top of page

చిరునవ్వుల చిరుజల్లు


'Chirunavvula Chirujallu' New Telugu Story

Written By Yasoda Pulugurtha

చిరునవ్వుల చిరుజల్లు తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సహస్ర, అర్జున్ లకి నాలుగు రోజుల క్రితం పెళ్లిచూపులు జరిగాయి. అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సహస్ర కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరే. ఇద్దరూ హైద్రాబాద్ లోనే పనిచేస్తున్నారు. అన్నీ బాగున్నాయి. అయితే ఇంకా ఏ విషయమూ నిర్ధారించుకోలేదు. సహస్ర కు అంతకు కొన్ని రోజుల ముందే రాకేష్ అనే వ్యక్తితో పెళ్లి చూపులైనాయి. రాకేష్ కి సహస్ర బాగా నచ్చేసింది. అతను నెదర్ లేండ్ లో పని చేస్తున్నాడు.


అతని కుటుంబం, ఆస్తి, అంతస్తు అన్నీ బాగున్నా పెళ్లి అయితే నెదర్ లేండ్ కి వెళ్లాలా, నేను నా జాబ్ ను మానలేనంటూ సహస్ర అంటోంది. అయితే ఎవరిని చేసుకోవాలన్నది తుది నిర్ణయం సహస్ర తల్లితండ్రులు సహస్రకే వదిలేసారు.


రాకేష్ తరచుగా సహస్రకు ఫోన్ చేయడమే కాదు మెసేజెస్ చేస్తూ ”ఏమి ఆలోచించుకున్నావు సహస్రా? తొందరగా నీ నిర్ణయాన్ని చెప్ప”మంటూ ఒకటే విసిగిస్తున్నాడు.

‘నాకు కొంచెం సమయం కావాలి రాకేష్’ అంటూ సహస్ర అతని ప్రపోజల్ ని పెండింగ్ పెట్టింది.


ఆ తరువాత కొద్ది రోజులకు అర్జున్ సంబంధం వచ్చింది. అర్జున్ సహస్రకు నచ్చాడు. కానీ అర్జున్ కి తను నచ్చానో లేదో తెలియదు.


అర్జున్ ని చేసుకుంటే ఇంచక్కా ఇక్కడే ఉండచ్చు, అమ్మా నాన్న కూడా దగ్గరే ఉంటారు కదా అని సహస్ర అనుకుంటోంది.


అంతక ముందు పెళ్లి చూపుల్లో రాకేష్ ఎంతో చొరవ చూపిస్తూ తనతో మాట్లాడాడు. ఒక్క విషయం కాదు, సూది బెజ్జం నుండి అంతరిక్షం వరకు తనకు ఎన్నో విషయాలు తెలుసన్నట్లుగా గడ గడా మాట్లాడాడు. ఒట్టి వాగుడు కాయని అనుకోకుండా ఉండలేకపోయింది. అసలు తననే అందరూ వసపిట్ట అంటూ ఉంటారు. తనను మించిపోయి మాట్లాడే రాకేష్ ను చూస్తూ తను కావాలనే మౌనంగా ఉండిపోయింది. సహస్ర తల్లీ తండ్రీ అయితే ఆశ్చర్యపోయారు సహస్ర మౌనంగా ఉండిపోయేసరికి.


‘సిగ్గు పడుతోందేమో’ అనుకున్నారు ముందు, ఆ తరువాత ‘ఈ పెంకి పిల్లకు సిగ్గు కూడానా’ అనుకుంటూ మనసులో నవ్వుకున్నారు.


అర్జున్ పెళ్లి చూపుల్లో ఒకటి, రెండు మాటలు మినహా మరేమీ మాటలాడలేదు. కాస్తంత గంభీరంగానే ఉన్నాడు.


అర్జున్ తో పెళ్లి చూపులై వారం రోజులు దాటిపోయాయి. అతనేమైనా చొరవ చూపించి ఫోన్ చేస్తే అతన్ని కలవాలని, ఎన్నో మాటలాడాలని ఎదురు చూస్తోంది.


కానీ అతన్నుండి ఏ ఫోన్ లేదు. కనీసం మెసేజ్ స్ కూడా లేవు.


‘ఎంత పొగరు ఇతనికి’ అని అనుకోకుండా ఉండలేకపోయింది.


‘మీరు నాకు నచ్చారు సహస్రా’ అని చెపితే అతని సొమ్ము ఏం పోయిందో అనుకోసాగింది.


‘తను ఎలా చెపుతుంది? ముందు తనే చెప్పేస్తే అతని ముందు లోకువైపోతే?’


అసలుకే తనని ఇంట్లోనూ బయటా ఒక అమ్మాయిగా చూడరు.


రాకేష్ కి త్వరగా తన జవాబు చెప్పాలంటే అర్జున్ మనసులో తన పట్ల ఎటువంటి అభిప్రాయముందో తెలుసుకోవాలి.


ఇంక చివరకు ఏమైతే అది అయిందనుకుంటూ తనే ఆ రోజు మధ్యాహ్నం అర్జున్ కి ఫోన్ చేసి సాయంత్రం అయిదు గంటలకు “కేఫ్ కాఫీ డే” లో కలుద్దాం రండంటూ ఫోన్ చేసింది.


తను పావుగంట ముందే వచ్చేసి ఎదురుచూస్తోంది.


అర్జున్ హడావిడి గా వచ్చాడు. అందమైన అతని క్రాఫ్ చెదిరి కొన్ని వెంట్రుకలు అతని విశాలమైన నుదుటి మీద అల్లరిగా పడుతుంటే వెనక్కి తోసుకుంటూ సహస్ర కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చొన్నాడు. ఎంత అందంగా ఉన్నాడో అనుకోసాగింది మనసులో.


కనీసం “హాయ్” అని కూడా విష్ చేయకపోతే తనే విష్ చేసింది.


తనే మాట్లాడింది “ఎలా ఉంది మీ వర్కం”టూ.


“హెక్టిక్ గా ఉందండీ”, “ఎందుకు రమ్మనమన్నా”రంటూ ముళ్లమీద ఉన్నట్లే అడిగాడు.


“తనకి లేదా వర్క్”? తనకు ఏ పనిపాటా లేకా పిలిచాననుకుకుంటున్నాడు కాబోలు.


“చెప్పండి, ఎందుకు రమ్మనమన్నారు? ఇంకో అరగంటలో క్లైంట్ తో వీడియో కాల్ ఉంది. మీరు తొందరగా చెప్పడం పూర్తి చేస్తే నేను వెళ్లాలి” వాచ్ చూసుకుంటూ తొందరపడుతున్నాడు.


తనవైపు సరిగా చూడలేదు. అతన్ని కలుసుకోబోతున్నానని ఉదయం కొత్త చూడీదార్ డ్రస్ వేసుకుని కాస్తంత ప్రత్యేకంగా తయారైంది. ఆఫీస్ లో తన కొలిగ్స్ తన వైపు చూస్తూ ‘ఏమిటీ విశేషం, ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నా’వంటూ మెచ్చుకున్నారు.


‘కానీ, అర్జున్..? ఇతనికి ఏ టేస్ట్ లు సరదాలూ లేవా..? ఒట్టి దధ్దోజనంలా ఉన్నాడ’నుకోసాగింది.


ఎందుకో ఒకలాంటి అభిమానం, రోషం చోటు చేసుకున్నాయి. ముఖం కందగడ్డలా అయింది.


‘‘ఐయామ్ సారీ, మరోసారి కలుద్దా”మంటూ బై చెప్పేసింది.


ఇంటికి వెళ్లగానే తల్లితో “నేనా పొగరుబోతు అర్జున్ ని చేసుకో”నంటూ కోపంగా చెప్పేసింది.


“మరి ఆ రాకేష్ ని చేసుకోవచ్చుకదే సహస్రా, నిన్ను ఇష్టపడుతున్నాడు కూడా” అనేసరికి “రాకేష్ లేడూ గీకేషూ లేడు, నేనసలు పెళ్లే చేసుకో”నంటూ కోపంగా తన గదిలోకి వెళ్లిపోయి దఢాలున తలుపులేసేసుకుంది.


నాలుగురోజుల తరువాత అర్జున్ నుండి మెసేజ్, ‘మిమ్మలని వెంటనే కలవాలి, సాయంత్రం కాఫీషాప్ కు రమ్మ’నమని.


మొదట రాను అని చెప్పాలనుకుంది. కానీ, ఆరోజు అతని ప్రవర్తనను కడిగిపారేసి అతన్ని చేసుకోనని ముఖం మీదే చెప్పేయాలని నిర్ణయించుకుంది.


తను కావాలనే ఒక పావుగంట లేట్ చేసింది. అతని రియాక్షన్ చూద్దామని. అతను తన కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నాడు. ఏమిటింత ఆలస్యం అన్నట్లుగా చూసాడు.


"అర్జంట్ మీటింగ్ లో ఉన్నాను. ఒక అరగంటలో వెళ్లిపోవాలి, ఎందుకు పిలిచారో తొందరగా చెప్పండి".


సహస్ర మాట్లాడుతున్న తీరుకి అతని పెదవులపై కనీ కనిపించని చిరునవ్వొకటి తళుక్కుమంటూ మెరిసి మాయమైంది.


“ఓ, చాలా ధాంక్స్ వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని నేను వృధాచేస్తున్నందుకు సారీ కూడా.


బై ది బై మీరు ‘యస్’ అనగానే పెళ్లి చేసుకోడానికి, ‘నో’ చెప్పగానే వాజమ్మలా తలదించుకుని వెళ్లిపోడానికి నాకు వ్యక్తిత్వం లేదనుకుంటున్నారా’? నేను పొగరుబోతునని నన్ను చేసుకోనని అన్నారుట?”


‘‘మీరు ఫోన్ చేసి కలుసుకుందామా అనే సరికి నేను ఎగురుకుంటూ మీముందుకు వచ్చి వాలిపోవాలి’. అప్పుడు నేను బుధ్దిమంతుడిని. చూసావా నేను ఫోన్ చేయగానే పరుగెత్తుకుంటూ వచ్చేసాడు, పూర్ ఫెలో” అని నా గురించి అందరకూ టాంటాం చేసి చెప్పేస్తారు. ఏమి అమ్మాయిలండి బాబూ, మీకొక నమస్కారం!"


అతను చేతులు జోడించి తలవంచి నమస్కారం పెడుతున్న తీరుకి ఫక్కుమంటూ బైటకు రాబోతున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది. కోపాన్ని నటిస్తూ వింటోంది.


“మన పెళ్లిచూపులకు కొన్ని నెలల ముందు నాకో పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చూపులైనాయి. ఆ అమ్మాయి కూడా మీలాగే బాగుంది. ఏదో ఆ అమ్మాయితో ఫ్రీగా ఒకరి భావాలు మరొకరు ఎక్సేంజ్ చేసుకోవచ్చని అనుకుంటూ ఫోన్ చేసి కలుద్దామా అంటే, నా గురించి లేని పోని అభియోగాలు చేస్తూ అందరికీ టాంటాం చేస్తూ, నేనో మేనర్ లెస్ బ్రూట్ నని, కేరక్టర్ లేదని, నన్ను ఒంటరిగా కలవమన్నాడంటూ చెప్పేసింది ఆ మహాతల్లి, మొదటి పరిచయంలోనే ఎంత చనువు తీసుకున్నాడంటూ!


“అంటే..అంటే నా మీద బురద జల్లినట్లు కాదా”? నా కేరక్టర్ ని కించపరచినట్లు కాదా?”


" అలా అయితే మీరు నన్ను కలవాలనుకుంటూ ఆరోజు ఫోన్ చేసి పిలిచారు, అంతమాత్రాన నేను మీ కేరక్టర్ ను నలుగురి ముందూ కించపరచడం సబబా”?


“ఏం మాట్లాడరే సహస్రా”?


"నా పిచ్చిగానీ మీ లాంటి అమ్మాయిలు ఏమన గలరు కనుక, నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది కదా”.


“ఒక్క విషయం అడుగుతాను చెప్పండి”.


“కేరక్టర్ అన్నది అమ్మాయిలకే సొంతమా”? “అబ్బాయిలకు కాదా ? “అబ్బాయిలందరూ రౌడీగాళ్లేనా? చొరవ చూపిస్తే ఒకలాగ, బుద్దిగా ఉంటే దధ్దోజనం లా ఉన్నాడని అనేదీ మీరే”.“ఏం మీ అమ్మాయిలేనా కేరెక్టర్ ఉన్న మంచి భర్త రావాలని ఆశపడేది? మేమూ అనుకుంటాం అండీ మంచి భార్య మా జీవితంలోకి రావాలని”. మీరు నాలాంటి పొగరుబోతుని ఇష్టపడకపోయినా ఫరవాలేదు. మంచి బుధ్దిమంతుడిని, నీతివంతుడిని చూసి చేసుకోండం"టూ కోపంగా వెనుతిరగబోతున్న అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని ఆపేస్తూ ‘‘సారీ నాదే పొరపాటు, క్షమించండి”. “నాకు మరి ఏ బుధ్దిమంతుడు వద్దండోయ్, ఈ పొగరుబోతుతో సర్దుకుపోతానంటున్న” సహస్ర చిలిపి మాటలకు చిరు నవ్వుల చిరుజల్లు కురిసిందక్కడ.


“మరి నీకు నేను నచ్చానా అర్జున్, నచ్చానని చెపితే ఆ ‘రాకేష్’ కి మెసేజ్ చేసేస్తాను”.


“ఎవరా రాకేష్”?


"నీలాగే నాకూ ఇంతకముందు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. రాకేష్ అనే అతను నెదర్ లేండ్ నుండి వచ్చి నన్ను చూసి వెళ్లాడు. నేను నచ్చానుట. వెళ్లినప్పటినుండి నా ఫోన్ అతని మెసేజులతో నిండిపోయింది. తనని చేసుకోమంటూ బోర్ కొట్టేస్తున్నాడు."


“ఏం చేసుకోవచ్చు కదా, నాలాగ పొగరుబోతు కాదేమో కదా" సహస్ర వైపు క్రీగంట చూస్తూ అన్నాడు.


“అబ్బా.. రాకేష్ గురించి అడక్కు బాబూ, అతనొక వసపిట్టనుకో. నాన్ స్టాప్ గా మాట్లాడేస్తూ ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు”.


"అఫ్ కోర్స్, నేనూ వాగుడుకాయననుకో. కానీ ఇద్దరం అలా ఎడతెరిపి లేకుండా వసపిట్టల్లా వాక్కుంటుంటే ఏమైనా బాగుంటుందా చెప్పు? బోర్ అనిపించదూ? పైగా నేను మూటా ముల్లే సర్దేసుకుని అతనితో నెదర్ లేండ్ వెళ్లిపోవాలి. నాకు అలా ఉండకూడదు. నేను మాట్లాడుతుంటుంటే మంత్రముగ్ధలా అలా నా మాటలే వింటూ ఉండాలి.


“ఓ నేనైతే నీ మాటలు చెవులప్పగించి వింటాననేకదూ? అమ్మాయి లెప్పుడూ తమను కట్టుకోబోయేవాడు కాస్తంత నెమ్మదిగా ఉంటూ తమ మాటనే వినేవాడు కావాలని అనుకుంటారుట.

బహుశా నీవు కూడా అదే జాతిలోనిదానివే కదా".


“ఏమో అర్జున్, రాకేష్ కంటే నాకు నీవే నచ్చావు".


“మరి నీ అభిప్రాయం ఏమిటి అర్జున్? ఆడపిల్లని నేనే సిగ్గువిడిచి నా ఇష్టాన్ని ముందుగా చెప్పేసాను”.


“ఓ అయితే నా అభిప్రాయం చెప్పాలన్నమాట. నన్ను పొగరుబోతునని నీవు తిట్టినా మళ్లీ తిరిగి నీకు ఫోన్ చేసి ఎందుకు పిలిపించాననుకున్నావ్? ఇంకా అర్ధం కాలేదా" అంటూ చిలిపిగా చూసాడు సహస్ర వైపు.


"అయితే ఇప్పుడే మెసేజ్ చేసేస్తాను, అర్జున్ అనే అబ్బాయి ని చేసుకోవాలనుకుంటున్నానని”.


"ఇంక ఆలస్యం ఎందుకు, మెసేజ్ చేసేయ్" అనేసరికి సహస్ర ముఖం ముద్ద మందారమే అయింది.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


53 views0 comments

Comments


bottom of page