది ఐన కళలకు మూలమె

కళలు లేని మనిషి కనగ లేము

 

69.)అమిత తిండి దినుట అదియును కళయేను

అధిక జనము తిండి అనగ మితము

సాధ నంబు తోడ సాధించ నుండును

కళలు లేని జీవి కనగ లేము

 

70.)పంట అధిక మనగ పండించ కళయేను

కాల మార్పు బట్టి కర్ష కుండు

విత్త నాలు వేయు విరివిగ బండించ

కళయు లేని జీవి కనగ లేము

 

 71.)కోప గించు భర్త కోపము అణుచను

భార్య దలచు యుక్తి బాగు గాను

అదియు కళయె అనగ అవనిన జూడగ

కళలు లేని జీవి కనగ లేము

 

72.)కుంభ కర్ణు నిద్ర గుణుడును తిను తిండి

అనుక రించ బూన అదియు కళయె

పనియు ఏది లేక పడుకొను మెక్కుచు

కళలు లేని జీవి కనను లేము

 

73.)ఇంద్ర జాల మన్న ఇలలోన కళయేను

మోస మందు ఉండు మొదటి నుంచి

గుర్తు పట్ట కుండ గుంభన మనసాగు

కళలు లేని జీవి కనగ లేము

 

74.)గణన యంత్ర మనగ కనిపెట్టు విద్యయు

కళయె అనగ నుండు కాంచ నుండ

పిన్న దైన నదియు పిడికిట విశ్వమె

కళలు లేని జీవి కనగ లేము

 

75.)ముగుద ముగ్గు లేయ ముత్యపు రథమని

ఇంట్లొ వాకి లందు ఇంపు గుండ

కళల జాబి తాలొ కలికిది ప్రతిభయె

కళలు లేని జీవి కనగ లేము

 

76.)కుట్లు అల్లి కనక కూచిది పనితన

మనగ నుండు జూడ మనుషు లందు

అదియు కళయె అనగ అవనిన జూడగ

కళలు లేని జీవి కనగ లేము

 

77.)ధనము దాచు టనగ ధరణిన కళయేను

వ్యయము చేయ కుండ వ్యవహ రించ

మనసు గట్టి పరచి మనుగడ సాగించ

కళలు లేని జీవి కనగ లేము

 

78.)కథలు వ్రాయు టయును కళయన నొప్పగ

పాఠ కులును జదువ పఠన మందు

మునిగి యుండు రీతి ముఖ్యము కథలోన

కళలు లేని జీవి కనను లేము

 

79.)ధౌత వస్త్ర మెపుడు ధరియించ కళయేను

మైల బట్ట కుండ మన్ని కగను

వస్త్ర ధార ణందు వంకయు లేకుండ

కళలు లేని జీవి కనగ లేము

 

 80.)మేను శుభ్ర తెరిగి మేలగు రీతిన

నడుచు కొనుట యనగ నాగ రికత

కనగ అదియు నొక్క కళయేను మనిషందు

కళలు లేని జీవి కనగ లేము.

 

81.)పిట్ట గూడు గట్టు పిసరంత ఉన్నను

చెట్టు కొమ్మ కొసన చేటు పాటు

కలుగ కుండ జూసి కట్టుట కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

82.)వాస్తు విద్య గూడ వసుధన కళయేను

ఇంటి వాస్తు జూసి ఇల్లు గట్ట

భవిత లోన బతుకు భద్రము అననుండు

కళలు లేని జీవి కనను లేము

 

83.)పెద్ద మనిషి ముందు పెద్దగ పలుకక

అణకు వొంది పలుక అదియు కళయె

నమ్ర తెంతొ మేలు నరులకు బతుకున

కళలు లేని జీవి కనగ లేము

 

84.)తప్పు జేయు వాని తప్పును మాన్పించు

విధము యెరుగ గూడ వినగ కళయె

దండ నేది లేక తగినటు జెప్పగ

కళలు లేని జీవి కనగ లేము

 

85.)గుక్క పట్టి యేడ్వ గుబులును జెందక

పాప ఏడ్పు మాన్ప బాహు సంధి

ఎత్తు కొనుచు తేర్చు ఎరుగయు కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

86.)భార తీయ కళల భాగ్యము నెంచగ

కళలు ఎన్నొ కలిగి కాన నగును

కదలి కేది అయిన కళలేను నిండుండు

కళలు లేని జీవి కనగ లేము.

 

87.)పత్తి చేత బట్టి పలుచటి దారము

వడుకు టందు నేర్పు వచ్చి యున్న

అదియు కళయె జూడ అతివల యందున

కళలు లేని జీవి కనగ లేము

 

88.)మనిషి కొలత బట్టి మన్నిక యెరుగంగ

బట్ట లెన్ని అయిన బాగ గుట్ట

దర్జి కళయె అదియు దర్జాగ నుండగ

కళలు లేని జీవి కనగ లేము

 

89.)దాన ధర్మ మంటు దర్జాగ జేయగ

అందు లోప మేది అనక నుండ

కనగ అదియు నొకటి కళయేను అవనిన

కళలు లేని జీవి కనగ లేము.

 

90.)సమయ పాల నంటు సరిగను వర్తించ

అదియు కళయె అనగ అంద రెరుగ

సమయ పాల ననగ సాధ్యము అరుదగు

కళలు లేని జీవి కనగ లేము

 

91.)వేయి గొర్రె లందు వేలెత్తి చూపుచు

తనది గొర్రె ఇదని తడుము కోక

గోప కుండు జెప్ప గొప్పది కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

92.)కుమ్మ రతను జేయు కుండలు మట్టితొ

పెద్ద భాండ మైన పెలుచ గుండ

కుంభ కారు తెలివి కుంభిన కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

93.)మలిన మెంత ఉన్న మానక వలువలు

ధావ కుండు ఉతుకు ధవళ మనగ

కళయె అనగ నుండు క్షారకు పనియన

కళలు లేని జీవి కనగ లేము

 

94.)కురటు డనగ బాగ కుట్టును చెప్పులు

చదువు ఏది లేక చక్క గాను

అదియు కళయె అనగ అతనిలొ ప్రతిభయె

కళలు లేని జీవి కనగ లేము

 

95.)పద్మ శాలి యనగ పర్పము నేయుచు

కళలు ఎన్నొ నింపు కాంచ నుండ

మాన రక్ష కుండు మహిలోన అతడేను

కళలు లేని జీవి కనగ లేము

 

 96.)కుంద నంబు గరిగి కుదురుగ సొమ్ములు

అవుస లోండ్లు జేయు అంద మనగ

కాంత లెంతొ మెచ్చ కళలను నింపుతు

కళలు లేని జీవి కనగ లేము.

 

97.)కులము నందు జనులు కూడియు నుండగ

కళలు ఒక్క చోట కలయు విధము

ఊరు వాడ లంత ఉండేవి కళలేను

కళలు లేని జీవి కనగ లేము

 

98.)చంద్రి లుండు జేజు చక్కగ క్షౌరము

కొత్త పోక డెరిగి కోరు విధము

అందు గూడ కళలె అబ్బుర పరుచగ

కళలు లేని జీవి కనగ లేము

 

(99). వృక్ష వాటి కెంతొ వృద్ధియు జెందగ

మంచి కళయు గల్గి మాలి ఎంతొ

శ్రమయు దార బోసి శ్రద్ధగ బెంచును

కళలు లేని జీవి కనగ లేము

 

100.)కూర గాయ లెంతొ కుదురుగా బేర్చియు

అంగ డందు రోజు అమ్ము వారు

కాంచ కళలు ఎన్నొ కలిగియు నుందురు 

కళలు లేని జీవి కనగ లేము.

 

101.)కళయు ఎంతొ బాగు కానగ గుడులందు

తీర్చి దిద్దు చుండు తీరు గనగ

దైవ మపుడె వచ్చి దాగిన యటులుండు

కళలు లేని జీవి కనగ లేము

 

102.)వంట ఒకటె గాదు వడ్డన కళయేను

సహన మనగ యుండ సంత సించి

తినెడి వారు తృప్తి తినెదరు జూడగ

కళలు లేని జీవి కనగ లేము

 

103.)కళలు ఎన్నొ తీర్లు కలియుగ మందున

కుముదు డనగ బోడు కూడు దినుచు

ఎంగి లనెడు చేత ఎరిగియు అళిగొట్ట

కళలు లేని జీవి కనగ లేము

 

 104.)సహన మనగ గూడ సాహస కళయేను

పోటి పడెడు చోట పోరు మాన

బోడు ధీరు డెపుడు పోరామి గలిగిన

కళలు లేని జీవి కనగ లేము.

 

105.)సాహ సంబు తోడ సత్యము బలుకుచు

వెట్ట ముండు జూడ వెరువ కుండ

తగిన తీరు మెలుగ తనరగ కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

106.)బవిరి అక్ష రాలు బాగుగ వ్రాయుచు

పఠన మందె ధ్యాస పాటి యనుచు

విద్య గరుపు చుండ విశదము కళయేను

కళలు లేని జీవి కనగ లేము

 

107.)అచర జీవు లందు అగుపడు కళలన

ప్రకృతి యందు మొదటె ప్రాప్తి నొంది

కళల రూపు తోడ కాన్పించు చుండును

కళలు లేని జీవి కనక లేము.

 

108.)రక్త జిహ్వ పులియు రాజీయు పడకుండ

నిత్య గ్రాస మంద నిలిచి యుండి

జంతు జంపి దినెడి జాతిది కళయేను

కళలు లేని జీవి కనగ లేము                                                        

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page