top of page
Original.png

దేహమే దేవాలయం

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #దేహమేదేవాలయం, #వివాహబంధం

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 49

Dehame Devalayam - Gayathri Gari Kavithalu Part 49 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 11/12/2025

దేహమే దేవాలయం - గాయత్రి గారి కవితలు పార్ట్ 49 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


దేహమే దేవాలయం.

(వచనకవిత)

**********************************

ఏ రోగములు రాకుండా మనమంతా జాగ్రత్తలు తీసికొందాం!


ప్రాతః కాలమున నిద్రలేచి భానుమూర్తిని దర్శించుకొందాం!

ఆ తొలి సంధ్యలోహాయిగా ప్రకృతి యాందాల నాస్వాదిద్దాం!


నాలుగడుగులు వేస్తూ నలుగురిని నవ్వుతూ పలకరిద్దాం!

కాలమున కనుకూలమౌ యాహారాన్ని తయారు చేసుకుందాం!


సాత్వికమౌ యాహారాన్ని శక్తి కోసమై కుటుంబంతో భుజియిద్దాం!

సత్వ సంపద పెంపొందగ కొంత వ్యాయామమును సాధన చేద్దాం!


అతిగా ప్యాకెట్ల తిండిని తినటమనర్ధమని తెలుసుకొందాం!

బ్రతికియున్న నాలుగు దినాలు బలముతో భువిపై జీవిద్దాం!


ఊబకాయంతో మన శరీరంలోకి వస్తాయెన్నో రకాల మార్పులు.

ఆబగా తింటుంటే శరీరాని కంటుకుంటాయెన్నో రకాల జబ్బులు.


దేహమే ధర్మార్థకామ మోక్షముల సాధనకుత్తమమైన సాధనం.

మోహమును విడనాడి పుణ్యమును పొందగా ప్రయత్నిద్దాం!


దేవాలయము వంటి దేహములో స్థిరముగా కొలువుండు దైవం.

జీవాత్మకు నా పరమాత్మకు నెన్నడు విడదీయరానిదా బంధం.


జవజీవజ్ఞాన సంపత్తితో మన సంఘాన్ని సేవించుకొందాం!

భవిష్యత్తుకు బలమైన వారసత్వ సంపద నందించుకొందాం!//


************************************


ree










వివాహబంధం

(వచన కవిత)

************************************


వేలయేండ్ల నాటి సంప్రదాయం బీటలు వారిపోతోంది.

కాల మివ్విధి మన సంస్కృతిని కాలరాచిపోతోంది.


పవిత్రమైన వివాహబంధం పరిహాసాలపాలవుతోంది.

ప్రవిమలంబగు దాంపత్యమిపుడు బావురుమంటోంది.


గుట్టుగా సాగే సంసారాలు కోర్టుల్లో కొట్లాడు కుంటున్నాయి.

తిట్టుకుంటూ దంపతులు తెగతెంపులు చేసుకుంటున్నారు.


సహజీవనమంటూ క్రొత్త విధానం వేగంగ నివ్వటిల్లుతోంది.

అహంకారపు వ్యక్తిత్వాలగాధంలో పడి భోరునేడుస్తున్నాయి.


పరాయి దేశాల జీవన మిపుడు మన ప్రజలకలవాటయింది.

చరితలో మన జాతి సంతకమిపుడు మాయమైపోయింది.


పెద్దవాళ్ళ బోధలిపుడు పెడ చెవినబెట్టే కూళలు పుట్టారు.

ముద్దు ముచ్చటలు లేని మురికిలో పడి మునుగుతున్నారు.


తుచ్ఛమైన కోర్కెలతో నాశన మవుతున్న గృహస్థాశ్రమం.

పెచ్చు పెరిగిన విడాకుల్లో భీతిలి పోతున్న పసివారి బాల్యం.


ఇప్పుడైనా విలువల నెరిగించి మన బిడ్డల్ని పెంచుకొందాం!

తప్పులను దిద్దుకోమని తగినట్లు పాఠాలు చెప్పుకుందాం!


సరియగు మార్గంలో మన సంఘాన్ని నడిపించుకొందాం!

జరిగిన నష్టాన్ని పూడ్చుకొంటూ జాతికి వైద్యం చేసుకుందాం!


పరాయి విషభావజాలాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధిద్దాం!

ధరణి కాదర్శమైన మన సంస్కృతిని బ్రతికించు కొందాం!//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:

నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page