'Dharma Parayana' written by Sudhamurali
రచన : సుధామురళి
గుళ్ళోంచి విష్ణుసహస్రనామం వినిపిస్తోంది. మర్రిచెట్టు మీద పక్షుల సందడి పెరుగుతోంది. నూతిలో చేద చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. మడిపంచెకట్టుకుని పువ్వులేరడానికి బయటకొచ్చారు సుందరయ్యగారు. వంటింట్లో కాఫీడికాక్షన్ వాసన..పాలుపొంగినవాసన కలగలిపి ముక్కును తాకింది.
"లక్ష్మీ! లక్ష్మీ! పొయ్యిమీద పాలు పొంగినట్లు వున్నాయి చూడూ " అంటూ పెరట్లోనుంచే కేక పెట్టారు సుందరయ్య గారు.
"జగత్ప్రభుమ్ దేవదేవ మనతం పురుషోత్తమం" అంటూ ఆ వినిపించే విష్ణు సహస్రనామ స్తోత్రముతో గొంతు కలపడం లక్ష్మీ దేవికి ఉన్న అలవాటు. అలా పాడుతూనే సుందరయ్య గారికి సైగలతో చెప్పింది నేనున్నాను, చూసుకుంటాను ,మీరు త్వరగా పూలు కోసే పని కానివ్వండి అని. సుందరయ్య గారికేమో ఎప్పుడెప్పుడు చిక్కటి, చక్కటి కాఫీ కప్పు చేతికందుతుందా? ఎప్పుడు జిహ్వ కోరిక చల్లారుద్దామా అని ఆత్రంగా వుంది.
ఇంతలో సెలవులకు వాళ్ళింటికి వచ్చిన దీప నిద్రనుండి లేవడం, ఏంటా అలికిడి అని పెరట్లోకి రావడం రెండూ చకచకా జరిగాయి. దీప లక్ష్మిదేవి గారి అన్న కూతురు. తల్లీ, తండ్రీ లేని దీపంటే లక్ష్మీదేవికి చాలా ప్రేమ. అన్నని తనలో చూసుకుని మురిసి పోతుంటుంది. దీప తల్లీ తండ్రీ లేకున్నా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకొని తన కాళ్ళపై తాను నిలబడగలిగింది. అది కూడా లక్ష్మీదేవి గారికి చాలా గర్వంగా ఉంటుంది.
"అయ్యో ! ఏమిటండీ మీ అరుపులు. పిల్ల చూడండి గాభరా పడి అప్పుడే లేచేసింది. అసలు కాస్తంత పాలు పొంగితే ఏం కొంపలు అంటుకుపోతాయని మీ బాధ! రోజూ తెల్లవారగట్టే లేచి ఆఫీసుకు వెళ్లే పిల్లాయే! ఇక్కడికి వచ్చినప్పుడన్నా కాస్తంత విశ్రాంతి తీసుకుంటుంది కదా అనుకుంటే , మీ హడావుడితో లేపేస్తిరి" అంటూ అంతెత్తున లేచింది సుందరయ్య గారి మీదకు.
సుందరయ్యది ‘ఆ!’ అంటూ నోరెళ్ళబెట్టే పనయ్యింది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డా విష్ణు సహస్రనామ పారాయణ చేసేటప్పుడు ఒక్కమాటా మాట్లాడని తన సహధర్మచారిణి ఇవాళ ఇంతలా అరవడం ఆయనకి అంతుబట్టడం లేదు. కోడలి మీద ప్రేమ ఎంత పనైనా చేయిస్తుందేమో అని సరిపెట్టుకున్నాడు. దీప లేచింది కాబట్టి తనకూ కాఫీ త్వరగా దొరుకుతుందని ఆశ కూడా పడ్డాడు.
దీపకి కూడా ఇదంతా కొత్తగా ఉంది. తన అత్త, మామని అలా గదమాయించడం చూడలేదెప్పుడూ! ఆరడుగుల కంటే ఎత్తుగా, ఆజానుభాహుడుగా వుండే మామ సుందరయ్య అంటే ఇంట్లో అందరికీ హడలే. తనకు తెలిసినంత వరకూ అత్త ఏనాడూ మామను ఎదిరించడం గానీ, పరుషంగా మాట్లాడడం కానీ ఎరుగదు. ఐదుగురు ఆడపడుచులు, ఇద్దరు మరుదులూ ఉన్న ఉమ్మడి సంసారాన్ని ఎంతో ఓర్పుతో, నేర్పుతో తీర్చిదిద్దింది. మామ అడుగుజాడల్లోనే నడుస్తూ వచ్చింది. అలాంటి అత్త ఇప్పుడిలా మామకు ఎదురు నిలవడం ఆశ్చర్యంగా ఉంది తనకు. ఉద్యోగ విరమణ తర్వాత ఎవరి పరిస్థితైనా ఇంతేనా అని అనిపించింది.
ఈ లోగా అత్త పళ్ళు తోముకో మనడం, తానెళ్లి ఫ్రెష్ అయి రావడం క్షణాల్లో జరిగిపోయాయి. మడి కట్టిన అత్త కలిపిన కాఫీ అద్భుతంగా ఉండడంతో ఆస్వాదిస్తూ మామ కూడా కాఫీ తాగే పనిలో ఉండటంతో తన సందేహాన్ని బయటపెట్టింది అత్త దగ్గర.
"అత్తా! నీకు మామంటే భయంతో కూడిన గౌరవం కదా! అలాంటిది ఈరోజు నువ్విలా మామను గట్టిగా మాట్లాడటం నాకు నమ్మశక్యంగా లేదు" అని అన్నది.
ఎక్కడి నుంచి విన్నాడో సుందరయ్య గారు “నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతానమ్మా” అంటూ వచ్చారు.
"ఇన్ని రోజులుగా నేనే మీ అత్త నోరు నొక్కేస్తూ వచ్చాను. భార్య గట్టిగా మాట్లాడితే పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడినని నా తోడబుట్టిన వాళ్ళూ, నా కడుపున పుట్టిన వాళ్ళు ఎక్కడ నన్ను చులకనగా చూస్తారో అని సమాజం గౌరవించదనీ భావిస్తూ మీ అత్తని నా కనుసన్నల్లో మసలేలా అదుపుచేస్తూ వచ్చాను. నిన్న కాక మొన్న పుట్టిన పిల్లలు సైతం వాళ్ళ ఇష్టాయిష్టాలకు విలువిస్తూ ఉంటే పాపం మీ అత్త నా కోసం తన ఆలోచనల్నీ ,అభిరుచులనీ అన్నీ మార్చుకొని నేనే సర్వస్వంగా బతుకుతూ నోరు లేని మూగదానిలా బతికింది. ఇంత కాలానికి నాకు జ్ఞానోదయం అయ్యింది. తోబుట్టువులు పట్టించుకోకున్నా, కన్నబిడ్డలు దూరమయినా మూర పసుపు తాడుతో మూడు ముళ్లేసినందుకు నన్నే అంటిపెట్టుకుని నా బాగోగులే తన సౌభాగ్యమంటూ బతికేస్తోంది.
అందుకే ఇక తనని బాధపెట్ట తలచుకోలేదు. తన మనసులో ఏముందో నాతో చెప్పే స్వతంత్రాన్ని .. కాదు, తను పోగొట్టుకున్న తన హక్కుని తనకు తిరిగి ఇచ్చేశాను. ఇంక మేము ఎక్కువకాలం బతికేదీ లేదు, సమాజం దృష్టిలో చులకన అయ్యేదీ లేదు. అసలు ఈ సమాజంతో నాకు పనేలేదు. నా ఇంటి మహాలక్ష్మి సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఇన్నాళ్లూ తాను భర్త మాటను అనుసరిస్తూ *ధర్మ పరాయణి* అని అనిపించుకుంటే ఈ మిగిలున్న కాస్త కాలాన అన్నా నేను భార్యను గౌరవించి, ఆమెను ప్రేమించి అర్థం చేసుకున్న ధర్మపరాయణుడిని అని అనిపించుకోవద్దా? "అంటూ కొనకళ్ల నుంచీ కారుతున్న కన్నీటిని ఆపే ప్రయత్నం కూడా చెయ్యకుండా అలాగే మళ్లీ పూర్తి కాని పూజ కోసం దేవుడి గదికి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు తన మేనత్త కూడా ఆనంద భాష్పాలో, బాధా చెమరింపులో తెలీకున్నా కంటి నుండి ఏకధాటిగా కారుతున్న నీటిని ఆపుతూ నైవేద్యం వండే పనికి నడుంబిగించింది.
మామ చెప్పిన మాటలే చెవిలో తిరుగుతుండగా ఆ భార్యాభర్తల అనుబంధానికి దీప మురిసిపోతూ స్నానానికి బయలుదేరింది.
***శుభం***
Comments