ఉసురు
- Pulletikurthi Krishna Mohan
- Sep 18
- 6 min read
#KrishnaMohanPulletikurthi, #పుల్లేటికుర్తికృష్ణమోహన్, #ఉసురు, #Vusuru, #TeluguHeartTouchingStories

Vusuru - New Telugu Story Written By - Krishna Mohan Pulletikurthi
Published In manatelugukathalu.com On 18/09/2025
ఉసురు - తెలుగు కథ
రచన: కృష్ణమోహన్ పుల్లేటికుర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
(“రుంజ” అనేది విశ్వబ్రాహ్మణులు వాయించే ఒక మంగళ వాయిద్యం, భూమి మీద మొట్టమొదటి మంగళవాయిద్యంగా నమ్మకం, వారు తప్ప ఇంకెవరూ దానిని వాయించరు. చూపుకు మృదంగం వలే ఉంటుంది, కానీ చాలా పెద్దది. సుమారు మూడడుగుల ఎత్తు, అడుగున్నర వ్యాసంతో ఉంటుంది. ఇత్తడితో చేసినది కాబట్టి దాని బరువు.. వారు మోయలేనంత )
1960
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
నుదుటన విభూది పూసుకుంటూ శివస్తోత్రాన్ని జపిస్తున్నాడు వీరాచారి. మామూలుగా అతని గొంతు వీధంతా వినిపిస్తుంది ఇక శివస్తోత్రం మొదలు పెడితే.. దారిలో వెళ్తున్నవారు ఆగి వినాల్సిందే.
ద్రాక్షారామంలో వీరాచారంటే తెలియనివారు లేరు, ఒక వైపు స్వర్ణకార వృత్తి చేస్తూ ఇంకో వైపు రుంజ వాయిద్య కళాకారుడుగా మంచి పేరు సంపాదించాడు. భయం, భక్తి, చాదస్తం అతని సొంతం. పూర్వీకుల నుండి వస్తున్న కళను కొనసాగిస్తున్నాడు. అతనే కాదు, ఆ ఊరిలో కొంత మంది ఈ వృత్తిని నమ్ముకున్నారు.
ఆరోజు దసరా కావడంతో రుంజ వాయించవలసిందిగా పిఠాపురం సంస్థానం నుండి పిలుపందింది. “పార్వతీ కళ్యాణం”, “వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ”, చెప్పడంలో అతనికి అతనే సాటి.
ఈసారి దసరా ఉత్సవాలకు కుమారుడు శంకరాచారిని కూడా సంస్థానానికి తీసుకు వెళ్దామని అతని ఆలోచన.
“నాన్నా.. ” అన్న పిలుపుతో అటు చూశాడు వీరాచారి.
“బండి సిద్ధంగా ఉంది బయల్దేరండి”
పూజ నుండి రుంజ ను తీసి బయటకు వచ్చాడు.
వీధిలో రెండు ఎడ్లబళ్ళు సిద్ధంగా ఉన్నాయి.
భార్య అలివేలు ఎదురురాగా బయల్దేరాడు.
తన బృందమైన ధర్మారావు అతని కొడుకు నారాయణ, ఒక బండి పై కూర్చున్నారు. రుంజ వాయించేది తనైనా వాళ్ళిద్దరూ సహాయంగా ఉంటారు. శంకరాచారి, నారాయణ, ఒకే వయసు వాళ్ళు మంచి మిత్రులు కూడా.
“బావా ఏంటి ఈసారి అల్లుడిని జమీందార్ గారికి పరిచయం చేస్తావన్నమాట” చనువుగా అడిగాడు ధర్మారావు.
“మరి తప్పదుగా బావా.. నాకెలాగూ వయసు అయిపోతోంది.. అబ్బాయికి పాతికొచ్చింది. ఇక రుంజ బరువు మోయడం నావల్లకాదు. ” ఆవేదనగా చెప్పాడు.
బావతో ఏం మాటాడినా సమస్యే నని ఊరుకున్నాడు ధర్మారావు. రుంజను బండిలోకెక్కించి జాగ్రత్తగా దానిమీద రెండు చేతులు వేసి ఉంచాడు.
బళ్ళు బయల్దేరాయి..
*
శంకరాచారి బండిలో వీరాచారి, నారాయణ బండిలో ధర్మారావు ఉన్నారు, అడ్డత్రోవలో పిఠాపురం బయల్దేరారు. శంకరాచారి బండి నడుపుతున్నాడు కానీ ఆలోచనలతో తల నరాలు తెగిపోతున్నాయి, రుంజ వాయించడం అతనికి అసలు ఇష్టం లేదు.
ప్రస్తుతానికి ఒక వైపు కౌలుకు తీసుకున్న పొలంలో వ్యవసాయం, మరోవైపు స్వర్ణకార వృత్తి, చాలదన్నట్టు రుంజ వాయించడం ఏమిటో? అర్ధం కావడం లేదు, సరికదా తను ఈ విద్యను పూర్తిగా నేర్చుకోలేదు, వద్దంటే నాన్న వినడు.
‘ఇది విశ్వకర్మ ద్వారా వచ్చిన విద్య, మనం తప్ప ఇంకెవరూ చేయడానికి వీలు లేదు, ఇది వృత్తి కాదు మన కుటుంబానికి మంగళకరం’ అంటాడు.
కాలం మారి పోయింది. ఇప్పుడు ఎన్నో రకాల వాయిద్యాలు వచ్చేశాయి, పాతకాలం వాయిద్యాలు అవసరం లేదు.. చాదస్తం కాకపోతే రైలు మీదో బస్సు మీదో వెళ్ళాల్సింది పోయి, ఈ బండి మీద వెళ్ళడం.. ఎప్పటికి చేరుతామో తెలియదు. ఒక్క కుదుపుతో ఈలోకంలోకి వచ్చాడు.
“మనసిక్కడ పెట్టి తోలరా..” గదమాయించాడు వీరాచారి.
తండ్రి కేక తో ఈ లోకంలోకి వచ్చాడు. బండి మెల్లగా వెళ్తోంది.. ఎద్దుల మెడలో గంటలు మోగుతున్నాయి, చుట్టూ పొలాలు. రెండు గంటలు ప్రయాణం చేసిన తరువాత “నాన్నగారు.. కొంచె సేపు విశ్రాంతి తీసుకుందాం” అన్నాడు భయంగా.
“సరే, మంచి నీడ ఉన్నచోట ఆపు” అన్నాడు వీరాచారి.
కొంత దూరం వెళ్ళిన తరువాత మామిడి చెట్టు నీడలో బళ్ళు ఆపారు. అలివేలు కట్టిన ఫలహారం మూట విప్పారు అందులో ఏముందో ఆసక్తిగా చూస్తున్నాడు ధర్మారావు.. దిబ్బ రొట్టెలు, పంచదార పానకం.
“అబ్బా! మా చెల్లమ్మ చేసిన దిబ్బరొట్టెలు భలేగా ఉంటాయ్ బావా” అన్నాడు ధర్మారావు.
శంకరాచారి, నారాయణ కళ్ళతో ఏదో సైగ చేసుకోవడం, వీరాచారి గమనించాడు.
*
విపరీతంగా ఎండ కాస్తోంది, మట్టి రోడ్డు మీద ఎవ్వరూ తిరగడం లేదు, కాకుల అరుపులు తప్ప ఇంకేం వినబడడం లేదు, దూరంగా తాటి చెట్టు మీద ఒక మనిషి తప్ప జనసంచారమే లేదు. ఎండకి అలసిపోవడం వలన నలుగురూ చిన్న కునుకు తీశారు. ఎద్దులు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి. నాల్గవజాము మొదలైందనగా అందరూ నిద్ర లేచారు. ఎంతసేపు పడుకున్నారో వారికే తెలియదు.
ఎడ్లబండి లో ఉండాల్సిన రుంజ లేకపోవడం వీరాచారి గమనించాడు. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. కొంతదూరం నడుచు కొని వెళ్ళి చుట్టుపక్కలా చూశారు. కనిపించలేదు. దీనికంతటికీ కారణం శంకరాచారేనని అతని నమ్మకం.
ఈ పనిలో నారాయణ హస్తం కూడా ఉందని అనుకున్నాడు. కానీ బావమరిది కొడుకు కాబట్టి ఏమీ అనలేడు. ఇందాక తాను నిద్రలో ఉన్నప్పుడో దానిని ఎక్కడో పారేశారని అనుకుంటున్నాడు. ఏం చేయాలో అతనికి అర్ధం కాలేదు.
‘రుంజ లేదు కాబట్టి ఇక పిఠాపురం వెళ్లాల్సిన పనిలేదు’
అనుకున్నాడు శంకరాచారి.
“మరేం ఫర్వాలేదు బావా. కాకినాడలో మా బామ్మర్ది భీమాచారి ఉన్నాడు. వాడి దగ్గర కొత్త రుంజ ఉంది. అడిగితే ఇస్తాడు.. ” ధైర్యం చెప్పాడు ధర్మారావు.
వీరాచారికి నమ్మకం లేదు.. అప్పటి నుండి తండ్రి కొడుకులిద్దరికీ మాటల్లేవు, ఎడ ముఖం పెడ ముఖంగా ఉన్నారు. సాయంత్రం ఎప్పటికో కాకినాడ చేరారు.
*
పిఠాపురం సంస్థానం కోలాహలంగా ఉంది. జనమంతా అక్కడే ఉన్నారు. ఎత్తైన పీఠం మీద, అపర శ్రీకృష్ణ దేవరాయలుగా పేరు పొందిన ‘రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహద్దూర్’ ఆశీనులై ఉన్నారు.
అప్పటి వరకూ సంగీత, నాట్య, కోలాటాలతో, కోలాహలంగా గడిచింది. ఇక వీరాచారి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రుంజ వాయిద్యం వినిపించనిదే అక్కడ దసరా పూర్తి కాదు.
ఇక వీరాచారి రాడనుకున్న సమయానికి,.. వినిపించింది.
రుంజ నాదం..
‘తకదిమ్మ తకదిమ్మి తాండవశ్శివా నాట్యమ్మాడేనే..’ అని తాళం మొదలైంది..
జనాలు మెల్లగా విడిపోయి వీరాచారి చుట్టూ చేరారు.
బహద్దూర్ ముఖం పై చిన్న చిరునవ్వు..
పార్వతీ కళ్యాణం.. జనాలు మంత్ర ముగ్ధులై వింటున్నారు.
రుంజ నుండి వచ్చిన భీకరమైన ధ్వనికి అందరి గుండెలలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. సంస్థానం ఆవరణలో కట్టిన ఆవులు ఆ శబ్దానికి రంకెలు వేయసాగాయి.
వంటశాలలో అటక పై ఇత్తడి సామాన్లలో ప్రకంపనలు. రెండు యోజనాల దూరం వరకూ ఆ శబ్ధం వినిపిస్తూనే ఉంది. శంకరాచారికి కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్టుంది.
తండ్రికి ఇంత ప్రాముఖ్యత ఉందని అర్ధం అయింది. బహదూర్ తో సహా ప్రజలందరూ ఆనందించారు.
ఆ రాత్రి భీమాచారి ఇంటిలో ఆతిధ్యం. అతనికి సంస్థానం నుండి పిలుపొచ్చినా విష జ్వరం వలన వెళ్లలేక పోయాడు.
*
తొలి జాములో తిరుగు ప్రయాణం అయ్యారు. వీరాచారి కోపం కొంచం కూడా తగ్గలేదు. అంతే కాదు, నిన్నఅద్భుతం సృష్టించిన రుంజ, అతనికి పెద్దగా నచ్చ లేదు. దానిలో చిన్న లోపం ఉందన్న సంగతి తనకి మాత్రమే తెలుసు. ఆ లోపం లేక పోతే, నిన్న రుంజ సృష్టించిన ప్రకంపనకు దగ్గరలో ఉండే నిండు గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం అయ్యేది. ఆ లోపాన్ని సవరించి దానిని మెరుగు పెట్టి భీమాచారికి అప్పజెప్పాడు.
దారి పొడవునా వీరాచారి దృష్టి, పోయిన రుంజ కోసం వెతుకుతూనే ఉంది. తిమ్మాపురం గ్రామ పరిసరాల్లో బళ్ళు ఓ ప్రక్కగా ఆపి, ఫలహారం మూట విప్పారు.
దానిలో తనకిష్టమైన తాటిరొట్టె ఉంది. దాని రుచి ముందు తన కోపం చల్లారింది. తిన్న తరువాత గుండెలో ఏదో మంట మొదలైంది.
*
చీకటి పడ్డ తరువాత ఊరిలోకి చేరారు. ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలివేలు అడిగిన ప్రశ్నలకు ముభావంగా ఉన్నాడు.
జరిగిన విషయాన్ని తల్లితో చెప్పాడు శంకరాచారి.
వీరాచారి సంగతి తెలుసు కాబట్టి ఆమె మౌనంగాఉంది. రాత్రి బోజనం అయిన తరువాత, మెల్లగా పెదవి విప్పాడు “మన మాట బయటి పిల్లలు వింటారు గాని మన పిల్లలు వినరు ” జరిగిందంతా వివరించాడు. అంతా విన్నదామె, తప్పెక్కడ జరిగిందో ఆమెకు అర్ధం కాలేదు.
*
తెల్లవారు జామున, శంకరాచారి, నారాణాచారి, రుంజ వెతకడం కోసం నడుచుకొని వెల్లసాగారు. ప్రక్క ఊరు రామలింగాపురం దాటుతుండగా దూరంగా ఎవరో అమ్మాయి పరుగులెత్తుకుంటూ కనిపించింది.
ఆమె ఎందుకు పరిగెత్తుతుందో అర్ధం కాలేదు, ఒక నూతి వైపు వెళ్ళసాగింది. శంకరాచారికి అర్ధం అయింది. వెంటనే ఆమె ను వెంబడిస్తూ పరిగెత్తాడు. పెళ్లి చీరలో కన్పించింది.. పార్వతి.
*
ద్రాక్షారామం ప్రక్క ఊరు రామలింగాపురం, ఆ ఊరికి చెందిన నాగబ్రహ్మం ఆచారి, స్వర్ణకార వృత్తితో పాటూ పౌరోహిత్యం చేస్తూ బాగా స్థిరపడ్డాడు. అతని కూతురు పార్వతి. ఆమె పేరు పార్వతి అయినా లక్ష్మీ కళ ఉట్టి పడుతుంటుంది.
సామర్లకోటకు చెందిన అమృత లింగం, ఆమెను ఒక పెళ్లిలో చూశాడు. అప్పటి నుండి పడుకోవడం మరిచిపోయి ఆమెను ఎలా పెళ్లి చేసుకోవాలో ఆలోచించ సాగాడు. ఒకే కులం అని తెలుసుకొని అదే ఊర్లో ఉన్న సాంబడిని పట్టుకున్నాడు.
మందిమార్బలంతో, లాంఛనాలతో ఒక రోజు నాగబ్రాహ్మం దగ్గర వాలిపోయాడు. కాళ్ళపై పడ్డాడు. ఎదురు కట్నం ఇస్తామన్నాడు, సంబంధం ఎందుకు కాదనాలో తెలియక సరే అన్నాడు. ముహూర్తాలతో సంబంధం లేకుండా దసరా మరునాడు లగ్నం పెట్టమన్నాడు.
నాగబ్రహ్మం అన్నిటికీ ఒప్పుకున్నాడు. కనీసం కూతురు ఇష్టాన్ని కూడా అడగలేదు. ఎందుకంటే.. అమృత లింగం కోట్లకు పడగలెత్తాడు. పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కుమారుడి కాలి మీద బొల్లి మచ్చలు, పార్వతి తల్లి వరాలమ్మ దృషిలో పడి పెద్ద కేక వేసింది. అమృత లింగం ఎందుకు తొందర పెట్టాడో అప్పుడు అర్ధం అయింది. పెళ్లి ఆగింది.. పార్వతి మనసు విరిగి, జరిగిన అవమానం తట్టుకోలేక అక్కడ నుండి పారిపోయింది.
*
వెనక్కి చూడకుండా పార్వతి నూతి వైపు పరిగెత్తి ఒక్క ఉదుటున దూకింది. శంకరాచారి కూడా ఆలోచించకుండా దూకాడు. అతడికి ఈత రాదు.
రామలింగాపురం జనమంతా ఆమె వెనుక పరుగులెట్టారు. నారాయణాచారి, వారి దగ్గర పెద్ద తాడు తీసుకుని నూతి వేశాడు. ఓ నలుగురు తాడు పట్టి లాగగా కొంత సేపటికి అందులో నుండి బయటకు వచ్చారు.. పార్వతీ శంకరులు. తూర్పు నుండి వచ్చే సూర్య కిరణాలతో ఆమె మెడలో మంగళసూత్రం పచ్చగా మెరిసింది.
ముందుగా నారాయణాచారి గ్రహించాడు.. అతడి ఆనందానికి అవధులు లేవు..
ఊరి ప్రజలందరూ జరగబోయే తప్పు, తప్పినందుకు ఎంతో ఆనందించారు. నాగ బ్రహ్మం చాలా సంతోషించి అక్కడే పెళ్లి మంత్రాలు అందుకున్నాడు.
శంకరాచారి నారాయణాచారి చెవిలో ఏదో చెప్పాడు. అతడు వెంటనే నూతిలోకి దిగి పోయిందనుకున్న రుంజను బయటకు తీసుకొచ్చాడు. ఎవరో దొంగలు దాని బరువు మోయలేక ఈడ్చుకొచ్చి దాంట్లో పడ వేసినట్టున్నారు.
***
వీరాచారి ఇంటి ముందు రామలింగాపురం ఊరి వారంతా చేరారు. పార్వతీ శంకరాచారిలను చూసిన వీరాచారి నివ్వెర పోయాడు. ఏది జరగ కూడదనుకున్నాడో అదే జరిగింది. ఉగ్రుడైపోయాడు. ‘పెళ్లికి అంగీకరించను’ అన్నాడు. కారణం ఏమిటని ప్రజలందరూ అడిగారు.
చెప్పసాగాడు “ వీళ్లిద్దరి ప్రేమ విషయం తెలిసి, ఒక సారి నాగబ్రహ్మం ఇంటికి వెళ్ళి పిల్లనడిగితే, నక్షత్రాలు చూసి చెపుతానని చెప్పలేదు. రెండు సార్లు కబురు పంపినా పలకలేదు. ఈలోగా ఇంకో సంబంధం కుదుర్చుకున్నాడు. ” బెట్టుగా అన్నాడు.
“క్షమించండి బావగారు. వీళ్ళ జాతకం అర్ధం కాక రాజమండ్రి సిద్ధాంతి గారి వద్దకు పంపాను. అక్కడ ఆలస్యం అయింది. అందుకే చెప్పలేదు ” అబద్ధం ఆడాడు.
ఇంతలో నారాయణ రుంజ ను తీసుకొచ్చి వీరాచారి ముందుంచాడు. దానిని చూడగానే అతడు చల్లబడ్డాడు. ఆమె పెళ్లి విషయం శంకరాచారికి తెలియకూడదని అతడ్ని సంస్థానానికి తీసుకు వెళ్ళాడు. కానీ విధిని తప్పించలేక పోయాడు.
ఊరి జనం అంతా చేతులెత్తి, అతన్ని మన్నించి కోడలిని లోపలికి తీసుకు వెళ్ళమని ఒప్పించారు.
సమయం కోసం ఎదురు చూస్తున్న అలివేలు హారతి పట్టుకొని కోడలిని లోనకి తీసుకు వెళ్ళింది, ఆమె ఆనందo అంతా ఇంతాకాదు.
*
రోజులూ గడుస్తున్నా కొడుకు మీద కోపం పోలేదు, ఎక్కడో పోయిన రుంజ నూతిలో దొరకడం ఏమిటో, నూతిలో కొడుకు చేతికి తాళి ఎక్కడ నుండి వచ్చిందో తెలియలేదు.
తడిసి పోయిన రుంజను చూసి చాలా బాధ పడ్డాడు. దానికి ఈడ్చడం వలన బాగా గీతలు లొట్టలు ఉన్నాయి. తరువాత మంచి చర్మం సంపాదించి దానిని చక్కగా తయారు చేశాడు. ఇత్తడిని నగిషీ పట్టి పుత్తడిగా చేశాడు.
శంకరాచారి తండ్రి తో దూరాన్ని భరించలేక పోతున్నాడు. వాడి బాధ చూడలేక ఒకరోజు నారాయణాచారి మావయ్య దగ్గరకొచ్చి.. జరిగిన విషయం చెప్పసాగాడు.
“మామయ్యా.. ఆరోజు పిఠాపురం వెళ్తున్న దారిలో బండి ఆపాం కదా.. అక్కడ కొంత దూరంలో తాటి చెట్టు కింద మేమిద్దరం కల్లు తాగాం. వాడు వద్దన్నా నేనే బలవంత పెట్టి వాడి చేత తాగించాను. వాడి తప్పేమీ లేదు. మేము వచ్చే సరికే రుంజ లేదు, ఎవరు తీశారో మాకు తెలియదు ” భయపడుతూ అక్కడ నుండి పారిపోయాడు.
*
పిఠాపురం సంస్థానం నుండి వర్తమానం వచ్చింది. దాని సారాంశం వీరాచారి ప్రతిభకు మెచ్చి ఎకరం భూమిని ఇనాంగా ఇచ్చారు. “నా కొడుకు ఇక కౌలుకి తీసుకోవలసిన అవసరం లేదు” ఆనంద భాష్పాలు రాల్చాడు వీరాచారి. తండ్రి కాళ్ళపై పడ్డాడు శంకరాచారి
*
చిన్న చినుకులు ప్రారంభమైనాయి, పార్వతి ప్రసవ సమయం దగ్గర పడింది, ఇక రాత్రి ప్రసవం అనగా మంత్రసాని మరిడమ్మ చేతులెత్తేసింది. ‘ఈ ప్రసవం కష్టం నా వల్లకాదు, ఇంకెవరికైనా చూపించండి’ అoది.
అత్తవారింట శంకరాచారి ఉన్నాడు, అతడి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. చినుకులు పడుతూనే ఉన్నాయి. మామా అల్లుడు బామ్మర్ది సాంబడు ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతున్నారు.
చీకట్లో దూరంగా రుంజను మోయలేక మోయలేక మోసుకొస్తున్నాడు వీరాచారి.
ఇంటి ముందు చావిట్లో రుంజతో.. మొదలైంది వాయిద్యం,
మెల్లగా మొదలై ఉధృతంగా వాయించ సాగాడు. భీకరమైన ధ్వనికి ఊరంతా చేరారు, వారు ఆధ్యాత్మికమైన ఆనందంలో ఓలాలాడుతున్నారు.
అతని నోట కుమార సంభవం పద్యాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రకంపనల దాటికి పార్వతి నొప్పులు ప్రారంభమైయ్యాయి. ఏదో అద్భుతం జరగబోతోందని నాగ బ్రహ్మం అనుకున్నాడు. బిడ్డ అరుపులకు లోనకు వెళ్లారు మామ అల్లుళ్ళు. ‘ఆడ బిడ్డ..’ అని పెద్ద కేక వేసింది మంత్రసాని. తండ్రి తో విషయం చెపుదామని బయటకు వచ్చాడు.
అప్పటికే ఆనందంగా రుంజ పై తల వాల్చి కన్ను మూశాడు వీరాచారి.
******
కృష్ణమోహన్ పుల్లేటికుర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పుల్లేటికుర్తి కృష్ణ మోహన్,M.A.PGDCA., జర్నలిస్ట్ మరియు రచయిత, శ్రీకాకుళం
@pulletikurtikrishnamohan1531
• 6 hours ago
రుంజ వాయిద్యం మీద కధ వ్రాయడం, నా అదృష్టం గా భావిస్తున్నాను చదివి ప్రోత్సహించవలసిందిగా మనవి