top of page

ఏం మిగిలింది


'Em Migilindi' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“యిద్దరు కొడుకులూ ఇంజనీరింగ్ చదివి, అమెరికా వెళ్లిపోయారు. యిప్పుడు మనమిద్దరం మిగిలిపోయాము. ఒకరికి ఒకరు తోడుగా వుండాలిసింది పోయి మీరు నన్ను తిట్టా, నేను మిమ్మల్ని నాలుగు మాటలు అనటం ఎందుకండీ? వున్నన్నాళ్లు సుఖంగా వుండక..” అంది సులోచన.

“నువ్వేగా మీ అన్నగారి కొడుకు అమెరికా వెళ్ళి బోలెడు డబ్బు సంపాదించి మీ అన్నయ్య కి పంపుతున్నాడని అన్నావు. మన పిల్లలని కూడా అమెరికా పంపాలిసిందే అని పంతం పట్టి పంపించావు. అప్పటినుండి ఫోన్ టింగ్ అనగానే పిల్లలు ఏమైనా డబ్బు పంపించారని అనుకోవడం తప్పా, బ్యాంకు నుంచి ఒక్క మెసేజ్ రాలేదు. అదీ నీ పిల్లల ప్రేమ” అన్నాడు రాఘవ.

“మీకు పెన్షన్ వస్తోంది. యింకా పిల్లలు డబ్బు మీద ఆశ ఎందుకండీ, వాళ్ళు అక్కడ సుఖం గా వుంటే చాలు” అంది.

“పిచ్చదానా , సుఖం దూరం గా వెళ్ళిపోతే దొరకదే, వచ్చిన డబ్బుతో సంతోషం గా వుంటే, మన దేశం లో లేని సుఖం ఎక్కడా లేదు. అయినా నీతో వాదించి లాభం లేదులే.

ఎలాగో వచ్చే నెలలో కొడుకు దగ్గరికి వెళ్తున్నావుగా.. ఆ సుఖం హాయిగా అనుభవించి రా” అన్నాడు రాఘవ.

“మిమ్మల్ని కూడా రమ్మన్నాడుగా, మీరే ‘ఆ విమానం లో గంటల తరబడి కూర్చోలేను’ అని తప్పించుకున్నారు కానీ ‘అయ్యో పాపం.. నేను వెళ్లకపోతే అది ఒక్కత్తి ఎలా వెళ్తుంది’ అన్న ఆలోచన లేదు మీకు. యిటు పెళ్ళాం మీద ప్రేమ లేదు, అటు కొడుకుల మీద ప్రేమ లేదు” అంది సులోచన.

అమెరికా నుంచి పెద్ద కొడుకు శ్రీధర్ వాళ్ళమ్మకి ఫోన్ చేసి వచ్చేప్పుడు కావలిసిన ఊరగాయల లిస్ట్ చెప్పేయటం, యీవిడ గారు నా వెంటపడి ‘గాజువాక లో ఎవరో బ్రాహ్మణ కుటుంబం పచ్చళ్ళు బాగా పెడతారని అన్నారు, వెళ్ళి తీసుకుని రండి’ అని నన్ను చంపడం.. అనుకున్నాడు రాఘవ.


చిన్న కొడుకు వెంకటేష్ డైరెక్టుగా తండ్రికే ఫోన్ చేసి, వచ్చే అప్పుడు అమెరికా కరెంటు కి పనికి వచ్చే మిక్సీ, మీకు ఫిల్టర్ కాఫీ కోసం పెద్ద సైజ్ కాఫీ ఫిల్టర్ తీసుకుని రండి అని చెప్పటం తో బజార్ అంతా తిరిగి కొడుకు చెప్పినవి కొనుక్కుని వచ్చాడు.

“నాన్నగారూ! మీరు కూడా అమ్మతో రావచ్చుగా, అందరం కలిసి టూర్ కి వెళ్ళచ్చు” అన్నారు కొడుకులు.

“నాకు రావాలని వున్నా, ఈ వయసులో కదలకుండా 24 గంటలు విమానం లో కూర్చోలేను. ఏదో శుభ్రత పాటిస్తున్న నేను అక్కడ కాయితాలు వాడలేను అబ్బాయి” అన్నాడు రాఘవ. “అయినా మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి, అమెరికాలో మూడు నాలుగు సంవత్సరాలు వుండి వచ్చేస్తామని, అక్కడ గ్రీన్ కార్డు కి ఎందుకు ట్రై చేసుకున్నారు? అందరూ ఏడాదికి ఒక్కసారి అయినా ఇండియా కి వచ్చి తల్లిదండ్రులని, చుట్టాలని చూసుకుని తిరిగి వెళ్తున్నారు. మీరు అయిదు సంవత్సరాలనుండి ఒక్కసారి మమ్మల్ని చూడటానికి రాలేదు” అన్నాడు రాఘవ.

“రోజూ వీడియో కాల్ లో చూస్తున్నాము, మాట్లాడుతున్నాము. యింకా అక్కడికి లక్షలు ఖర్చు పెట్టి వచ్చి చేసేది ఏముంది? మేము వచ్చినా నెల కంటే వుండలేము. మీరు వస్తే ఆరు నెలల వరకు వుండవచ్చు” అన్నాడు పెద్దకొడుకు శ్రీధర్.

“అలాగా, సరే అమ్మ వస్తుంది లే, నేను ఈ ప్రయాణాలు చెయ్యలేను” అని ఫోన్ కట్ చేసి భార్య వంక తిరిగి “అంతా విన్నావుగా, రోజూ వీడియో లో నిన్ను కూడా చూస్తున్నారు గా, మరి నిన్ను రమ్మని ఎందుకు పిలుస్తున్నారు? యిప్పుడు కోడలు కూడా ఉద్యోగం కి వెళ్తోంది కదా, నీ అవసరం ఎక్కువ లే” అన్నాడు రాఘవ.

“రానని భీష్మించుకుని కూర్చున్నారు. యింకా ఎందుకు వాదన? నన్ను మహారాణి లాగా చూసుకుంటారు. మీలాగా తిట్టారు. అయినా జాతకం లో అమెరికా వెళ్లే యోగం వుండాలి” అంది..

ప్రయాణం రోజు రానే వచ్చింది. తెల్లవారు జామున రెండు గంటలకు విమానం. రాఘవ, సులోచన రాత్రి పది గంటలకే విమానాశ్రయం చేరుకున్నారు. యిద్దరి మొహాలలో కనిపించని దిగులు.

లగేజ్ మొత్తం హెల్పర్ కిచ్చి భార్య తో చెప్పాడు, “భయపడకు, విమానంలో డాలస్ వెళ్లే వాళ్ళతో పరిచయం చేసుకుని వాళ్ళతో పాటు గేటు దగ్గరికి వెళ్ళు.

ఇంటికి వెళ్లిన తరువాత అబ్బాయి తో చెప్పి ఫోన్ చేయించు. నువ్వు ఎన్ని రోజులు వుండగలిగితే అన్ని రోజులు వుండి వచ్చేసేయి. నేను విమానాశ్రయం కి వస్తాను” అన్నాడు రాఘవ భార్య తో.

“నా సంగతి పర్వాలేదు, మీరు టైంకి మందులు వేసుకోండి. మేడమెట్లు ఎక్కద్దు, క్రింద బాత్రూం వాడుకోండి. వండుకోలేకపోతే మీ తమ్ముడు యింటికి వెళ్ళి వుండండి., పనిమనిషి వచ్చినప్పుడు ఒక కన్నేసి వుంచండి, నేను లేను కదా అని యిల్లు తుడవకుండా వెళ్ళిపోతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, పూరీలు, వడలు లాంటి నూని వస్తువులు తినకండి. నేను చెప్పడమే కానీ మీరు వింటారా..” అంటూ చెపుతున్న భార్య తో “జాగ్రత్తగా వుంటానులే, నువ్వు అక్కడ కోడల్ని, కొడుకుని విసిగించకు” అని భార్య ని లోపలకి పంపించి చెమర్చిన కళ్ళు తుడుచుకుని, కారు పార్కింగ్ దగ్గరికి బయలుదేరాడు రాఘవ.

రెండు నెలలు భారంగా గడిచాయి. రాఘవ ని అతని తమ్ముడు “మా యింట్లో వుండు, మళ్ళీ నువ్వు ఒక్కడివే ఏమి వండుకొని తింటావు, నీకు సెపరేట్ గా గది కూడా వుంది” అన్నాడు.

“లేదురా! అప్పుడప్పుడు యిలాగే వచ్చి ఒక రెండు రోజులు వుంటాను” అన్నాడు.

పనిమనిషి వెంకమ్మ యధావిధిగా ఒక రోజు వస్తే ఒక రోజు మానేసేది.

రాత్రి హోటల్ లో చపాతీ కూర్మ తిని, యింటికి వచ్చి కొంతసేపు వార్తలు విని పడుకున్నాడు రాఘవ.

ఉదయం పనిమనిషి దొడ్డి వూడ్చి, ముగ్గులు వేసి, “సార్, సార్” అంటూ తలుపు కొట్టినా జవాబు రాకపోవడం తో, ‘బహుశా సార్, వాళ్ల తమ్ముడి ఇంటికి వెళ్ళి వుంటాడు’ అని వెళ్ళిపోయింది.

సాయంత్రం మళ్ళీ వచ్చి తలుపు కొట్టినా తలుపు తీయకపోతే, దొడ్డి వైపు వున్న కిటికీ తోసి చూస్తే, రాఘవ పడుకున్న విధానం అనుమానం గా తోచి, పక్కన వున్న యింటి వాళ్ళని పిలుచుకుని వచ్చింది పనిమనిషి.

పక్క యింటిలో వున్న కుమార్ గారు కిటికి లోంచి చూస్తో ‘అంకుల్, అంకుల్..’ అని నాలుగు సార్లు పిలిచినా లేవకపోవడంతో, కర్ర తీసుకుని కిటికి లోంచి లోపల రాఘవ ని పొడిచాడు. అయినా కదలకుండా పడివుండటం తో, ‘ఏదో అయ్యింది అంకుల్ కి’ అని అసోసియేషన్ ప్రెసిడెంట్ కి చెప్పి తలుపు పగలు కొట్టి లోపలికి వెళ్లారు.

చెప్పాటానికి ఏముంది.. రాఘవ ప్రాణం ఎప్పుడో పోయింది.

ఎవ్వరి దగ్గరా అమెరికాలో వున్న రాఘవ కొడుకుల అడ్రస్ లేదు. యిక్కడ రాఘవ కి ఎవరైనా చుట్టాలు వున్నారేమో అని ఫోన్ తీసుకొని చూస్తే, ఫోన్ కి పాస్వర్డ్ వుంది.

‘యిప్పుడు ఏమి చేయాలి..’ అని కాలనీ పెద్దలు ఆలోచన చేస్తోవుండగా, పనిమనిషి రంగమ్మ, “నాకు అమెరికా నుంచి ఒకసారి అమ్మగారు ఫోన్ చేసి, ‘రోజు వస్తున్నావా’ అని అడిగారు. నా ఫోన్ లో ఆ నెంబర్ వుంటుంది చూడండి” అని యిచ్చింది.

బతికించావు తల్లి, అని ఫోన్ తీసుకుని అందులో వున్న అమెరికా నెంబర్ కి ఫోన్ చేసారు. అమెరికా లో అర్ధరాత్రి అవడం తో రెండు మూడు సారులు ఫోన్ చేసిన తరువాత రాఘవ వాళ్ల కొడుకు ఫోన్ తీసుకుని, సంగతి విని కొయ్యబారి పోయాడు.

కాలనీ ప్రెసిడెంట్ ని తాము వచ్చే అంతవరకు బాడీని ఏదైనా హాస్పిటల్ లో భద్రపరచమని చెప్పి, తల్లిని లేపి నాన్న కి వొంట్లో బాగుండలేదుట, అన్నయ్య కి కూడా చెప్పాను, మనం రేపు ఇండియా బయలుదేరి వెళ్దాం అన్నాడు.

“ఏమైంది రా, యిప్పుడు ఎలా వుంది, నిజం చెప్పు?” అంది ఏడుస్తూ.

“వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. కంగారు పడకు.. ఎల్లుండి కి అక్కడ వుంటాము. కుమార్ నాన్నని హాస్పిటల్ చేర్పించి చూసుకుంటున్నారు” అన్నాడు. ఎలా తెల్లారిందో తెలియదు, ట్రావెల్స్ వాళ్ళతో ట్రై చేసి అందరు ఇండియా బయలుదేరారు. ఈ హడావుడి కి ఎందుకో సులోచన కి మనసు కీడు శoకించడం మొదలైంది.

యిరవై నాలుగు గంటల ప్రయాణం తరువాత విశాఖపట్నం చేరుకున్నారు. సామాన్లు తీసుకుని ఇంటికి చేరుకునే సరికి ఉదయం ఏడుగంటల సమయం అయ్యింది.

“అదేమిటిరా మన యింటిముందు టెంట్ వేసారు” అంటూ ఏడుపు మొదలుపెట్టిన తల్లిని పట్టుకుని మెల్లగా కారు దింపాడు, లోపల తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ శ్రీధర్.

వరండాలో తండ్రిని గాజు పెట్టెలో చూడగానే తల్లికొడుకులు గొలుమన్నారు. తండ్రికి మంచి పేరు వుండటం తో చుట్టు పక్కన వాళ్ళు, రాఘవ తమ్ముడు అందరు అక్కడే వున్నారు.

శ్రీధర్ ని, వదినగారి ని చూడగానే కళ్ళు తుడుచుకుంటూ రాఘవ తమ్ముడు వచ్చి శ్రీధర్ భుజం తట్టి, రాఘవ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు.

“డాడీ! తాతయ్య అక్వేరియం లో పడుకున్నాడు ఎందుకు?” అంటున్న కొడుకుని దగ్గరగా తీసుకున్నాడు శ్రీధర్.

ఏమిటో పిల్లలని విదేశాలకు పంపిన తల్లిదండ్రులకి చివరికి ఈ గాజు పెట్టే గతిలాగా వుంది అని జనం లోనుంచి ఒక పెద్దాయన అనడం విన్న శ్రీధర్ కి అవును మేము అమెరికా వెళ్ళి సాధించింది ఏమిటి? అక్కడ పెద్ద పెద్ద భవనం లో వుండటం కోసం వెళ్ళి, చివరికి ప్రాణం లేని తండ్రి వున్న గాజు పెట్టి పక్కన వుండాలిసి వచ్చింది. తండ్రితో గడిపే ఆనందం ఆ అమెరికాలో లేనేలేదు అని ఒక్కసారిగా కూలబడుతున్న శ్రీధర్ ని పట్టుకుని కుమార్, మీరే యిలా బాధ పడితే అమ్మా, తమ్ముడు పరిస్థితి ఏమిటి, ధైర్యం తెచ్చుకోండి అని అన్నాడు.

“యింకా ఎక్కడి ధైర్యం కుమార్ గారు, ఇన్నాళ్ళు నాన్న వున్నాడు మాకేమిటి భయం అనుకున్నాము. యిప్పుడు మా వెన్నెముక విరిగిపోయింది” అని తల్లిని పట్టుకుని ఏడ్చేసాడు రాఘవ చిన్న కొడుకు.

***

=====================================================================

ఈ కథ నా స్వంత రచన, ఎవ్వరిని దృష్టిలో పెట్టుకుని రాసినది కాదు - శ్రీనివాసరావు జీడిగుంట

===================================================================== జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.














48 views0 comments

Comments


bottom of page