'Chupu' - New Telugu Story Written By Dr. Dilavar Mohammad
'చూపు' తెలుగు కథ
రచన: Dr. దిలావర్ మొహమ్మద్
"దాగుడుమూత దండాకోర్.... పిల్లీ వచ్చే ఎలుక భద్రం.... "అంటూ
పిల్లలిద్దరూ నానమ్మ సుభద్రమ్మను ఆట పట్టిస్తున్నారు.
"ఎక్కడా...ఎక్కడున్నారు...?"అంటూ చేతులు ముందుకు చాపి వెదుకుతున్నట్టు నటిస్తున్నది సుభద్రమ్మ.
"నానమ్మా...ఇదుగో....యిక్కడ.." చేతులు వూపుకుంటూ ఉత్సాహంగా అంటున్నారు పిల్లలు.
"ఎక్కడర్రా...?అరే.....నాకు కనపడ్డం లేదే....? "పిల్లల్లో హుషారెక్కిస్తూ అన్నది సుభద్రమ్మ.
పిల్లలకు ఏనుగునెక్కినంత సంబరంగా ఉంది. రెట్టింపు ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ
అరచినంత పనిచేస్తున్నారు పిల్లలు.
"అయ్యో....ఎట్టారా మీతో వేగేది....?కనబడ్డం లేదంటే వినిపించుకోరేం?" తచ్చాడుతున్నట్టు అక్కడక్కడే తిరుగుతున్నది సుభద్రమ్మ.
"నానమ్మా! ఇదుగో మేం ఇక్కడే ఉన్నాం.....కనిపిస్తున్నామా...?" బీరువా చాటునుండి కొంచెం బయటికొచ్చి అన్నారు పిల్లలు.
"లేదే...? మీరెక్కడున్నారర్రా...?" చేతులుముందుకు చాపి నెమకుతున్నట్టుగా అన్నది సుభద్రమ్మ.
"భలే భలే...నానమ్మకు కనిపించడం లేదంట....మేమే గెలిచాం." పట్టరాని సంతోషంతో కేరింతలు కొట్టుకుంటూ నానమ్మ దగ్గరకు వచ్చారు పిల్లలు.
సుభద్రమ్మ మురిపెంగా పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుంది.
***** ***** *****
కాలంతో దోబూచులాడుకుంటూ కొన్ని రోజులు దొర్లి పోయాయి. సాయం సంధ్య లోకమ్మీద బంగారు రజను చల్లుతున్నది.సూర్యునికి రేచీకటో ఏమో... నడుస్తూ నడుస్తూ అలా తూలి సముద్రం లో పడిపోయాడు. ఐనా మసక వెలుతురు తొంగి తొంగి చూస్తూనే ఉంది.
ఆ చల్లని సంధ్యాసమయంలో నానమ్మా,పిల్లల దోబూచులాట మళ్ళీ మొదలయింది. పెరట్లో వేప చెట్టు చాటున దాక్కున్నారు పిల్లలు. సుభద్రమ్మ ఎప్పటి లాగానే పిల్లల్ని వెదుకు తున్నది.
"నానమ్మా! అటు కాదు....ఇటు...ఇటూ..." అంటున్నారు పిల్లలు.
"ఎక్కడ దాక్కున్నారర్రా...?నాకు కనిపించడం లేదు." అంటూ చేతులు ముందుకు చాపి అటూ ఇటూ కదిలిస్తూ వెదుకుతున్నది సుభద్రమ్మ.
"నానమ్మా...! అటు వెళ్ళకు...ఇటు...ఇటు.." పిల్లలు హుషారుగా అంటూ నానమ్మకు కూడా హుషారెక్కించాలని చూస్తున్నారు.
"ఏమోనర్రా...!నాకు కనిపించడం లేదు" నిరుత్సాహంగా అన్నది సుభదరమ్మ.
పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చెట్టు చాటు నుండి బయటికొచ్చారు.
"నానమ్మా! ఇదుగో... ఇక్కడేఉన్నాం... పట్టుకో చూద్దాం...?" సవాలు విసురుతున్నట్టుగా అన్నారు పిల్లలు.
"ఇక్కడంటే ఎక్కడ? నాకు కనిపించి చావడం లేదర్రా..." సుభద్రమ్మ గొంతులో కొంచెం విసుగు ధ్వనించింది. చేతులు చాపి అటూ ఇటూ కదిలిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నది సుభద్రమ్మ.
"నానమ్మా! అటు కాదు....మేం బయటికొచ్చేశాం. ఇటు వచ్చి పట్టుకో." సుభద్రమ్మలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తూ అన్నారు పిల్లలు.
"ఏమోరా....ఏలా పట్టుకోను? కనిపించడం లేదు...? సుభద్రమ్మ కొంచెం విచారంగానే అన్నది.
ఎదుటికొచ్చి నుంచున్నా నానమ్మ తమను గుర్తించకపోవడం తో పిల్లలకు అనుమానం వచ్చింది. అయినా "ఫో నానమ్మా! నీ దంతా దొంగ నాటకం. నీ ముందే ఉన్న మేం కనిపించడం లేదని బుకాయిస్తున్నావు." అని కినుక వహిస్తున్నట్టుగా అన్నారు పిల్లలు.
"నాటకం కాదర్రా! నాకు నిజంగానే కనిపించడం లేదు." అనుకుంటూ ముందుకు అడుగులు వేసింది సుభద్రమ్మ. ముందున్న వేపచెట్టు కనిపించకపోవడం తో అమాంతం గుద్దుకుంది. నొసలు నుండి సొడ సొడ రక్తం కారుతున్నది.
పిల్లలిద్దరూ భయపడి పోయారు. నానమ్మకు నిజంగానే కనిపించడంలేదేమోఅనుకున్నారు. "నానమ్మా!" అనిపిలుస్తూ ఏడ్చుకుంటూ వెళ్ళి నానమ్మను చుట్టేశారు.
***** ***** ****** *****
పడుతూ, లేస్తూ, కుంటుకుంటూ కొన్ని రోజులు ముందుకు కదిలాయి. స్కూళ్ళూ, హోం వర్కులూ,ట్యూషన్లూ......పిల్లలు రొటీన్ జీవితం లో పడ్డారు.
ఓ రోజు వనజ పిల్లలకోసం హార్లిక్సు కలుపుతున్నది. పిల్లలిద్దరూ ఏదో సైగ చేసుకున్నారు.
పెద్ద పిలగాడు నితీష్ గొంతు సవరించుకొని భయం భయంగా "అమ్మా!" అని పిలిచాడు.
"ఏంట్రా...!"అన్నది వనజ పిల్లల వైపు చూడకుండానే.
"అమ్మా.....మరి .....మరి...నానమ్మకు .....కళ్ళు కనబడ్డం లేదమ్మా!" అన్నాడు నితీష్ మెల్లగా.
గిరుక్కున పిల్లల వైపు తిరిగింది వనజ.
"ఏమైందిరా...మీ నానమ్మకు?" అని అన్నది.
ఈసారి చిన్న పిల్లగాడు సతీష్ అందుకున్నాడు."అమ్మా...! మరే ....నానమ్మకు ....కళ్ళు కనబడ్డం లేదమ్మా!" అని అన్నాడు.
షాక్ తగిలినట్టు అనిపించింది వనజకు. "అవునా...?" అన్నది విస్మయంగా.ఓ నిమిషం పాటు ఆమెలో ఏవేవో ఆలోచనలు కలమెలిగాయి. వెంటనే సర్దుకొని " మీకిలాంటి పెద్ద పెద్ద విషయాలెందుకు...? పాలు తాగి స్కూలుకు వెళ్ళండి. స్కూలు బస్సు వచ్చే వేళైంది కూడా..." అని పిల్లల నోళ్ళు మూయించింది వనజ.
పిల్లలిద్దరూ నీరు గారి పోయారు. అమ్మ నాన్నతో చెప్పి నానమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్తుంది అనుకున్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్ళు పోసింది వనజ. బిక్కమొహాలేసుకొని అయిష్టంగానే హార్లిక్స్ తాగి భుజాలకు బ్యాగులు తగిలించుకున్నారు.
***** ***** *****
మజ్జుగా మరికొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు సుభద్రమ్మ పునుకులాడుకుంటూ కొడుకు అశోక్ దగ్గరికొచ్చింది. అశోక్ ఏదో కథ రాయడంలో నిమగ్నమై ఉన్నాడు.
"పెద్దోడా ! " అని పిలిచింది సుభద్రమ్మ.
రాసుకుంటున్న కాగితం మీంచి దృష్టి మరల్చకుండానే "ఏంటి?" విసుగ్గా అన్నాడు అశోక్.
"పెద్దోడా! మరే...మరే... నాకు కళ్ళు కనబడ్డం లేదురా....! "అని అన్నది సుభద్రమ్మ దీనంగా.
"వయసు పెరుగుతున్నది కదా. అది మామూలే." సుభద్రమ్మ మాటలను తేలిగ్గా తీసుకొని అన్నాడు అశోక్.
"అది కాదురా! ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూయించుకుంటే మంచిదికదా!" అని ప్రాధేయపడుతున్నట్టుగా అన్నది సుభద్రమ్మ.
"సరేలే....రెండు మూడు రోజుల్లో తీరిక చూసుకొని వెళ్దాం."అన్నాడు అశోక్.
"సరే " అని తను పడుకునే మంచం దగ్గరకు తడబడుకుంటూ వెళ్ళింది సుభద్రమ్మ.
రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడూ కొడుకును అడుగుతూనేఉంది సుభద్రమ్మ.
తల్లి పోరు పడలేక ఓ రోజు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అశోక్. అక్కడ డాక్టర్లు కంటి పరీక్ష చేసి, "శుక్లాలు బాగా పెరిగిపోయాయి.త్వరగా ఆపరేషన్ చేయకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదముంది "అని అన్నారు.
అశోక్ గుండెల్లో రాయి పడ్డట్టయింది.'ఇప్పుడిదొకటి వచ్చి పడింది ఏదీ దారి భగవంతుడా!' అనుకున్నాడు లో లోపల. ఇంటి కెళ్ళింతరువాత లోపాయికారంగా భార్య చెవిలో ఊదాడు.
వనజ ఓ రెండు నిమిషాలు మౌనం లో కూరుకు పోయింది.
"ఇంతోటి ఉద్యోగం తో ఇంటి ఖర్చులే వెళ్ళదీస్తారా...? పిల్లల బడి ఫీజులే కట్టుతారా? ట్యూషన్ ఫీజులే కట్టుతారా? పాల వాడికే ఇస్తారా? ఇందులోనే చిట్టీలు కూడా కట్టాలి. నా నడుం నొప్పి ,కీళ్ళ నొప్పి సరే సరి. వెలగబెట్టేది పంతులు గిరి. కలెక్టరో, డాక్టరో,ఇంజనీరో,. లాయరో కాదు." అంటూ విసా విసా వంటింట్లోకి దూరింది వనజ.
అప్పటికి తాత్కాలికంగా ఆ వడగళ్ళ వాన వెలిసింది. అడపా దడపా సుభద్రమ్మ తన కళ్ళ ఆపరేషన్ గురించి కదిలిస్తూనేఉంది. ఇక తప్పేట్టు లేదని ఓసారి మళ్ళీ భార్యను కదిలించాడు అశోక్.
గయ్యిమని ఇతెత్తులేచింది వనజ.
"మీ తాత తండ్రులు సంపాదించిపెట్టిన ఆస్తి పాసులేమన్నా ఇంట్లో మూలకు పడి మూల్గుతున్నాయనుకుంటున్నారా.? ఒక సారి చెబితే అర్థం కాదా మీకు? అయినా ఆపరేషనై సుబ్బరంగా ఆవిడ గారు మంచం ఎక్కి తే చచ్చే చాకిరంతా ఎవరు చేయాలనుకుంటున్నారు? నాకు తెలియక అడుగుతా! మీరొక్కరేనా ఆవిడగారికి కొడుకు? మీ తమ్ముళ్ళున్నారుగా! ఫోన్ చేసి తీసుకు పొమ్మని చెప్పండి." అంటూ తుఫానులా విరుచుకు పడింది వనజ.
అశోక్ పెద్ద తమ్ముడు రమేష్. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. చిన్నతమ్ముడు నరేష్. అతడు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరే. పూణేలో ఉంటున్నాడు. ఇద్దరూ బాగానే నాలుగురాళ్ళు వెనకేసుకున్నవాళ్ళే.
అశోక్ ముందుగా పెద్దతమ్ముడు రమేష్ కు ఫోన్ చేసి"రమేష్! అమ్మకు కంటి శుక్లాలు ముదిరిపొయాయి. వెంటనే ఆపరేషన్ చేయక పోతే చూపు పూర్తిగా పోతుందట. నువ్వు అర్జంటుగా వచ్చి అమ్మను తీసుకెళ్ళు" అని చెప్పాడు.
"ఇప్పుడా !" నిర్ఘాంత పోయాడు రమేష్ ."అన్నయ్యా! నీకు తెలీంది ఏముంది? ఇక్కడ ఊపిరి సలపనంత పని. ప్రోగ్రాం ఆఫీసరుగా చేరి తప్పు చేశానేమో నని అనిపిస్తున్నది. ఉద్యోగంతో సతమత మవుతున్నాను. ఇంటి అద్దె, పిల్లల కార్పోరేట్ స్కూలు ఫీజులు, మండి పోతున్న నిత్యావసర సరుకుల ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. మీ మరదలు పీజీ చేసిన ఆధునిక మహిళ. కాఫీ పెట్టడం కూడా చేతకాదు. అమ్మను ఇక్కడికి తీసుకు వచ్చి బాధ పెట్టడమే అవుతుంది. ఎట్లాగో అట్లా అమ్మను నువ్వే చూసుకో అన్నయ్యా!" అంటూ లౌక్యంగా తప్పించుకున్నాడు రమేష్.
అంతా విని నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేక పోయాడు అశోక్.
చివరి ఆశతో ఓరోజు నరేష్ కు ఫోన్ చేసి తల్లి పరిస్థితి అంతా వివరించి చెప్పాడు అశోక్. "ఎట్లాగైనా అమ్మను తీసుకు పోరా "అని ప్రాధేయ పడుతున్నట్టుగా అన్నాడు.
ఓ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు నరేష్.
"అన్నయ్యా! నీకు తెలియందేముంది? మీ మరదలికి ఇది రెండో కానుపు. పుట్టింటికి వెళ్ళదట. బోల్డన్ని హాస్పిటల్ ఖర్చులు. బాబుకు అన్నీ చూసుకోవడం నా వల్ల కావడం లేదు. ఆయాను పెట్టాను. ఇక్కడ ఆయాలంటే మాములు విషయం కాదు. వేలు గుమ్మరించాలి. పైగా వాడి చదువు. ఇక్కడ చదువు ఎంత ఖరీదైననదో వేరే చెప్పనవసరంలేదు. ఈ పరిస్థితిలో ఏం చేయడానికీ కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. అమ్మను ఎలాగైనా నువ్వే చూసుకోక తప్పదు అన్నయ్యా! " అంటూ మెత్తని కత్తితో కోసినట్టు చెప్పాడు నరేష్.
తలకాయ పట్టుకున్నాడు అశోక్. అతనికి ఏం చేయాలో ఎటూ తోచడం లేదు. రోజులు బుల్డోజర్ లా బద్ధకంగాదొర్లిపోతున్నాయి.
"పెద్దోడా! కళ్ళు బొత్తిగా కనిపించడం లేదు. ఆపరేషన్ చేయించురా!"అంటూ సుభద్రమ్మ పదే పదే గుర్తు చేస్తున్నది అశోక్కు.
తల్లి బాధ పడలేక ఓరోజు "వనజా! అమ్మకి ఆపరేషన్ చేయించుదామా? అమ్మ చాలా బాధపడుతున్నది." అని వనజతో నంగి నంగిగానే అన్నాడు అశోక్.
"నేనొక దాన్ని దొరికాను అందరికీ వెట్టిచాకిరీ చేయడానికి ..." కస్సు బుస్సులాడుతూ అన్నది వనజ.
"అదికాదు వనజా! కాస్త నా మాట విను..." నచ్చ జెప్పడానికి ప్రయత్నిస్తూ మెల్లగా అన్నాడు అశోక్.
"ఏది కాదు? ఆపరేషన్ చేయించుకుని ఆమె గారు మహరాణిలా మంచమ్మీద ఉంటే కిమ్మనకుండా అన్నీ చెయాల్సింది నేనే కదా! మీకేం మగమహారాజులు. ఆకాస్త పని కానిచ్చి మీరు చేతులు దులుపుకుంటారు. ఆ తరువాత చచ్చే చావు నాకేకదా! నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ బండ చాకిరీ నేను చేయ లేను బాబూ! ఆతరువాత మీ యిష్టం." ఫెళ ఫెళా ఉరుములు ఉరిమి నట్టుగా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది వనజ.
అశోక్కు ఎటూ పాలు పోవడం లేదు. ఊపిరి ఆడనట్టు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.
ఆఫీసుకు రొటీన్ గా వెళ్ళే ఉద్యోగిలా కాలం నిర్లిప్తంగా ముందుకు సాగుతున్నది.
****** ***** *****
ముని మాపు వేళ మసక బారే వెలుతురులా సుభద్రమ్మ జీవితం కూడా మసక బారిపోయింది. మూడవ కాలు ఊతంతో సుభద్రమ్మ కాలానికి ఎదురీదుతున్నది.
ఎటో పోయి దేనికో తగులుతున్నది. తప్పేళాలు,చెంబులు, గిన్నెలు,గ్లాసులు బొల బొలా పడుతున్నాయి. వాటితోబాటుగా తిట్లు కూడా పడుతున్నాయి.
"భగవంతుడా! తొందరగా నన్ను తీసుకుపోకుండా ఎందుకు ఈ భూమ్మీద వుంచావయ్యా! భూమ్మీద వుండి నేను చేసే రాచకార్యాలేమూన్నాయి ఇంకా....?"అని మాటి మాటికి అనుకుంటూ కళ్ళొత్తుకుంటున్నది సుభద్రమ్మ.
నానమ్మ అవస్థ చూసి పిల్లల గుండెలు అవిసి పోతున్నాయి. చేసేదేం లేక బాధ ను లో లోపలే భరిస్తున్నారు పిల్లలు.
వీలు చిక్కినప్పుడల్లా నానమ్మకు సాయం చేస్తున్నారు కానీ వాళ్ళకు చిక్కే సమయమెంత?
గుడ్డి కళ్ళతో అట్లాగే వేగుతున్నది సుభద్రమ్మ.
ఆ రోజు ఆదివారం. పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు."ఒరేయ్ బాబూ! నన్ను కాస్త ఎండ పొడకు కూచో బెట్టండిరా!" అని పిల్లల్ని అడిగింది సుభద్రమ్మ.
పిల్లలు పెరట్లో కుర్చీ వేసి సుభద్రమ్మను కూచో బెట్టి, తమపనుల్లో నిమగ్నమయ్యారు. ఎండ చురుక్కుమనిపించేదాకా సుభద్రమ్మ కుర్చీలోనే కూచుంది. తరువాత చేతికర్రసాయం తో పక్కకు నడిచింది.
పెరట్లో ఓ పక్కన ఎప్పుడో తీసిన గొయ్యి మృత్యువులా నోరు తెరుచుకొని ఉంది. సుభద్రమ్మ కర్ర పోటు వేసుకుంటూ అటువైపే వెళ్ళుతున్నది. పిల్లలు హాల్లోంచి సుభద్రమ్మ గోతి వైపు వెళ్ళుతుండటం గమనిచారు. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు. వాళ్ళ గుండెలు గుభెల్లుమన్నాయి.
"నానమ్మా! అటు వెళ్ళకు. అటువైపు గొయ్యి వుంది." అని అరచుకుంటూ వెళ్ళే లోపే జరగ కూడనిది జరిగేపోయింది. సుభద్రమ్మ అమాంతం గొయ్యిలో పడి పోయింది.
"అమ్మా!" అంటూ గావుకేక పెట్టింది.
ఆ కేక విని అశోక్, వనజా పెరట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి కొయ్యబారి పోయారు. వెంటనే ఇరుగుపొరుగు వారి సాయం తోసుభద్రమ్మనుగోతిలోంచి వెలుపలికి తీశారు.
తలకు బాగా దెబ్బ తగిలినట్టుంది. సుభద్రమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కొడుకూ కోడలు కలసి సుభద్రమ్మను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగ కూడదనుకున్నదేమో, సుభద్రమ్మ రెండు మూడురోజుల్లోనే-ఆసుపత్రిలోనే కన్నుమూసింది.
బెంగుళూరునుండీ, పూణే నుండీ రమేష్, నరేష్ మొక్కుబడిగా వచ్చారు. అంత్యక్రియలు జరిగేవరకు నిప్పుల మీద నుంచున్నాట్టుగా ఉన్నారు. ఆ కాస్త పని అయి పోగానే ఎవరి దారి వారు పట్టారు.
ఎవరికి ఏ ఘోరం జరిగినా, ఏ మంచి జరిగినా తనకు పట్టనట్టు నంగ నాచి తుంగ బుర్రలా కాలం ముందుకు సాగు తూనే వుంది. సుభద్రమ్మ జ్ఞాపకాలు త్వరగానే గతం లో కలిసిపోయాయి.
అశోక్, వనజా, పిల్లలూ త్వరగానే మామూలు జీవితానికి అలవాటు పడ్డారు.
***** ***** *****
అశోక్ గడప దాటి లోనికి అడుగు పెట్టాడో లేదో రయ్యిమని భర్తకు ఎదురొచ్చింది వనజ.
"ఏమండీ! మీకో శుభ వార్త." ఉత్సాహంగా అన్నది వనజ. ఆమె ముఖం కళ కళ
లాడుతున్నది.
'ఏంటబ్బా శుభవార్త" అని తనలో అనుకుంటూ వనజ వైపు కుతూహలంగా చూశాడు అశోక్.
"అదేంటండీ! అలా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు? మీరు రాసిన కథ “మాతృదేవోభవ"కు ప్రథమ బహుమతి వచ్చిందటండీ! పత్రిక వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. కంగ్రాట్స్ అండీ!" అంటూ పట్టరాని సంతోషంతో చెప్పింది వనజ.
'మాతృదేవోభవ!.....'గుండెలో కలుక్కుమన్నది అశోక్ కు.
"ఇంత సంతోషకరమైన వార్త చెబితే అలా ఆముదం తాగిన మొహం పెట్టుకొని ఉన్నారేమిటండీ.......ఇదిగో ఆబహుమతి సొమ్ము ఇరవై వేలు నాకే సుమా!" గోముగా అన్నది వనజ.
"ఆ....ఆ.....అలాగే...."అని అన్యమనస్కంగానే అన్నాడు అశోక్.
ఆ రోజు స్పెషల్ వంటకాలు చేసి ప్రేమగా భర్తకు వడ్డించింది వనజ.
కొన్ని రోజులకు తల్లి జ్ఞాపకాలనుండి బయటపడ్డాడు అశోక్. ఇక కథా వ్యాసంగం ముమ్మరం చేశాడు. విరివిగా కథలు రాయడం మొదలెట్టాడు. ఇదివరకు పొగ తాగే అలవాటు కొద్దిగా వుండేది. ఇప్పుడు అదేపనిగా సిగరెట్లు ఊదిపారేస్తున్నాడు. దాంతో పాటు టీలు, కాఫీలు కూడా బాగా అలవాటయ్యాయి.
ఓరోజు 'తల్లి ప్రేమ ' అన్న కథ రాయడం మొదలెట్టాడు. ఉన్నట్టుండి బాత్రూంకు వెళ్ళాలనిపించింది. కథరాయడం ఆపి బాత్రూం కు వెళ్ళి వచ్చాడు. మళ్ళీ కథ రాయడం మొదలైంది. ఇంతలోనే మళ్ళీ బాత్ రూం కు వెళ్ళాల్సి వచ్చింది. అలా ఆ రోజు చాలా సార్లు బాత్రూం కు వెళ్ళ వలసి వచ్చింది.
ఆ తరువాత కూడా రెండు మూడు రోజులు అలాగే బాత్రూం కు వెళ్ళాడు. కాళ్ళు బాగా లాగుతున్నాయి. విపరీతమైన దాహం. నీరసం. షుగరేమో అన్న అనుమానం వచ్చింది అశోక్ కు.
ఓ రోజు విషయం వనజతో చెప్పాడు. "ఎందుకైనా మంచిది. ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి" అని అన్నది వనజ.
తెల్లారి పరగడుపున ఆసుపత్రికి వెళ్ళాడు అశోక్. మూత్రపరీక్షతోబాటు అన్నం తినక ముందూ, తిన్న తరువాత రక్తపరీక్షలు కూడా చేశారు. సాయంత్రానికి రిపోర్టులు వచ్చాయి. మధుమేహం టైప్ రెండు అని తేలింది.
మరునాడు రిపోర్టులు తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు అశోక్.
"రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. టీలు ,కాఫీలు మానాలి. కొన్ని మాత్రలు కూడా వాడాలి" అని ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చాడు డాక్టర్.
అశోక్ డాక్టర్ చెప్పినట్టుగా ఇంజెక్షన్లూ, మాత్రలూ ఐతే వాడుతున్నాడు గానీ టీలు, కాఫీలు మానడం అతని వల్ల కావడం లేదు.
దాంతో చక్కెర స్థాయులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. కాలం అనాసక్తంగా, అన్యమనస్కంగా ముందుకు అడుగులు వేస్తున్నది.
రోజులు గడుస్తున్నకొద్దీ మధుమేహం అశోక్ ను కుంగదీస్తున్నది. ఇప్పుడు మరొక ఉపద్రవం వచ్చి పడింది. అశోక్కు చూపు ఆనడం లేదు. అంతా అలికేసినట్టు మసక మసకగా కనిపిస్తున్నది.
కంటి వైద్య నిపుణుడి దగ్గరకెళ్ళి చూపించుకున్నాడు అశోక్.
"డయాబెటిక్ రెటినోపతి. ముదిరి పోతున్నది. ఆపరేషన్ చెయ్యాలి. కానీ షుగర్ పేషెంటుకు ఆపరేషన్ చెయ్యడం కష్టం. అది ఇక్కడ కుదరదు." అని చావుకబురు చల్లగా చెప్పాడు డాక్టర్.
అశోక్ ను హైదరాబాద్ లో పేరున్న కంటి వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళింది వనజ.
"సరే చూద్దాం " అని అన్నాడు దాక్టర్. అశోక్కు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టనిపించింది.
ముందు చక్కెర నియంత్రణకు పవర్ ఫుల్ మందులు వాడాడు డాక్టర్. కాస్త నెమ్మదించిందనుకున్నప్పుడు మొదట ఒక కన్నుకు , తరువాత రెండో కన్నుకు ఆపరేషన్ చేశాడు . 'ఆపరేషన్ విజయవంతంగా జరిగింది కానీ రోగి మాత్రం చచ్చి ఊర్కున్నాడు ' అన్న చందంగా అయింది అశోక్ పరిస్థితి.
చూపు ఏమాత్రం బాగుపడలేదు సరికదా మరింత మందగించింది. హతాశుడైనాడు అశోక్ .
జీవితాంతం గుడ్డివాడిగాగానే ఉండాల్సి వస్తుంది అనే ఆలోచన రాగానే కంపరమెత్తి పోతున్నాడు అశోక్. ఇక పుస్తకాలు చదవడం కుదరదు. కథలు రాయడం కుదరదు. తన సాహితీ మిత్రులైన కాంతారావు, సాగర్, సుబ్బారావు, హనీఫ్ తనను వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకు పోతారు అన్న ఆలోచన రాగానే తల్లడిల్లి పోతున్నాడు అశోక్.
ఓసారి ఇంట్లో పునుక్కుంటూ నడుస్తుంటే నీళ్ళ బిందె తగిలి కింద పడ్డాడు. అతనికి ఎందుకో తల్లి సుభద్రమ్మ గుర్తుకొచ్చింది.
" అమ్మా! ముగ్గురు కొడుకులమై ఉండీ నీకు ఏం చేయలేక పోయాం. ఒకరి మీద ఒకరు బాధ్యతలు తోసుకొని నిన్ను ఏమాత్రం పట్టించుకోలేదమ్మా! జీవితాంతం గుడ్డిదానిలా ఎంత అల్లాడి పోయావో కదా! ఆపరేషన్ చేస్తే నీకు చూపు వచ్చే అవకాశం ఉన్నా మేం అమానుషంగా ప్రవర్తించి నీకు ద్రోహం చేశాం. ఇప్పుడు చూడు. నాకు ఆపరేషన్ జరిగినా చూపు రాకుండా గుడ్డి వాణ్ణయ్యాను. అమ్మా! మమ్మల్ని క్షమించగలవా...?" అని అశోక్ తలపోసుకుంటుంటే కళ్ళ లోంచి కన్నీరు ధారగా కారుతున్నది.
*******
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
댓글