సావిత్రి
- Achanta Gopala Krishna
- Sep 17
- 5 min read
#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #సావిత్రి, #Savithri, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

సావిత్రి / కల వర మాయే రా..
Savithri - New Telugu Story Written By Achanta Gopala Krishna
Published In manatelugukathalu.com On 17/09/2025
సావిత్రి - తెలుగు కథ
రచన: ఆచంట గోపాలకృష్ణ
సావిత్రి / కల వర మాయే రా..
“ఒసేయ్ సావిత్రి.. ఎంతసేపు అలా సింగారించు కుంటూ ఉంటావ్, రా ఆలస్యం అవుతోంది” అన్నది వాళ్ళ అమ్మ, గుడికి పూల సజ్జ పట్టుకుని.
“ఇదిగో వస్తున్న..” అని అరిచింది.. సావిత్రి.
“దాని సంగతి తెలుసుగా.. దానితో పెట్టుకుంటే పనులు అయినట్లే..” అన్నారు నవ్వుతూ నరేష్..
“ఇదిగో వచ్చేసా..” అంటూ పరిగెత్తుకుని వచ్చింది సావిత్రి.
ఒక్కగానొక్క కూతురు గారాల పట్టి.. కొంచెమ్ అందం పిచ్చి.. ఎక్కువ సేపు అద్దం ముందే నిలబడి ఉంటుంది..
“ఎంత సేపు.. ఆ కాస్త పిలక దువ్వుకోవడానికి.. ఈపాటికి గుడి కి టైం అయిపోతోంది..” అంది లక్ష్మీ..
“నీకు కావాలంటే ఒక్కదానివే వెళ్ళు.. నా కూతురి ని ఏమైన అన్నావంటే ఊర్కోను..” అన్నాడు నరేష్..
“అలాగే గారం చేయండి.. ఆడపిల్ల అన్నాక వంట వార్పు, దేముడు భక్తి నేర్పించక పోతే ఎలా..”
“అన్ని నాకు తెలుసు..” అంది సావిత్రి.. గడుసుగా..
“తెలుసు టే పాపం” అన్నాడు నరేష్ సపోర్ట్ గా.
“ఆ ఆ ఇప్పుడు మీ సాక్ష్యం కావాలి మరి” అంటూ.. “సరేలే నడు ఇప్పటికే ఆలస్యం అయింది” అంటూ తొందర పెట్టింది..
“నాన్నా వెళ్లొస్తాం” అంది సావిత్రి..
“జాగ్రత్తగా వెళ్ళిరండి.. కొంచెం నా తరపున కూడా దేముడికి మొక్కండి” అన్నాడు నరేష్..
“చెప్పండి ఆ కోరిక ఏమిటో.. అడుగుతాను” అంది.. లక్ష్మి.. వెటకారంగా..
“నాకేమి కోరిక ఉంటుంది.. ఇదిగో.. దీన్ని ఇచ్చాడుగా. ఇంక నాకోసం ఏమి అడగను..”
“మరి ఎవరికోసం” అంది లక్ష్మీ..
“ఇంకెవరి కోసం నా బంగారు తల్లి కోసం.. అదేం కోరుకుంటే అదే నాకొరిక. అదే ఇవ్వమని నా తరపున అడుగు” అన్నాడు తన కూతురిని మురిపెంగా చూస్తూ..
“మా మంచి నాన్న.. అందుకే నేను నాన్న కూతురిని” అంది మెడ చుట్టూ చేయి వేసి.. గడుసుగా అమ్మ వేపు కి చూస్తూ..
“సరే అలాగే కానివ్వండి.. ఏమీ చేస్తాం.. మీరిద్దరూ ఒక పార్టీయేగా ఎప్పుడూ.. నేనే పరాయిదాన్ని..” అంటూ బయలుదేరింది.. నవ్వుతూ..
“అదేం లేదులే అమ్మా.. నువ్వు కూడా చాలా ఇష్టం.. కానీ నాన్న అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అంతే..” అంది సావిత్రి..
“ఇప్పడు ని జాలి ఎవరికి అక్కరలేదు కానీ, ముందు నడు.. ఆలస్యం అవుతోంది.. నేను మీ అమ్మ నే. ఆ మాత్రం అర్ధం చేసుకోలేనా.. ఏదో సరదాకు అన్నాను అంతేనే తల్లీ..”
“అమ్మా, ఇది చాలా ఫెమస్ గుడి కదా, స్వామీజీ లు ఎవరూ ఎందుకు కనబడరు ఎప్పుడూ..” అంది..
“ఏమి వాళ్ళ దగ్గర కూడా ఏదైనా తాయెత్తులు, మూలికలు కావాలా అందానికి” అంది.. లక్ష్మీ నడుస్తూ..
“కాదు. నా జుట్టు పెరగటానికి ఏదైనా ఇస్తారేమో నని.. వాళ్లకి బొలెడు అంత జుట్టులు ఉంటాయి కదా.. ఏమి రాసుకుంటారో..” అంది సావిత్రి..
“పిచ్చి వాగుడు కట్టి పెట్టి రా, పూజారి గారు వెళ్ళిపోతారు..” అంది లక్ష్మీ..
లోపలికి వెళ్ళగానే పూజారి రామయ్య శాస్త్రి.. నవ్వుతూ పలకరించారు..
“రా అమ్మ లక్ష్మీ.. నరేష్ గారు రాలేదా” అని అంటూ పూలు, కొబ్బరికాయ ఉన్న సజ్జ తీసుకుని.. “పూజ ఎవరి పేరు మీద” అని అడిగారు..
“సావిత్రి పేరు మీదనే అండీ..” అంది లక్ష్మీ..
అలాగే అంటూ స్తోత్రం చదువుతూ.. స్వామి వారి పూజ చేసి.. ప్రసాదం ఇచ్చారు..
శఠగోపం పెడుతూ.. ‘మనో వాంఛ ఫల సిద్ధి రస్తూ..’ అంటూ ఆశీర్వదించారు..
“నా జడ బాగా పొడుగు పెరగాలి అని ఆశీర్వదించండి స్వామి” అంది..
ఆయన ఒక నవ్వు నవ్వి, “అలాగే తల్లీ” అంటూ తథాస్తు అన్నారు..
“ఎప్పడూ ఆ గొడవేనా.. ఇంక మారవా.. గుడి లో కూడానా.. ఏ చదువో, కోరుకోవాలి కదా..” అంది లక్ష్మీ చిరు కోపంగా..
ఆ అంటూ నాలిక ఎగరేసింది, రోజు ఉండేదే గా అని..
“నువ్వు మారవు, పద నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు.. ఆయనకి టిఫిన్ పెట్టాలి. ఆఫీస్ కి ఆలస్యం అవుతుంది మళ్ళీ..” అంటూ తొందరగా నడవసాగింది..
ఎదురుగా ఒక ఆమె గుడి లోకి వెడుతోంది.. సావిత్రి దృష్టి ఆమె జడమీద పడింది.. “అబ్బా ఎంత పొడుగు గా ఉందొ.. భలేగా ఉంది” అంటూ.. “ఆంటీ.. మీ జడ చాలా పొడుగు గా ఉంది. ఏ నూనె వాడతారు” అని అడిగేసింది..
ఆవిడ ఆగింది. సావిత్రి వైపు చూసింది..
“అలా ఆడిగేయడమేనా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించవా” అని అరిచింది లక్ష్మీ..
“నువ్వు ఉండు అమ్మా.. అంటి ప్లీస్.. చెప్పండి అండీ..”
ఆవిడ సావిత్రి అమాయకత్వానికి నవ్వి.. “ఈ రోజుల్లో అంత జడలు ఎక్కడ..ఇది సవరం.. కావాలంటే నువ్వు కొనుక్కో”అని షాప్ పేరు చెప్పి వెళ్ళిపోయింది..
లక్ష్మీ కి నవ్వు ఆగలేదు.. “వెళ్ళు, డబ్బులు ఇస్తాలే.. కొనుక్కో” అంది నవ్వు ఆపుకుంటు..
ఉక్రోషం వచింది సావిత్రికి.. “నాకు అలాంటి జుట్టు వద్దు.. చూస్తా.. ఏదో ఒక నూనె దొరకక పోతుందా.. నా జుట్టు పెరగక పోతుందా..” అంది.. “సర్లే పద..” అంటూ బయలుదేరి వెళ్లారు.
***
“ఏమ్మా దర్శనం బాగా జరిగిందా” అని అడిగారు..
“ఆ నాన్నా.. బాగానే జరిగింది..” అంటూ లోపలకి వెళ్ళింది..
“లక్ష్మి.. నాకు ఆఫీస్ టైం అవుతోంది.. టిఫిన్, బాక్స్ రెడీ చెయ్.. నేను వెళ్ళాలి” అన్నారు నరేష్..
“ఇదిగో ఒక్క నిమిషం” అంటూ టిఫిన్ వడ్డించింది..
“ఒసేయ్ సావిత్రి,, నువ్వు రావే” అంటూ అరిచింది..
“సరే వస్తున్నా” అంటూ చెప్పి.. వచ్చింది..
టిఫిన్ తినేసి “కాసేపు చదువుకో. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి” అంది లక్ష్మీ..
“సరే అమ్మా.. తినే అప్పుడు ఎందుకు.. చెపుతావు.. తిననీ.. నన్ను.. ప్రశాంతం గా..” అంది సావిత్రి..
“చదువుతుంది లే ముందు తిననీ దానిని” అన్నాడు నరేష్..
నరేష్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు..
“ఏమండి పార్సెల్” అంటూ ఒక పార్సెల్ ఇచ్చి వెళ్లి పోయాడు..
“ఏమిటి ఇది” అంది లక్ష్మీ..
“కొత్త రకం నూనె అమ్మా.. జుట్టు పెరుగు తుంది అంటే ఆర్డర్ ఇచ్చా..” అంది..
“ఇలా అడ్డమైనవి వాడొద్దు అంటే వినవు.. ముందు పుస్తకాలు తీయి.. తరువాత చూద్దువు గాని దీని సంగతి” అంది..
సర్లే అంటూ.. బుక్ తీసింది..
ఫుల్ గా టిఫిన్ కుమ్మేసి.. ఇప్పడు చదవాలంటే.. ఎలా.. లేకపోతే అమ్మ తిడుతుంది.. సరేలే కాసేపు చదివి.. ఆతరువాత దీని సంగతి చూద్దామ్.. అని చదవసాగింది..
కాసేపు అయ్యాక.. మనసు నూని సీసా మీదే ఉంది.. కొంత రాసేసుకుని ఆ తరువాత చదవచ్చు కదా.. ఇంతలో టైం ఏం వేస్ట్ అవుతుంది అనుకుని రాసేసింది..
కొంతసేపటికి.. ఒసేయ్ సావిత్రి అని పిలుపు విని పించింది..
‘ఆ వస్తున్నా’ అంటూ బైటికి వచింది..
కాలికి జుట్టు తగిలింది.. “అమ్మ.. నీ జుట్టు చూడు ఎలా ఊడి పోయిందో.. నేను కొన్న నూని రాసుకో.. స్ట్రాంగ్ గా ఉంటుంది..” అంది..
లక్ష్మీ ఒకసారి పైకి కిందకి చూసి “అది ఏ రంగు లో ఉంది” అంది..
“నలుపు..” అంది.
“మరి నా తల ఏరంగు” అంది..
“తెలుపు..”
“అయితే మరీ ఆ జుట్టు ఎవరిది?” అంది..
“అంటే..”
“అది నీదే నే మొద్దు మోహమా..” అని తిట్టింది..
“అయ్యో నాజుట్టే..” అని కొంచెం లాగి చూసింది.. ఇంకొంచెం చేతిలోకి వచ్చింది.. అలా కొంచెం కొంచెం.. మొత్తం ఊడి పోయింది.. ఇంక అపుడు చూడాలి సావిత్రి పరిస్థితి.. కెవ్వుమని అరిచింది.. ఇప్పడు ఎలా..“ఈ గుండు వేసుకుని ఎలా తిరగాలి.. బాబోయ్..” అంటూ అరిచింది..”
“అలా అడ్డమైన వి రాస్తే ఇలాగే ఉంటుంది” అంటూ నవ్వింది లక్ష్మీ..
“అమ్మా అమ్మా..” అంటూ కోపం గా అరిచింది..
వీపు మీద ఒక్కటి ఇచ్చింది.. లక్ష్మీ.. దెబ్బకి మెలుకువ వచ్చింది..
“దున్నపోతు లా తినేసి చదువు కోవే అంటే.. పుస్తకం మీద వేసుకుని నిద్ర పోతావా..” అంటూ అరుస్తోంది..
చెక్ మని లేచి కూర్చుంది.. సావిత్రి.
గుండెల మీద ఉన్న పుస్తకం ఒళ్ళో పడింది.. పక్కనే చూసింది..
ఆ సీసా అలాగే ఉంది.. పార్సెల్ విప్పలేదు.. జుట్టు లాక్కుంది.. బాగానే ఉంది.. ఏమైంది.. అని అడిగింది లక్ష్మీ..
నా జుట్టు బాగానే ఉంది ఉడిపోలేదు.. ఇదంతా కలే” అంది.. సావిత్రి.
“అలా పగలు పడుకుంటే అలాంటి పీడ కలలే వస్తాయి..” అంది లక్ష్మీ..
‘ఇది పీడ కల కాదు.. నాకు బుద్ధి చెప్పే కల.. ఇంక మీదట.. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు.. ఉన్నది చాలు లే’ అనుకుంది..
“లే కాస్త ముఖం కడుక్కో.. నిద్ర మత్తు ఒదులు తుంది.. అయినా "అందం అంటే మనసు లో ఉంటుంది.. మంచి ఆలోచిస్తూ, ఎప్పుడు సంతోషం గా ఉంటే మొహం లో కళ అదే వస్తుంది.. అదే అసలైన సౌందర్యం..” అంది లక్ష్మీ..
“నిజమే అమ్మ.. నాకు తెలిసి వచ్చింది.. అసలైన అందంమనసుని బట్టి ఉంటుంది కానీ రాసుకునే రంగు లు బట్టి కాదు.. అని అర్థం అయ్యింది” అంది సావిత్రి.
“కుర్చీ లో కూర్చుని చదువు..” అంది..
“అలాగే అమ్మ” అంటూ మంచం దిగింది..
ఆ పార్సెల్ వైపు చూసింది.. ఇంక దీని అవసరం లేదు అనిఆ పాకెట్ ని డస్ట్ బిన్ లో పారేసింది..
‘హమ్మయ్య ఇప్పడు మనసు ప్రశాంతం గా వుంది.. హమ్మో.. నిజం గానే ఆ కల.. నిజమైతే.. అయ్యబాబోయ్.. అతి ఆశ =కి పోతే ఉన్నది కూడా పోయేలా ఉంది.’ అనుకుని.. ముఖం కడుక్కుని.. వచ్చి.. కుర్చీ లో కూర్చుని పుస్తకం తెరిచింది.. సావిత్రి..
శుభం
ఆచంట గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు ఆచంట గోపాలకృష్ణ
రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..
15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..
నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..
ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..
Comments