డెడ్ ఎట్ 3. 30
- Karlapalem Hanumantha Rao
- Sep 19
- 5 min read
#అమృతరావు, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #Kosamerupu, #TeluguSuspenseStory

Dead At 3.30 - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 19/09/2025
డెడ్ ఎట్ 3. 30 - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సెల్ రింగవుతుండటంతో నిద్రాభంగమయింది!
టైమ్ చూస్తే ఒంటిగంట!
అర్థరాత్రి మద్దెల దరువు.. మా పోలీసోళ్ళకి ఇది మామూలే!
తప్పేదేముంది? విసుక్కుంటూనే ఫోన్ తీసా! చెప్పింది విని "ముందు వెంకట స్వామిని అక్కడికి పంపించండి! నేను స్పాట్ కి వెళ్ళి చూసొస్తా! “ అని ఆర్డరేసి..
రడీ అయి.. లోకేషన్ చేరుకుంటే.. అదొక అపార్ట్ మెంట్ కాంప్లెక్స్.. సానంద.. మిడిల్ క్లాస్ టైప్!
అప్పటికే వచ్చున్న హెడ్ కానిస్టేబుల్ అచ్చెన్న ‘ఠక్ ‘ మని ఓ సెల్యూట్ కొట్టి "థర్డ్ ఫ్లోర్ సార్! " అంటూ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశాడు.
సంఘటన జరిగింది మూడో అంతస్తు లెఫ్ట్ సైడ్ ఫ్లాట్లో!
ఫ్లాట్ ఓనర్ రంగనాథం.. మా కోసమే ఎదురు చూస్తున్నాడు.. కంగారుగా! ఖాకీలం కంట బడగానే ఆయన ఫేస్ లో పెద్ద రిలీఫ్!
మమ్మల్ని మెల్లగా ఫ్లాట్ లోపలకి తీసుకెళ్ళాడు.
బెడ్ రూమంతా గందరగోళంగా ఉంది.. నేలమీద చెల్లాచెదురుగా కాగితం ముక్కలు!
రెండు ముక్కల్ని ఏరి నాకందిస్తూ అన్నాడు అచ్చెన్న “ఎటెంప్టెడ్ సూయిసైడ్ సర్! పేరు అమృతరావు.. ఏ. జీ ఆఫీసులో జూనియర్ ఎక్కౌంటెంట్.. సింగిల్గా ఉంటున్నాట్ట! నిన్న మధ్యాహ్నం మూడింటికే ఆఫీసు నుంచి వచ్చేసాట్ట!.. "
"వచ్చినప్పుడ్నించీ మూడీగా ఉన్నాడు సార్! ఏమయిందని అడిగితే 'ఏంలేద'న్నాడు" అన్నాడు రంగనాథం.
“ఓ. కే! మీరేనా ఇందాక స్టేషన్ కి కాల్ చేసింది? డీటెయిల్స్ చెప్పండి.. మీకు తెల్సినంత వరకూ!”
రంగనాథం చెప్పిందాన్ని బట్టి ఆత్మహత్యకు పూనుకున్న అభాగ్యుడు గనర్నమెంట్ ఎంప్లాయే కాదు.. కథా రచయిత కూడానట!
"రైటరంటున్నారూ.. ఆయన పేరేంటీ?"
"చెల్లుబోయిన అమృతరావు. అమృత అని పెట్టుకున్నాడు సార్.. పెన్నేమ్ "
“ఆపేరెక్కడా విన్నట్లు లేదే?!“
నాకూ తెలుగు సాహిత్యంతో కొంత పరిచయం కద్దు.
"ఆ పేరు కోసమే సార్ ఈ మనిషి తంటాలంతా! ఆఫీసులో ఏం పని చేస్తాడో ఏమో గానీ, ఇంట్లో ఉన్నంత సేపూ ఏదో గిలుకుతూనే ఉంటాడు! ఏ పత్రిక లోనూ తన కథలు పడ్డం లేదని దిగులు. ఆ డిప్రెషన్ అదీ చూసి ఎప్పుడో ఏదో చేసుకుంటాడనుకున్నా! అనుకొన్నట్లే అయిందిప్పుడు.. ఖర్మ.. !“
“ ఏ హస్పిటల్లో అన్నారూ ఆయన్ని జాయిన్ చేసిందీ?“
"సంజీవనీ మల్టీ స్పెషాలిటీ అని చెప్పారు” అన్నాడు అచ్చెన్న.
“ఇక్కడికదే దగ్గరండీ! వాళ్ళాఫీసువాళ్ళే తీసుకెళ్లారు. నాకు కాళ్ళ వాపులు.. పోలేకపోయా " సంజాయిషీ ఇచ్చాడు రంగనాథం.
"కనీసం.. ఎన్‌క్వయిరీ అయినా చేసుండాల్సింది.. స్టేషనుకు కాల్ చేసే ముందు.. "
"చేస్తూనే ఉన్నా సార్.. ! ఖచ్చితంగా ఏదీ సమాధానం రాటంలేదు అక్కణ్ణుంచి. అందుకే స్టేషన్ కి ఇన్ఫాం చేసింది”
ఒక వంక రంగనాథం చెప్పింది వింటూనే ఇంకో వంక అచ్చెన్న అందించే పేపర్లు చూస్తున్నా. అదేదో పత్రిక నుంచి వచ్చిన రిజెక్షన్ లెటర్ లాగుంది. 'మీరు పంపిన "డెడ్ ఎట్ 3. 30" కథ ప్రచురణకు స్వీకరించబడలేదు.. ' అని కనిపించింది. పత్రిక పేరు తెలీలేదు ఆ చోట్లో పేపర్ కట్ అయివుంది.
రెండో కాగితంలోనూ దాదాపు ఇదే మేటర్.. కాకపోతే ప్రతిక పేరు.. ‘శోభ’.
అక్కడి టేబుల్ మీద చెల్లా చెదురుగా పడున్న కాగితాలూ.. కవర్లూ.. ఒక్కొక్కటే చూస్తున్నా.. క్లూసేమన్నా దొరుకుతాయని ఆశ.
ఆర్యా!
మీరు పంపిన "డెడ్ ఎట్ 3. 30" రిపోర్టును తగిన ఆధారాలు జతచేయనందున ప్రచురించటం లేదు.
ఇట్లు
సంపాదకుడు
భూతద్దం పరిశోధన మాసపత్రిక
..
మరో పేపర్ తీశాను. లైట్ రెడ్డిష్ కలర్లో ఉన్న అదీ రిజెక్షన్ లెటరే !
శ్రీ చెల్లుబోయిన అమృతరావుగారికి
నమస్తే! మీరు దయతో పంపిన "డెడ్ ఎట్ 3. 30" సాహిత్య వ్యాసాన్ని ప్రచురించ లేకపోతున్నాము. తెలుగు సాహిత్యం మీద మీకున్న ఆసక్తి అభినందనీయం.
ఇట్లు
స్తోత్రం సాహిత్య మాసపత్రిక
ఎడిటర్-ఇన్- ఛార్జ్
..
మరో డిటో లెటర్.. సహకారి పక్షపత్రిక సంపాదకుడి నుంచి !
అయ్యా/ అమ్మా
మీ నుండి అందిన "డెడ్ ఎట్ 3. 30" పెద్దకథను ఆసక్తితో పరిశీలించాము. ఈ స్థాయి విస్తృత రచనలను 'సహకారి' వేదిక కాదు. అన్యథా భావించరని ఆశిస్తున్నాము.
..
ఇలాంటి తిరస్కరణ లేఖలు టేబుల్ మీద ఇంకా చాలానే ఉన్నాయి!
నిజం చెప్పద్దూ.. అమృతరావు మీద బోలెడంత జాలేసింది ఆక్షణంలో.
ఆర్షసాహితి పక్షపత్రికవారు "డెడ్ ఎట్ 3. 30"కథను వచనకవితగా అపార్థం చేసుకొన్నట్లున్నారు. ధన్యవాదాలు చెబుతూనే అభ్యుదయ కవిత్వాన్ని 'ఆర్ష సాహితి' ప్రోత్సహించదు అంటూ నిర్దాక్షిణ్యంగా తిప్పిపంపారు.
..
ఇలాగే.. మలేసియా తెలుగుసంఘం త్త్రైమాసిక సాహిత్య పత్రికవారు కూడా!
మహాశయా!
తెలుగుభాష మీద గల అభిమానంతో ఉగాది పర్వదిన సందర్భంగా మేము నిర్వహించే కథల పోటీలో పాల్గొన్నందుకు అభినందనలు. మీరు పంపిన "డెడ్ ఎట్ 3.30" కావ్యఖండిక మా నియమనిబంధనలకు లోబడిలేనందున పోటీకి పరిగణించటంలేదు. తగినన్ని స్టాంపులు జత చేయనందున రచనను తిప్పిపంపలేకపోతున్నాం.
ఇట్లు
జీవబంధు
మలేసియా తెలుగుసంఘం త్త్రైమాసిక సాహిత్య పత్రిక
..
మరో రిజెక్షన్ లెటర్!
ఫ్రమ్
‘దివ్యవాణి’ ఆధ్యాత్మిక మాసపత్రిక
బరంపురం
మహాత్మా!
శ్రీ శైలాంబికాదేవి మాహాత్మ్య విశేషాల ప్రచారార్థం అమ్మవారి భక్తకోటి నెలనెలా ప్రచురిస్తున్న ‘దివ్యవాణి’ లో ప్రచురణ కోసం మీరు భక్తిపూర్వకంగా సమర్పించిన శృంగారగాధ "డెడ్ ఎట్ 3. 30" పత్రిక ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా లేదు. కావున తిరిగి పంపటమయింది.
సదా అమ్మవారి ఆశీస్సులు మీకు తోడుగా ఉండుగాక.
'దివ్యవాణి ‘
..
చిన్నపిల్లల సంచికలను కూడా వదిలినట్లు లేదు ఈ బేతాళ కథకుడు అమృతరావు. ‘చంటి’ అనే 'మారుపేరు'తో సంధించినా ఈ "డెడ్ ఎట్ 3. 30" అస్త్రం బూమెరాంగ్ కాక తప్పలేదు!
తమ్ముడు చంటీ !
నీవు ఉత్సాహంగా రాసిన కథ అందింది. కథ రాసే తొందరలో ఈ "డెడ్ ఎట్ 3. 30" హర్రర్ స్టోరీ నీదేనని నిరూపించే ధ్రువపత్రం జతచేయడం మరచిపోయావు. మన 'లక్క పిడతలు' బాలల పత్రిక అభిరుచులకు తగినట్లు కదా కథ ఉండాల్సింది?! మరో చక్కని కథ రాసి ధ్రువపత్రం జతచేసి పంపించు. తప్పక ప్రచురణకు పరిశీలిస్తాను.
ఆశీస్సులతో
మీ 'అన్నయ్య'
'లక్కపిడతలు' సంపాదకుడు.
చివరికి.. ఈవేళ, రేపటి నిజం, జాగారం, కంచుకాగడా, తెలుగుగోడు.. లాంటి దినపత్రికల సాహిత్యానుబంధాల చుట్టూ చెడతిరిగినా ఈ "డెడ్ ఎట్ 3. 30" అచ్చుకు నోచుకోలేదంటే అమృతరావు ఎంత ఫ్రస్టేషన్ లో ఉండుంటాడో అర్థమవుతుంది!
“సార్! ఇవిగో.. ఇవి కూడా తిరుగు టపాలో రిటనొచ్చిన అమృతరావు "డెడ్ ఎట్ 3. 30" కథ తాలూకు కవర్లు!" ఒక్క పెట్టున అనరిచాడు అచ్చెన్న అల్మారా తలుపు బార్లా తెరిచి!
చెల్లాచెదరుగా కింద పడ్డ ఆ కవర్లలో.. చెమటచుక్క, సోవియట్ భూమి, శ్రీమతి, అన్నదాత, ఆటపాటలు, ఆర్థికసమత.. లాంటి తెలుగు భాషలో వచ్చే అన్నిరకాల పత్రికల నుంచి వచ్చిన రిజెక్షన్ లెటర్లున్నాయ్!
"ఏణ్ణర్థం నుంచి ఒకటే కథండీ.. పంపిన పత్రిక్కే.. ఒకసారి నిక్ నేమ్ తో.. ఒకసారి దొంగపేరుతో.. ఇంకోసారి ఆడపేరుతో ట్రయ్ చేస్తూనే ఉన్నాడు.. ఏ పత్రికైనా ఏమరుపాటులో ఈ 'డెడ్ ఎట్ 3. 30' ని ప్రచురిస్తుందని ఆశ.. పాపం! అహోరాత్రాలు తలకిందులుగా తపస్సు చేసైనా కథారచయిత అనిపించుకోవాలని తపన ఆ మానవుడికి! పగవాడిక్కూడా వద్దురా భగవంతుడా ఈ బాధలు! అనిపించేంత వెగటు పుట్టించేసాడ్సార్ ఈ దురదృష్ట జాతకుడు. “
రంగనాథం మాటల మధ్యలోనే సెల్ రింగవటం మొదలయింది..
“హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి.. ఫ్రమ్ సంజీవనీ మల్టీ స్పెషాల్టీ.. రిపోర్టింగ్ సార్! ఈ సూయిసైడ్ ఎటెంప్టెడ్ కేండిడేట్.. సి. హెచ్. అమృతరావు'.. ఎక్స్పైర్డ్ సార్.. జస్ట్.. ఫైవ్ మినిట్స్ బ్యేక్"
వెంకటస్వామి చెప్పిన వివరాలన్నీ శ్రద్ధగా వింటున్న నా చూపు.. యధాలాపంగా అక్కడే టేబుల్ మీదున్న టైమ్- పీస్ మీద పడింది.
గడియారంలో చిన్న ముల్లు మూడు అంకె మీద!.. పెద్దముల్లు ఏడు అంకె మీద!!
“3. 35”
దట్ మీన్స్.. ‘డెడ్ ఎట్ 3. 30’ కథా రచయిత అమృతరావు ఎక్జాట్లీ.. డెడ్- ఎట్ 3. 30’
‘ఓ మైగాడ్! వాటే వండర్!’.. ఆ కోయిన్సిడెన్స్ కి నా మతిపోయింది.
కిందకొచ్చి కారు స్టార్ట్ చేస్తుంటే రంగనాథం పరుగెత్తుకుంటూ వచ్చి నా చేతికి ఓ కవరందించాడు.
కవర్ మీది అడ్రసు..
శ్రీ సి. హెచ్. అమృతరావు
ఫ్లాట్ నెంబర్ 3. 30; సానంద అపార్ట్మెంట్స్
మోతీనగర్
హైదరాబాద్- 500020
కవర్ ఓపెన్ చేసి చూస్తే.. బుల్లెట్ వారపత్రిక నుంచి!
శ్రీ సి. హెచ్. అమృతరావుగారికి
అభినందనలు. మీరు పంపిన కథ ‘డెడ్ ఎట్ 3. 30’ ను ప్రచురణకు స్వీకరించాము. వీలువెంబడి ప్రచురించగలమని తెలియచేస్తున్నాము.
ఇట్లు
సంపాదకుడు
బుల్లెట్ సపరివారపత్రిక
"నిన్నే వచ్చిందట సార్ ఈ లెటర్! 3. 30 పోస్ట్ బాక్సులో వేయబోయి పొరపాటున 3. 03 వేసిపోయాడు పోస్ట్ మాన్. ఆ ఫ్లాట్ వాళ్ళు ఊరి నుంచి రాత్రే వచ్చార్ట! నాకు ఇప్పుడిచ్చి వెళ్ళారు అమృతరావొస్తే ఇవ్వమని!" అన్నాడు రంగనాథం వణికే గొంతుతో!
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comments