top of page

చెట్టు మాటున మాడంత మబ్బు


'Chettu Matuna Madantha Mabbu' New Telugu Story

Written By Pandranki Subramani

'చెట్టు మాటున మాడంత మబ్బు' తెలుగు కథ

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


ఎట్టకేలకు మాధవయ్య కొడుకునీ దివంగత మల్లన్నగారి మనవణ్ణీ అయిన నాకు కొలువు దొరికింది. ఎక్కడని-ఎప్పుడని- సుమారు ఇరవై ఎనిమిదేళ్ళ వయసు దాటిన తరవాత మా ఊరి మండలాఫీసులో--ఎటువంటి కొలువని-పర్మినెంట్ డఫ్టరీ ద్యోగం, యూనిఫారంతో సహా--నాకు సర్కారు ఉజ్జోగం దొరికిందని విని వాడ వాడంతా ఆశ్చర్యపోయారు. అంతవరకూ పిల్లనివ్వాలా వద్దానని నక్కి నక్కి చూస్తూన్నవరసకు మామలు బంధుత్వం గల మేనమామలూ వాళ్ళ వాళ్ల పిల్లలను నాకు కట్టివ్వడానికి రాయబారాలు పంపించనారంభించారు. అద్గదీ సర్కారు ఉజ్జోగానికున్న మహత్తు!నేను మాత్రం తక్కువ తిన్నానా --యూనిఫారం వేసుకుని నేనెవ్వరి ఇంటికీ వెళ్లలేదు. అంతెందుకు—మా అమ్మా బాబుల వద్దకు కూడా వెళ్లలేదు. తిన్నగా వేప చెట్టు క్రింద ఎప్పటిలాగే గుసగుసలతో ఊసులాడుకుంటూన్న మా ఇద్దరి బామ్మల వద్దకూ వెళ్లి కాళ్లకు నమస్కరించి ఇద్దరికీ చెరొక కేకూ చేతిలో పెట్టాను.


ఇద్దరు బామ్మలకూ మెత్తటి కేకు తినడం అంటే మహా ఇష్టం. దాదాపు పళ్ళూడిపోయిన బోసి నోళ్ళ తో ఎంచక్కా చకచకా నమిలి మింగేస్తారని, కబుర్లు చెప్పుకుంటూనే--కాని-ఈసారి వాళ్లిద్దరూ కేకును చకచకా నమలలేదు. నేను వేసుకున్న ప్యూను యూనిఫాంని ఎగాదిగా చూసి ఇద్దరూ నన్ను ఒక్కసారిగా హత్తుకుని చెట్టు చప్టానుండి లేచి నన్ను తోడ్కొ ని తిన్నగా ముత్యాలమ్మ వారి బొడ్రాయి వద్దకు తీసుకువెళ్ళారు-మొదట వాళ్లిద్దరూ దండప్రమాణం చేసి అమ్మవారి పాదాల చెంత ఉన్న కుంకుమ తీసి నా నుదట పూసి ఆ తరవాత మాయింటి ముంగిట ఉన్న వేప చెట్టు వద్దకు తీసుకువెళ్ళి ఒకరు తరవాత ఒకరుగా అన్నారు, అంతర్గతమైన ఉద్వేగానికి లోనవుతూ-“దీనిని మామూలు చెట్టనుకునేవు-చాలా గొప్ప చెట్టు-నువ్వంటుంటావే మా ఇద్దరికీ బోలెడు సంగతులు తెలుసని-కాని అది నిజం కాదు. మాకంటే చాలా చాలా విషయాలు ఈ చెట్టుకే తెలుసు. మాగురించి తెలుసు-మీ బాబు గురించి తెలుసు-మీ అమ్మగురించి పూర్తిగా తెలుసు. అర్థమైందా బుల్లి బాబు రావూ!” నేను తలూపుతూ ఇద్దరు బామ్మలకూ మరొకసారి దండం పెట్టి అక్కణ్ణించి కదలబోయాను.


కాని వాళ్ళు నన్ను విడిచి పెట్టలేదు. సాధారణంగా ఇద్దరూ నన్ను విడిచిపెట్టరు. నాతో ఊసులాడటమంటే-నాతో గిల్ల కజ్జాలు పెట్టుకోవడమంటే ఇద్దరికీ కాకి నాడ కాజా తిన్నంత ఖుషీ-మొత్తానికి నేను వాళ్లిద్దరకూ నేస్తమున్న చెలికాడిని. కాని ఇద్దరు బామ్మలూ నన్ను ఎక్కువ సేపు అటకాయించ లేదు. ఇద్దరూ వాళ్ళ చెంగు ముడుల నుంచి చిల్లర డబ్బులు తీసి అందించారు. నేనందుకుంటూనే అనుకున్నాను -‘ఎంత వెర్రి బాగులోళ్ళు మాబామ్మలిద్దరూ—ప్రభుత్యోద్యోగిగా హోదా పేరిగినన నాకు ఈ చెంగుముడి డబ్బులు యే మూల కని?పీచుమిఠాయి తింటూ రోడ్లుతిరిగే వయస్సా నాది?‘ వీళ్ళిద్దరి చూపులో నేనెప్పుడు మగరాయుడిగా ఎదుగుతానో మరి--


ఇప్పుడు మా బామ్మలిద్దరి విషయానికి వస్తాను. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. సవతులు కూడాను-అంటే మా తాత మల్లన్న గారు ఒకే పెళ్ళిపందిరలో స్వయాన వివాహమాడిన భార్యలన్నమాట. నేను విన్నంత వరకూ-అక్కాచెళ్ళెల్లిద్దరూ మల్ల యుధ్ధ యోధుడైన మల్లన్నగారిని ఇష్టపడ్డారు. అంచేత అక్కా చెల్లెళ్ళిద్దరినీ విడదీయడమెందుకని పెద్ద మనసు చేసి ఇద్దర్నీ అక్కున చేర్చుకున్నాడు ఆ నవరస కేళీ విలాస పురుషుడు. అప్పుడు ఈ రూల్సూ రెగులేషన్సూ ఎక్కడివని—ఒకరి కంటే ఎక్కువ మందిని చేసుకోకూడదన్న మ్యారేజీ చట్టం ఎక్కడిదనీ!అంతా ఊరిపెద్దల ఆధిపత్య విన్యాసమే!అసలు ఆరోజుల్లో ఊరి పెద్దలకు తెలియకుండా పోలీసులు ఊళ్ళోకి ప్రవేశించగలిగేవారా?ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం-నాకు ఆసక్తికర మైనవిషయం. ముఖ్యంగా నా వయసుకి ఆసక్తికరమైన అంశం. ఈ బామ్మలిద్దరూ నేనడిగినా అడక్కపోయినా తాముగా చాలా విషయాలే చెప్తుంటారు-నూరిపోస్తుంటారు. కాని ఇంతవరకూ ఒకటి మాత్రం చెప్పలేదు. అదేమంటే–ఇద్దరు బామ్మలకూ శోభనం ఒకేసారి ఒకే రాత్రి జరిగిందా-ఒకే ఇంట్లో జరిగిందా!అక్కాచెల్లెళ్లిద్దరి చిలిపి చేష్టల జంట దాడికి మా మల్లన్నతాత తట్టుకోగలిగాడా! కాని నేనింత వరకూ ఆ ఊసెత్తకుండా ఒదిగి ఉండిపోయాను. సాహసించి అడిగితే ఏమవుతుంది? పట్టు పట్టున మొట్టి కాయలు పడ్తా యి. అన్నీ కాకపోయినా--కొన్ని గుండె గుప్పెట్లో అలా నిమ్మళంగా ఒదిగిపోతేనే బాగుంటుంది కదా!.


ఒకసారి మా వాడలో ఎదురు చూడని సంఘటనొకటి చోటు చేసుకుంది. దానికి సాక్షీభూతుడు మరెవ్వెరో కాదు-నేనే!


మా మండలాధికారి ఆధ్వర్యాన ఒక చిన్నపాటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గాలులు బలంగా వీస్తున్నప్పుడల్లా వేప చెట్టు కొమ్మలు చేతులు చాచి అందుకున్నట్టు కరెంట్ వైర్లను లాక్కుంటున్నాయి. విద్యుత్ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తు న్నాయి. అంచేత అక్కడక్కడ వేపచెట్టు కొమ్మల్ని కుదురుగా కోసి ట్రిమ్ చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ వార్త విన్నంతనే మా బామ్మలిద్దరూ అంతెత్తున లేచారు. మా ఆఫీసు తరపున చెట్టుకొమ్మల్ని ట్రిమ్ చేయడానికి వచ్చిన హమాలీ కార్మికులంద రిపైనా శివమెత్తినట్టు విరుచు పడ్టారు. ముక్త కంఠంతో అరిచారు-చెట్టుని ముట్టుకుంటే వాళ్లకు చేతులు మిగలవంటూ హెచ్చ రించి వేటకొడవళ్లు తీసుకు వచ్చి వాళ్ళకు అడ్డంగా నిల్చున్నారు.


అంతటితో ఊరుకున్నారా—లేదు. ’అలో రామా!’ అని అల్లంత దూరాన చోద్యం చూస్తూ నిల్చున్న నన్ను పిలిచి చాచి లెంపకాయ కొట్టారు-‘ఈ చెట్టు ఎంత గొప్పదో నీకు తెలవదా?నీకు బొడ్డూడని వయసులో నీకు పేరు పెట్టింది ఆ బొడ్రాయమ్మ సమక్షంలోనే కదా!’అని. ఆ లోపల ఆ విషయం తెలుసుకున్న మాబాబు పరుగున వచ్చి అప్పటికి మా డిపార్టు వాళ్ళకు నయానా భయానా నచ్చచెప్పి తరవాత మరొకమారు వచ్చి నిదానంగా ట్రిమ్మింగ్ వర్క్ చేసు కోమని పంపించి అమ్మలిద్దరినీ ఇంట్లోపలికి తీసుకు పోయాడు. కాసేపు తరవాత ఇద్దరూ ఆవేశం నుండి తేరుకున్నారని గ్రహించిన పిదప మా బాబు ఇద్దరు అమ్మల్నీ ఎడాపెడా వాయించినంత పని చేసాడు-“ఏమనుకున్నారిద్దరూ?పేట రౌడీ రంగమ్మలనుకుంటున్నారా?సర్కారు వాళ్లు పబ్లిక్ పనులు చేసుకునేటప్పుడు అడ్డుతగిలితే ఎంత పెద్ద పోలీసు కేసవుతుందో తెలుసా!మేజిస్ట్రేట్ బైలు దొరకని కేసు పెట్టి మీతోబాటు మమ్మల్నీ లోపలకు తోసేస్తాడు. మీకు వత్తాసుగా మీ ముద్దుల మనవడు గాని ముందుకు వస్తే వాడికి జైలుతో టాటు ఉద్యోగం కూడా ఊడుతుంది. ఇక వాడి పెళ్ళి యెలా జరుగుతుంది?మీరెలా కనులారా వాడి పెండ్లి చూడగలరు?”దానితో ఇద్దరూ దెయ్యం చరచినట్టు బిత్తరపోయి కళ్లు మిటకరించి చూస్తూ ఉండిపోయారు.


నాకు పాపం అనిపించింది. దేవతల్లాంటి స్త్రీలిద్దరూ అలా బెల్లం కొట్టిన రాళ్లలా తయారయితే నేనే కాదు, ఇంకెవ్వరు మా త్రం చోద్యం చూస్తూ ఉండగలరు? నేను ఇద్దరి బామ్మలనూ పొదవి పట్టుకుని బైట ఉన్న బంకు టీ స్టాల్ వద్దకు తీసుకోపోయి రెండు ఫుల్ గ్లాసులనిండా టీ ఇప్పించాను. బలవంతంగా రస్కు బిస్కట్లు తినిపించాను. నాతో బాటు మా అమ్మ వచ్చింది గాని-అత్తయ్యలిద్దరి వద్దకూ వచ్చి ఏమని చెప్పాలి?ఏమి చెప్తే ఇద్దిరికీ ఉపశమనం కలుగుతుందో తెలియక దూరాన నిల్చుండి పో యింది. కొన్ని సమయాలలో నిశ్శబ్దమేగా నిండు మనోభావానికి నిజమైన వ్యక్తీకరణం!అమ్మకు అత్తయ్యలిద్దరి పట్లా భక్తిభావం మెండు. ఇక పోతే నా తరపున నా వంతు ప్రయత్నం కూడా చేసాను అంతత్వరగా అంత దీర్ఘంగా వేపచెట్టు కొమ్మల్ని కోయకుం డా ఉండటానికి--ఆ మాటకు వస్తే అక్కడి సర్కారు వాళ్ళతో కొద్దో గొప్పో పరిచయం నాకు ఉండనే ఉందిగా!


ఇలా రోజులు సాగుతుండగా నాకు మరొక మంచి-కాదు-రెండు మంచి విషయాలు జరిగాయి. ఎలాగో క్రిందా మీదా పడి, కోచింగ్ తీసుకుని డిపార్టుమెంటల్ మెరిట్ పరిక్షల్లో ఉత్తీర్ణుడనై క్లారికల్ క్యాడర్కి ఎగబ్రాకాను. ఆ తరవాత ఇంటివాడినయాను. అన్నాళ్ళూ ఇంటా బైటా అంటకాగినట్టు వేసుకు తిరిగిన తెల్ల యూనిఫారమ్ ని పాము వదలిన కుబుసంలా విడిచి పెట్టి నాతో పనిచేసే తోటి డఫ్టరీలకు ప్యూనులకు పార్టీ ఇచ్చి మరచిపోకుండా మాబామ్నలిద్దరికీ పారడైస్ నుండి మంచి రుచికరమైన కేకులు తెచ్చి ఇచ్చాను. వాళ్లు కూడా మరచి పోకుండా చెంగు ముడినుండి ఎప్పటిలాగే చిల్లర తీసిచ్చి మనసార ఆశీర్వదించి పంపారు. అంతే కాకుండా ఇద్దరూ మా తాత్తయ్య మల్లన్నగారి పటం వద్దకు తప్పకుండా వెళ్ళి వినయ పూర్వకంగా తలవంచి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోమని సలహా ఇచ్చారు. నేనెలాగే వెళ్లి ఆయన పటం ముందు వంగి నమస్కరిస్తున్నప్పుడు బుర్రమీసాల మాటున నవ్వుతూ నిల్చున్న ఆయనను చూసి ఇలా అనుకోకుండా ఉండలేక పోయాను-“ఎంత ధైర్యమయ్యా నీకు!ఇష్టపడ్డారు కదా అని ఇద్దరు అక్కాచెల్లెళ్ళనూ అమాంతం పెళ్ళాలు చేసుకుని ఇసుమంత జంకూ బొంకూ లేకుండా ఏలు కుంటావా! ఏలుకున్నావే అనుకో-వాళ్లిద్దర్నీ విడిచి అంత త్వరగా పైలోకాలకు చేరుకుంటావా రంభ ఊర్వశుల్ని చూస్తూ పళ్ళు ఇకిలించడానికి!అదే పని ఈరోజుల్లో చేసుకుంటే నీకు తెలుసుండును దాని పర్యవసానమేమిటో!“ముందే అన్నట్టు పనిలో పని గా మంచిలో మంచిగా నాకు వివాహం కూడా ఐపోయింది. ఇద్దరు బామ్మలూ అంతా తామై కనుమరుగున ఉంటూనే అంతా వెనుకనుండి జరిపించారు. మధుపర్కంలో మా ఆవిణ్ణీ నన్నూ చూసి ఎంతగా ముచ్చటపడ్డారో!


ఇకపైన ముందుకు సాగి చెప్పాలంటే ఉద్యోగ స్థాయి మారితే బాధ్యతులు కూడా మారుతాయి కదా! ఆ తీరున నేను వా రం రోజుల పాటు మాహెడ్ గుమాస్తాకి ఆసరాగా పాలనా పర్యటనకు వెళ్ళాల్సి వచ్చింది. అంచేత-అక్కడా ఇక్కడా కాకుండా తిన్నగా ఇఛ్ఛాపురం వరకూ వెళ్ళ వలసి వచ్చింది. ఆకారణాన ఊరునీ నాకొత్త పెళ్లాన్నీ విడిచి వెళ్లిపోయాను మైళ్ళ దూరానికి.


మరీ కన్సర్వేటివ్ గా ఉన్నానుకోకపోతే-నేను ప్రకృతిని అందమైన తెలుగాడపడచు మూడ్స్ తో పోల్చుతాను. ఒకే వద నం-పలు కోణాలు పలు మనో భావాలు-నిశ్చింతగా నిలకడగా ఉదాసీనంగా కనిపించే ప్రకృతికి కూడా పలు విచిత్ర పార్శ్వాలు--వరంగల్ లో వర్షాలు కురుస్తుంటే-దానికి ఆనుకుని ఉన్న పొరుగు ప్రాంతంలో బొట్టు చినుకు కూడా పడదు. భాగ్య నగరంలో ఎండలు మండి పోతుంటే-దానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో-చంటాడు తుళ్ళిపడి ఏడుపు లంకించుకున్నట్టు భోరున బాదేస్తుంటుంది ఆకాశం. నేను టూరు ముగించుకుని మా హెడ్ గుమాస్తాగారిని వాళ్ళింటి వద్ద దిగబెట్టి మా వాడ చేరుకునేట ప్పటికి నాకు దిమ్మ తిరిగి పోయినంత పనయింది. వాడ మొదటి వీధిలో కళ్ళు తేలేసి నిల్చుండి పోయాను. అసలది మా వాడే నా! లేక మతిమరుపుతో నీటి మడుగులు దాటుకుంటూ దారితప్పి మరెక్కడికో వచ్చానా!అక్కడక్కడ నాలుగైది ఎడ్ల బండ్లు బారున పడి ఉన్నాయి. అల్లంత దూరాన ఎవరిదో కొత్తకారు బోల్తా పడి నీళ్ల గుంటలో తేలుతూంది. రెండు కరెంట్ స్తంభాలు నేల కొరిగి ఉన్నాయి. మరొక రెండు స్తంభాలు ఎవరో చాచి బాదినట్టు నేల వేపు వంగిపోయాయి. పెక్కు ఇండ్లముందు చింత చెట్లూ మాఁవిడి చెట్లూ ఎవడో రాక్షసుడి పిడికిలికి చిత్తైనట్టు చెల్లా చెదురుగా పడిఉన్నాయి.. నలువైపులా నీటి మడుగులే-బురద కుంటలే-చుట్టూ కలయచూసాను. అలికిడీ సందడీ ఏఁవీ లేవు. ఎక్కడా యేమూలనా యేతల్లి జోలపాటా వినిపించడం లేదు. నన్ను పలకరించడానికి కాదు-నేనుగా ముందుకు వెళ్లి పలకరించడానికి కూడా ఎవరూ గోచరించలేదు. జీవితం అప్పుడప్పుడు ఎంత విడ్డూ రంగా మారిపోతుంది!అన్నీ ఉండికూడా ఏమీ లేనట్లయి పోతుంటుంది.


నేనిక చేసేది లేక టూరు సామగ్రి తడిసిపోకుండా ట్రావిలింగ్ బ్యాగ్ ని నెత్తిన పెట్టుకుని మడుగులోకి దిగాను.


తిన్నగా వేగంగా నడచి వెళ్ళి ముత్యాలమ్మవారి బొడ్రాయికి చేతులు చాచి నమస్కరించి వెనుతిరిగాను. ఇంకేముంది—గుండె గుభేలుమంది. అమాంబాతు వేప చెట్టు విరిగి చేతులూ కాళ్లూ పోయిన ప్రాణిలా ఒరిగి పోయుంది. ఇప్పుడు బామ్మలిద్ద రూ ఎక్కడున్నారు?ఇదంతా చూసి ఎంతగా హృదయ క్షోభ అనుభవంచి ఉంటారో!తరుక్కుపోయిన గుండెను అదుముకుంటూ తేరి చూస్తూ నిల్చున్నప్పుడు మా ఆవిడ పరుగున వచ్చి నా చేతినుండి ట్రావిలింగ్ బ్యాగు అందుకుంది. నిస్తేజంగా చూస్తూ”మా నాన్నమ్మలిద్దరూ ఏమి చేస్తున్నారు?


నిద్రపోతున్నారా?”అని అడిగాను. పుష్పలత తల అడ్డంగా ఆడించింది. అలా తల ఆడిస్తూ బదులిచ్చింది-“అత్తా మామయ్యా ఎంత పిలిచినా రానని అక్కడికక్కడే కూర్చుండి పోయారిద్దరూ. తుంపర పడుతున్నా విన కుండా లేవకుండా--అదిగో ఆ పిట్ట గోడకు ఆనుకుని వేప చెట్టుని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు” ఆమాటతో నేను సర్రు న తిరిగి చూసాను. బామ్మలిద్దరూ దగ్గర దగ్గరగా భుజాలు కలుపుకుని కూర్చున్నారు. నేనటు వేగంగా కదుల్తూ అన్నాను-“వాళ్లేదో ఛాదస్తంతో మొండిగా అలా తేమగాలిలో వణకుతూ ఉంటే మీరందరూ చోద్యం చూస్తూ ఇంట్లో హాయిగా వెచ్చగా కబు ర్లాడుతూ ఉంటారా!వాళ్ళమాట అటుంచు--నీకైనా మతీ బుధ్ధీ ఉండవద్దూ!”అప్పుడు పుష్పలత నన్నాపింది. “వాళ్లను చూసి అరవకు. గీపెట్టకు. ఇద్దరి బాధకూ చాలా అర్థం ఉంది”.


నేను వెటకారంగా నవ్వి అడిగాను-“ఏమిటో అంత లోతైన అర్థం?”

“చెప్తాను. కొంచెం ఆవేగం తగ్గించుకోండి. అది ఛాతస్తం కాదు. ఉవ్వెత్తున లేచి పడే హృదయ మనోరాగం. పడిపోయిన ఆ వేప చెట్టు క్రిందే-మీతాతయ్యగారితో ఊరి పెద్దల సమక్షంలో వాళ్లకు పెండ్లయింది. ముగ్గురూ కలిసే ముత్యాలమ్మవారి బొడ్రాయికి నమస్క రించి ఇంట్లోపలకు నడిచారట. వెన్నెల భోజనం వేప చెట్టు క్రింద కూర్చునే తినేవారట. అన్నేళ్లు మీ తాతయ్యతో చీకూ చింపరీ లేకుండా సంసారం చేసారు. అది వాళ్ళిద్దరూ మరచిపోలేక పోతున్నారు. అసలు వాళ్లిద్దరూ ప్రతి రోజూ ఉదయం నుండి ముని మాపు వరకూ ఆ చెట్టు క్రిందే కూర్చోవడానికి కారణం కూడా ఇదేనేమో!” నేనప్పుడు ఉద్వేగం అణచుకున్నాను.


తడిసిపోయిన నా రెండు కళ్ళనూ తుడుచుకుంటూ బామ్మలిద్దరి వద్దకూ చేరి-ఇద్దరి భుజాలపైనా చేతులుంచి-“బామ్మా!నేనొచ్చాను. మీ మనవడు బాబూరావు వచ్చాడు. నేనొచ్చేటప్పుడు కేకులు తేవడం మరిచాను. రేపు తెచ్చిస్తాలే—ఇప్పుడు కదలి లోపలకు రండి. మళ్లీ వర్షం వచ్చేలోపల ఇంట్లోపలకి వెళ్లిపోదాం” అంటూ మృదువుగా యిద్దరినీ కుదిపాను. కాని వాళ్ళలో ఎవరూ లేవ లేదు. తిరిగి చూడలేదు. కూలిపోయిన వేప చెట్టులాగే ఇద్దరూ నేలకొరిగిపోయారు. ”బామ్మా!“ అంటూ యేడుస్తూ ఇద్దర్నీ రెండు చేతులతోనూ గుండెలకు హత్తుకున్నాను, తాతయ్య ఆత్మలో ఇద్దరి ఆత్మలూ యెప్పుడో కలసిపోయుంటావి!

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).




మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




75 views0 comments

Comments


bottom of page