top of page
Original.png

ధరణీ రుహ శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #DharaniRuhaSathakamu, #ధరణీరుహశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆటవెలది

ree

Dharani Ruha Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 04/09/2025

ధరణీ రుహ శతకము - తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


1.)మొక్క బెంచ నీకు మోక్షము లభియించు

బాట సారు లంత భాగ్య మనగ

మనసు తృప్తి జెందు మ్రానుల జూచియు

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

2.)చెట్టు బెంచి చూడు చేనుయు చెలుకలొ

ఎండ సోక కుండ ఎరుగ నుండ

ఉండు నీకు అదియె ఉపకార మనగను

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

3.)ఎండ వేడి జూసి ఎగిరెడు పక్షులు

నీడ కొరకు వెదకు నీల్గ కుండ

వాటి రక్ష ణెరిగి వసుమతి శిఖిబెంచు

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

4.)అడవి నందు గూడ అగములు రక్షించ

జంతు తతులు జేరు జర్ణ ముండ

ఎండ వాన ముప్పు ఎరిగిన వగుచును

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

5.)చెట్టు నరుక బోకు చెడుయగు పుడమిన

ప్రకృతి యందు చెట్టె ప్రబల రక్ష

పక్షి పశువు మనకు పాదప రక్షణె

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

6.)ఫలము పుష్ప మిచ్చు పాదప మనగను

ఎండ దొరయు మండ ఎవరు ఐన

చెట్టు నీడ నుండ చేరుచు నుందురు

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష.

 

7.)వృక్ష సంప దున్న పృథ్విన రక్షణ

తరువు లేని చోట తపను వేడి

తట్టు కొనను లేక తట్టము జీవికి

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

 8.)జగము నందు అగము జనముకు మేల్జేయు

తరువు నీడె జీవి తగిన రక్ష

వాన గురియు నన్న వనమున చెట్లేను

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

9.) తిండి దినుట కెన్ని తిప్పలు బడినను

వృక్ష జాతి లేక వృద్ధి లేదు

తరువు బెంచి తేనె తట్టము తీరేది

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

10.)రావి వేప తులసి రమణులు మ్రొక్కగ

మావి చింత తోడు మరియు ఎన్నొ

పూజ కక్క రొచ్చు పుడమిన అందురు

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష.)

 

11.)కలియు గమిది యనగ కర్తవ్యమనియెంచి

చెట్టు మనిషి బెంచ చెడుపు గాదు

నిత్య కృత్య మనుచు నిలువక మనసిడి

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

12.)మార్గ మందు జూడ మ్రానులు ఇరువైపు

ఉండు నటుల బెంచ ఉత్త మంబు

ఉర్వి జనులు ఉంద్రు ఉల్లాస భరితంగ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 13.)పెరటి లోన చెట్టు పెద్దగ బెరిగిన

ఇంతి సంత సించు ఇంటి వెనుక

నీడ వచ్చు నంటు నిమ్మళ పడుచును

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

14.)నారి కేళ చెట్టు నరులును ఎరుగక

వరఫ లమును వాడ వసతి యేది

అన్ని తీర్ల చెట్లు అవనిన అక్కరె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

15.) తాటి కల్లు త్రాగ తాడిని బెంచగ

కష్ట జీవి ద్రాగు కల్లు గనుచు

ఘర్మ జలము గార్చు ఘనతన వారిదె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

16.)నాగ వల్లి దళము నరులకు ఎంతనొ

నముల తృప్తి నిచ్చు నయము గాను

అదియె తమల పాకు అనెదరు పుడమిన

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

17.)మర్రి చెట్టు నీడ మనిషికి మేల్జేసు

మర్రి ఆకు నందు మనిషి దినును

ఊడ లెన్నొ బెర్గి ఉర్విన బెరుకింక

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

18.)దేవ దారు పూలు దేవుని కిష్టము

మంది రంబు ముందు మంచి దనుచు

శిఖరి నాట నుంద్రు శివునికి భక్తితొ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

19.)వృక్ష సంప దున్న వృద్ధియె ధరణిన

ఇంటి ముందు వేప ఇంపు అనగ

చల్ల గాలి వీచి ఛాయతొ మదికింపు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

20.)బావి చెలుక లందు బాలురు చెట్టుకు

ఊయ లంటు గట్టి ఊగు చుండ

వారి తృప్తి గనగ వరమన చెట్టులె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

21.)కాన నంబు అనగ గాఢము చెట్లుండు

చెట్లు లేని చోటు చేటు దెచ్చు

జగము చెట్లు బెంచ జనముయె సుఖపడు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

22.)వృక్ష జాతి పుడమి వృద్ధియు జెందగ

రక్ష ణుండు బతుక రంధి లేక

చెట్టు అనగ పుడమి చెప్పగ వేలుపు

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

23.)చల్ల గాలి వీచ జర్ణము గావలె

ఊరి నిండ చెట్లు ఉండ మేలు

ప్రకృతి యంటె చెట్లె వాసుర యందున

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

24.)ఇంటి ద్వార మైన ఇంపగు కిటికీలు

చెట్టు కర్ర లేక చేయ రాదు

రోలు రాతి దైన రోకలి కర్రదె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

25.)హలము చేయ బూన అగమము కర్రయె

గుంటు కైన గూడ గుల్మ మేను

కర్ష కుండు కృష్టి కనలేడు శిఖిలేక

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష


 26.)ఇంటి ముందు మొక్క ఇంపుగ బెరుగను

చాలి నన్ని నీళ్ళు చల్లు చుండ 

ఏపు గాను బెరుగు ఎరుగగ మదికింపు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

27.)అడవి యందు చెట్లు అతిగను బెంచగ

అడవి మృగము లేవి అనగ రావు

పాళె మందు దిరుగి ప్రజలను భయపెట్ట

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

28.)ధూమ శకట పట్ట దూరము గాకుండ

కర్ర లెన్నొ నడుమ కట్ట నుండ

వాటి పట్టు సడలి వంకర గాబోవు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

29.)అడవి యందు గూడ అవసర మంటును

పండ్ల చెట్టు బెంచ పండ్లు బండ

వన్య మృగము లకును పసిదీరు వనమంత

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

30.)పేద వారు గుడిసె వేయను బూనగ

ఆకు కర్ర వలయు అందు కొరకు

అగము బెంచు టందు అదియెంతొ మేలగు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

31.)చెట్టు బెంచ నుండ చెప్పను లాభాలు

మనిషి బతుకు నందు మహిమ వోలె

చాల నుండు జూడ జగమున కనగను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

32.)ఔష ధంబు కొరకు అక్కర కొచ్చేది

తైల మెంతొ చెట్ల తైల మనగ

తరువు పోష నెంతొ తప్పదు జనముకు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

33.)నారి కేళ మందు నరులకు సరిపడ

చమురు దీయ వచ్చు చక్క గాను

కొబ్బె రెంతొ మేలు కోర్కెలు దీరను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

34.)మంచి నూనె గూడ మనకును దొరికేది

చెట్ల నుండె చాల చెప్ప నుండ

చెట్టు లేక మనిషి చెడునింక బతుకున

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

35.)మనిషి బ్రతుకు జాస్తి మ్రానుల నుండియె

రక్ష ణుండు గనగ రంధి లేక

తరువు కరువు అయిన తప్పవు తిప్పలు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

36.)రక్ష చెట్టు కీయ రక్షించు మనిషిని

బువ్వ లెన్ని దిన్న భువిన తరువె

ఆదు కొనుట కనగ అదియన దైవమె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

37.)కడలి పైన నుండి కదిలేటి బలమైన

హోరు గాలి నాప యోధు డనగ

ఒడ్డు నందు బెంచు ఉర్విరుహమెదిక్కు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

38.)విశ్వ మందు గనగ వీణయు వాయిద్య

పరిక రాలు అన్ని ప్రజలు వాడ

చెట్టు కలప నుండె చేతురు బాగుగ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

39.)తాటి చెట్టు నుండి తాటిది కల్లని

ఈత చెట్టు నుండి ఈత కల్లు

అవని అమృత మంటు ఆపోశ నింతురు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

40.)మనిషి సదన ముండి మంచిగ బ్రతికిన

అడవి జంతు తతికి అండ చెట్టె

ఉర్వి యందు చెట్లె ఉండను మేలగు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

41.)కనగ స్వర్గ మందు కల్పక ముండగ

అవని యందు బతుక అగమె రక్ష

ఎక్క డైన చెట్లు ఎదుగుచు మేల్జేయ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

42.)పట్టు పాను పైన పవళించు మంచము

చెట్టు వలన గాద చేయ నగుట

పుడమి యేది యైన పుష్పద ముంటెనె

ధరణిరుహమ బెంచ ధర్మ రక్ష

 

43.)ఇంట హవణి జేయ ఇంపగు కలపన

తరువు నుండె వచ్చు తనర నుండ

భూజ ముండ పుడమి భూరిగ లాభమె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

44.)ప్రకృతి లోన గనగ ప్రతిజీవి సతతము

మాను వలన లాభ మంద నుండ

శిఖరి భువిని నాట శివముయు గలుగును

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

45.)సంప దన్న పుడమి స్కంధిని గలుగుటె

తరువు లేక యున్న తనక లేను

పట్ణ పల్లె లందు పాదప మనమేలు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

46.)చేను నందు రైతు చేయను హలభూతి

కర్ర ఎంతొ దాని కవస రంబు

దుక్కి వాలు తోడు దున్నను ఇంకెన్నొ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

47.)మాన వుండు బతుక మహిలోన కలపయె

అవస రంబు ఎంతొ అనగ నుండు

భరణి కుజము లుండ భాగ్యము జీవికి

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

48.)పేరు చింత అయిన పెద్దగ లాభమె

చిగురు కాయ ఫలము చింత లేక

వత్స రంబు అంత వరుసగ వాడొచ్చు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

49.)ఎండ కాల మందు ఎరుగగ పశుపక్షి

తతులు జేరు చుండు తరువు క్రింద

చల్ల గాలి విసర చల్లని నీడలొ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

50.)ఉర్వి యందు చెట్లు ఉపయోగ మెంతనొ

మనిషి దెలిసి యుండి మాను బెంచ

పశువు పక్షి జనము పరిరక్ష నొందును

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 51.)పూలు కాయ లుండ పుడమిన చెట్లకు

మేలు అధిక ముండు మేది నందు

తరువు లేని చోట తనకలి తప్పదు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 52.)ఇంటి ముందు వేప ఇంతింత బెరుగగ

దాని గాలి వలన తగ్గు వ్యాధి

వేప చెట్టు వల్ల వేలుగ లాభాలు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

53.)పెరటి యందు గూడ పెద్దగ చెట్లుండ

ఇంపు గుండు జూడ ఇంట సుఖము

తరువు లన్ని ఉన్న తట్టము లేదంద్రు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

54.)సంఘ మేర్ప డుండి సాలము బెంచగ

ఊరి వారి కంత ఉండు సుఖము

కాన నంబు బెంచ కానము మృగమూర

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

55.)గరసు నేల నైన గట్టిగ ద్రవ్వుచు

పెట్ట చెట్టు లెన్నొ పెరుగ నుండు

మంచి ఫలిత మీయ మనిషికి తృప్తుండు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

56.)తల్లి పాలు ఇచ్చి తనయుల బెంచగ

తరువు ఫలము లిచ్చు తనివి దీర

తల్లి తరువు రెండు తలువగ వేల్పులు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

57.)కోతి కొమ్మ లాట కోరుతు పిల్లలు

ఆడు చుండ జూడ అగును తుష్టి

తనయ లూయ లూగ తనివియు అంతనె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

58.)చెట్టు బెంచ బూను చెప్పగ బిడ్డోలె

దాని వల్ల గలుగు ధర్మ మెంతొ

పుడమి చెట్ల వలెనె పున్నెము జాస్తగు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 59.)తరువు ఒకటి బెంచ తరములు ఎన్నోను

ఫలము లొసగు చుండు ఫలిత మనగ

నీడ తోడు చెట్టు నీయును చలిగాలి

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

60.)పరశు తోడ మనిషి ఫలమిచ్చు చెట్టును

కూల గొట్ట బూన కూడ దెపుడు

అగము లేక యున్న అగచాట్లు దప్పవు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

61.)విటపి లెన్ని బెంచ విపులన అందమె

ప్రకృతి యందు శోభ ప్రబలు చుండు

జనము సుఖము పొందు జర్ణము లుండగ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

62.)చెట్టు రక్ష ణంటె చెట్టుయు రక్షించు

ఆకు పచ్చ దనము ఆరక నుండ

నీరు బోయు చుండ నిత్యము నిగనిగె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

63.)ఆకు పచ్చ చెట్లు అవనిన బెరుగగ

తేకు వెంతొ గలుగు తెలుప జనము

లోప మంటు గనక లోకము నందున

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

64.)తులసి మొక్క అయిన ద్రువమున బెంచగ

ససియు గలుగు చుండు సంప దోలె

తులసి మేలు కేది తూగదు ధరణిన

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

65.)అగము నరుక బూన అఘమెంతొ దగులంగ

జగము నందు పుణ్య జనులు అనగ

మాను బెంచు చుండ మంచని పేరొచ్చు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 

66.)కమత కాడు తిండి క్ష్మాజము క్రిందనె

పగటి పూట దినును పల్లె లందు

అంబ టేళ గూడ అగమము క్రిందనె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

67.)పల్లె జనులు బండి పల్లవి వాడుతు

చేయు చుంద్రు జూడ చేల నుండి

ధాక ములును గట్టి ధాన్యము జేరేయ

దరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

68.)పెళ్ళి పంది రేయ పెంచిన చెట్టులె

బాగ పనికి వచ్చు భాగ్య మనగ

వంట చెరుకు గూడ వనమున శిఖినుండె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

69.)చేతి కర్ర కైన చెప్పగ చెట్టులె

అక్క రొచ్చు చూడ అవని యందు

అగ్గి పెట్టె ఐన అదియును కర్రయె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

70.)ఎండ చలియు నందు ఎరుగగ స్థిరముయు

చేయు చుండు జూడ చెట్టు లేను

అగము లేక జగము అరుగదు ముందుకు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

71.)తాటి ఈత కల్లు తాగగ నుండగ

వాటి బెంచ వలయు వసుధ యందు

శ్రామి కుండు దాగి శ్రమదీర్చు కొనబూను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

72.)నావ నడుప బూన నరునకు కర్రయె

అవస రంబు జూడ అవని యందు

ఎడ్ల బండి కైన ఎరుగగ శిఖికర్రె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 73.)అలసి సొలసి ఉండు అధ్వాతి కొరకని

బాట వెంట చెట్లు బాగ బెంచ

సేద దీర్చు కొనును చెట్టులు ఉండగ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

74.)ఇనుము ఇత్త డింక ఇతరము పనియందు

కర్ర బొగ్గె రోజు కాల్చ దగును

కర్ర గాల్చ కుండ కానము బొగ్గును

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

75.)శాల మందు వేడి శక్తియు దాగుండు

నిత్య బతుకు కొరకు నిప్పు సడ్డ

అగము బెంచి తేనె అందును నిప్పుయు

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

76.)కర్ర లోన గనగ కాంతియు దాగుండు

అగ్గి వేడి బుట్టు అందు నుండె

చెట్ల మహిమ యెంచ చెప్పను గొప్పనె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

77.)తోర ణంబు గట్టి తొట్లెలొ వేసేది

బాల సారె నాడె బాలు రందు

తొట్లె జేయ సడ్డ తొలుతన శిఖికర్రె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

78.)శీత కాల మందు శిఖికర్ర తోడనె

చలికి మంట బెట్ట సహజ మనగ

అన్ని అవస రాలు అగముయె దీర్చేది

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

79.)గచ్చు తోడ ఇల్లు గట్టిన గూడను

కర్ర అవస రంబు కట్టె టపుడు

కర్ర లేక బనులు కదులను బోకుండు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 80.)చెట్టు బెరడు తోటి చేయగ మందులు

ఆకు పసరు గూడ అక్క రొచ్చు

అనుచు మందు లెన్నొ అనువుగ జేతురు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

81.)పాఠ శాల యందు పాఠాలు నేర్వను

చెక్క బల్ల లెన్నొ చేర్చి యుండు

నల్ల బల్ల గూడ ననగను చెక్కేను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

82.)కలప మంచి దైన కలకాల ముండేది

చెక్క తోటి జేయు చెడని తలుపు

శాశ్వ తంబు నిలువ శాలము కర్రేను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

83.)అడవి యందు పెక్కు అగములు బెంచగ

దట్ట మైన అడవి దాపు చరికి

ఊరు నందు చెట్లు ఉపకార మెంతనొ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

84.)చెట్టు లెన్ని బెంచ చెప్పను మేలేను

మనిషి బతుకు అంత మాను నుండె

మాను లేని చోట మనుగడ కష్టమె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

85.)భూమి నందు బుట్టు భూజము లెన్నైన

మాన వాళి కింక మట్ట మేను

అధిక చెట్ట్లు బెంచ అదియెంతొ మేలౌను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

86.)మనిషి సిద్ధ పడుచు మానుల బెంచగ

ఉద్య మంగ బూని ఉండ నుండి

మనిషి ఒక్క టైన మరిబెంచ పున్నెమె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 

87.)వరఫ లముల శిఖరి వంగదు ఎపుడును

నింగి ఎత్తు ఎదిగి నిలిచి ఉండు

నారి కేళ చెట్టె నరులకు వరమన

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

88.)వృక్ష రక్ష ణెరుగ వృక్షము రక్షించు

కుక్షి నిండు టందు కుజము పాత్రె

అధిక ముండు జూడ అవనిన గనగను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

89.)పులుగు లెన్నొ వాలు పుష్పద మందున

వాటి తావు అదియె వసుధ యందు

పులుగు రక్ష ణెంతొ పున్నెము గలిగించు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

90.)ఆట వస్తు వనగ అగమము నుండేను

చేయు చుంద్రు జూడ చెప్ప గాను

వెదురు నుండె జేయ వేణువు అనగను

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

91.)బడిలొ గుడిలొ జూడ బలమగు తలుపులు

క్రకచ పత్ర మనెడి కర్ర వాడి

చేయు చుందు రనుచు చెప్పుచు ఉందురు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

92.)భూమి సార మెంతొ భూరిగ బెంచేది

చెట్టు ఒకటె చూడ చెప్ప నుండ

మనిషి సమము చెట్టు మహిలోన రక్షణె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

93)మర్రి ఆకు మీదె మరునయ్య శయనించె

అగము లేక యున్న అతని తరమ

అన్ని యుగము లందు అగములు ఉండును

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

 

94.)జమ్మి చెట్టు ఎంతొ జయమని తలచుచు

దసర పండు గందు ధర్మ చింత

పూజ జేయు చుంద్రు పురమున జనులంత

ధరణి రుహము బెంచ ధర్మ రక్ష

 

95.)చెట్ల విలువ జూడ చెప్పను లక్షలు

అంత విలువ అనగ అగము కుండు

అక్క రొచ్చు చెట్లె అవనిన అధికము

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

96.)తరువు వృద్ధి జెంద తవిషిన త్రెవ్వన

జగతి శోభ గనగ జనము మెచ్చు

అవని చెట్లు ఉన్న అగునెంతొ లాభము

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

97.)తాటి కొబ్బ రీత తరువులు తోడుగ

మావి చెంత వేప మహిలొ ఉన్న

కరవు లధిక మనగ కనగను రావంద్రు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

98.)దేవ లోక మందు దేవత రువనెడి

కల్ప వృక్ష మనగ కలిగి యుండ

తాటి కొబ్బ రనగ తవిషిన వెలిచెట్టె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

99.)ఉష్ణ మనగ దాగి ఉండును చెట్టులొ

చెట్టు మహిమ లెన్నొ చెప్ప నుండ

దేవ తరువు మించి దేహిని గలవన

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

100.) ఇంట వీధి ఊర ఇంకను పలుచోట్ల

చెట్లు బెంచ నుండ సేమ మనగ

పూలు కాయ పండు పుష్పద మందించు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

101.)మనుజు లందు దుష్ట మనుజులు ఉన్నట్టు

చెట్టు లందు ముళ్ళ చెట్టు లుండు

మంచి చెడులు యెంచి మానుల బెంచుడు

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

102.)ఏక వింశ తంటు ఏనుగు మొగమయ్య

పూజ జేయ నుంద్రు పూలు బెట్టి

అట్టి పూలు అన్ని అగముల నుండియె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

103.)లక్ష్మ ణుండు మూర్ఛ లంకలొ బోవగ

ఆంజ నేయు డరిగి అపుడె దెచ్చె

ఔష ధంబు చెట్ట్లు అసువులు నిలుపగ

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

104)పుడమి పుట్టు వుంటె పుడమిన రక్షణ

తల్లి గలిగి యుండు తనయు లోలె

చెట్టు క్రింద పైన చెప్పగ రక్షణె

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

105.)ప్రాణ వాయు వనగ ప్రాప్తించు శిఖినుండె

శిఖరి యనగ లేక చింత గలుగు

హృదయ స్పంద నంటు హృదియందు గనబోము

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

106.)చెట్టు కైన ప్రేమ చెప్పగ కననుండు

నారి కేళ వృక్ష న్యామ మెరుగ

కాయ రాలి చెడని కఠినపు ఫలమేను

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

107)సృష్టి యందు స్రష్ష్ట సృజనన జేసెను

నాల్గు విధము లుండ న్యాయ మనగ

అందు ముఖ్య మనగ అగములె అవనిన

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష

 

108.)అమ్మ పైన జూపు అభినుతి ఎంతనొ

అగము పైన గూడ అటులె జూప

తరువు రక్ష ణిచ్చు తలివోలె పుడమిన

ధరణిరుహము బెంచ ధర్మ రక్ష                                                                       

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page