top of page
Original.png

అత్తగారి హాస్యం

#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు, #LVJaya, #LVజయ, #AtthagariHasyams, #అత్తగారిహాస్యం

ree

Atthagari Hasyam - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 17/09/2025 

అత్తగారి హాస్యం - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 15)

రచన: L. V. జయ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

సమర్థ్ తో పెళ్ళి తరువాత అత్తగారింట్లో అడుగుపెట్టింది జాగృతి. మొదటిరోజు, కొత్తదంపతుల చేత సత్యనారాయణవ్రతం చేయిస్తున్నామంటూ బంధువుల్ని, చుట్టుపక్కలవారందరిని పిలిచారు సమర్థ్ తల్లితండ్రులు రాధ, మాణిక్యాలరావు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. 


ఉదయాన్నే మొదలుపెట్టిన వ్రతం పూర్తయ్యేటప్పటికీ, మధ్యాహ్నం మూడు దాటింది. భోజనాలు ఎప్పుడు పెడతారా అని అందరు ఎదురుచూస్తున్నారు. ఆకులు వేసి, వండిన పదార్థాలని వడ్డించేలోపే, ఆకలికి ఆగలేకపోయిన పిల్లలు వచ్చి కూర్చున్నారు. వడ్డనలు పూర్తయ్యి, తినడం మొదలుపెడదామని అందరూ అనుకుంటున్న సమయానికి, మాణిక్యాలరావు తమ్ముడు శివరామ్ వచ్చి, "భోజనకాలే భగవత్ ప్రార్ధన అంటారు. పిల్లలెవరైనా ఒక శ్లోకం చెప్పేస్తే, అందరం తినడం మొదలుపెట్టచ్చు. " అన్నాడు. ఆకలితోనున్న పిల్లలు శివరాం మాటని పట్టించుకోకుండా తినడం మొదలుపెట్టారు. 


అది చూసిన రాధ, "తెలుగుమాస్టారుకి ఎంత గౌరవముందో కనపడుతోంది. మనవాళ్ళే నీ మాట వినకపోతే, ఇక స్కూల్ లో పిల్లల సంగతేంటో? అక్కడా కూడా నీకొచ్చే గౌరవం ఇంతేనా?" అంది శివరామ్ ని వెక్కిరిస్తూ. 


'మరిదిన్న గౌరవం కూడా లేకుండా, అందరిముందూ శివరాం ని, రాధ వెక్కిరించటం, అందరూ చూసి నవ్వటం, తట్టుకోలేకపోయింది ఆయన భార్య అన్నపూర్ణ. "పిల్లలు తింటున్నారు కదా. వాళ్ళు చెప్పకపోతేనేం, నేను చెప్తాను. " అని, అన్నపూర్ణ స్తోత్రం చెప్పడం మొదలుపెట్టింది. 


మధ్యలోనే చప్పట్లుకొట్టింది రాధ. "నీ భర్త పరువుని నిలబెట్టడానికి బాగానే ప్రయత్నించావుగానీ, నీ పేరుని కూడా నిలబెట్టుకో. అన్నపూర్ణవి కదా, ఇక స్తోత్రాన్ని ఆపి, తినే అదృష్టాన్ని అందరికీ ప్రసాదించు. " అంది విసుగ్గా. ఈ సారి అన్నపూర్ణని చూసి నవ్వారందరూ. 'రాధ గురించి తెలిసి కూడా, అనవసరంగా ఆవిడ నోట్లో నోరు పెట్టానని' అనుకుంది అన్నపూర్ణ. 


అందరూ భోజనాలు చెయ్యడం మొదలుపెట్టాక, రాధ, మాణిక్యాలరావు అన్న ఆనందరావు దగ్గరికి వెళ్ళి, "బావగారు. మీకు అన్నీ సరిగ్గా కనపడుతున్నాయోలేదో? కొంచెం చూసుకుని తినండి. " అంది నవ్వుతూ. 


"మా ఆయనకి సరిగ్గా కనపడకపోవడమేమిటి? ఆయకేమి చూపు మందగించలేదు. " అంది ఆనందరావు పక్కనే ఉన్న ఆయన భార్య సావిత్రి. 


"అక్కా, నీకీ విషయం తెలియదన్నమాట అయితే. బావగారు ఒకసారి ఎవరికీ చెప్పకుండా, సెకండ్ షోకి వెళ్లారుట. దొంగతనంగా ఇంట్లోకొచ్చి, వంటింట్లో అన్నం తింటుంటే, చారుగిన్నెలోంచి మిరపకాయ పాక్కుని బయటొచ్చినట్టు కనపడిందిట. తీరా చూస్తే, అది బొద్దింక. ఇప్పుడు చెప్పు. బావగారికి నిజంగానే కళ్ళు సరిగ్గా కనపడతాయా?" అని గట్టిగా నవ్వింది రాధ. రాధ మాటలకి చుట్టాలందరూ నవ్వుతుంటే, సావిత్రి మొహం మాడిపోయింది. 


"రాత్రిపూట చీకట్లో కళ్ళు సరిగ్గా కనపడకపోతే, చిన్నప్పటినుండే చూపు మందగించిందంటావా?" అంది సావిత్రి కోపంగా. రాధ గురించి పూర్తిగా తెలిసిన ఆనందరావు, సావిత్రిని ఊరుకోమని సౌంజ్ఞ చేసాడు. 


అందరి భోజనాలు అయ్యాక, "పెళ్ళి హడావిడిలో మనమెవ్వరం సరిగ్గా ఫోటోలు తీయించుకోలేకపోయాం. ఇప్పుడు అందరూ తీయించుకుందాం రండి. ఫోటోగ్రాఫర్ ని పిలుస్తాను. నాకు అస్సలు సరైన ఫోటోలు లేవు. " అంది రాధ. 


"ఇప్పుడే కదా కడుపునిండా తిని, కిళ్ళీలు వేసుకున్నాం. పెదవులు ఎరుపెక్కి, పొట్టలు పైకొచ్చున్నాయి. ఇప్పుడు ఫొటోలేమిటి? హాయిగా కాసేపు పడుకోవాలనుంది. " అన్నాడు మాణిక్యాలరావు. 


"ఆడవాళ్ళ పెదవులు ఎరుపెక్కినా పర్వాలేదుగాని, పొట్టలు పైకొస్తేనే బాగుండదు. ఇంత వయసొచ్చినా ఇవేం పనులు అనుకుంటారు మిమ్మల్ని చూసి. " అంది రాధ అదోరకంగా నవ్వుతూ. 


"అయినా నువ్వెలా పడినా పర్వాలేదు కానీ, నేను అందంగా, సన్నగా కనపడాలి ఫొటోల్లో. " అంది తనని తాను చూసుకుంటూ. 


"వయసు నాకుమాత్రమే వచ్చింది. ఈవిడకి రాలేనట్టుంది. ఎంత వయసొచ్చినా, అందగత్తెననే అనుకుంటుంది. " అనుకున్నాడు మాణిక్యాలరావు, రాధకి వినపడకుండా. పక్కనే ఉన్న శివరాంకి, ఆనందరావుకి, మాణిక్యాలరావు అన్న మాటలు వినపడి నవ్వుకున్నారు. 


శివరాం వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ, "వదినా, మీరు అందంగా, సన్నగా కనపడడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు ఎప్పుడూ చెయ్యని ఒక పని చేస్తే చాలు. " అన్నాడు. 


"ఏమిటో చెప్పు" ఆతృతగా అడిగింది రాధ. 


"ఏమి లేదు. ప్రతీదానికి, అన్నని వెనక్కి తోసి, మీరే ముందుంటారు కదా. ఈసారి కనీసం ఫోటోల కోసమైనా, అన్నని ముందుంచి, మీరు అన్న వెనక నిలబడండి. అప్పుడు సన్నగా, అందంగా కనపడతారు. " అన్నాడు రాధకి సలహా ఇస్తున్నట్టు. 


ఆనందరావు కూడా, ఇదే సమయం అనుకుని, "అవునమ్మా. మా వాడిని ముందుంచి, నువ్వు ఒక్కసారి వాడి వెనక నించో. మాకు కూడా చూడడానికి బాగుంటుంది. పాపం ఎప్పుడూ వాడిని నీ వెనకే చూసాం. " అన్నాడు నవ్వుతూ. 


మాణిక్యాలరావుకి, రాధ ఏ మాత్రం గౌరవమివ్వదని తెలిసిన బంధువులందరూ రాధని చూసి నవ్వారు. భోజనాలప్పుడు జరిగిన అవమానానికి, శివరామ్, ఆనందరావులిద్దరూ ప్రతీకారం తీర్చుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ అర్ధమయ్యింది. రాధ మాత్రం ఇదేమి పట్టించుకోనట్టు, ఫొటోగ్రాఫర్ ని పిలిచింది. 


జంటలందరినీ వరసగా మెట్లమీద నించోబెట్టి, కెమెరావైపు నవ్వుతూ చూడమన్నాడు ఫోటోగ్రాఫర్. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఫోటో సరిగ్గా రాకపోయేటప్పటికీ, పైవరసలోనున్న జంటని, కెమెరావైపు సరిగ్గా చూడమని చెప్పాడు. 


"ఆ పైవరసలోనున్నవాళ్ళు నీవైపు చూడనట్టుంటారు. కానీ, నీ వైపే చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ మెల్లకళ్ళు. ఫోటో సరిగ్గా రాదుకానీ, నీ పని నువ్వు చెయ్యి. " అంది రాధ, ఫొటోగ్రాఫర్ తో. 


పై వరసలోనున్న రాధ ఆడపడుచు మీనాక్షి, మీనాక్షి భర్త సుందరరావు మొహాలుమాడిపోయాయి. "అందరిముందూ ఈ విషయం చెప్పాలా వదినా?" అంది మీనాక్షి కోపంగా. 


"ఉన్న విషయమే కదా చెప్పాను. మీరిద్దరూ ఎవరిని చూస్తారో ఎవరికీ తెలియదుమరి. పాపం ఫోటోగ్రాఫర్ కి మాత్రం ఎలా తెలుస్తుంది. " అంది రాధ. 


రాధ మాటలకి మీనాక్షికి ఒళ్ళుమండింది. "నువ్వు కూడా నవ్వుతూ కెమెరా వైపు చూడకు వదినా. ఫోటో సరిగ్గా రాదు. పాపం. కింద వరసలో నాలుగు పళ్ళు మాత్రమే మిగిలాయి కదా మరి నీకు. " అంది కోపంగా. 


మీనాక్షి అలా అంటుందని రాధ ఊహించలేదు. అందరూ తనని చూసి నవ్వుతుంటే, రాధ తలదించుకుంది. 



"హాస్యంగా అంటే ఎందుకలా అయిపోతున్నావ్ మీనాక్షి, సరదాగా తీసుకోవచ్చు కదా. " అంది. 


"నేను సరదాగానే తీసుకుంటున్నాను వదినా. నువ్వు కూడా తీసుకో. తల దించుకోకు. జుట్టుకి పూర్తిగా రంగువేసుకోలేదు కదా నువ్వు. నీ ముసలితనం అంతా కనపడిపోతోంది. " అంది మీనాక్షి రాధ మీద కక్ష తీర్చుకుంటున్నట్టు. ఈ సారి రాధ మొహం మాడిపోయింది. 


'ఇంటికి పిలిచి, అందరిముందూ సొంతవాళ్ళ పరువు తీసింది రాధ. తొమ్మిదో క్లాస్ పాసయ్యిన ఈవిడ, తెలుగుపండితుడైన మరిదిని అంది. బావగారన్న గౌరవం లేకుండా, ఆయన చూపు మందగించిందంది!! ఈవిడేదో చాలా అందంగా ఉన్నట్టు, ఇంటి ఆడపడుచుని, ఆవిడ భర్తని వెక్కిరించింది. భర్త గురించి కూడా పిచ్చి మాటలు మాట్లాడింది. ఏం మనిషో? ఈవిడ సరైన బుద్ధి చెప్పారందరూ' అనుకున్నారు చుట్టాలందరూ. 


'ఎవరినీ వదలని ఈవిడ నన్నెంత అంటుందో? ఈవిడతో నేనెంతపడాలో? సరదా పేరుతో, అందరినీ వెక్కరిస్తూ మాట్లాడే రాధలాంటివాళ్లది హాస్యమా? వెటకారమా?' అనుకుంది జాగృతి. 


***

L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు



Comments


bottom of page