మాస్టరు గారి అబ్బాయి
- Srinivasarao Jeedigunta
- Sep 18
- 5 min read
#MastaruGariAbbayi, #మాస్టరుగారిఅబ్బాయి, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Mastaru Gari Abbayi - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 18/09/2025
మాస్టరు గారి అబ్బాయి - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సైకిల్ తొక్కుతో వస్తున్న సత్యం మాస్టర్ గారిని చూసి లోపలికి పరుగేత్తడు చౌదరి గారి అబ్బాయి రమేష్. రైతులతో మాట్లాడుతున్న చౌదరి గారు యింటి ముందు ఆగిన మాస్టర్ గారి సైకిల్ చూసి వినయంగా లేచి ఎదురు వెళ్లి “నమస్కారం మాస్టర్, విన్నాను కలరాతో స్కూల్లో కుర్రాడు చనిపోయాడు అని, చాలా విచారకరం. గవర్నమెంట్ వారికి ఉత్తరం రాసాను. వెంటనే టీకాలు, డాక్టర్ ని పంపించమని” అన్నాడు మాస్టర్ గారికి కుర్చీ చూపించి చౌదరిగారు.
చౌదరిగారి మాటలకి సత్యం మాస్టర్ నవ్వుతూ “అయితే మీ అబ్బాయి స్కూల్ ఎగకొట్టడానికి మళ్ళీ మీకు కథ చెప్పాడు అన్నమాట. కలరా లేదు చనిపోవడం లేదు, మీ వాడు స్కూల్ కి ఎందుకు రాలేదా అని తెలుసుకుని నాతో తీసుకుని వెళదాం అని వచ్చాను. ”
“అరేయ్ రమేష్! ఇక్కడికి రా, మీ సార్ వచ్చారు” అని కొడుకుని పిలుచుకుని “ఎందుకు స్కూల్ కి వెళ్ళలేదు” అని అడిగాడు.
“నాకు చదువుకోవాలి అని లేదు. ఎమ్మెల్యే అవుతాను” అంటున్న కొడుకుని చూసి “పిచ్చ వేషాలు మానేసి బాగా చదువుకుని ఉద్యోగం చేసుకో. అప్పుడు మన యింట్లో ఉద్యోగం చేసే మొదటి వాడివి నువ్వే” అన్నాడు చౌదరి గారు.
మాస్టర్ కలిపించుకుని “అలాగే ఎమ్మెల్యేవి అవుదువు గాని, ముందు దానికి కూడా చదువుకుంటే మినిస్టర్ కూడా అవ్వగలవు. పదా పుస్తకాల సంచి తీసుకుని రా వెళ్దాం” అన్నారు.
“ఎందుకు సార్ మా అబ్బాయి అంటే అంత శ్రద్ద మీకు, ఇంటికి వచ్చి మరీ స్కూలుకి తీసుకుని వెళ్తున్నారు” అని అడిగాడు చౌదరి గారు.
“బాగా చదివే పిల్లలు అంటే నాకు బాగా యిష్టం. వాళ్ళని సరైన దారిలో పెడితే రేపు దేశానికి పనికి వస్తారు, అందుకే నేను శ్రమ అనుకోకుండా వాళ్ళని స్కూలుకి వచ్చేలా చూస్తాను” అంటూ రమేష్ ని సైకిల్ మీద ఎక్కించుకుని బయలుదేరారు.
“ఏమిటో ఈ సార్ పద్ధతి, పిల్లాడికి ట్యూషన్ కూడా చెప్తున్నారు కదా అని నాలుగు బస్తాలా బియ్యం పంపితే తిరిగి పంపించేసాడు, మీ పిల్లాడు వృద్ధిలోకి వస్తే అదే నాకు పదివేలు అని. ”
***
మొత్తానికి మాస్టర్ గారి కొడుకు శంకర్, చౌదరి గారి అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు. మాస్టర్ గారికి వేరే ఊరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. దానితో కుటుంబం తో సహా వెళ్లిపోయారు.
వెళ్ళేటప్పుడు రమేష్ ని పిలిచి “జీవితం లో చదువు ముఖ్యం. నువ్వు చదువు మానకుండా వుంటావు అని అనుకుంటాను” అన్నారు.
“మీ మాట తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను మాస్టర్ గారు, మీ అబ్బాయి ని కూడా బాగా చదివించండి, అవసరం అయితే నాన్నగారి సహాయం తీసుకోండి” అన్నాడు. తన స్నేహితుడు శంకర్ కి కూడా వీడ్కోలు చెప్పాడు.
రమేష్ గుంటూరు లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, “చదవడం, రాయడం వచ్చింది, ఇహ నేను రాజకీయాల్లో చేరి మీకు సహాయంగా వుంటాను” అన్నాడు తండ్రితో.
చౌదరి గారు కూడా తనకి వయసు మీద పడుతోంది సరేలే అని కొడుకుని తను పనిచేస్తున్న పార్టీ లో చేరిపించాడు. సహజంగా రక్తంలో రాజకీయం అలవాటు ఉండటం తో దూసుకుపోతున్నాడు. పై అధినాయకత్వం యితని సేవలు గుర్తించింది.
మాస్టర్ గారి అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్ష లో సెక్రెరియట్ లో గుమస్తా గా చేరాడు. డబ్బులు లేక పై చదువులు చదవలేక పోయాడు గాని, మంచి తెలివితేటలు కలవాడు. ఏ సమస్య అయినా యిట్టే రూల్ చెప్పి సరైన నోట్ ఫైల్ తయారుచేసి పై ఆఫీసర్స్ కి పంపించేవాడు.
యితని పైన వెంకట్రావు అనే అసిస్టెంట్ సెక్రటరీ వుండేవాడు. అదృష్టం బాగుండి ఆ పదవిలోకి వెళ్ళాడు. మాస్టర్ గారి అబ్బాయి శంకర్ పెట్టిన నోట్ అర్ధం చేసుకోవడం వెంకట్రావు కి కష్టంగా ఉండేది. అందుకే శంకర్ ని పిలిచి “ఏమిటయ్యా నువ్వు పెట్టే నోట్, ఇదేమి రామాయణం అనుకున్నావా, సింపుల్ గా రాయచ్చు కదా” అని అవమాన పరిచేవాడు.
ఒకరోజున అర్జెంటు ఫైల్ తీసుకుని శంకర్ అసిస్టెంట్ సెక్రటరీ గదికి వెళ్ళి “సార్ అర్జెంటు ఫైల్.. తమరు తీసుకొని రమ్మన్నారుగా” అంటూ టేబుల్ మీద పెట్టాడు. వెంకట్రావు రివ్వున లేచి “అర్జెంటు అని నువ్వు నాకు గుర్తు చేస్తావా” అంటూ ఫైల్ తీసుకుని నాలుగో ఫ్లోర్ కిటికీ నుంచి కిందకి పడేసి “యిప్పుడు వెళ్ళి తీసుకొని రా” అన్నాడు కోపంగా.
శంకర్ వెంటనే టేబుల్ మీద వున్న వైట్ పేపర్ మీద తన రాజీనామా రాసి ఆయన దగ్గర పడేసి “నేను ఉద్యోగం మానేసాను. నీలాంటి మూర్ఖుడి దగ్గర ఉద్యోగం చెయ్యడం కంటే అడుక్కోవడం మేలు, నువ్వే కిందకి వెళ్ళి ఫైల్ తెచ్చుకో, ఆ ఫైల్ ముఖ్యమంత్రి వరకు వెళ్ళాలి నీ యిష్టం” అని బయటకు వచ్చేసాడు.
జరిగిన విషయం భార్య కి చెప్పాడు శంకర్. “మంచి వాడైనా, చెడ్డవాడైనా అధికారి అధికారే, మనమే సద్దుకోవాలి. జీతం లేకుండా సంసారం ఎలా” అంది శంకర్ భార్య.
“కంగారు పడకు, నేను ఐఏఎస్ కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తాను. వాడిని మించిన అధికారం సంపాదించి, అటువంటి వాళ్లకు బుద్ది చెప్పాలి. నువ్వు మీ పుట్టింట్లో కొన్నాళ్ళు వుండు, ఒక పదిరోజులలో మనకు గవర్నమెంట్ నుంచి రావలిసిన డబ్బులు వస్తాయి. కొంత డబ్బు నీతో తీసుకుని వెళ్ళు, నేను తెలివితేటలూ లేక గుమస్తా ఉద్యోగం లో చేరలేదు, మా నాన్నగారికి స్థోమత లేక పై చదువులు చదవలేదు, నువ్వు నన్ను ఐఏఎస్ ఆఫీసర్ గా త్వరలో చూస్తావు” అన్నాడు భార్యతో.
చౌదరి గారు పోవడంతో, రమేష్ పూర్తిగా పాలిటిక్స్ లో ఉండిపోయి ఆ తరువాత వచ్చిన ఎలక్షన్ లో నిలబడి ఎమ్మెల్యే గా గెలిచాడు. మకాం హైదరాబాద్ కి మార్చి, పెద్ద నాయకులకి అనుకూలంగా వుండి మంచి పేరు తెచ్చుకున్నాడు. అధినాయకత్వం కూడా రమేష్ ని గుర్తించటం తో రమేష్ చుట్టూ కొంతమంది ఎమ్మెల్యే లు చేరి రమేష్ నాయకత్వం లో పనిచేయడం మొదలుపెట్టారు.
సహజంగా మాస్టర్ గారి అబ్బాయి అవ్వడంతో శంకర్ మొదటి సారే ఐఏఎస్ ఎగ్జామ్స్ మంచి ర్యాంక్ తో పాస్ అయ్యాడు. అతనికి హైదరాబాద్ లో తను పనిచేసిన సెక్రటేరియట్ లోనే డిప్యూటీ సెక్రటరీ గా జాయిన్ అయ్యాడు.
ఒకరోజున తనని అవమానం చేసిన అసిస్టెంట్ సెక్రటరీ వెంకట్రావు ని పిలిపించాడు, అతను లోపలికి వస్తో శంకర్ ని చూసి ఆశ్చర్యం తో నోట మాట రాకుండా వుండిపోయాడు.
“వెంకట్రావు గారు.. నేను గుమస్తా గా వున్నప్పుడు మీ తెలివితేటలు ఎలా వున్నాయో యిప్పుడు కూడా అలాగే వున్నాయి. మీ క్లర్క్ రాసిన నోట్ మీరు రాసినడానికంటే వందరెట్లు బాగుంది. యిప్పుడు ఈ ఫైల్ ని యిక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి విసిరేస్తాను. వెళ్లి తీసుకుని నోట్ కరెక్టుగా రాసుకుని రండి” అంటూ కిటికి దగ్గరికి నడిచి వెళ్లి నవ్వుతు తిరిగి వచ్చి “అలా కూర్చోండి వెంకట్రావు గారు. ప్రతీ ఉద్యోగికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు మన క్రింద పనిచేస్తున్నారు కదా అని మన అధికారం చూపిస్తే ఏదో ఒకరోజు మనం కూడా ఘోరంగా అవమానింపబడతాము.
క్రింద ఉద్యోగులని గౌరవించండి, వాళ్ళని మెచ్చుకోకపోయినా అవమానం చెయ్యకండి. మీరు ఆనాడు నన్ను అవమానం చెయ్యడం తో పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యాను, అందరూ ఆలా కాలేరు కదా. వాళ్ళ మనసు బాధపడితే మనకి మంచిది కాదు, మీరు నన్ను చూసినప్పుడల్లా పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి కనుక మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను, మీకు ఏ అవసరం వచ్చినా నన్ను కలవవచ్చు” అని పంపించేసాడు శంకర్ ఐఏఎస్.
కొన్నాళ్ళకు శంకర్ డెప్యూటేషన్ మీద ప్రధాన మంత్రి కార్యాలయం లో పని చెయ్యడానికి వెళ్ళిపోయాడు. అక్కడే సెక్రటరీ గా ప్రమోషన్ వచ్చింది. ఒకరోజు ప్రధాన మంత్రి గారి సెక్రటరీ శంకర్ కి చెప్పాడు ‘మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తమ రాష్ట్రము కి పంపమని అడిగారు, త్వరలో మీరు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలిసి రావచ్చు’ అని. అన్నట్టుగానే మూడు నెలలో హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ముఖ్య ప్రధాన సెక్రటరీ ని కలిసి తన జాయినింగ్ రిపోర్ట్ యిచ్చాడు.
ఆయన అది తీసుకుని “మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి” అనడంతో ముఖ్యమంత్రి గారి అప్పోయింట్మెంట్ తీసుకుని ఆయనని కలవడానికి వెళ్ళాడు. తలుపు తీసుకుని లోపలికి వస్తున్న శంకర్ ని చూసి సంతోషం గా “రారా శంకర్” అని ముఖ్యమంత్రి పిలవడంతో అక్కడ వున్న మంత్రులు ఆశ్చర్యంతో శంకర్ వంక చూస్తో ఉండిపోయారు.
వాళ్ళని చూసి ముఖ్యమంత్రి “ఇతను మా మాస్టర్ గారి అబ్బాయి. నేను స్కూల్ కి వెళ్లకపోతే మా మాస్టర్ ఇంటికి వచ్చి మరీ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇతను పట్టుదలతో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. నాకు ముఖ్య స్నేహితుడు” అని చెప్పి వాళ్ళని పంపించేసి, శంకర్ తో వేరే గదిలో కూర్చొని చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు.
“నువ్వు ప్రధాన మంత్రి ఆఫీస్ లో వున్నావు అని తెలిసి నీలాంటి వాడి సేవలు మనం పుట్టి పెరిగిన మన స్టేట్ కి కావాలి అని పిలిపించాను. అంతే కాదు. నేను యిప్పుడు ఈ స్టేజ్ లో ఉండటానికి మీ నాన్నగారు జీవితం లో ఎలా ఉండాలో నేర్పించటమే. నువ్వు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ప్రధాన సెక్రటరీ గా వుండి నాకు మంచి పేరు తెస్తావు అని ఆశ. ”
ఇంటికి వచ్చి భార్యకి చెప్పాడు ముఖ్యమంత్రి మా నాన్నగారి శిష్యుడు, నాకు స్నేహితుడు అని.
“ఏదైనా పట్టుదల, కృషి వుంటే సాధించలేనిది ఏమి వుండదు, ఎక్కడ పల్లెటూరు చదువులు, యిప్పుడు నా స్నేహితుడు ముఖ్యమంత్రి. నేను ఐఏఎస్ ఆఫీసర్ ని” అన్నాడు ఆనందంగా.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


@t.s.sbhargavateja6196
•22 hours ago
Super story srinivas rao garu🎉