భక్త కబీర్
- Pratap Ch
- Sep 3
- 2 min read
#ChPratap, #భక్తకబీర్, #BhakthaKabir, #TeluguDevotionalStory

Bhaktha Kabir - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 03/09/2025
భక్త కబీర్ - తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
భక్తి ఉద్యమంలో కబీర్‌దాస్ ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా నిలిచారు. 15వ శతాబ్దంలో వారణాసి సమీపంలోని లహర్టారా గ్రామంలో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు నిరుపేద ముస్లిం జులాయ కుటుంబం కావడంతో చేనేత పనిని జీవనోపాధిగా ఎంచుకున్నారు. ఆయన నిజజన్మపై పలు కథనాలు ఉన్నప్పటికీ, సమాజం గుర్తించిన సత్యం ఏమిటంటే కబీర్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ ఆలోచనలతో విశ్వమానవుడిగా ఎదిగారు.
కబీర్ జీవితంలో ఒక విశేష ఘట్టం ఆయన గురువుగా రామానందను స్వీకరించడమే. ఆచారపరంగా హిందూ – ముస్లిం భేదాలు తీవ్రమైన కాలంలో కబీర్ రామానంద దగ్గర శిష్యత్వం పొందారు. ఆయన వద్ద అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఉపదేశంగా పొందారు. ఒక కథనం ప్రకారం, రామానంద ఉదయం గంగాస్నానానికి వెళ్తూ మెట్లపైకి ఎక్కుతుంటే, చిన్నవయసులోని కబీర్ అక్కడ నిద్రించి ఉండేవాడు. ఆయనపై కాలు తగిలి, రామానంద నోటి నుండి “రామ్ రామ్” అనే మాట వెలువడింది. అదే ఆయనకు దీవెనగా, మంత్రంగా మారింది. ఈ సంఘటన ఆయన భక్తి మార్గాన్ని నిర్ణయించింది. స్వామి రామానంద నీడలో ఆధ్యాత్మిక మార్గంలో అంచెలంచెలుగా ఎదుగుతూ చివ్వరకు భక్తి ఉద్యమంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు కబీర్.
కబీర్ ముస్లిం సమాజంలో పెరిగి కూడా మతమౌఢ్యాలను తిరస్కరించారు. ఒకసారి వారణాసిలోని మసీదులో మౌల్వీలు ప్రార్థన చేస్తున్నప్పుడు, కబీర్ వారిని “మీరు మసీదు పైకప్పుపై నిలబడి అల్లాను పిలుస్తున్నారు, ఆయన మీకు అంత దూరంలోనా? మన హృదయం శుభ్రంగా ఉంటే దేవుడు దూరంగా ఉండడు.” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఆ సమాజంలో కలకలం రేపింది. కబీర్ ను ఒక అతివాద భావాలు వున్న వ్యక్తిగా అప్పుడు సమాజం భావించింది. అయితే దేవుడు ఎక్కడో లేడు, మన అంతరంగంలోనే ఉన్నాడు, ఆయనను ఎక్కడెక్కడో వెదకడం మానేసి మన హృదయాంతరాళలోనే వెదకండి అన్నది ఆయన ప్రజలకు ఇచ్చిన సందేశం.
కబీర్ యొక్క రచనలు ప్రజలకు సులభమైన భాషలో, లోతైన ఆధ్యాత్మిక సందేశంతో నిండినవి. ఆయన దోహాలు దాదాపు 5000 వరకు లభ్యమయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆయన శిష్యులు ఆయన సాహిత్యాన్ని “బీజక్”, “సఖీ గ్రంథావళి”, “అనురాగ్ సాగర్” వంటి సంపుటాలుగా సేకరించారు.
కబీర్ ఒక దోహాలో ఇలా చెప్పారు:
“పోథీ పఢి పఢి జగ్ మువా, పండిత్ భయో న కోయ్; ఢాయి ఆకర్ ప్రేమ్ కా, పఢే సో పండిత్ హోయ్।”
(ఎన్నో గ్రంథాలు చదివినా నిజమైన జ్ఞానం రావడం కష్టం. ప్రేమ అనే రెండు అక్షరాలను గ్రహించినవాడే అసలైన పండితుడు.)
మరొక దోహా:
“బడా హువా తో క్యా హువా, జైసే పెడ్ ఖజూర్; పంథీ కో ఛాయా నహీం, ఫల లగే అతిదూర్।”
(వయస్సు పెరిగి మనైషి ఆరడుగులు ఎదిగితే ప్రయోజనం ఏమిటి? అది తాటి చెట్టు లాంటిది – నీడ ఇవ్వదు, పండు అందదు. నిజమైన గొప్పతనం వినయంతో, సేవతోనే వస్తుంది.)
సంత్ కబీర్ తన జీవన తత్వం ద్వారా మతభేదాలకతీతంగా మానవతా విలువలను ఆవిష్కరించారు. కేవలం భక్తి మార్గాన్ని చూపడమే కాక, ఆయన బోధలు సమాజంలో సమానత్వం, ప్రేమ, సత్యం అనే విశ్వమానవ ధర్మాన్ని వెలిగించాయి. అందుకే నేటికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు అన్నది విస్పష్టం.
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comments